అవును ..వాళ్ళు దారిలో పడ్డారు - జీడిగుంట నరసింహ మూర్తి

Avunu vaallu daarilo paddaru

“ ఈ జీతాలతో మనం మన పిల్లలను చదివించుకోలేం. ధైర్యంగా జీవితాలను ముందుకు కొనసాగించలేం ఏదో ఒక వ్యాపారంలోకి దిగాలి. వేన్నీళ్ళకు చన్నీళ్ళులాగా ఎంతో కొంత మన జీవితంలో అది వుపయోగపడాలి “

ఆ ముగ్గురికీ మనసులో ఇదే ఆలోచన. ఒకటే అభిప్రాయం.

“అలా అని మనం మన ప్రస్తుత ఉద్యోగాలు వదులుకుని వ్యాపారం చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీలు కూడా ఎంతో కొంత చదువుకున్నారు. వాళ్ళను ఈ వ్యాపారంలో క్రియాశీలక పాత్ర వహించేటట్టుగా చూద్దాం.”

“ముందు మన దగ్గర ఎంతెంత డబ్బు వుందో లెక్కలు తియ్యాలి. ఆ తర్వాత ఏదో ఒక బ్యాంకులో వ్యాపారం కోసం అని చెప్పి లోను తీసుకుందాం. ఇదంతా ఒక నెల రోజులు సమయం పడుతుంది . ఈ లోపు ఈ రోజుల్లో ఏ వ్యాపారం మనకు అనువుగా వుంటుందో ఆలోచిద్దాం “

అందులో ఒకరి మస్తిష్కంలో చటుక్కున మెరుపులా ఒక ఆలోచన మెదిలింది , ఆ ఆలోచన కార్య రూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రస్తుత పరిస్తితులలో ఇంటింటా పెరిగిపోతున్న రోగాల దృష్ట్యా ,కొత్తగా పెనుభూతంలా ఆవహిస్తున్న వైరస్ , వాటి నిర్మూలన కోసం వైద్య విధానంలో వస్తున్న పెను ప్రత్యామ్నాయాలు దృష్టిలో పెట్టుకుని , కుక్క గొడుగుల్లా పెరిగిపోతున్న ఇంగ్లీష్ మందుల షాపుల తాకిడిని, వాటి ఉదృతాన్ని అరికట్టాలంటే వాటికి దీటుగా ఒక ఆయుర్వేద షాపు పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది అనేది వారి ఆలోచన .

ఈ ఐడియా రావడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా వుంది. ఇది ప్రతిపాదించినతని భార్యకు స్వయానా తాతగారు ఆయుర్వేద మందులు తయారుచేయ్యడంలోనూ, రకరకాల మొండి వ్యాధులకు చికిత్స చెయ్యడంలోనూ దిట్ట అని గుర్తుకు వచ్చింది .

ఒక శుభ ముహూర్తాన ఆ కాలనీలో షాపు ప్రారంభం బంధువుల మధ్య , స్నేహితుల మధ్య అట్టహాసంగానే జరిగింది. షాపు సహ భాగస్వాములు ముగ్గురూ ఏదో కంపెనీలో వుద్యోగం చేస్తూ వుండటం వల్ల మందుల అమ్మకాల బాధ్యత మెల్లి మెల్లిగా వారి భార్యల మీద పడింది.

ముత్యాలరావు అదే కాలనీలో అపార్ట్మెంట్ కొని గత నాలుగేళ్లుగా వుంటున్నాడు. ఉద్యోగం నుండి రిటైర్ అయ్యి అయిదారేళ్లు అవ్వడంతో అతని కాలక్షేపం కాలనీలో వుండే వాళ్ళతో లోకాభిరామాయణం ,తనకు తెలిసిన విజ్ఞానాన్ని వాళ్ళకు పంచడం, తోచిన సలహాలు ఇవ్వడం . ఈ క్రమంలో కొత్తగా తెరిచిన ఆయుర్వేద షాపు ఆయన కంట పడింది. ఊరికే పలకరిస్తే బాగుండదని ఆయుర్వేద షాపులో తనకిష్టమైన మాధీఫల రసాయనం సీసా కొన్నాడు. ఒకసారి మందుల షాపు అటూ ఇటూ పరికించి చూశాడు.

” ఈ కాలనీలో వాళ్ళతో పరిచయం ఏర్పడటానికి మీకు కొంత సమయం పడుతుంది లెండి. పూర్తిగా ఇక్కడి వాళ్ళ మీదే ఆధారపడక బయట పబ్లిక్ తో కూడా కాస్త టచ్లో వుండండి. మీరు అడిగినా అడక్కపోయినా చెపుతున్నాను . మీకు తెలుసో , తెలియదో నాకు తెలియదు . ఇప్పుడు ఆయుర్వేదంలో షుగర్ కు , బీపీకి శక్తివంతమైన మందులు వచ్చాయి. కరోనా లాంటి అంతుపట్టని వ్యాధులకు కూడా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని చెపుతున్నారు. వాటిని కూడా మీ షాపులో పెట్టండి. ఆ ప్రొడక్ట్స్ నేను నెట్లో చూసి చెపుతాను . ఈ కాలనీలో సగానికి పైగా ఆ రోగాల వాళ్ళు

వున్నారు. వాళ్ళనందరినీ ఇటువైపు మరలుస్తాను . అఫ్కోర్స్ . నాకు కూడా ఆరోగ్య సమస్యలు చాలానే వున్నాయి. మా కాలనీలో షాపు పెట్టినప్పుడు మా లాంటివారం ఎంతో కొంత బాధ్యత తీసుకోకపోతే ఎలా ? “ అంటూ షాపులో వున్న ఆడవాళ్ళను ఓరకంట చూస్తూ అన్నాడు ముత్యాలరావు .

“అవును బాబాయిగారు . మీ లాంటి వారి అండదండలు మాకు చాలా అవసరం. అలా ఎంతసేపు నిలబడతారు కూర్చోండి “ అంటూ లోపలనుండి కుర్చీ తీసి షాపు బయట అరుగుమీద వేసింది ఒక భాగస్వామి భార్య . .దానితో పాటు ఒక న్యూస్ పేపరు కూడా .

ఆ రోజు ఆదివారం అవ్వడంతో షాపులో ముగ్గురు భాగస్తులు ప్రత్యక్షమయ్యారు.”

"ఈ రోజు చిక్కారు గదరా ఎన్నాళ్లు తప్పించుకుంటారు ?” అనుకున్నాడు ముత్యాలరావు మనసులో .

“బాబూ ఏమీ అనుకోకండి. మీరు మీ ఆడవాళ్ళను అలా షాపులో వదిలేసి మీ పనులు చూసుకుంటూ వుంటే ఎలా ? ఇదేమేనా పచారీ షాపా అడిగిన వస్తువు చేతిలో పెట్టటానికి ? షాపుకొచ్చిన వాళ్ళు రకరకాల రోగాల వాళ్ళు వుంటారు. వాళ్ళ అనుమానాలు తీరుస్తూ , సరైన మందు ఇవ్వాల్సిన భాద్యత కూడా మీ మీద వుంది. ఎటూ మీ ఆడవారిలో ఒకరి తాతగారు ఆయుర్వేద వైద్యుడు అంటున్నారు కదా వారానికి రెండు రోజులైనా వచ్చి షాపులో కూర్చోమనండి. షాపులో ఎక్కడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కనిపించడం లేదు. డ్రగ్ ఇనస్పెక్టర్ల దృష్టిలో పడితే మొదలుకే మోసం వస్తుంది. మీ బంధువు గారి పేరు మీద ఒక సర్టిఫికేట్ తీసుకుని షాపులో తగిలించండి. ఇవేమీ లేకుండా షాపు నడుపుదామని ఎలా అనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు . ఇక మందుల విషయంలో నాకు కొంత ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు , హోమియో వాటిమీద అవగాహన వుంది అనుకోండి. ఎటూ నేను ఈ కాలనీలో వాడినే కాబట్టి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మీ ఆడవారికీ, అడిగితే మీకు సలహాలు ఇవ్వగలను . . ఈ షాపులో ఎప్పుడూ ఆడవాళ్లే వుంటారు మగవాళ్ళు అస్సలు కనపడరు అనే అనుమానం కస్టమర్లకు రాకూడదు “ అని సుధీర్ఘంగా అవసరం లేకపోయినా తన వుద్దేశ్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ముత్యాల రావు .

ఏదో ఆశయంతో షాపంటే పెట్టేశారు కానీ ముత్యాల రావు చెప్పినట్టు పూర్తి దృష్టి పెట్టలేక భార్యల మీదే ఆధారపడక తప్పడం లేదు షాపు ఓనర్లకు.

“అమ్మా సంతాన సాఫల్యం కోసం మీ దగ్గర ఏమైనా మందులు దొరుకుతాయా ?” అని అడిగాడు ఒక కస్టమర్ కొద్దిగా మొహమాట పడుతూ .

“లేకపోవడం ఏమిటి ఏ వైద్యములోనూ ఈ విషయంలో సరిగ్గా గ్యారంటీ లేని వైద్యం మా దగ్గర వుంది ఉండండి ఇస్తాను “ అంటూ ఆవిడ కుర్చీ వేసుకుని చటుక్కున పై అరలోంచి ఒక మందును చీరకొంగుతో తుడిచి “ ఇదిగోండి పైన రాసి వున్న సూచనలు ప్రకారం మీ భార్యా భర్తలిద్దరూ ఈ మందు ప్రస్తుతం వారం రోజులు వాడండి. మరో వారం పదిరోజుల తర్వాత ఫైనల్ డోసు ఇస్తాను. . పండంటి బిడ్డ పుట్టాక మాకు తీపి తినిపించాలండోయ్“ అంది డబ్బులు తీసుకుంటూ ఒక నవ్వు విసిరి. .

తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళినట్టు , రోజుకు రెండు మూడు కిలోమీటర్లు వాకింగ్ క్రమం తప్పకుండా చేసే ముత్యాల రావు కాళ్ళు బద్దకించి మందుల షాపు దగ్గర వేసిన కుర్చీలో కూలబడేటట్టు చేస్తున్నాయి.

వారం రోజులు అయ్యింది అనుకుంటా ఇంతకు ముందు సంతాన సాఫల్యం కోసం మందుల కోసం వచ్చిన వ్యక్తి రొప్పుకుంటూ వచ్చాడు.

“ ఏమ్మోయ్ మీరిచ్చిన మందు వాడటం మొదలు పెట్టాక , మా ఆడమనిషికి , నాకు వారం నుండి ఒకటే విరోచనాలు ,డోకులు పట్టుకున్నాయి . వేరే షాపులో చూపిస్తే విరోచనాలు అవ్వడానికి మందు వాడితే విరోచనాలు కాక ప్రవచనాలు వస్తాయా ?” అన్నాడు చిరాకు పడుతూ .. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. మాకు చదువు అంతగా లేదు. మీరే కాపాడాలి” అన్నాడు ఏడుపు మొహం పెడుతూ .

“ బాబూ . హడావిడిలో మీరు అడిగిన దానికి మందు ఇవ్వబోయి వేరేది ఇచ్చాను . . మీరెళ్ళాక స్టాక్ చెక్ చేస్తున్నప్పుడు తెలిసింది పొరపాటు జరిగిందని . ఎటూ మీకు విరోచనాలు అయ్యి షాపుకు పరిగెట్టుకొస్తారని అప్పుడు మందులు మార్చొచ్చని వూరుకున్నాను కానీ మీరు వారం రోజుల పాటు ఈ మందులు వాడుతారని అనుకోలేదు “ అంది ఆమె విచారంగా మొహం పెట్టి .

ఈ లోపే ఇంకో రెండు మూడు కేసులు ఆయుర్వేద షాపుమీదకు దండయాత్రకు వచ్చాయి. ఈ విపత్కర పరిస్తితినుండీ తట్టుకోవడానికి ఆమెకు తలప్రాణం తోకకు వచ్చింది. ఉసూరుమంటూ తలపట్టుకుంది .

అక్కడే కూర్చుని వున్న ముత్యాలరావు పరిస్థితిని గమనిస్తున్నాడు .

“బాగుందమ్మా వరస . నేను ముందే చెప్పాను మీరేమేనా అనుకోండి. మీరు చేస్తున్నది సరైన పద్దతి కాదు. ఏ మందు పడితే అది ఇస్తే ప్రాణాల మీదకు వస్తే మీ భర్తలమీద మీ మీద కేసులు పెడతారు . అసలు ఆయుర్వేద మందుల షాపుకు అంత తేలిగ్గా పర్మిషన్ మీకు ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు. అయినా నేల విడిచి సాము చేసినట్టు మీకా ఈ మందుల మీద ఎటువంటి అవగాహన లేకపోగా , పక్కన తెలిసిన ఒక డాక్టర్ కూడా లేకుండా ఏమిటమ్మా ఇదంతా ? అసలు ఇటువంటి షాపు పెట్టడానికి ఎంత గుండె ధైర్యం కావాలి ?” అన్నాడు పెద్దరికం చేసుకుని .

“లేదండీ బాబాయిగారు. మా తాతగారు ఆయుర్వేద డాక్టరే కదా. . అనుమానం వచ్చినప్పుడు ఆయన్ని కనుక్కునే మందులు ఇస్తాం. అసలు ఆయన మాకు అండగా వున్నారనే ధైర్యంతోనే ఈ షాపు పెట్టాం .పైగా మా షాపులో సగం మందులు ఆయన చేసినవే .” అంది భాగస్తుని భార్య .

“ఓహో అది కూడా వుందా ? మీరిస్తున్న మందులు చూస్తూంటే మీ తాతగారు మీద అనుమానం వస్తోంది . పోనీ ఆయన్ని తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టొచ్చు కదా ?”

“లేదు బాబాయి గారు! మా తాతగారికి ఇప్పుడు తీవ్రమైన అనారోగ్యం. మంచమ్మీదే అన్నీను . ఇంట్లో చాలా రోజులనుండి మూలుగుతున్న మందులను మూటగట్టి తెచ్చి షాపులో పెట్టాం . పెద్దాయన్ని ఇబ్బంది పెట్టడం బాగోదని మేమే లాగించేస్తున్నాం “ అంది ఆ తింగర బుచ్చి . ఆమెకు ఏ విషయం మాట్లాడాలో ఏది దాచాలో కూడా తెలియదు అని ఆమెను చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.

“ అదేమిటి ఆయనకు అనారోగ్యం అంటున్నారు . ఆయన తయారుచేసిన ఆయుర్వేద మందులు ఆయనకు పని చెయ్యడం లేదా ?” అడిగాడు ముత్యాలరావు ఆమెనుండి ఇంకా ఎన్నో విషయాలు బయటపెట్టాలన్న ఆతృతతో .

“ అలా ఏమీ లేదండీ . వాటిమీద ఆయనకు విపరీతమైన నమ్మకం. అందువల్లే కదా మమ్మల్ని ప్రోత్సహించి మా చేత ఈ షాపు పెట్టించారు.నిజానికి ఒక కొడుకో, కూతురో వుండి వుంటే వాళ్ళ చేతే ఈ షాపు పెట్టించే వాడు. పిల్లలు లేరు నిస్సంతు. మా అమ్మగారిని పెంచుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆవిడా పోయారు . ఇంట్లో చూసుకునే వాళ్ళు కూడా లేరు . . భార్య పదేళ్ళ క్రితమే పోయింది”
“అయ్యో ఆయనకే పిల్లలు లేరా ? ఆశ్చర్యంగా వుందే. అయినా కూడా పిల్లలు కలిగే మందులు తయారుచేశాడన్నమాట ?” తవ్వినకొద్దీ మంచి ఆసక్తికరమైన విషయాలు దొరుకుతున్నాయి ముత్యాలరావుకు . .

సాయంత్రం షాపుకొచ్చిన భర్తతో తింగరబుచ్చి ముత్యాల రావు గురించి చెపుతూ “ పాపం పెద్దాయన రోగాల గూర్చి వచ్చిన కస్టర్మర్లతో వివరిస్తూ మందులు బాగానే అమ్ముడయ్యేటట్టు చూస్తున్నాడు. పాపం ఎన్నో విషయాలు చనువుగా అడుగుతూ వుంటే మాటల మధ్యలో మా తాతగారు గూర్చి అంతా చెప్పేశాను” అంది నవ్వుతూ .

“ఓసీ నీదుంప తెగిపోను ? ఆ ముసలాయన గూర్చి ఎందుకు చెప్పావే బాబూ ? ఆయన పేరు చెపితే మందులు కూడా పనిచెయ్యవు .ఎలాగో సరుకంతా వదుల్చుకోవాలని నేను చూస్తూంటే ?” అన్నాడు కోపంగా ఆమె భర్త .

ఈ గందర గోళం అంతా ఒక కంట కనిపెడుతున్న ముత్యాలరావు కాలనీలో షాపు మీద ఎంతోమంది కామెంట్ చేస్తున్న విషయాన్ని చూచాయిగా షాపులోని భాగస్తుడితో చెప్పేశాడు . ఆ తర్వాత ఏమయ్యిందో కానీ అప్పటివరకు షాపు ముందు ముత్యాలరావు కోసం కుర్చీ వేసిన షాపు యజమానులు ఇప్పుడు ఆ కుర్చీ కూడా తీసేశారు.అదే విషయాన్ని గూర్చి కోపంగా ఆయన అడిగితే “ ఏమీ అనుకోకండి సార్ . ఈ షాపు పక్కనే వున్న లేడీస్ టైలరింగ్ షాపు వాళ్ళు అలా మగవాళ్ళను కూర్చోవేసి కూర్చోబెట్టొద్దు . మా షాపు కొచ్చే ఆడ వాళ్ళను అదే పనిగా చూస్తున్నారు .ఇలా అయితే మా షాపుకొచ్చే గిరాకీ కొండెక్కుతుంది “ అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఆ కుర్చీ కాస్తా ఎత్తేయ్యాల్సి వచ్చింది అని ఆయన ముత్యాలరావు మీద కలిగిన ఏహ్య భావాన్ని ఆ రకంగా వెళ్ళగక్కాడు . .

ముత్యాలరావు ఒక నెలరోజులపాటు హైదరాబాదులో వున్న కొడుకు దగ్గరకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. ఎందుకో అతని మనసులో ఆయుర్వేద షాపు మెదిలింది. అటువైపు దృష్టి సారించాడు. ఆశ్చర్యం ఆయుర్వేద మందుల షాపు స్థానంలో కోడిగుడ్లు, బ్రెడ్లు. పాల ప్యాకెట్లు, కూరలు కనపడ్డాయి. షాపు మధ్యలో దర్జాగా కూర్చుని తింగరబుచ్చి ఊపిరాడకుండా కస్టమర్లతో తీరిక లేకుండా వుండటం చూశాక “ అద్గదీ ఇదే మీకు తగిన షాపు “ అనుకుంటూ నవ్వుకుని అక్కడనుండి వెళ్లిపోయాడు*****

***** సమాప్తం ****

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి