మరునాడు వారాంతపు సెలవు కదా అని, భార్య సత్యతో కలిసి కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి ఒంటి గంట వరకు టీవీలో సినిమా చూసి పడుకుంటే –
ఆయన నాన్న వాసుదేవరావు పెట్టిన సుప్రభాతంతో, శనివారం తెల్లవారి అయిదు గంటలకే భార్యాభర్తలకి నిద్రా భంగమైంది.
ఇద్దరికీ ఆయన మీద ఎంత చికాకు వచ్చినా, ఎప్పటిలాగే పెద్దాయన కదా అని ఏమీ అనలేక, ఓ గంట వరకూ పక్కమీదే అసహనంగా అటూఇటూ దొర్లి, ఆరుగంటలైన తరువాత ఇక తప్పదని లేచి, ఏడో గంటవుతుండగా పెద్దాయనకి టీ అందించేరు.
ఆ రెండుగంటలలో - సుప్రభాతం అయిపోగానే, వెంకటేశ్వర భక్తిగీతాలు పెట్టి, వ్యాయామం, యోగా, ధ్యానం కానిచ్చి, టీ కోసం ఎదురు చూస్తూ తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు, వాసుదేవరావు.
ఏడాది క్రిందటి వరకు, పూజలు పునస్కారాలన్నీ వాసుదేవరావు భార్య అన్నపూర్ణగారే చేసేవారు. ఈయన హారతి కళ్ళకద్దుకొని దేమునికి నమస్కారం చేసి వచ్చి తన దినవారీ కార్యక్రమాలలో పడుతూ లేస్తూ, వేళ అవగానే ఏదో ఇంత తిని ఆఫీస్ కి పరిగెత్తేవారు.
ఆవిడ పోయిన తరువాత, కాస్తా కాలక్షేపం కూడా అవుతుంది కదా అని, ఆ పూజలు పునస్కారాలవీ తానే చేసుకుంటూ కాలం గడపడం అలవాటు చేసుకున్నారు.
ఆ పూజా కార్యక్రమం ప్రారంభం అవ్వాలంటే స్నానం అవాలి. స్నానం చేసే ముందర బాత్ రూమ్ కి వెళ్లి రావాలి. బాత్ రూమ్ కి వెళ్లాలంటే, టీ తాగాలి.
తెలుగు సినిమా పాతపాటలు, భక్తిగీతాలు మరియు కర్ణాటక సంగీతం కీర్తనలు వినడమంటే వాసుదేవరావుకి ఎంత ఇష్టమంటే, కాస్త ఖాళీ సమయం దొరికితే అవి వినవలసిందే. మరిప్పుడు ఆయనకీ ఉన్నదే ఖాళీ సమయం.
-2-
కాబట్టి ఉదయం అయిదు నించి రాత్రి పడుకున్నవరకు ఆయన గదిలోంచి అలా ఏవో వినిపిస్తూనే ఉంటాయి. పైగా, మూడు నెలలై వినికిడి మందగించడంతో, అవన్నీ ఎక్కువ సౌండ్ లో పెట్టుకొని వింటూ ఉంటారు. అవి ఎంత సౌండ్ లో వినపడతాయంటే, ఇరుగుపొరుగు వారెవరూ అవి వినడానికి వారి వారి ఇళ్లలో ఎటువంటి సాధనం వేరే వాడుకోనక్కరలేదు.
మామగారి సంగీతాభిమానంతో, సత్యకి మధ్యాహ్నం నిద్ర కుదరడం లేదు.
"మధ్యాహ్నం ఓ రెండు గంటలు ఆ సంగీతకచేరీ ఆపమని మీరు మీ నాన్నగారికి చెప్తారా లేక నన్నే చెప్పమంటారా"
"పెద్దాయనకి ఎలా చెప్పేది సత్యా"
"కనీసం ఆ సౌండ్ తగ్గించమని చెప్పండి"
"ఆయనకి వినిపించడం తగ్గిపోయింది కదా, అందుకే సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటారు. నీకు తెలియందేమిటి"
"రోజంతా పనిచేసి మధ్యాహ్నం ఓ గంట పడుకుందికి కూడా కరువైపోయింది వెధవది ఈ ఇంట్లో."
"అలా విసుక్కోకు. తాపీగా ఏదో రోజు నాన్నకి నేను మెల్లిగా నచ్చచెప్తాన్లే "
"ఇదే మాట అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాగ మూడు నెలలై చెప్తూనే ఉన్నారు:"
కృష్ణమూర్తి ఆఫీస్ నించి రాగానే, భార్యా భర్తలకు రోజూ ఇలాంటి కీచులాటలే.
కృష్ణమూర్తి ఈ సమస్యని ఒక రోజు తన స్నేహితునితో చెప్పుకొని వాపోతే –
అతను "దీనికి ఇంత ఆలోచన ఎందుకు. బ్లూటూత్ లింక్ ఉన్న హెడ్ ఫోన్ కొని మీ నాన్నగారికి ఇచ్చి, అది ఎలా వాడుకోవాలో నేర్పించు. దాంతో నీ సమస్య గాయబ్" అని సలహా ఇచ్చాడు.
స్నేహితుడిచ్చిన ఆ సలహాని ఆచరణలో పెట్టిన తరువాత, ఇరుగుపొరుగు వారు ఎటువంటి ఖర్చు లేకుండా మంచి సంగీతం వినే భాగ్యానికి దూరమైపోయేరు.
ఇప్పుడు సత్య రోజూ మధ్యాహ్నం గంటేమిటి, రెండు గంటలు హాయిగా నిద్రపోతోంది. అలాంటి సదుపాయం కలగచేసిన భర్త అంటే ప్రేమ ఎక్కువైపోయిన సత్య, కృష్ణమూర్తిని రాత్రి నిద్రపోనివ్వడంలేదు. (అది వేరే సంగతి).
-3-
పిల్లలకి సెలవలు కావడంతో కృష్ణమూర్తి, సత్య, పిల్లలు ఎవరూ కూడా ఏడోగంటకి ముందర లేవడంలేదు. ఆ తరువాత వాసుదేవరావుకి టీ అందేసరికి సుమారుగా ఉదయం ఎనిమిది కావొస్తూంటుంది.
అలా ఓ పదిహేను రోజులు గడిచిన తరువాత, ఒక రోజు ఉదయం వాసుదేవరావు కృష్ణమూర్తితో "ఒరే కృష్ణా, నాకు టీ ఇంత ఆలస్యంగా ఇస్తే, విరోచనం సమస్య అవుతోందిరా. కోడలికి చెప్పి నాకు ఉదయం త్వరగా టీ ఇచ్చేటట్టుగా చూడరా కొంచెం. నీకు పుణ్యముంటుంది"
అలా జరగాలంటే, సత్య ఉదయం త్వరగా లేవాలి.
"పిల్లలకి సెలవలప్పుడు కూడా ఆలస్యంగా లేవడానికి నోచుకోలేదా" అని తాడెత్తున లేచిన సత్యకి ఎదురు చెప్పలేని కృష్ణమూర్తికి ఇప్పుడు మరో సమస్య ఎదురైంది.
కృష్ణమూర్తి తన స్నేహితుడితో మళ్ళా ప్రస్తుత సమస్యని మొరపెట్టుకున్నాడు.
ఏ సమస్యకైనా ఇట్టే సమాధానం చెప్పగలిగిన ఆ స్నేహితుడు "ఇదేమీ సమస్య కానేకాదు. ఓ పని చెయ్యి. కరంట్ తో పనిచేసే ఒక అరలీటర్ నీళ్లు మరిగే వాటర్ హీటర్ కొని, దాంతోపాటు చిన్న చిన్న పాలగుండ ప్యాకెట్లు, పంచదార గుళికలు, చిన్న టీ ప్యాకెట్లు కొని, మీ నాన్నగారికి ఇచ్చి వాటితో తానే టీ ఎలా చేసుకోవొచ్చో నేర్పించు. పైగా, నాన్నా ఇవన్నీ నీ దగ్గర ఉంటే, నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు నీ అంతట నువ్వే టీ తాగవచ్చు అని కూడా చెప్పు. దాంతో, నీ సమస్య హుష్ కాకే. మీరు టీ త్రాగే సమయంలో మీ నాన్నగారికి మీ ఆవిడ భక్తిగా ఇచ్చే టీ ఆయన మరోసారి త్రాగుతారు, అంతే. " అని సలహా ఇచ్చేడు.
తేలికైన మనసుతో, కృష్ణమూర్తి ఆ సలహా తూ చ తప్పకుండా పాటించి ప్రశాంతంగా ఉన్నాడు.
మరునాడు ఆదివారమే కదా అని, భార్యాభర్తలు టీవీలో సినిమాలు చూసి, రాత్రి మూడవుతుండగా పడుకున్నారు. దాంతో, వాళ్ళు లేచేసరికి ఉదయం ఎనిమిదవస్తోంది.
-4-
తొమ్మిదవుతుండగా, తాను తయారుచేసిన టీ కప్పుతో వెళ్లిన సత్య వెంటనే తిరిగివచ్చి కృష్ణమూర్తితో "మీ నాన్నగారు హెడ్ ఫోన్ పెట్టుకొని కుర్చీలో కూర్చొని పడుకొని ఉన్నారు. ఎంత పిలిచినా పలకడం లేదు. మీరు వెళ్లి గట్టిగా పిలిచి, ఆ హెడ్ ఫోన్ తీసి. ఈ టీ తాగమని చెప్పండి" అని టీ కప్పు ఇచ్చింది.
"నువ్వే గట్టిగా పిలిస్తే అయిపోయేదికాదా, మళ్ళా నేను వెళ్లాలా" అని విసుక్కుంటూ వెళ్ళాడు, కృష్ణమూర్తి.
అలా వెళ్లిన కృష్ణమూర్తి అయిదు నిమిషాలకి విషణ్ణ వదనంతో బయటకి వచ్చి "సత్యా, నాన్న ఇక లేరు. ఆ కుర్చీలో కూర్చొనే ఎన్ని గంటలకి పోయారో. అతని శరీరం చల్లగా ఉంది." అని ఏడుస్తూ దిగులుగా కూర్చో పడిపోయేడు.
భర్త చెప్పింది నిజంగా నిజమేనా అని తెలుసుకోవడానికి వెళ్లిన సత్య కూడా వచ్చి భర్త పక్కన దిగులుగా కూర్చుంది.
అలా కూర్చున్న కృష్ణమూర్తి 'స్నేహితుడిచ్చిన రెండు సలహాలు పాటించి, ఆఖరికి తండ్రి ఎప్పుడు పొయారో కూడా తెలుసుకోలేనంత పరిస్థితి, తన చేతులారా తానే తెచ్చుకొని పెద్ద తప్పు చేసేనేమో' అని మౌనంగా రోదిస్తూ, తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు -- లోపం ఎక్కడుంది అని.
**************