ఆ అడవికి రాజైన సింహం తన చక్కని పరిపాలనతో అడవి జీవుల మన్ననలను అందుకుంటుంది. అడవి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ అడవి జీవుల సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తుంది. ప్రతి జీవితోనూ స్నేహ భావంతో ఉంటూ వాటికి ప్రేమను పంచుతుంది. అడవిని పొరుగు అఠవుల క్రూర మృగాల బారిన పడకుండా రక్షించడానికి, మానవుల దాడి నుంచి రక్షించడానికి రక్షణ బాధ్యతలను పెద్దపులికి అప్పగించింది. పరిపాలనలో తనకు సలహాలను, సూచనలను ఇవ్వడానికి, తన పరిపాలనలో లోపాలను తెలుపడానికి మేథావి ఏనుగును మంత్రిగా నియమించింది. ఏనుగు పెద్దపులితో "వ్యాఘ్రరాజమా! ఈ అడవిని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నీపై పడింది. రక్షకులే భక్షకులు అయినట్లు నువ్వే అడవి జీవులను రహస్యంగా తినేవు సుమా!" అని నవ్వింది. "ఏమో! నా మీద ప్రేమతో నాకు నువ్వే జంతువులను ఆహారంగా అందిస్తావేమో!" అని నవ్వింది పులి. ఇదిలా ఉండగా ఆ అడవిలోకి ఒక నక్క కొత్తగా ప్రవేశించింది. దాని స్వభావానికి విరుద్ధంగా అన్ని జీవులతో స్నేహంగా ఉంటూ వాటికి అవసరమైన సహాయం చేస్తుంది. కొద్ది కాలంలోనే అడవి జీవులకు నక్క అంటే ప్రాణం అయింది. నక్క రోజూ ఒక్కొక్క స్నేహితునితో కలిసి మాట్లాడుతూ అడవి అంతా తిరిగేది. రాను రాను అడవిలోని జీవుల సంఖ్య తగ్గుతుంది. బయటికి వెళ్ళిన జంతువులు తిరిగి రావడం లేదు. ఏ మాయదారి జంతువో వాటిని వేటాడి తింటుందని భావించాయి అడవి జీవులు. అవి అడవికి రాజైన సింహానికి ఈ విషయం చెప్పాయి. నక్కపై తమకు అనుమానం ఉందని చెప్పాయి. నక్కపై ఒక నిఘా వేసి ఉంచమని సింహం ఆదేశించింది. ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన పడవద్దని అంతా తాను స్వయంగా చూసుకుంటానని అన్నది సింహం. "మీకా శ్రమ అక్కరలేదు మహారాజా! నేను స్వయంగా అడవి అంతా కలియదిరిగి ఆ క్రూర మృగాన్ని పట్టుకొని చంపుతానని వాగ్దానం చేసింది. అప్పుడు ఏనుగు "మీ ఇద్దరికీ శ్రమ ఎందుకు? మహామంత్రిని నేను చూసుకుంటాను." అని అన్నది. "మీరంతా ఎవరి పని వారు సక్రమంగా నిర్వహించండి చాలు. అడవి బిడ్డల క్షేమం నా లక్ష్యం. కాబట్టి నేనే స్వయంగా అడవి అంతా కలియదిరిగి, ఆ దుష్ట జంతువు పని పడతాను." అన్నది సింహం. రోజులు గడుస్తున్నాయి. అడవిలోని జీవులు క్రమ క్రమంగా మరింత తగ్గుతున్నాయి. యథావిధిగా నక్క తన మిత్రులను వెంట తీసుకుని రోజూ అడవి అంతా తిరగసాగింది. ఒకరోజు పొరుగు అడవికి రాజైన మరో సింహం ఈ అడవికి వచ్చింది. అన్ని అడవి జీవులతో సమావేశం ఏర్పాటు చేసింది. "చూడండి నా ప్రియమైన ప్రాణులారా! నాకు వృద్ధాప్యం వస్తుంది. మా అడవికి కొత్త రాజును నియమించాలి. కానీ మా అడవిలోని చాలా జీవులు క్రూర స్వభావం కలవి. స్వార్థ బుద్ధి కలవి. నా అసమర్థత వల్లనే ఇలా జరిగింది. ఈ అడవి రాజు సుపరిపాలనలో అడవి జీవులన్నీ ధర్మ బుద్ధిని కలిగి ఉన్నాయని విన్నాను. కాబట్టి నా తరువాతి మా అడవికి రాజును ఈ అడవి నుంచే నియమించాలని అనుకున్నాను. అయితే ఎవరైనా తాము గతంలో చేసిన తప్పులను ఒప్పుకొని ఇంకా ఆ తప్పులు చేయమని ప్రమాణం చేస్తేనే వారిని మా అడవికి రాజును చేస్తాను." అన్నది పొరుగు సింహం. "నేను జంతువులను నమ్మించి తీసుకెళ్ళి మరో అడవిలో ఉన్న పెద్దపులికి అప్పగిస్తున్నాను. ఆ పెద్దపులి చంపగా ఆ జంతువులను ఇద్దరం పంచుకొని తింటున్నాం. నన్ను క్షమించండి మహారాజా! ఇకపై ఆ తప్పులు చేయను." అన్నది నక్క. "నక్క మాటలు అబద్ధం. ఆ పనులను చేస్తుంది నేనే. పక్క అడవిలో మాయదారి పులికి ఈ జంతువులను ఇస్తున్నాను. నక్క నన్ను నీడలా అనుసరిస్తూ నేను చేసే పనులను గమనించింది. పదవి కోసం అబద్ధాలు చెబుతుంది. నన్ను క్షమించండి మహారాజా! " అన్నది మంత్రి ఏనుగు. "అదేం కాదు. రెండూ పదవి కోసం అబద్ధాలు చెబుతున్నాయి. ఈ అడవి జంతువులను నమ్మించి తీసుకెళ్ళి తింటున్నది స్వయంగా నేనే. నన్ను క్షమించండి. ఇకపై అలాంటి పాడు పనులు చేయను. అడవికి రాజైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదా! నా జీవులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను." అన్నది పెద్ద పులి. "ఆపండి! పదవి కోసం మీరంతా అబద్ధాలు చెబుతారా! ఎంతో నమ్మకంతో పరిపాలన సాగిస్తూ ఈ జంతువులను నమ్మించి, రాత్రులు ప్రేమతో వెంట తీసుకుని భక్షిస్తుంది నేనే." అన్నది ఆ అడవికి రాజైన సింహం. "మీరు తప్పు చేయడం ఏమిటి. ఇది నేను నమ్మను." అన్నది పొరుగు అడవి రాజైన సింహం. "కావాలంటే నా వెంట రండి." అని ఆ జంతువులను ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి తాను భక్షించగా మిగిలిన ఎముకలను చూపించింది. "ఇప్పుడు చెప్పండి. నేను ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రెండు అడవుల జీవులనూ కంటికి రెప్పలా కాపాడుతూ అడవులను సమర్థవంతంగా పరిపాలిస్తాను. " అన్నది సింహం. "చూడు మాయదారి మహారాజా! నువ్వు చేస్తున్న పనులను రహస్యంగా గమనించింది నక్క. విస్తుపోయిన నక్క ఏనుగు, పెద్దపులికి ఈ విషయం చెప్పింది. ఆ తర్వాత అవి కూడా రహస్యంగా గమనించాయి. నా దగ్గర చేరి ఈ విషయం చెప్పి, ఈ నాటకం ఆడించాయి. ఇంత గట్టిగా వెయ్యి జంతువుల బలాన్ని పొందిన నేను అడవి పాలనా బాధ్యతలను. వదిలిపెట్టేది ఏమిటి?" అన్నది. ఆ సింహంతో పోరాడి దాన్ని చంపేసింది పొరుగు సింహం. సమర్థవంతమైన ఏనుగును ఆ అడవికి రాజును చేసింది. అడవికి పట్టిన కష్టాలు తొలగిపోయాయి.