“ గండం " - జీడిగుంట నరసింహ మూర్తి

Gandam

ఇంజినీరింగ్ కాలేజీ దూరంగా వుండటం వల్ల మధు తన ఆర్ధిక పరిస్తితులను దృష్టిలో పెట్టుకుని కొడుక్కి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొని పెట్టాలని చూస్తున్నాడు. అతని ఆఫీసులో పని చేస్తున్న సింగ్ కు ఈ విషయం తెలిసి నేను కొత్త బండి కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీ అబ్బాయి నాక్కూడా బాగా తెలుసు. నీకైతే తక్కువ రేటుకు ఇచ్చేస్తానులే ఒక ఐదు వేలు ఇచ్చి బండి తీసుకుపో అన్నాడు.

ఒక రోజు మధు, అతని కొడుకు శేఖర్ను తీసుకుని అదే కాలనీలో వుంటున్న సింగ్ ఇంటికెళ్ళి దుమ్ముకొట్టుకుపోయి ఒక మూల గోడకు ఆనించి వున్న స్కూటర్ని చూసి మనసులో కొంత అసంతృప్తి అనిపించినా సింగ్ తెలిసిన వాడవటం, రెండవది తన ఆర్ధిక కూడా పరిస్తితి బేరీజు వేసుకున్నాక చివరకు రాజీపడి స్కూటర్ను ఆ వీధిలోనే ఒకసారి అటూ ఇటూ నడిపి అక్కడకక్కడ అయిదు వేలకు చెక్కు రాసి ఇచ్చేశాడు.

స్కూటర్ తీసుకున్న విషయం మధు తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వెంకటేశానికి చూచాయిగా చెప్పాడు ఐదు వేలకు తీసుకున్నాను పరవాలేదా ? అంటూ అతని అభిప్రాయం అడిగాడు.

“ తీసుకుంటున్నావా తీసేసుకున్నావా ముందు ఆ విషయం సరిగ్గా చెప్పు ? అని రెట్టించి అడిగాడు వెంకటేశం .

“ అయిదువేలకు చెక్కు కూడా ఇచ్చేశాను. బండి వేసుకుని అప్పుడే మా వాడు కాలేజీకి కూడా వెళ్ళాడు “ అన్నాడు మధు విజయగర్వంగా.

“ ఎంత పని చేసావొయ్ . నాకు ఒక మాట చెప్పాల్సింది. సింగ్ ఆ స్కూటర్ చాలా మందికి అమ్మాలని చూశాడు. ఆ బండికి ఇన్షూరెన్స్ కట్టలేదు. ఆ పేపర్ల విషయం అతను నీతో ఖచ్చితంగా చెప్పి వుండడు. అంతేకాదు . లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకుండా బండి నడుపుతూంటే పది పదిహేను సార్లు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారని కూడా విన్నాను . . పైగా బండి ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుందిట. . నా ప్రకారం ఈ పాటికి మీ వాడు బండి తోసుకుంటూ వెళ్తూ వుంటాడు . సింగ్ నిన్ను నిలువునా మోసం చేశాడు . ఎలాగో అలా ఆ బండి వెనక్కి ఇచ్చేసి ఆ చెక్కు లాక్కో “ అన్నాడు వెంకటేశం మధును కంగారు పెడుతూ . సింగుపై ఉక్రోషం, కోపం , అవమానం ఒక్కొక్కటిగా అతన్ని ఆవరించాయి. చాలా కాలంగా చూస్తున్నా సింగ్ ద్వంద్వ ప్రవృత్తి తను అర్ధం చేసుకోలేక పోయాడు . వెంకటేశం సింగు కుట్రను బయటపెట్టాక ఒక్కసారిగా మధుకు వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్దయ్యింది. మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది.

ఈ సమస్యను ఎలా ఎదుర్కోలిరా బాబూ అనుకుంటూ ఆలోచిస్తూ ఆఫీసునుండి త్వరగా తెమిలి బయట పడ్డాడు మధు. టెన్షన్ వల్లనేమో అనుకుంటా కళ్ళు బైర్లు కమ్మినట్టుగా అనిపించింది. కళ్ళల్లో బలం సన్నగిల్లింది . సడలిపోతున్న సహనాన్ని కూడదీసుకుని ఎలాగో అలా ఇంటికి వచ్చి ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డాడు. కొద్దిసేపు అశాంతిగా కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగాడు. భార్య కృష్ణవేణి కంగారుపడుతూ అతని దగ్గరకొచ్చింది. ఏదో చెప్పాలనుకుని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న అతనికి ఆమె సమక్షంలో గొంతు పెగలడం లేదు బహుశా తను చేసిన పనికి ఆమె కోపంగా తనపైనే విరుచుకు పడుతుందనే భయం వల్ల కావచ్చు.

మధు కొడుకుతో జరిగిన మోసం గురించి చెప్పాలని అనుకుంటున్న లోపే సాయంత్రం కాలేజీనుండి త్వరగా ఇంటికొచ్చేసిన మధు కొడుకు శేఖర్ “ నాన్నా ఆ బండి చాలా ట్రబుల్ ఇచ్చింది. వెళ్ళేటప్పుడు , వచ్చేటప్పుడు తోసుకుంటూ పోవాల్సి వచ్చింది. ఇలా అయితే రోజూ నేను కాలేజీకు వెళ్ళి చదువు చదివినట్టే. మీరు ఏదో విధంగా అంకుల్ తో మాట్లాడండి.” అన్నాడు . అతని చొక్కా పూర్తిగా తడిచి ముద్దయ్యి మట్టి కొట్టుకుపోయినట్టుగా కనిపిస్తోంది. నుదుట మీద చెమట ధారాపాతంగా కారిపోతోంది.

తండ్రి కొడుకుల సంభాషణ విన్న మధు భార్య కృష్ణవేణి తలపట్టుకుని “ అనుకున్నాను . ఇలాంటిది ఏదో జరుగుతుందని. మొదటినుండి వాడి విషయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. వాడికి ఇష్టమున్న బ్రాంచిలో సీటు దొరకలేదు. ఆ సబ్జెక్టు తీసుకున్న వాళ్ళకు భవిష్యత్తులో మంచి ఉద్యోగం కూడా రాదని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు స్కూటర్ కొనే విషయంలో కూడా అదే పొరపాటు జరిగింది. కొన్నాళ్లు ఆగండి పిల్లాడికి బోనస్ డబ్బులు వచ్చాక కొత్త స్కూటర్ కొనిపెట్టండి. నలుగురిలో చూడటానికి చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పినా మీరు చెవిలో వేసుకోలేదు . ఇప్పుడేం చేస్తారో చేయండి. ముందు వెళ్ళి ఆ డొక్కు స్కూటర్ వాడి మొహాన కొట్టి ఆ డబ్బు లాక్కోండి . “ అంది అసహనంగా. భర్త ఆలోచించకుండా చేసిన పనికి ఆమె మనసంతా గందరగోళంగా తయారయ్యింది. మనసులో చెలరేగుతున్న అలజడిని బలవంతాన అణుచుకుంది.

అసలే మనస్తాపంగా వున్న అతనికి భార్య మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి . ఉసూరుమంటూ మంచమ్మీద వాలిపోయాడు . . అతనికి ఇప్పుడేం చెయ్యాలో తోచడం లేదు. ఒక పక్క సింగ్ బాగా తెలిసిన వాడు. అయినా ముందూ వెనకా ఆలోచించకుండా ఆ బండికి అన్ని పేపర్లూ సరిగ్గా వున్నాయా లేదా అని కనుక్కోకపోవడం తన తప్పే. ఈ ప్రపంచంలో ఒక వస్తువును వదుల్చుకోవాలని చూసే వాళ్ళు ఎన్నో రకాల అబద్దాలు ఆడైనా అవతలి వారికి అంటగట్టడం సర్వసాధారణమైన విషయం. సింగుకూడా అదే చేశాడు. .రకరకాల ఆలోచనలతో తలక్రిందులు అవసాగాడు. . .

రేపు ఏదో విధంగా సింగును కలుసుకుని నచ్చచెప్పాలి. అప్పటివరకూ తనకు మనశ్శాంతి దొరకడం దుర్లభం అనుకున్నాడు మధు దీర్ఘాలోచనలో పడుతూ .

జరిగిన మోసం గురించి తండ్రి తీవ్ర ఆవేదన చెందుతూ వుండటం చూశాక శేఖర్ మస్తిష్కంలో చటుక్కున్న ఒక మెరుపులా ఒక ఆలోచన మెరిసింది .

“నాన్నా నువ్వింకా ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు .మీ ఆఫీసులో పని చేస్తున్నాయన కనుక నీకు మొహమాటాలు వుంటాయి. నాకు అంత అవసరం లేదు. బండి నడపాల్సిన వాడిని నేను. ఖరాఖండిగా చెప్పేస్తాను బండి వద్దని. ముందు బండికి సంబంధించిన పేపర్లు బయట పెట్టమంటాను. నాకామాత్రం ధైర్యం వుంది. ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకుని వచ్చేస్తాను. నువ్వు నిశ్చింతగా వుండు . ‘ అంటూ స్కూటర్ తీసుకుని సింగు వాళ్ళింటికి వెళ్ళాడు శేఖర్ .. .

శేఖర్ వెళ్ళేసరికి సింగ్ ఇంట్లో లేడు బయటకు వెళ్లాడని అతని భార్య చెప్పింది . .

“ఆంటీ ఒక చిన్న పని మీద వచ్చాను . నిన్న ఉదయం బండి కోసం మా నాన్న , నేను వచ్చి చెక్కు ఇచ్చాము. అందులో ఒక పొరపాటు జరిగింది. ఆ బాంకులో డబ్బు లేదుట . వేరే చెక్కు రాసిస్తానన్నాడు మా నాన్న . ఆ చెక్కు బ్యాంకులో వేస్తే గొడవవుతుంది. అంకుల్ మీకిచ్చి వుంటే దాన్ని ఇచ్చేయ్యండి. ఐదు నిమిషాలలో వేరే బ్యాంకు చెక్కు తెచ్చిస్తాను . అప్పటివరకూ ఈ స్కూటర్ ఇక్కడే పెడుతున్నాను. మీకు చెక్కు ఇచ్చేసి స్కూటర్ తీసుకు వెళ్ళి పోతాను". అన్నాడు శేఖర్ లోలోపల టెన్షన్ పడుతూనే ..

“ అయ్యో ఎంత పొరపాటు జరిగింది ? ఇంకా నయం .నిన్న శనివారం అవ్వడం వల్ల సరిపోయింది..బ్యాంకు లేదుట. చెక్కు ఆయన నాకిచ్చి జాగ్రత్తగా ఉంచమన్నారు . ఇదిగో చెక్కు టేబుల్ మీదే పెట్టాను. వుండు ఇస్తాను “ అంటూ చెక్కును అటూ ఇటూ చూసి శేఖర్ చేతిలో పెట్టింది సింగ్ భార్య. .

సింగ్ తిరిగి తిరిగి ఇంటికొచ్చేసరికి వాకిట్లో స్కూటర్ కనపడటంతో ఆశ్చర్యంతో “ఏమిటి ఈ బండి మళ్ళీ ఇక్కడకు ఎలా వచ్చింది ?’ అంటూ భార్య వేపు సీరియస్గా చూసి అడిగాడు. జరిగిన విషయం మొత్తం చెప్పింది అతని భార్య. ఆ క్షణాన సింగ్ మొహం నల్లబడి పోయి కొద్దిసేపు ఉలూకూ పలుకూ లేకుండా అలాగే కొయ్యబారి పోయాడు. అంతలోనే తేరుకుని

“ కొంప ముంచావుకదే. ఎలాగో అలా ఎక్కడా అమ్ముడు కాని ఆ స్కూటర్ని మధుకు అంటగట్టాలని నేను చేసిన ప్రయత్నం అంతా గండికొట్టేశావు. . ఛి ! నీ వల్ల నాకు ఐదు వేల రూపాయలు వచ్చినట్టు వచ్చి వెనక్కి పోయాయి “ అంటూ తలబాదుకున్నాడు పాపం సింగ్ . అంత తేలిగ్గా ఆ పిల్లాడు మొగుడి ప్లానును తిప్పి కొట్టడం చూసి ఆమె చేష్టలుడిగి పోయి అవమానంతో తలదించుకుని ఉండిపోయింది.

కొడుకు చాకచక్యానికి మధు కళ్ళు గర్వంగా మెరిసాయి. అతనికిప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుంది. ఇంకో రకంగా చెప్పాలంటే గుండెలమీద బరువు దించినట్టయ్యింది.

“శభాష్ రా . నేను చేయలేని పని నువ్వు చేసి నన్ను పెద్ద గండాన్నుండి బయట పడేశావు. నువ్వు ఈ రోజు చేసిన గొప్ప పనికి నీకు పాత స్కూటర్ అవసరం లేదు. నీకు అంత ఖర్మేమి పట్టలేదు. మీ అమ్మ చెప్పినట్టు ఒక్క ఇరవై రోజుల్లో కొత్త స్కూటరే కొని ఇస్తాను. అప్పటివరకు నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదు. కాలేజీకు ఆటో మీద వెళ్ళు ఏమీ పర్వాలేదు ఇంకో విషయం. ఇన్నాళ్ళు నీకు ఆసక్తి లేని బ్రాంచిలో సీటు దొరికింది అన్న అపోహ మీ అమ్మతో పాటు నాకు కూడా వుండేది. ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు అందులో కూడా అద్భుతమైన విజయం సాధించగలవని . “ అంటూ మధు భావోద్వేగంతో కొడుకును దగ్గరకు తీసుకున్నాడు ప్రేమ పూర్వకంగా .*******

సమాప్తం

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి