వారాలబ్బాయి - బి.రాజ్యలక్ష్మి

Vaaraalabbayi

“ఏమండీ మీతో ఒక మాట చెప్పాలి రాజ్యం తల దువ్వుకుంటున్న రమణ దగ్గరగా వచ్చింది .

“ఒక్క మాటేగా చెప్పు రాజూ “అన్నాడు రమణ ఆఫీసుకెళ్లే హడావిడిలో .

“ఏం లేదండీ !మన రాఘవ క్లాసులో ఒక బీదబ్బాయి చేరాడుట .చదువులో చురుకు ! చదుకోడానికి పుస్తకాలకు , అన్నింటికీ స్కాలర్షిప్ వస్తున్నదిట.హాస్టల్ వాళ్లు భోజనం వసతి లేదన్నారుట .వుండడానికి వసతిచ్చారు ///“ రమణ భార్యను మధ్యలోనే. ఆపాడు .

“రాజ్యం నువ్వు చెప్పాల్సింది సూటిగా చెప్పు .నేను ఆఫీసుకెళ్లాలి “అన్నాడు రమణ .

“వారానికో రోజు ఆదివారం అతనికి మనింట్లో భోజనం పెట్దామనుకుంటున్నాను .మిగిలిన రోజులు. మనకు తెలిసిన వాళ్లకు ,నా ఫ్రెండ్స్ కు చెప్పాలనుకుంటున్నాను ,మీ అభిప్రాయం యేమిటి ?”భర్త ను అడిగింది రాజ్యం .

“నెలలో నాలుగు రోజులేగా ! ఒక మంచిపని చేసినవాళ్లమవుతాం .ఇందుకు నా అనుమతి కావాలా పిచ్చిరాజ్యం ! కాకపోతే మిగిలిన. రోజులు నువ్వు అందరికీ తగుదునమ్మా అని అడగకు ! అందువల్ల మనం యిబ్బందుల్లో పడతాం ! ఆ అబ్బాయి యేదో యేర్పాటు చేసుకుంటాడులే !సరే రాజూ నేను ఆఫీసుకెళ్తున్నాను “అంటూ రమణ వెళ్లిపోయాడు .

రాజ్యం ఎదురుగుండా చెట్టుక్రింద నించున్న అబ్బాయిని పిలిచింది .అతను వినయం గా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు .

“అమ్మా బాబుగారు ఒప్పుకున్నారా !”భయం గా వినయం గా అడిగాడు .రాజ్యం అతన్ని పరిశీలనగా చూసింది ముఖం లో చురుకుతనం ,తెలివి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి .సుమారు పదహారేళ్లుంటాయి .ఆత్మాభిమానం తో ముఖం యెర్రబడింది .

“ఒప్పుకున్నారు వేణూ ,ఆదివారం వచ్చేసెయ్యి ,రాఘవ ,విశ్వం తో కూడా ఆడుకోవచ్చు ,చదువుకోవచ్చు ,కాలేజీ హడావిడి ,కంగారు వుండదు .ఈ రోజు యెలాగూ వచ్చావు కాబట్టి భోజనం చేసి వెళ్లు “ అంది రాజ్యం ఆప్యాయం గా అతన్ని చూస్తూ .

వేణు ముఖం లో సంతోషం ,ఆకలి కొట్టొచ్చినట్టు కనపడ్డాయి .పెరట్లో కాళ్లు చేతులు కడుక్కోచ్చాడు .వంటింటి ప్రక్కన గదిలో విస్తరాకేసి మంచినీళ్ల గ్లాసు పెట్టింది .కూర ,పప్పు ,పచ్చడి వేసింది .పెరుగు ,ముక్కలపులుసు రెండు కప్పుల్లో పోసి ప్రక్కన పెట్టింది .వంటింటి గుమ్మం దగ్గర కూర్చుంది .అడిగి మరీ మరీ వడ్డించింది .

వేణు కళ్లల్లో నీళ్లు తిరిగాయి .”అమ్మా ,మీలో మా అమ్మ కనిపిస్తున్నది “కళ్లుతుడుచుకున్నాడు .తృప్తిగా భోజనం చేసాడు .కాళ్లకు దణ్ణం పెట్టి వెళ్లిపోయాడు .రాజ్యానికి కూడా చాలా తృప్తిగా వుంది ! ఒక మంచిపని చేసానని అనుకుంది .
————————————————————

ఆదివారం వచ్చింది .రాజ్యం ప్రతి ఆదివారం రమణకు ,పిల్లలకు యిష్టమైన వంటకాలు చేస్తుంది ,స్వీటు హాటు చేస్తుంది .అందుకే వేణును కూడా రమ్మంది పిల్లలతో కలిసి భోజనం చేస్తాడు అనుకుంది .వేణు వచ్చాడు .పిల్లలతో పాటు వేణు భోజనానికి కూర్చున్నాడు . అడిగి అడిగి మరీ యిష్టమైనవి వేయించుకున్నాడు .కబుర్లు చెప్పుకంటూ తిన్నారు .రమణ భార్య రాజ్యం లో చల్లని అమ్మతనాన్నిచూసి సంతోషించాడు .అన్నం పెట్టాడు వేరు ,ఆప్యాయం గా అన్నం పెట్టడం వేరు .ఆప్యాయత లో అమ్మతనం కమ్మదనం వుంది .వేణు కాసేపు రాఘవ తో కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు.

————————————————————————

నెల రోజులయ్యింది .నాలుగు. ఆదివారాలు వేణు పిల్లలతో సరదాగా భోజనం చేస్తాడు ,కబుర్లు చెప్తాడు వెళ్లిపోతాడు .ఒక్కోసారి రాజ్యానికి యింటిపనుల్లో సాయం చేస్తాడు .బజారెళ్లి వస్తువులు తెస్తాడు ,నీళ్లు నింపుతాడు ,గదులు శుభ్రం చేస్తాడు .అతన్ని చూస్తే రమణకు రాజ్యానికి ముచ్చటేస్తుంది .

మరో రెండు నెలలు గిర్రున తిరిగాయి .వేణు బాగా అలవాటుపడ్డాడు .ఆరోగ్యం గా ,పుష్టిగా తయారయ్యాడు .తన పిల్లలకన్నా రెండుముద్దలు యెక్కువే తింటున్నాడు .రమణ యింట్లో సరుకులకు కూరలకు ప్రతినెలా కొంత డబ్బిస్తాడు .అందులోనే రాజ్యం కొంత పొదుపు చేసేది ! కానీ మూడునెలలనుంచి పొదుపూ కుదరడం లేదు పైగా రమణ దగ్గర సరిపోవడం లేదని అప్పుడప్పుడూ తీసుకుంటున్నది .రాజ్యానికి ఒక రోజు యీ విషయాసలన్నీ గ్రహింపుకొచ్చాయి .ఎందుకింత ఖర్చులవుతున్నాయి అని దీర్ఘం గా ఆలోచించింది .వేణు భోజనం అదనపు ఖర్చని అర్ధమయ్యింది .వాడు తిండి బాగానే తింటాడని మొదటిసారి రాజ్యం మనసులో ఒక స్వార్థబీజం నాటుకుంది .అది తొలవడం మొదలయ్యింది .ఇప్పుడు వేణు అన్నానికి వస్తున్నాడంటే చిరాకు అయిష్టం కంపరం మొదలయ్యింది .

———//////——-/————///—-/—-///

ఆదివారం వచ్చింది .కానీ రాజ్యం మనసులో వేణు కు అన్నీ వంటకాలు వడ్డించాలని లేదు .పిల్లలతో పాటు వాడు తినకూడదు అని నిశ్చయించుకుంది . అనుకోకుండా ఆ రోజే పిల్లలు ,రమణ గుడికెళ్లారు .వేణు వచ్చాడు .

“అమ్మా ,యెవ్వరూ కనిపించడం లేదేమిటి “అంటూ చనువుగా అడిగాడు .
“వాళ్లు గుడికెళ్లారు ,నీకు పెట్టేస్తాను రా “అన్నది రాజ్యం .

“వాళ్లు వచ్చేదాకా వుంటానులే అమ్మా “అన్నాడు వేణు .చిర్రెత్తుకొచ్చింది రాజ్యానికి .

“వేణూ నాకసలే తల నొప్పిగా వుంది ,విసిగించకు ,వాళ్లతో నీకెందుకు ? నువ్వు తినెళ్లు “అంటూ కోపంగా అరిచింది .వేణు బిత్తరపోయాడు .ఏమనుకున్నాడో యేమో విస్తరాకు ముందు కూర్చున్నాడు .రాజ్యం విసుక్కుంటూ కొద్దిగా కూర ,కొద్దిగా పప్పు ,కొద్దిగా పచ్చడి వేసి మజ్జిగ కప్పు పెట్టింది .వేణు ముభావం గా పెట్టింది తిన్నాడు ,మళ్లీ అడగలేదు .ఆకు తొట్లో పడేసి చెయ్యి కడుక్కుని రాజ్యానికి నమస్కరించి వెళ్లిపోయాడు .రాజ్యానికి వాడు అలా వెళ్లిపోతుంటే యేదో తప్పుచేసినదానిలాగా ఫీల్ అయ్యింది .

ఇంకో ఆదివారం వచ్చింది .వేణు వచ్చాడు .రమణ పిల్లలు యింట్లోనే వున్నారు .పిల్లలూ వేణు కలిసి తింటే వేణుకు స్వీట్లు హాట్లు ఎక్సట్రా చేసిన వంటకాలు వడ్డించాల్సి వస్తుంది ,వాడికి వెయ్యకపోతే పిల్లలూరుకోరు .అందుకని రాజ్యం పిల్లలు రమణ వున్న గదికి వెళ్లింది .

మీకు తర్వాత అన్నం పెడతాను .వేణు తిని వెళ్తాడు బయటకు రాకండి “అంటూ తలుపులు దగ్గరేసి వేణును వరండాలో కూర్చోమంది .

వేణుకు క్రమం గా రాజ్యం ప్రవర్తన అర్ధమవుతున్నది . వరండాలో కూర్చున్నాడు .విస్తట్లో చద్దన్నం ,ఆవకాయ వేసింది .ఒక కప్పులో పల్చని మజ్జిగ పెట్టింది .
“వేణూ ధరలు బాగా పెరిగాయి .యీవల యేమి చెయ్యలేదు .చద్దన్నం కూడా బాగామిగిలింది .పారెయ్యలేం గా “అంటూ వేణును చూసింది .

“పర్వాలేదమ్మా మా యింట్లో కూడా అమ్మ అప్పుడప్పుడు చద్దన్నం పెడ్తుంది .నాకలవాటే “అన్నాడు వేణు .రాజ్యానికి అతని మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి .ఏదో అపరాధభావం ఫీలయ్యింది .వేణు విస్తరాకు పడేసి వెళ్లిపోయాడు .

రమణ అన్ని వింటూనే వున్నాడు .పిల్లలు రమణ భోజనానికి వచ్చారు .వాళ్లకు స్వీట్లు హాట్లు రెండు కూరలు అప్పడాలు వడియాలు వేసింది .రాఘవ కు యెందుకో అనుమానం వచ్చింది .

“అమ్మా వేణుకు స్వీట్లు వేసావా ,అన్ని కూరలు వేసావా అప్పడాలు వడియాలు వేసావా “అంటూ రాజ్యం ముఖం లోకి అనుమానం గా చూసాడు .

“ఒరేయ్ నన్ను విసిగించకు ,వాడి గొడవ నీకెందుకు ?”కసిరింది .

రమణ మౌనం గా తినేసాడు .పిల్లలు తినేసి లోపలి వెళ్లారు .

“రాజ్యం నీ పధ్ధతి బాగాలేదు .నువ్వే ఆదివారం వేణు కు భోజనం అనుకున్నావు .అతను అభిమానం కల పిల్లాడు. నీ ప్రవర్తన అతన్ని యెంత బాధపెడ్తుందో గ్రహించావా ! మనకు యింకో పిల్లాడు వుంటే పెట్టమా ! అతను బీద పిల్లాడు పరాయి పిల్లాడు అని చులకన ! ఎన్నాళ్లు పెడతాం ? నువ్వే ఆలోచించు .ఇంటర్ మీడియేట్ రెండు సంవత్సరాలు ! సెలవులొస్తే తల్లి దగ్గర కే వెళ్తాడు ఆ తర్వాత మనం రమ్మన్నా రాడు ఒక పిల్లాడి బంగారు భవిష్యత్తు ఆలోచించు ! మనం మనుష్యులం శిలలం కాదు ! “అన్నాడు రమణ .అప్పటికే రాజ్యం మనసు కరిగి కన్నీరయ్యింది ! తన తప్పు తెలుసుకుంది సిగ్గుపడింది .వేణు ను తీసుకురమ్మని రాఘవను పంపింది .ఆదివారాలు వేణు లైబ్రరీ లో వుంటాడని తెలుసు .రాఘవ సంతోషం గా వేణు ను తీసుకొచ్చాడు .వేణు వచ్చాడు కానీ ముఖం లో సంతోషం లేదు .

రాజ్యం వేణు ను చూడగానే “రా వేణూ నామనసు బాగాలేక విసుక్కున్నాను .యింకా యెప్పుడూ విసుక్కోను “అంటూ అక్కున చేర్చుకుని తల నిమిరింది .కళ్లు చెమర్చాయి !వేణు కూడా “అమ్మా “అంటూ వాటేసుకున్నాడు .రమణ పిల్లలు కూడా రాజ్యాన్ని వాటేసుకున్నారు .రాజ్యం స్వీటు వేణు నోట్లో పెడుతూ కన్నీళ్లతో నవ్వేసింది .

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి