ప్రసాదం - జీడిగుంట నరసింహ మూర్తి

Prasadam

“ఈ రోజు తాయారమ్మ బంగారయ్యా రాలేదేమిటో ప్రతి ఆదివారం టంచన్గా వాలిపోతూ వుంటారుగా ?” అన్నాడు రమణారావు భార్య మాధురితో. అతని గొంతులో రవ్వంత హేళన తొంగిచూసింది. .

“ పోనీలెండి .వాళ్ళను అంత చులకనగా చేసి మాట్లాడకండి . . పిల్లలు దూరంగా వేరే దేశాలలో వున్నారు. వాళ్ళకు ఈ వయసులో ఏం తోస్తుంది చెప్పండి. ఏదో దగ్గర చుట్టాలిళ్ళకు వెళ్ళి పలకరిస్తారు . . వాళ్ళ వల్ల మనకు ప్రత్యేకంగా ఖర్చు కానీ , శ్రమ కానీ ఏముంది ఏదో వచ్చినప్పుడల్లా ఇద్దరికీ చెరో కప్పు కాఫీ తప్ప “ అంది మాధురి తన పిన్నీ , బాబాయిలను సమర్ధిస్తూ. నిజానికి వాళ్ళకు తాయారమ్మా, బంగారయ్యా అని పేరు పెట్టింది రమణారావే. వాళ్ళ అసలు పేర్లు రమణి, రాజారావూను.

పేపరు చదువుకుంటూ బాల్కనీలోంచి వీధిలోకి చూశాడు రమణారావు. . దూరంగా నడుచుకుంటూ వస్తూ కనపడ్డారు రాజారావు దంపతులు. కుర్చీలోంచి దిగ్గున లేచి " ఏమోయ్ . రారనుకున్నాను. ఆకాశం విరిగి మీద పడినా కూడా వాళ్ళ రాక ఆగదు అని మరోసారి రుజువయ్యింది. . .అన్నట్టు ఈ రోజైనా మర్చిపోకుండా ప్రిజ్జులో వుంచిన తిరుపతి లడ్డూలు వదిల్చెయ్యి. ప్రిజ్జు డోర్ తెరవాలంటేనే భయంగా వుంటోంది “ అన్నాడు .

ఎప్పటికప్పుడు ఎవరికో ఒకరికి పెట్టేసి వదిలించుకోవాలని అనుకోవడం ,ఆ విషయం వచ్చిన వాళ్ళు వెళ్లిపోయాక గుర్తుకు రావడం ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చోవడం కొన్నాళ్లుగా అనుభవం అవుతున్న దరిమిలా ఈ రోజు బాగా గుర్తుపెట్టుకుని పెన్నుతో అరచేతిమీద కూడా రాసి పెట్టుకున్నాడు రమణారావు. ఎటువంటి పరిస్తితిలో మర్చిపోవడానికి వీల్లేకుండా. .

“ ఏమిటండీ మీరు మరీ బొత్తిగా ఇలా తయారయ్యారు? మీకు నాకూ షుగర్ వుందని తెలిసీ కూడా అపార్ట్మెంట్లో పక్కవాళ్ళకు కూడా ప్రసాదం పంచకుండా దేవుడి ప్రసాదమేగా ఎన్ని రోజులైనా వుంటుంది ఇంటికొచ్చిన ఎవరికైనా పెట్టొచ్చు అంటూ ప్రిజ్జులో రెండు నెలలనుండి మురగ పెట్టి వుంచి ఇప్పుడు ఏదో రకంగా మా వాళ్ళకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి అలా చేస్తే ఖచ్చితంగా మనకు పాపం అంటుకుంటుంది . నా చేతులతో నేను ఎవరికీ ఇవ్వలేను. నేను ఆ విషయం మర్చిపోవడం లేదు. కావాలనే మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రసక్తి తీసుకురావడం లేదు . మీరు కూడా అటువంటి ప్రయత్నాలు మానుకోండి . రేపెప్పుడైనా ఏదైనా గుడి దగ్గర బయట గోడ దగ్గర పెట్టేయ్యండి.” అంటూ మొగుడు పసాదం విషయం ఎత్తినప్పుడల్లా క్లాసు తీసుకునేది మాధురి . . .అతని ప్రతి మాటా,ప్రతి చర్యా ఆమె అర్ధం చేసుకోగలదు.

భర్త ప్రవర్తనకు ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ వస్తూనే వుంది కానీ ఆ రోజు గట్టిగా మొహం వాచేటట్టు చివాట్లు పెట్టింది. వెంటనే వెళ్ళి ప్రిజ్జులోంచి ప్రసాదాన్ని తీసి వేరే చోటకు మార్చాలని ఆమె ఆలోచన . .

“నీ మొహం దేవుడి ప్రసాదం పాడవడం ఏమిటి ? ప్రిజ్జులున్నది ఎందుకనుకుంటున్నావ్ ?. . నీకెందుకు ఊరుకో . ఏదో రకంగా వాటిని ఈ రోజు వదిలించి చెయ్యి దులుపుకుంటాను. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కావడం లేదే . అది ప్రసాదమే బాబూ . ఎవరైనా కళ్లకద్దుకుని తీసుకుంటారు . ఈ విషయంలో నువ్వేమీ నాకు అడ్డురాకు “ అంటూ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. . భర్త మాటలు ఆమెకు అర్ధరహితంగా తోచాయి. ఎంతగా సరిపెట్టుకుందాం అనుకున్నా కుయుక్తితో కూడిన అతని ప్రవర్తనకు అవమానంతో మొహం జేవురించింది. అతను మానవతా విలువలకు ఎప్పుడో నీళ్ళు వదిలేసినట్టుగా ఆమెకు తోస్తోంది.

అరగంట గడిచింది కానీ రమణీ, రాజారావులు కాలింగ్ బెల్ కొడతారని చూసిన రమణారావుకు నిరాశ ఆవరించింది.

"అదేమిటి .నాకు వాళ్ళు దూరం నుండి వస్తున్నట్టు కనపడ్డారే. ఇంకా రాలేదేమిటి ? ఎవరిని చూశానో ఏమిటో? వుండు కిందకు వెళ్ళి చూసొస్తాను " అంటూ మెట్లు దిగి బయట గేటు దగ్గర కాసేపు తచ్చాడాడు రమణారావు . .క్షణ క్షణానికి అతనికి భరించరానంత ఆలస్యంగా అనిపిస్తోంది. అతని మనసంతా విష తుల్యం అయిపోయింది .

"భగవంతుడా . ఈ రోజు పిన్నీ బాబాయిలు రాకుండా చూడు . . ఈ మొండి మనిషి అన్నంత పని చేస్తాడు " అని మనసులో దణ్ణం పెట్టుకుంది మాధురి.

ఏమయ్యిందో ఏమిటో వరసగా వారం రోజులుగా తాయారమ్మా, బంగారయ్యా అదే రమణి రాజారావులు రమణారావు ఇంటి మొహం చూడలేదు. . తన క్షేమ సమాచారాలు ఆప్యాయంగా కనుక్కునే తన పిన్ని, బాబాయిలు రావడం మానేసేసరికి మాధురి కంగారుపడి ఫోన్ చేసింది.

“ ఏం చెప్పమంటావే అమ్మాయి! మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు నెల రోజులక్రితం తిరుపతి నుండి తెచ్చి పక్కన ఉంచేసిన లడ్డూ ప్రసాదం బలవంతం చేసి తినిపించారు. అప్పటికే ఆ ప్రసాదం పూర్తిగా పాడయ్యిపోయిందనుకుంటా మా ఇద్దరికీ ఒకటే డోకులు. నలుగురికీ పంచితే అది ప్రసాదం అవుతుంది కానీ అలా ఎవరైనా ఎవరికీ పెట్టకుండా మురగపెట్టుకుంటారా ? అసలు అటువంటివారిని దేవుడు హర్షిస్తాడా చెప్పు ? పాపం మూటకట్టుకోరూ? సరే తల్లీ . ఈ డోకులు పూర్తిగా కట్టేసి కొద్దిగా నెమ్మదించాక ఒకసారి ఆటో కట్టుకునైనా మిమ్మల్ని వచ్చి చూడాలని వుంది . “అంది అవతలవైపునుండి రమణి నీరసంగా .

"అయ్యో ఎంత పని జరిగింది ? నిజంగా ప్రమాదం తప్పింది. పాపం మీ పిల్లలు కూడా దగ్గరా దాపుల్లో లేరు . ఆ భగవంతుడే కాపాడాడు " అంటోంది మాధురి. . పిన్నితో మాట్లాడుతోంటే ఆమె పెదవులు అదురుతున్నాయి.ఆమె గుండె దడదడా కొట్టుకోవడం ఆమెకు వినిపిస్తోంది.

"ఏమిటటా ? ఎందుకు రావడం లేదుట ? ఏమంటోంది మీ పిన్ని ?" అడిగాడు రమణారావు మాధురి ఫోను పెట్టేశాక . అతని మనసులో ప్రిజ్జులో వున్న లడ్డూలే మెదులుతున్నాయి. అవి వదుల్చుకోలేని తన అశక్తతకు మనసులోనే తనని తను నిందించుకున్నాడు.

"ఏం జరిగిందా ? పక్కింటి వాళ్ళు ఎవరో పాడైపోయిన ప్రసాదం పెట్టారుట. ఇది కాకతాళీయం అనుకోండి ఏదైనా అనుకోండి. ఎలాగో అలా చావు తప్పి బయటపడ్డారుట. ఫోన్ చేసే మనకు చెప్పడానికి వీల్లేనంతగా గొంతులు ఎర్రగా పూసిపోయి ఒకటే డోకులుట . ఇంకా నయం అదే మనింట్లో జరిగివుంటేనా ఎంత అభాసుపాలయ్యే వాళ్ళం ? మీ మొండితనం, మూర్ఖత్వం ఇకనైనా తగ్గించుకోండి. భగవంతుడు చూస్తూ వూరుకోడండీ. నా అదృష్టం బాగుండి ఈ గండం గడిచింది. ఇంత జరిగాకా కూడా సిగ్గులేకుండా ఇలాగే ఇంట్లో కూర్చుంటే ఎవరూ క్షమించరు. పదండి వెళ్ళి పలకరించి వద్దాం. దారిలో డబ్బు కోసం చూసుకోకుండా మంచి పళ్ళు కొని తీసుకెళ్దాం" అంటూ తొందరపెట్టింది మాధురి.

అనుకోని ఈ హఠాత్పరిణామాన్నుండి తేరుకోవడానికి రమణారావుకు చాలా సమయం పట్టింది. ఇంకా ఒక్క నిమిషం ఆలోచించక వెళ్ళి ప్రిజ్జులోని లడ్డూలు ఒకసారి దేవుడి పటం వైపు చూసి దణ్ణం పెట్టుకుని గోడ వెనకాలకు విసిరేశాడు. మాధురి తలుపు తాళం వేసి బయలుదేరుతూ ఉంటే మౌనంగా భార్యను అనుసరించక తప్పలేదు రమణారావుకు . ***

సమాప్తం

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి