విజయానందుడు కుశాల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి.మహరాజుకు జంతువుల వేటంటే మక్కువ. ఒకరోజు సేనాపతి శరభూపాలుడితో కోటకు దగ్గర లోని అడవికి వేట కెళ్లాడు. మధ్యాహ్న మవడంతో వేటలో అలసిపోయిన మహరాజు ఒక పెద్ద చెట్టు కింద విశ్రమించాడు. అనుకోకుండా ఒక పెద్ద నాగుపాము చెట్టు పై నుంచి మహరాజు విజయానందుడి కాళ్లకు కొద్ది దూరంలో పడింది అది చూసిన సేనాపతి పాము మహరాజును కాటు వేస్తుందేమోనన్న భయంతో తన వద్దనున్న విల్లంబులతో చంపేసాడు. నిద్రలోనున్న మహరాజుకు ఈ విషయం తెలియదు. చెట్టు తొర్రలో నాగుపాము దంపతులు నివశిస్తున్నాయి. కొద్ది సమయం తర్వాత నాగరాజు రాలేదని ఎదురు చూసిన నాగరాణికి చెట్టు పరిసరంలో బాణం తగిలి చనిపోయి కనిపించాడు. అడవిలో ప్రేమగా జీవిస్తున్న తమను ఎడబాటు చేసాడని పగబూనింది. మహరాజును ప్రాణాలతో ఉంచకూడదనుకుంది. వెంటనే రాజు వేటాడిన పక్షి కళేబర రెక్కలలో దూరి కోటకు చేరింది. యధావిధిగా సాయంత్రం కోటకు తిరిగి వచ్చారు రాజ భటులతో మహరాజు. కోటకు చేరిన నాగసర్పం రాజభవంతికి దగ్గరలోని పెద్ద వృక్షం మీద నివాసం ఏర్పాటు చేసుకని మహరాజును కాటు వెయ్యడానికి సమయం కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు యువరాజు సహచరులతో ఆడుకుంటుంటే తన చేతిలోని పూలబంతి దగ్గర లోని చెట్టు మీద పడింది.యువరాజు పూలబంతి కోసం చెట్టు ఎక్కాడు. అక్కడే నక్కి ఉన్న నాగరాణి తన పగ తీర్చుకునేందుకు ఇదే సమయమనుకుని కాటు వేయబోయి మళ్లీ తనలో తనే ఆలోచించుకుని తండ్రి చేసిన తప్పుకు కుమారుడిని శిక్షించడం భావ్యం కాదని తన పగ మహరాజు మీద తీర్చుకుంటానని వెనక్కి తగ్గింది. నాగుపాము ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఎప్పుడూ మహరాజుకు రక్షణగా ఎవరో ఒకరు వెంట ఉంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. చెట్టు నుంచి రాజమహలుకి రాకపోకల సమయంలో నాగరాణి శరీర కుబుసం ఊడి గోడలకు అంటుకుంది. అది గమనించిన రాజభటులు విషయం రాజుకు చేరవేసారు. మహరాజుకు ఆందోళన ఎక్కువైంది. నాగ కుబుసం రాజమహలుకి ఎలా వచ్చిందని అంతటా వెతికించినప్పటికీ పాము జాడ కనబడలేదు. మహరాజు వెంటనే పండితులను జ్యోతిష్యులను దర్బారుకు రప్పించి విషయం చెప్పి దోష నివారణకు మార్గం సూచించమని అడిగాడు. వారు దొరికిన కుబుసం మిగతా ఆన్నీ కూలంకషంగా పరిశీలించి మహరాజు వల్ల నాగదోషం జరిగిందని అందుకే పగతో తోటి సహచరి సర్పం కోట ప్రాంగణంలో సంచరిస్తోందని తమరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందుకు మహరాజు విజయానందుడు చింతిస్తూ నాగదేవత మా కులదైవం. అటువంటి నాగదేవతకు మేము ఎలా నష్టం కలిగిస్తాము. రాజ్యంలోని ప్రజలకు వారి ఇంట పుట్టిన బిడ్డలకు మా కులదైవం నాగదేవత పేరు ఉండేలా నామకరణం చెయ్యమని శాసించాము. ఎవరు కూడా సర్పాలను వధించరాదని ఆవాసాలు కల్పించి పూజలు చెయ్యమని ఆజ్ఞ వేసాము. అటువంటిది మావల్ల నాగహింస జరగడమేమిటి? మాకు తెలియకుండా ఏదో పొరపాటు జరిగిఉంటుందని మదన పడసాగాడు. వాస్తవానికి మహరాజు విజయానందుడికి మహరాణి నాగావళికి సర్పాలంటే భక్తి భావన. అదే భక్తి భావనతో యువరాజుకు నాగానందుడు పేరు పెట్టారు. రాజ్యంలోని ప్రతి గ్రామంలో పాము పుట్టలను ఏర్పాటు చేయించి ప్రతి సంవత్సరం నాగపంచమి రోజున పూజలు చేయించి సర్పాలకు కావల్సిన ఆహారం ఏర్పాట్లు కలిగించాడు. విషయం తెల్సిన సేనాపతి పరుగున వచ్చి, కొద్ది రోజుల వెనుక మహరాజు అడవికి వేటకు వెళ్లడం అక్కడ చెట్టు కింద విశ్రమిస్తున్న సమయంలో సర్పం చెట్టు మీద నుంచి పాదాల వద్ద పడటం అది తమని కాటు వేస్తుందేమోననే భయంతో విల్లంబులతో సంహరించి మీరు చూస్తే కోపగించుకుంటారని మృతసర్పాన్ని పొదలలో పడవేయించానని జరిగిన సంఘటన వివరంగా తెలియచేసాడు. జరిగిన దుస్సంఘటన తెలిసి మహరాజు ఎంతో చింతా క్రాంతుడయాడు. తమ వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిందని దానికి శిక్షగా తను అగ్ని ప్రవేశం చేసి ప్రాయచ్ఛిత్తం చేసుకుంటానని తగిన ఏర్పాట్లు చేయించమని మహామంత్రిని ఆదేశించారు. ఇది తమ వల్ల తెలిసి జరిగిన దోషం కాదని , ప్రజల మేలుకోసం ఈ శిక్షను ఉపహరించుకోవాలని మహామంత్రి, మిగతా రాజపురోహితులు విన్నవించుకున్నారు. అడవిలో సేనాపతి వల్ల జరిగిన పొరపాటు మూలంగా తను అపోహతో దేవుడు లాంటి మహరాజును అంతం చెయ్యడానికి వచ్చానని చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడని పరదా వెనుక ఉండి అంతావిన్న నాగసర్పానికి పశ్చాత్తాపం కలిగింది. వెంటనే అక్కడ మండుతున్న కాగడాపై పడి కాలి ప్రాణాలు వదిలింది. అక్కడ సమావేశమైన రాజదర్బారు పండిత గణం , ప్రజలు ఈ ఘటన చూసి ఆశ్చర్యం చెందారు. ప్రజల కోరికను మన్నించి మహరాజు తన ప్రాణత్యాగాన్ని విరమించుకున్నాడు. కోటలో నాగరాణి నివాశమున్న వృక్షం మొదట పెద్ద నాగదేవత గుడి కట్టించి పూజలు జరిపిస్తున్నారు మహరాజు విజయానందుడు. సమాప్తం * *