భాగవత కథలు – 17 వామనావతారం - కందుల నాగేశ్వరరావు

Vaamanavataaram

భాగవత కథలు – 17

వామనావతారం

స్వర్గాదిపతియైన దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థించి, ఆయన కృపతో రాక్షసరాజైన బలిచక్రవర్తిని ఓడించాడు.బలి చక్రవర్తి శుక్రాచార్యునికి శిష్యుడై ఆయనకు కనికరం కలిగేటట్లుగా సేవించాడు.శుక్రుడు బలి భక్తికి మెచ్చి అతని చేత నియమానుసారంగా“విశ్వజిత్” యాగాన్ని చేయించాడు. బలి చక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము, సూర్యుడి గుఱ్ఱాలవంటి గుఱ్ఱాలు, గొప్ప విల్లు, అమ్ముల పొది, రత్నాలతో పొదిగిన కంకణాలు, రక్షణ కవచమూ లభించాయి. తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోని పద్మాల దండ ఇచ్చాడు. శుక్రాచార్యులు తెల్లని శంఖాన్ని ఇచ్చాడు.

బలి చక్రవర్తి తన శత్రువులైన దేవతలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గొప్ప గొప్ప దానాలు ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవెనలు పొందాడు. నిండు భక్తితో ఇలవేల్పులను పూజించాడు. పెద్దలందరి ఆశీర్వచనం తీసుకున్నాడు. తాతగారైన ప్రహ్లాదునకు ప్రణమిల్లాడు. తనతో సమానమైన బలము గల దైత్య సేనాపతులు వెంటరాగా రథమెక్కి దేవతల రాజధానియైన అమరావతినగరం చేరాడు.ఆ పట్టణం ముంగిటిలో బంగారు తలుపులు గల దట్టమైన పెద్ద గోపురాలు ఉన్నాయి. ఆ పట్టణం లోపల మేడలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అటువంటి నగరాన్ని రాక్షసులు ముట్టడించి విజయశంఖాలు పూరించారు.

బలి చక్రవర్తి అమరావతి నగరాన్ని ముట్టడించడానికి వస్తున్న సంగతి తెలిసిన దేవేంద్రుడు కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేసాడు. దేవమంత్రియైన బృహస్పతిని సంప్రదించాడు. “ఈ బలిచక్రవర్తి మేరుపర్వతం కంటె ఎత్తు పెరిగి తెగ విఱ్ఱవీగుతున్నాడు. వీడి బారి నుండి తప్పించుకునే మార్గం చెప్పండి” అని బృహస్పతిని వేడుకొన్నాడు. “దేవేంద్రా, భృగువంశపు బ్రాహ్మణుల శక్తి వల్ల వీనికి బలం చేకూరింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు. దానివల్ల నెమ్మదిగా వీడి పరాక్రమం సన్నగిల్లుతుంది. అంత వరకూ ఓపిక పట్టక తప్పదు.” అని చెప్పాడు. దేవతలు దీనికి ఒప్పుకొని ఇష్టమైన మారు వేషాలు ధరించి తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా బలిచక్రవర్తి విశ్వవిజేత అయి చాలా కాలం పాలించాడు. బలి చక్రవర్తి రాజ్యంలో చెయ్యిచాపి దానం అడిగే యాచకులకు కరువు ఏర్పడింది. కాలానుగుణంగా వర్షాలు కురిసేవి. భూమికి “వసుంధర” అనే పేరు సార్ధక మయింది.

అమరావతిని రాక్షసులు ఆక్రమించిన విషయం తెలిసిన దేవతల తల్లి అదితి చాలా దుఃఖించింది. తన బాధను భర్త కశ్యప మహర్షికి వెల్లడించింది. “నా చెల్లెలు పిల్లలైన రాక్షసులు నా కుమారులను దేవలోకం నుండి వెళ్లగొట్టారు. యజ్ఞాలలో హవిర్భాగాన్ని దేవతలకు అందనీయకుండా బలి దోచుకుంటున్నాడు. మహాత్మా బిడ్డలందరి పట్లా నీవు సమానమైనవాడవు. కాబట్టి దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండింప వలదా” అని అడిగింది. అందుకు కశ్యపమహర్షి కొంతసేపు ఆలోచించి, జ్ఞాననేత్రంతో రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో అని తెలుసుకున్నాడు. “ప్రియురాలా, దయామయుడైన విష్ణుమూర్తిని ఆరాధించు. నీ కోరికలు నెరవేరుతాయి.” అని చెప్పి కశ్యపుడు ‘వయోభక్షణం’అనే వ్రతాన్ని ఉపదేశించాడు.

దితి మిక్కిల భక్తిగా నియమనిష్టలతో ఆ వయోభక్షణ వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ వ్రత ఫలితంగా చతుర్భాహుడు, శంఖచక్రగదాధారీ అయిన విష్ణుమూర్తి ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. ఆమె శరీరం పులకించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ స్వామికి నమస్కరించింది. “ తండ్రీ బలవంతులైన రాక్షసులు నా బిడ్డలను బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు. నా బిడ్డల బాధలు పోగొట్టి వారిని కాపాడు” అని వేడుకుంది.

“అమ్మా, తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మించుతాను. మీ ఆలుమగలు ఆనందించేటట్లు, దేవతలు తిరిగి స్వర్గాన్ని పాలించేటట్లు, రాక్షసులు కలవరపడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకూ ఉంది. మక్కువతో నన్ను పెంచు” అని చెప్పి నారాయణుడు అంతర్ధానమయ్యాడు. ఒకనాడు తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణుతేజస్సు ప్రవేశించింది. కశ్యపుని వల్ల అదితి గర్భాన్ని ధరించింది. క్రమంగా నెలలు పెరిగాయి. అదితి గర్భంలోని ఆ శిశువు సమస్త లోకాలనూ తనలో ఇమిడించుకొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణిగిమణిగి ఉన్నాడు.శ్రావణమాసం, ద్వాదశి తిది, శ్రవణా నక్షత్రం, అభిజిత్తు లగ్నం, పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ ప్రకాశించే సమయంలో అదితి గర్భం నుండి మహావిష్ణువు వామన రూపంలో జన్మించాడు.

వామనుడు జన్మించినపుడు అతనికి నాలుగు చేతులూ, వాటిలో శంఖమూ, చక్రము, గద, పద్మమూ ఉన్నాయి. మకర కుండలాలు, రొమ్ముపై శ్రీవత్సము, మెడలో వనమాల, ఒంటిపై గోరోజనం రంగు వస్త్రాలు ఉన్నాయి. మొలకు బంగారు వడ్డాణము, కిరీటమా, హారాలు, మెడలో కౌస్తుభమణి మెరుస్తున్నాయి. అదితి కశ్యపులు ఆనందంతో ‘జయజయ నాదాలు’ చేసారు. దేవతలు పూల వర్షం కురిపించారు. ఆ పిమ్మట వామనుడు తన దివ్యరూపాన్ని వదలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారువేషాన్ని పొందాడు. పొట్టి బాలుడై వడుగు చేయతగిన వయసు కలవాడైనాడు.

అటు తరువాత వామనునికి వడుగు చేయడానికై మునీంద్రులు ఏర్పాటు చేసారు. వామనునికి సూర్యుడు గాయత్రీ మంత్రం ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతం, కశ్యపుడు దర్భల మొలత్రాడు, అదితి కౌపీనం, భూదేవి నల్లని జింక చర్మం, చంద్రుడు దండం, ఆకాశం గొడుగు, బ్రహ్మ కమండలం, సరస్వతీదేవి జపమాల, సప్తర్షులు పవిత్రమైన దర్భలను, కుబేరుడు భిక్షాపాత్ర ఇచ్చారు. పార్వతీదేవి ‘అక్షయం’ అంటూ భిక్ష పెట్టింది.

అర్థులకు అడిగింది ఇచ్చే దాతలు ఎవరున్నారు అని వామనుడు దేశ దేశాల బ్రాహ్మణులను అడిగాడు. అందరూ ఏక కంఠంతో బలి చక్రవర్తిని మించిన దాత ఎవరూ లేరు అని చెప్పారు. పెద్దల దీవెనలు, తల్లితండ్రుల ఆశీర్వచనాలు తీసుకొని మంచి ముహూర్తంలో బయలుదేరాడు. తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగినవాడు విష్ణువు. అయినా అతడు ఇంద్రుని కోసం బలిని బిక్షమడగడానికి బయలుదేరాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడంకూడా గొప్పవారికి ఒక అలంకారమే.

వామనుడు నర్మదా నదిని దాటి బలిచక్రవర్తి యాగశాల వద్దకు చేరాడు. అక్కడి నుండి ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలో చేరాడు. ఆ సభను ఆకర్షించాలనుకొని అక్కడే కాసేపు తిరిగాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో వాదించాడు. కొందరితో నవ్వుతూ ముచ్చటించాడు. తడబడుతూ కలవరపడుతూ దానవ చక్రవర్తిని సమీపించాడు. ధర్బలతో, అక్షతలతోనూ పవిత్రమైన కుడి చెయ్యి చాచి వామనుడు బలి చక్రవర్తితో ఇట్లా అన్నాడు. “ముల్లోకాలనూ శాసించే అధికారం కలవాడా, అవలీలగా దేవేంద్రుడిని వెలవెలా పోయేటట్లు చేసినవాడా, యోగకార్యాలలో విహరించేవాడా, సమస్త రాక్షసలోక సార్వభౌమా, నీకు శుభమగుగాక”.

చక్రవర్తి వామనునితో “ఓ బ్రహ్మచారీ నీ పేరేమిటి? నీ తల్లితండ్రులెవరు? నీవు రావడం వల్ల నాజన్మ, నా వంశం సఫలమయ్యాయి. నీకేమి కావాలి? ధనమా? సంపదలా? పొలాలా? భూభాగమా? ఇంకేమైనా కావాలా? కోరుకో” అన్నాడు. చక్రవర్తి పలుకులకు సంతోషించి వామనుడు ఇట్లా అన్నాడు. “ఇది నాచోటు అని ఎలా చెప్పేది? నేను ఒకచోట కాక అన్ని చోట్లా ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పను? అందరూ నా వాళ్ళే. కాని నేను ఒంటరి వాడిని. మీ పూర్వీకులు గొప్పవాళ్ళు. యుద్ధం చేయడానికి, దానం ఇవ్వడానికి మీ వంశంలో ఎవ్వరూ వెనుకాడలేదు. దానమివ్వడంలోనూ, సుగుణాలలోనూ నువ్వు కూడా మీ పూర్వీకులకు సమానమైనవాడవు. నాకు సొమ్ములూ, భూములు అక్కరలేదు. మూడు అడుగుల నేల మాత్రం ఇయ్యి, చాలు”.

బలి చక్రవర్తి “నువ్వు అన్నమాటలు ఒప్పుకోవలసిందే. కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్నీ అతని సంతోషాన్ని కూడా తలంచ వద్దా. నీకు అడగడం తెలియక మూడు అడుగుల నేల మాత్రం అడిగావు. చక్రవర్తినైన నేను ఇంత తక్కువ ఎలాగిస్తాను” అన్నాడు. ఈ విధంగా పలికిన బలి చక్రవర్తితో వామనుడు అన్నాడు “అయ్యా, నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు, జందెము, కమండలం, మొలత్రాడు, యోగదండం మాత్రం అవసరం. అంతేకాని భూములతో, ధనంతో, సంపదలతో నాకు పనిలేదు. ఆశ అనేది అంతులేని త్రాడు వంటిది. నేను కోరినట్లుగా నాకు ఆ మూడడుగుల చోటిస్తే చాలు. అదే నా పాలిటి బ్రహ్మాండం.సంతోషం కలవాడికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది. పూటపూటకు దొరికిన దానితో సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే తేజస్సు తరుగుతుంది. సంతోషం ఉంటేనే మోక్షం దొరుకుతుంది. సంతోషం లేకపోవడంమే మరల పుట్టడానికి కారణం అవుతుంది.”

వామనునికి మూడడుగుల భూ దానం చేయడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోకి తీసుకున్నాడు. శుక్రాచార్యులు దానవ చక్రవర్తితో “ఇతడు బ్రాహ్మణ వటువు కాదు. మారు రూపంలోనున్న విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడానికి అదితి కశ్యపులకు పుట్టినవాడు. నిన్ను మోసగించి నీ సంపదను తేజస్సును రాజ్యాన్నీ ఇంద్రుడికి ఇస్తాడు” అన్నాడు.

శుక్రాచార్యుని మాటలు విన్న బలి ఒక్కక్షణం కన్నులుమూసి ఆలోచించి ఇలా అన్నాడు. “ఈ వామనుడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఈ చెయ్యి ఎంత గొప్పది? మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, చెక్కిళ్ళపైనా, పైటపైనా, పాలిండ్లపైనా, శరీరంపైనా, పాదపద్మాలపైనా గౌరవాన్ని పొంచేది. అటువంటి గొప్పచెయ్యి ఇప్పుడు క్రిందది కావడమూ, నా చెయ్యి పైది కావడమూ ఎంత అదృష్టము? ఈ రాజ్యం ఏపాటిది? ఈ నా శరీరంకూడా శాశ్వతం కాదు. మేరు పర్వతం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమండలం పొడి అయిపోయినా, మిన్ను విరిగి మీద పడిపోయినా సరే, ఈ దానం ఇవ్వక మానను”. దీనితో శుక్రాచార్యులు కోపగించి “ నా ఆజ్ఞ మీరినావు. కాబట్టి త్వరలోనే నీవు పదవీబ్రష్టుడివి అవుతావు” అని శపించాడు. గురువు శాపానికికూడా బలి చక్రవర్తి బాధపడలేదు.

బలి చక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి భర్త సైగ గమనించి బ్రహ్మచారి కాళ్ళుకడగటానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది. బలి తన రెండు చేతులతోను కడగడానికి వీలుగా వామనుడు తన కుడి పాదాన్ని చాచాడు. వామనమూర్తిగా వచ్చిన విష్ణువు కుడి పాదాన్ని బలి కడిగాడు. తరువాత ఎడమ పాదాన్ని కడిగాడు. చేతులు చాచి వామనుని పూజించాడు. “విష్ణు స్వరూపుడవైన నీకు మూడడుగుల నేల దానం ఇస్తున్నాను” అంటూ నీరు ధారపోసాడు. ఆ సమయంలో నీళ్ళధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఆ సంగతి తెలుసుకొని వామనుడు దర్భకొనతో పొడిచాడు. దానివల్ల శుక్రునికి ఒక కన్ను పోయింది. ఆ తర్వాత ఏ ఆటంకం లేకుండా బలి ధారపోసాడు. వామనుడు తన చెయ్యి చాపి దానధారను స్వీకరించాడు.

బలిచక్రవర్తి విష్ణువునూ దేశకాలాలనూ తెలుసుకున్నాడు. శుక్రుడి మాటలనూ తెలుసుకొన్నాడు. తనకు చేటు వాటిల్లుతుందని తెలుసుకున్నాడు. ఐనప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చాడు. లోకంలో అతనివంటి మహాదాత ఇంకెవరు ఉన్నారు! అప్పుడు విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ, మరియొక అడుగుతో పైలోకాలనూ కప్పివేశాడు. క్రమంగా అన్నిటిని దాటి పోయాడు. ఆ మహారూపం పట్టకపోవడం వలన బ్రహ్మాండభాండం పెటపెటలాడి బ్రద్ధలైపోసాగింది. ఆయనతప్ప ఇంకెవ్వరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, చూపులకూ అందనివాడై శోభించాడు.

అన్ని లోకాలలోనూ వ్యాపించిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి మనస్సులో ఊహించడానికి వీలుకాకా బలిచక్రవర్తి, సభలోనున్న అందరూ చక్కగా స్తోత్రం చేసారు. అప్పుడు విష్ణువు మరల వామనరూపాన్ని ధరించి “ ఓ దానవేంద్రా మూడడుగుల ఇస్తానంటివి. రెండడుగలతో భూలోకమూ, స్వర్గలోకమూ సరిపోయినది. మూడవ అడుగు ఎక్కడ?” అని అడిగాడు.

ఆ మాటలకు దిగులు చెందకుండా బలి చక్రవర్తి వామనునితో “నీ మూడవ పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టు.” అన్నాడు. ఆసమయంలో బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చి వరుణపాశంతో కట్టివేయబడిన బలిని చూసి, విష్ణువును ప్రార్థించాడు. బలి చక్రవర్తి భార్య వింధ్యావళి “స్వామీ, నా భర్త తన సర్వస్వాన్నీ, మూడులోకాల రాజ్యాన్ని నీకు ధారపోసాడు. అటువంటివానిని ఎందుకు బంధించినావు. నాకు పతిభిక్ష పెట్టు” అని స్వామిని ప్రార్థించింది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి “ఇతడు శిక్షింపతగినవాడు కాదు. నీవు విష్ణువుని అని తెలిసి కూడా నీకు దానం ఇవ్వడానికి వెనుకాడ లేదు. ఇతనిని విడిచిపెట్టు” అని ప్రార్థించాడు.

అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు. “ఎవరిపై నేను దయ చూపించాలనుకుంటానో అటువంటి వాని సంపదను హరిస్తాను. ఇతడు పుణ్యాత్ముడు. ఐశ్వర్యాన్నికోల్పోయినా, గురువు శాపానికి గురైనా, సత్యాన్ని వదలకుండనా మాయను గెలిచాడు. ఇతడు మహనీయుడు. రాబోయే ‘సావర్ణి’ మనువుకాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. అంతవరకూ ఇతడు సుతలలోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పెంపొందుతాడు. ఆ లోకాన్ని రోగాలూ, ఆపదలూ, దుఃఖాలు లేకుండా విశ్వకర్మ సృష్టించాడు”. తరువాత బలి చక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు. “బలి మహారాజా నీ త్యాగం శ్రేష్టమైనది. నీకు మేలు జరుగుతుంది. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. నిన్ను నేను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాను.”

. బలి చక్రవర్తి విష్ణువుకు, బ్రహ్మకు, శివునకూ నమస్కరించాడు. బందం నుండి విడుదల పొంది తన కుటుంబంతోను, పరివారంతోను కలిసి సుతలలోకానికి వెళ్లడానికి తయారయ్యాడు. ప్రహ్లాదుడు స్వామికి నమస్కరించి చేతులు జోడించి శలవు తీసుకున్నాడు. అటుపిమ్మట ప్రహ్లాదుడు బలిచక్రవర్తినీ, రాక్షస సమూహాన్ని వెంటపెట్టుకొని ఒక గొప్ప గుహాద్వారం గుండా సుతల లోకానికి చేరాడు. విష్ణువు ఆజ్ఞతో శుక్రుడు బలిచక్రవర్తి మొదలుపెట్టిన యజ్ఞాన్ని పూర్తిచేసాడు. విష్ణువు బలి నుండి తీసుకున్న సంపదను, స్వర్గలోకాన్ని తన అన్నగారైన దేవేంద్రుడికి ఇచ్చివేశాడు. బలవంతుడైన తమ్ముని ప్రాపువల్ల ఇంద్రుడికి ఇంద్రపదవి లభించింది.

అద్భుతమైన లీలలతో కూడిన విష్ణువును గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడౌతాడు. త్రివిక్రముని పవిత్ర చరిత్రను కీర్తించితే ఎల్లప్పుడూ సుఖాలు కలుగుతాయి.

- శుభం -

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి