టీవీలో న్యూస్ చూస్తుండగా ' నగరంలో దొంగల ముఠా పట్టివేత ' అంటూ సంబంధిత దృశ్యాలు చూపిస్తున్నారు. ఓ టేబుల్ నిండా పరిచిన మొబైల్స్ , పర్సులు, వాచ్ లు, చెయిన్లు వగైరా సరంజామా. ఆ వెనుకే తలలు వంచుకుని ఇద్దరు, అభావపు చూపులతో మరో నలుగురు ఉన్నారు. అలా వారిని చూస్తుంటే నాకెందుకో రాజేష్ గుర్తుకొచ్చాడు. ****** అవి నేను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రోజులు. అప్పుడే మొబైల్స్ కొత్తగా మార్కెట్ లోకి ప్రవేశించాయి. కొద్దిమంది చేతుల్లోనే కనిపించేవి. మొబైల్ ఉండటం గొప్పగా ఉండేది. అలాంటి సమయంలో మా సెక్షన్ లోని ఆనందరావు ఖరీదైన నోకియా ఫోన్ కొనుక్కున్నాడు. దాంతో మా సెక్షన్ లో మొబైల్ కొన్న మొదటి వ్యక్తి ఆయనే అయ్యాడు. ఆయన మొబైల్ రింగ్ అయినప్పుడల్లా అందరి చూపులూ ఆయన వైపు మళ్లేవి. ఆనందరావు అది గమనించి, మరింత స్టైలిష్ గా ఫోన్లో మాట్లాడుతూ పోజు కొట్టేవాడు. అలా ఉండగా ఓ రోజు ఆనందరావు మొబైల్ పోయింది. పేరును సార్థకం చేసుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండే ఆయన ముఖంలో విషాదం. వెంటనే రిసెప్షన్ కు కాబోలు గబగబా వెళ్లాడు. సెక్షన్లో అంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ , ' పాపం కొత్త మొబైల్.. దొరుకుతుందో, లేదో ' అనుకుంటున్నారు. ఇంతలో ఆనందరావు తిరిగొచ్చాడు. ఆయన ముఖం చూస్తూనే మొబైల్ దొరకలేదన్నది నిర్ధారణ చేసుకుని, అంతా ఆయన చుట్టూ చేరారు. ' అసలు మీరు మొబైల్ ని ఆఫీస్ కి తెచ్చారా? ఒకవేళ బస్ లో పోయిందేమో, ఆఫీస్ కి వచ్చాక మీకు కాల్స్ ఏమైనా వచ్చాయా? మీరు ఎవరికైనా ఫోన్ చేశారా? అసలు ఎక్కడ మర్చిపోయారో గుర్తు చేసుకోండి.. ఎక్కడెక్కడ తిరిగారో అంతా చూడండి ' అని ఇలా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడారు. ' ఓ అరగంట క్రితమే మా ఫ్రెండ్ కు కాల్ చేశాను. ఆ తర్వాత నన్ను కలవడానికి ఎవరో వచ్చారంటే రిసెప్షన్ కు వెళ్లాను. కాసేపు మాట్లాడాను. వాళ్లకు నా నంబర్ కూడా ఇచ్చాను. వాళ్లు వెళ్ళిపోయారు. చూడాల్సిన అర్జెంట్ ఫైల్ గుర్తుకొచ్చి గబగబా సెక్షన్ కు తిరిగొచ్చాను. పనిలో పడి మొబైల్ విషయమే మరిచిపోయాను. తీరా పని పూర్తి చేసి, మొబైల్ కోసం చూసుకుంటే లేదు. రిసెప్షన్ లో మరిచిపోయానేమో అని అక్కడికి వెళ్లి చూస్తే లేదు. వేరే వారి మొబైల్ నుంచి నానంబర్ కు కాల్ చేసిచుసాను. రింగ్ అయితేనా, కాజేసిన దొంగ వెధవ స్విచాఫ్ చేసుంటాడు. ఇవాళ నా అదృష్టం బాగా లేదు. బంగారం లాంటి మొబైల్ పోయింది. పొద్దున లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో ' ఏడుపు ఒక్కటే తక్కువగా ఉంది ఆనందరావుకు. ' ఆనందరావుగారూ! ఐడియా. రిసెప్షన్ లో సిసి కెమేరా ఉంది కదా, దాన్ని చెక్ చేయిస్తే దొంగ దొరికిపోతాడు ' మేధావి మాధవరావు అన్నాడు. ఆ మాట వినగానే ఆనందరావు ముఖంలోకి వెలుగు వచ్చింది. ' థాంక్స్ మాధవరావ్ , నాకు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పుడే వెళ్లి టెక్నికల్ మానేజర్ ను అడుగుతాను ' అంటూ గబగబా వెళ్లాడు. మేమందరం సీట్లలో కూర్చున్నామే కానీ ఆనందరావు మొబైల్ దొంగ గురించిన ఉత్కంఠతో పనేమీ సాగడంలేదు. అంతలో ఆనందరావు రానే వచ్చాడు,కానీ గాలి తీసిన బెలూన్ లాగా ఉన్నాడు. ' ఏమైంది ఆనందరావ్ ' ఆయన పక్క సీటు ప్రసాద్ అడిగాడు. ' మేనేజర్ లంచ్ కు వెళ్లాడట. ఓ గంట ఓపిక పట్టక తప్పదు ' అంటూ సీట్లో కూలబడ్డాడు ఆనందరావు. దాంతో అంతా తమ కుతూహలానికి కళ్లెం వేసి, మెల్లిగా తన పనిలో మునిగిపోయారు. ఆ తర్వాత ఎందుకో తలెత్తి చూశాను. ఆనందరావు సీట్లో కనిపించలేదు. ' అయితే మొబైల్ సంగతి తేల్చుకోవడానికే వెళ్లుంటాడు ' అనుకున్నాను. పని చేస్తున్నా ఏదో సంచలన వార్త వినబోతున్న భావన. కొద్దిసేపటికి చిరునవ్వుల వెలుగులతో, చేతిలో మొబైల్ తో ఆనందరావు తిరిగొచ్చాడు. ' ఇంతకూ ఎవడా దొంగ రాస్కెల్ ? ' అంతా ఒకేసారి ప్రశ్నించారు. ' అటెండర్ రాజేష్. సిసి కెమెరా ఉండబట్టి సరిపోయింది. లేకపోతే మన మధ్యే ఒక దొంగ ఉన్న విషయం మనకు తెలిసేదే కాదు ' అన్నాడు ఆనందరావు. ' ఎందుకు చేశాట్ట వెధవ పని ' ఇంకొకరు అడిగారు. ' వాళ్ళావిడ చాలా రోజులుగా మొబైల్ కొనమని గొడవట. డబ్బుల్లేవంటే వినిపించుకోలేదుట. ఇవాళ రిసెప్షన్లో కుర్చీలో మొబైల్ కనిపించడం.. అక్కడెవరూ లేకపోవడంతో ఆశపుట్టి తీసుకున్నాడట. ఇలా దొంగతనం చేయడం ఇదే మొదటిసారి అని చెప్పాడు ' అన్నాడు అనందరావు. ' అలాకాక ఇంకెలా చెపుతాడు. ఇప్పటివరకు ఎన్ని దొంగతనాలు చేశాడో ఎవరికి తెలుసు? పట్టుబడే దాకా ఎవడైనా దొరే. ఇంతకూ మేనేజర్ ఏమన్నాడు రాజేష్ ని?' అడిగాను కోపంగా. ' నువ్వు చేసిన వెధవ పనికి శిక్షగా ఉద్యోగం నుంచి తీసేయాలనుకుంటున్నాను ' అన్నాడు ముందు. కానీ ఆయనది జాలి గుండె అని తెలుసుగా. ఈ ఒక్కసారికి క్షమించమని, లేకపోతే ఇంట్లో ముఖం చూపించలేననీ వాడు కాళ్లా వేళ్లా పడి ఏడవడంతో కరిగిపోయాడు. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఇంటికి పంపేది ఖాయం అన్నాడు. ' నన్ను క్షమించండి సార్ ' అంటూ ఆ వెధవ నా చేతులు పట్టుకున్నాడు కానీ నాకు వాడి ముఖం కూడా చూడబుద్ధి కాలేదు ' ముఖంలో అసహ్యాన్ని వ్యక్తపరుస్తూ అన్నాడు ఆనందరావు. ' అమ్మో! పైకి అమాయకుడిలా కనిపించే రాజేష్ లో దొంగబుద్ధి ఉందా? మనం ఇకనుంచి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అయినా ఈ మేనేజరొకడు. దొంగ వెధవపై జాలేమిటో వెళ్లగొట్టక ' అన్నాను నేను. అందరూ నాకు వంత పాడారు. రాజేష్ కొన్నాళ్లు తల వంచుకుని, కళ తప్పిన ముఖంతో కనిపించేవాడు. కొంతకాలం అతణ్ణి అదోరకంగా చూసినవారంతా మెల్లగా ఆ సంఘటన మరిచిపోసాగారు. కారణం రాజేష్ మంచిగా మసులుకోవడమే కావచ్చు. దాంతో క్రమంగా రాజేష్ కూడా తలెత్తుకుని అందరిలా తిరగసాగాడు. కానీ నాకు మాత్రం రాజేష్ ను చూసినప్పుడల్లా ఒక దొంగను చూస్తున్నట్లే ఉండేది. అతడేదో పలకరించబోయినా నిరసనగా చూసేవాణ్ణి. దొంగ బుధ్ధి పుట్టనేకూడదు కానీ ఒకసారి పుట్టాక పోతుందా? ' అనుకునేవాణ్ణి. అంతలో ఇంకో విశేషం జరిగింది. రాజేష్ డేటా ఎంట్రీ నేర్చుకోవడంతో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఎదిగాడు. అయినా అతడి పట్ల నా భావనలో మార్పు రాలేదు. నా అంతరంగం అతణ్ణి క్షమించలేకపోయింది. విశ్వసించలేకపోయింది. అందరూ అతణ్ణి మెచ్చుకుంటున్నా నేను మాత్రం ఆ విషయంలో గొంతు కలపలేక పోయేవాణ్ణి. అంతలో నాకు ఎక్కువ జీతంతో మరో కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆ సంస్థ నుంచి వచ్చేశాను' అనుకుంటుంటే ' భోజనానికి లేస్తారా ' అన్న మా ఆవిడ కేక.. దాంతో నా జ్ఞాపకాల భోషాణాన్ని మూసేసి అక్కడినుంచి లేచాను. ******* ఆ రోజు పని ఉండి బ్యాంక్ కు వెళ్లాను. జనం బాగా ఉన్నారు. సోఫాలో కూర్చుని కర్చీఫ్ కోసం జేబులో చెయ్యి పెడితే చేతికి తగలాల్సిన పర్స్ తగల్లేదు. గుండె గుభేలు మంది. పర్స్ లో క్యాష్ ఓ వేయి రూపాయలకు మించి లేదు కానీ దాంట్లో నా క్రెడిట్, డెబిట్ వగైరా కార్డులన్నీ ఉన్నాయి. భయంతో ఒళ్లంతా చెమటలు. ' నా పర్స్..నా పర్స్ ' వెర్రిగా అరిచి వెదకసాగాను. నా అరుపులకు అంతా నా వంక తిరిగారు. కొద్దిమంది నలువైపులా చూపులు సారించారు. ' సార్! బయటే పోయుంటుందండీ' ఎవరో అన్నారు దాంతో పార్కింగ్ దగ్గర ఏమైనా పడిపోయిందా అనుకుంటూ బయటకు నడిచాను. చూస్తే అక్కడా లేదు. నిస్పృహతో నిట్టూరుస్తుండగా ' సార్ ' అని పిలుపు. తలెత్తాను ఓ గడ్డం యువకుడు. ' మీ పర్స్ గేటు దగ్గర దొరికిందండీ. కార్డు మీద మీ ఫొటో చూసి, మిమ్మల్ని గుర్తుపట్టి వచ్చాను ' అన్నాడు, నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ. ' ఈ కాలంలో కూడా ఇంకా ఇంత మంచి వాళ్లున్నారా ' మనసులో అనుకుంటూ ' థ్యాంక్యూ, థ్యాంక్యూ వెరీమచ్ ' అన్నాను. అతడు కదల్లేదు. ' సార్! మీరు నన్ను గుర్తుపట్టలేదా ' అన్నాడు. దాంతో అతణ్ణి తేరిపార చూశాను. ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. ఇంతలో అతడి నుదుటి మీది మచ్చ మీద పడింది నా దృష్టి. ఆ..అవును, రాజేష్. వెంటనే ' రాజేష్! ' అంటూ అలాగే ఆశ్చర్యంగా నోరు తెరిచి ఉండిపోయాను. ' అవును సార్ రాజేష్ నే. అప్పుడు గడ్డం లేదు. ఇప్పుడు గడ్డం ఉంది. అదే తేడా. బాగున్నారా సార్ ' చిరునవ్వుతో అడుగుతున్నాడు రాజేష్.. 'దొంగబుధ్ధి ఒకసారి పుట్టాక పోదు ,' అనే నా భావనను చెరిపేస్తూ. (సమాప్తం)