మిగతాదంతా ఈడ బానే ఉంది - మద్దూరి నరసింహమూర్తి

Migatadanta eeda baane vundi

అయ్యోయ్, దండాలు.

ఏంటి నా సిన్నికి అసలు సదువే రాదు కదా - ఇంతోటి పెద్ద సీటీ ఎలా రాసింది, ఎలా టపాలో పంపిందబ్బా అనుకుంటున్నావా.

నేను సెప్తుంటే, నా బుడ్డోడు రాసుడులే ఈ సీటీ. ఆడే ఇది టపా లో పంపేడు.

కొంచెం పెద్దదైనా, ఓ తూరి నిమ్మళంగా సదువయ్యోయ్. ఎందుకంటే, నీతో కాకుంటే ఇంకేరితో సెప్పుకోను. ఇది సదివి నువ్వేతో సేసేస్తావనో సేసేయాలనో కాదు. ఎందుకో, నీతో ఈ ఇసయాలు సెప్పుకోవాలని. అంతే.

ఇప్పుడు అసలు ఇసయం ఏంటంటే -

నిలబడి నీళ్లు తాగుదామంటే, కాదు కూడదు పరిగెత్తేనా పాలే తాగుదామని, మమ్మల్ని ఈడ ఉంచి పెనిమిటి పట్నం పోయిండు. నెలా రెండు నెలలలో ఆడ కుదురుకుంటే, మీకు పాలు పంపుతానన్నాడు. ఆడెళ్ళిన మూడు నెలలకే మాయదారి మహమ్మారి కరోనా అని, అన్నీ మూసేసినారు కందా. ఆడు ఎలా ఉండాడో అని సింతగా ఉంది. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఇంట్లో అదే పనిగా కదలకుండా కూసోని బయటకు ఎల్లలేకపోవడంతో మావయ్య సిరాకు పడుతూండాడు. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఇరుగు పొరుగు ఆల్లతో పలకరింపులు కూడా లేకపోవడంతో అత్తయ్య సిరాకు పడుతోంది. మిగతాదంతా ఈడ బానే ఉంది.

-2-

ఇంట్లో సరుకులకు మెల్లి మెల్లిగా కాళ్లొస్తున్నాయి. ముందు ఎలా గడుస్తుందో అని బెంగగా ఉంటోంది. మిగతాదంతా ఈడ బానే ఉంది.

పిల్లోళ్లకి ఇసుకూళ్ళు లేవు, పాఠాలు సదవడం లేక, ఆడుకుందికి బయటకి పోడానికి లేక ఒకటే అల్లరి. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఈ సిక్కులు సాలక, ఓ నెలవుతాది మామకి కాళ్ళు నెప్పులు ఎక్కువయ్యాయి. ఆచారికి దూరం నించే దండాలు ఎత్తుకుంటే, నాలుగు తిట్లు తిట్టి, ఓ పాలి కొంపకి ఒచ్చి, దూరం నించే మామని సూసి బి పి ఎక్కువై ఉంటది అన్నాడు. బి పి ఏంటి అంటే, మామ ఒంట్లో రకతం ఒకటే లగెడుతోంది అన్నాడు. మామే లగెత్తలేడు, ఇక అతని ఒంట్లో రకతం ఎలా లగెత్తుద్ది అంటే - అదంతే మట్టి బుర్రలకి తెలీదన్నాడు. మిగతాదంతా ఈడ బానే ఉంది.

అత్తకి కూడా కాళ్ళు నెప్పులు నడుం నెప్పి అంటుండాది. మిగతాదంతా ఈడ బానే ఉంది.

పనికి పోకపోతే, పైసలు రావు. పనికి పొతే ఆ మాయదారి రోగం అంటుకుంటాదని జడుపు. మిగతాదంతా ఈడ బానే ఉంది.

అప్పటికీ ఓరిద్దరు బయటకి పని సూసుకుందుకి బయటకెళ్ళే సరికి, పోలీసోల్లు ఆళ్ళ కాళ్ళ మీద లాఠీకర్రతో కొట్టినారట. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఈడ మేమె కాదు అందరి గోల ఓ పిసరు ఎక్కు తక్కుగా ఇదే అయుంటాదిలే. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఇంట్లో గొడ్డుకి ఎట్టడానికి దాణా కూడా కరవైపోనాది. మిగతాదంతా ఈడ బానే ఉంది.

గొడ్డు గోదకి మేపడానికి కూడా బయటకి పోనాకి లేదు. మిగతాదంతా ఈడ బానే ఉంది.

-3-

ఉన్న రెండు ఎడ్లు కూడా పొలం ఎల్లడానికి లేక మరే పని పాటా లేక ఎప్పుడూ తొంగోనే ఉంటాయి. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఊళ్ళో కోతులకి తినేందుకు ఏటీ దొరకక, కొంపల మీద పడి సూరులో పెంకులు పీకి కుప్ప పోస్తున్నాయి. మిగతాదంతా ఈడ బానే ఉంది.

అలా అయిన కన్నాలలోంచి ఓన పడితే, నీళ్లు కారి కొంపలో ఒరదే ఒరద. మిగతాదంతా ఈడ బానే ఉంది.

ఓన లేనపుడు, పొద్దేల సూరీడు రేత్రి సెంద్రుడు కొంపలోనే ఉంటారు. మిగతాదంతా ఈడ బానే ఉంది.

మీరంతా బానే ఉండారు అనుకోనా. ఇంక ఉంటాను. మామిని అడిగానని సెప్పు. మీరిద్దరూ మంచిగా ఉండుండి. కొంపలోనే ఉండుండి.

నీ సిన్ని

*****

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్