బంధం విలువ - సుధావిశ్వం

Bandham viluva

ఆరోజు కాలేజీలో అందరికీ ఆఖరి రోజు. డిగ్రీ ఫైనల్ పరీక్షల రిజల్ట్స్ చూసుకుని ఫస్ట్ మార్క్స్ వచ్చినవాళ్ళు, కనీసం బొటాబొటి మార్కులతో పాస్ అయిన వాళ్ళు పార్టీ గురించి మాట్లాడుకుంటుంటే, ఫెయిల్ అయిన వాళ్ళల్లో అప్పుడు బాగా చదవాల్సింది అని కొందరు, ఆ.. ఏముంది మళ్లీ రాయొచ్చు, లైట్ తీసుకో అనుకుంటూ కొందరూ తిరుగుతున్నారు కాలేజీ ప్రాంగణంలో. మరికొందరు ఫ్రెండ్స్ తో విడిపోతున్నామని బాధ పడుతున్నారు. అప్పుడు అక్కడికి మాళవిక బ్యాచ్, రమ్య బ్యాచ్, ప్రశాంత్ బ్యాచ్, తరుణ్ బ్యాచ్ అలా కొందరు తమ బ్యాచ్ లతో ఒక్కచోట చేరారు. "ఈ కాలేజీ నుంచి వెళ్లిపోతున్నామంటే బాధేస్తుంది. అందరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఏ ర్యాగింగ్ లేదు. చదువులో ఒకళ్లకు ఒకళ్ళం హెల్ప్ చేసుకుంటూ నాలెడ్జ్ పెంచుకున్నాం. ఇప్పుడు ఎవరు ఏ రూట్ లో వెళతామో తెలీదు. మళ్లీ ఎప్పుడు కలుస్తామో! ముఖ్యంగా మన లెక్చరర్స్, మన ప్రిన్సిపాల్ సార్ అందర్నీ విడిచి పోతున్నాం.." అంటూ ఆగింది మాళవిక "అవును. మాకూ అలాగే వుంది" అన్నాడు తరుణ్ "నాదో ఐడియా! చెప్పనా! ఓ పని చేద్దాం. మరో ఐదేళ్లలో మన ప్రిన్సిపాల్ సార్ రిటైర్డ్ అవుతారు కదా! సార్ రిటైర్మెంట్ రోజు అందరం ఇక్కడే కలుద్దాం. మన అనుభవాలు పంచుకుందాం. సార్ కి చెప్పి వెళదాం. ఆయన ఆనందిస్తారు" అన్నాడు తరుణ్ "అవును ఈ ఐడియా బావుంది. అందరం కాంటాక్ట్ లో ఉందాం. సెల్ నంబర్స్ ఉంటాయిగా కలవొచ్చు" అన్నది రమ్య "ఓకే! డన్!" అనుకున్నారు అందరూ. ప్రిన్సిపాల్ సార్ కి, లెక్చరర్స్ కి చెప్పి, విడిపోయారు. ***** ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. కొందరు సాఫ్ట్ వేర్ జాబ్స్ లోకి వెళ్లారు, కొందరు డాక్టర్లు అయి పెద్ద హాస్పిటల్స్ లో చేస్తున్నారు. కొందరు అందులో పీజీ చేస్తున్నారు. కొందరు లాయర్లు అయి ప్రాక్టీసు చేస్తున్నారు. ఆ రోజు ప్రిన్సిపాల్ దివాకర్ రావు గారి రిటైర్మెంట్. ఆయన పూర్వ, ప్రస్తుత అందరు విద్యార్థులకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, ఆప్తుడు. కాలేజీ యాజమాన్యంనే కాకుండా విద్యార్థులు అందరూ ఘన సన్మానం చేశారు. పూర్వ విద్యార్థి సంఘం తరపున కూడా ఘన సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. ఆ తర్వాత.. అప్పటి క్లాస్ మేట్స్ అంతా ఓ చోట కాలేజీ లాన్ లో కూర్చున్నారు. ఎవరు, ఎలా దేంట్లో చేరారు, ఏం చేస్తున్నారు షేర్ చేసుకుంటున్నారు. "ఇంతకీ రమేష్ ఏడి? రాలేదా?" అని అడిగాడు తరుణ్ "అవును విశాల్! నీతో పాటుగా రమేష్ కూడా లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్నాడు కదా! తను బిజీ నా? మన నాలుగు బ్యాచెస్ కలిసి ఓ గ్రూప్ గా ఉండేవాళ్ళం. తనొక్కడే మిస్. తానూ వచ్చి ఉంటే బాగుండేది. ఇంతకీ తన లైఫ్ ఎలా ఉంది?" అంటూ అడిగాడు ప్రశాంత్ విశాల్ ఆ మాట విన్న వెంటనే నవ్వుతూ ఉన్నవాడు కాస్తా మౌనం వహించి, ఎటో చూడసాగాడు. "ఏమైందిరా బాబూ? ఎనీ థింగ్ రాంగ్?" అని అన్నాడు తరుణ్ "అవును. విషయం ఏంటో చెప్పు విశాల్" అంది మాళవిక అప్పుడు నోరు విప్పాడు. "రమేష్ ఒక ఊరి సర్పంచ్ కూతురిని పెళ్లి చేసుకున్నాడని మీకు తెలుసు కదా! మనం అటెండ్ అయ్యాం కూడా. హ్యాపీగా ఉంటాడని అనుకున్నాం కదా.." అంటూ ఆగాడు "ఆ అమ్మాయి మంచిది కాదా! కేసులు ఏమైనా పెట్టిందా? అయినా వాడూ లాయర్ నే గా" ఇలా ఆగకుండా ఆతృతగా అడుగుతోంది రమ్య "అబ్బా! ఆగమ్మా తల్లీ! అదేంకాదు. ఆ అమ్మాయి చాలా మంచిది. పెళ్ళవ్వగానే మామగారి పరపతి వల్ల చాలా కేసులు పెరిగాయి మన వాడికి. మంచి ఆదాయమూ వచ్చింది. అందుకని భార్య చేత కూడా లా చేయించి, ప్రాక్టీసు లో హెల్ప్ కు పెట్టుకోవాలని, జాబ్ మానేయ్యమన్నాడు. పాపం మానేసింది తను. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్లకు. ఓ సారి అత్తవారింటికి పండక్కి వెళ్ళాడు ఫ్యామిలీ తో. అక్కడ వాళ్ళ మామగారు సరిగ్గా మాట్లాడలేదట, గౌరవం తగ్గిందట. వీడికి కోపం వచ్చింది. భార్యతో అంటే అది చిన్న విషయం అన్నదట. అందుకని వీడికి కోపం. అప్పుడే ఎవరో పెళ్లయిన ఒకమ్మాయి వీడి వద్ద జూనియర్ గా చేరింది. ఆమెకు అట్రాక్ట్ అయి చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. ఓరోజు వాళ్లావిడ నాకు కాల్ చేసి చెప్పింది. నేనూ ఒకటి, రెండు సార్లు చూసాను తనతో క్లోజ్ గా ఉండడం. ఓ సారి అడిగాను కూడా. అప్పుడు వాడు... "ఇదంతా ఉత్తిదే రా! సినిమాలో లా ప్రయోగం చేస్తున్నా. నేను ఈమెకు దగ్గర అవుతున్నానని తెలిస్తే నా విలువ తెలిసి వచ్చి, నా కాళ్ళు పట్టుకుంటుంది మా ఆవిడ. అందుకని అలా చేస్తున్నా. కానీ మా ఇద్దరి మధ్యా ఏమీ లేదు" అన్నాడు ఇంకేమనాలో తెలియలేదు. ఆ జూనియర్ అమ్మాయిని కూడా ఒక్కతీ వున్నప్పుడు చూసి, మందలిస్తూ.. "ఏంటమ్మా ఇది? పెళ్లి అయిన దానివి, ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండాలి కదా! అలా ఎందుకు చేస్తున్నావు" అన్నాను "ఏం చేయమంటారండి బాబూ! నేనెంత దూరంగా ఉందామని చూసినా, ఆయనే అదే మీ ఫ్రెండ్ నే వినట్లేదు. ఇక ఏం చేయను నేను" అంది వయ్యారాలు పోతూ ఇదీ పరిస్థితి. డైవోర్స్ కు కూడా వేశాడని విన్నాను. అందుకే రాలేదేమో! పాపం! ఆ అమ్మాయిని, పిల్లల్ని తలుచుకుంటే బాధేస్తుంది" అని ముగించాడు సైకాలజిస్ట్ అయిన మాళవిక... "వాడి బ్రెయిన్ వాష్ చేద్దాం మనందరం కలసి వెళ్లి. ముందుగా ఆ జూనియర్ పిల్లకు వార్నింగ్ ఇచ్చి, అక్కడ్నుంచి వెళ్లిపోయేట్టు చేద్దాం. తర్వాత మనం కలిసి, కన్వీన్స్ చేసి చూద్దాం! ఏమంటారు" అంది అక్కడే ఉండేవాళ్ళు ఓకే అన్నారు. మిగతావారు ఫోన్ లో టచ్ లో ఉంటామన్నారు. అందరూ అక్కడ్నుంచి విడిపోయారు. ***** "సార్! నేను ఇక్కడ మానేస్తున్నాను" అన్నది జూనియర్ "ఏంటి? ఏమైంది ఇక్కడ. ఎక్కడికి వెళ్లిపోతావ్" మీడియా లో పనిచేసే ప్రశాంత్ కొందరు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి.. "నువ్వు ఏదో కారణం చెప్పి రమేష్ ను వదిలి వెళ్లకపోతే, ఛానెల్స్ లో నీ స్టోరీ వస్తుంది. మీ ఆయనకు, చుట్టాలకు తెలుస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సాక్ష్యాలు ఏమున్నాయని అనుకోకు. మా దగ్గర అన్నీ ఉన్నాయి. మీ ఇద్దరూ కలిసి వెళ్లిన ప్రదేశాల నుంచి సేకరించాం" అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు ఇదంతా గుర్తొచ్చి, "మా ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యింది. మా ఊరు వైజాగ్ వైపు. అందుకే అటు వెళ్తున్నాం" "అదేంటి? మీ ఆయనకు విడాకులు ఇచ్చేస్తానన్నావుగా! అందుకేగా నేనూ విడాకుల కోసం పేపర్స్ రెడీ చేసుకుంటున్నా. మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాంగా!" "అప్పుడు అలా అనుకున్నాను. కానీ మా ఆయన మంచిగానే ఉంటున్నాడు ఇప్పుడు. నేను విడాకులు తీసుకోను. వెళుతున్నా" అని చెప్పి వెళ్ళిపోయింది హతాశుడయ్యాడు రమేష్. ***** ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు. 'ఎప్పుడూ ఇంటికి రాగానే ఏదో ఒకటి నొప్పించే మాటలు మాట్లాడేవాడు ఇలా కూర్చున్నాడు ఏంటో!' అనుకుంది భార్య. అప్పుడు మాళవిక మిగతా బ్యాచ్ వాళ్లతో కలిసి వచ్చింది రమేష్ ఇంటికి. హఠాత్తుగా వచ్చిన క్లాస్ మేట్స్ ను చూసి సర్దుకుని... "హాయ్! అందరూ వచ్చేసారే! అడ్రెస్ ఎలా తెలిసింది. విశాల్ ఇచ్చాడా? నాతో ఓ మాటైనా చెప్పలేదు.." ఇంకా ఏదో అనబోయాడు "చెబితే రావద్దనే వాడివా? మొన్న అందరం కలుద్దాం అనుకున్నాం కదా! రాలేదేంటి? అందుకే మేమే వచ్చాం" అన్నది మాళవిక "కోర్టు పనుల్లో మర్చిపోయాను..." "అదేం లేదు. నీ ఘనకార్యం మాకు తెలిస్తే బాగుండదని రాలేదు. అంతే కదా!" అన్నది రమ్య "ఏమంటున్నావు? నేనేం చేశాను?" అన్నాడు అయోమయంగా "చూడు రమేష్! జీవితం చాలా విలువైనది. అందులో కుటుంబం ఎంతో ముఖ్యమైనది. మనల్ని ఈగో లేకుండా అర్థం చేసుకుని, సర్దుకుని పోయే జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టం. అటువంటి అదృష్టాన్ని చేజేతులా జారవిడుచు కోవద్దు రమేష్! ఆమెను మాటలతో హింసిస్తూ నువ్వేం ఆనందం పొందుతావో కానీ ఆమె బాధతో కళ్ళల్లో నుంచి కార్చే ఒక్కొక్క నీటి బొట్టు నీకు చెడును కలిగిస్తాయి. పర స్త్రీ వ్యామోహం ఉండకూడదు. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో మన కాలేజీలో చాలాసార్లు మన గురువులు చెప్పగా విన్నాం. అయినా నువ్వు ఇలా చేస్తున్నావంటే చాలా బాధ పడుతున్నాం" అన్నది మాళవిక "నేనేమీ వ్యామోహం లో కొట్టుకుపోవట్లేదు. ఎవరు చెప్పారు మీకు? అనవసరంగా ఏదేదో అనుకుంటున్నారు" "రమేష్! ఊరికే అనడం లేదు. సాక్ష్యాలు చూసే అంటున్నాం. నువ్వు, నీ జూనియర్ తో కలిసి ఉన్న ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఎంతో మంచి అమ్మాయి రా మా సిస్టర్. వాళ్ళ నాన్న ఏదో అవమానించాడు, తనూ పట్టించుకోలేదని కోపం తెచ్చుకోవడం ఏంట్రా? ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళను చూసైనా వాళ్ళను క్షమించేసి, బుద్ధిగా కాపురం చేసుకోరా! భార్య ప్రేమగా చూసుకున్నట్టు వేరేవాళ్ళు చూస్కోరురా! ఆ సంబంధాలు అక్కడి వరకే. భార్య దూరం అయ్యాక ఆ బంధం విలువ తెలుసుకున్నా బాధ పడటం తప్ప నువ్వు చేసేదేమీ లేదు. అందుకే ఇప్పుడే ఆ బంధం విలువ తెలుసుకో! నీ భార్యకు మంచి భర్త గా, పిల్లలకు మంచి తండ్రిగా మారు!" అన్నాడు బాధగా విశాల్ అలా అందరూ తమ స్టయిల్ లో చెప్పి కన్వీన్స్ చేశారు. స్వతహాగా మంచివాడు అవ్వడంతో త్వరగానే తన తప్పు తెలుసుకున్నాడు రమేష్. అందరికీ మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్పాడు. ఆ తర్వాత భార్య వద్దకు వెళ్లి క్షమించమని అడిగాడు. ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ అక్కడే సరదాగా కాసేపు గడిపి, తమ ఇళ్లకు వెళ్లిపోయారు. *** శుభం ***

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి