రామనాధం మరోసారి లెక్కపెట్టి చూసుకున్నాడు. సరిగ్గా ఇరవై నాణాలు ఉన్నాయి. తను ఎన్నో మార్వాడీ కంపినీలలో పనిచేసినందుకు గుర్తుగా ఈ ఈ నాణాలు లభించాయి. ప్రతి సంవత్సరం దీపావళికి కొంతమంది స్వీట్ ప్యాకెట్లు ఇస్తే తన అదృష్టవశాత్తు తనకు అన్నీ వెండి నాణాలే లభించాయి. ఇప్పుడు విలువ చూస్తే అవన్నీ కలిపి ఐదారు వేల రూపాయల పైనే ఉంటాయి. అవి చూసుకున్నప్పుడల్లా అతనికి మానసికంగా ఎంతో సంతృప్తి కలుగుతూ ఉండేది. తను ఒళ్ళు వంచి పగలూ , రాత్రి అని తేడా లేకుండా పని చేసిన దానికి ప్రతిఫలంగా జీత భత్యాలు లభించటమే కాకుండా విలువైన కస్టమర్ల నుండి బహుమతిగా ఈ వెండి నాణాలు పొందటం నిజంగా అతనికి గర్వకారణం . ఇంకొన్నాళ్ల తర్వాత వాటిని మార్పించి ఒక వెండి కంచం చేయించి దాంట్లో రోజూ భోజనం చేయాలన్న కోరిక కలుగుతూ ఉండేది. . ఇంకా తనకు పది పన్నేళ్ళ సర్విస్ ఉంది.
ప్రతి సంవత్సరం వస్తున్న నాణాలు ఖాళీ బోర్నవిటా డబ్బాలో వేసి ఎవరికీ కనపడకుండా అటకమీద దాచి పెడుతున్నాడు. అతనికి ఆ నాణాలు వస్తున్నట్టు తన సహచర ఉద్యోగస్తులకు కూడా ఎవరికీ తెలియదు. .
ఈ లోపు రామనాధం బాబాయి కూతురు పెళ్లంటూ శుభలేక వచ్చింది. తను ఉంటున్న ఇంటికి సరైన రక్షణ లేకపోవడంతో సాధ్యమైనంతవరకు ఇల్లు వదిలి ఎక్కడికీ సెలవు పెట్టి వెళ్ళే వాడు కాడు. దాని వల్ల అతని పనితనం పెరిగి మేనేజ్మెంట్ దృష్టిలో మంచి పనివాడిగా పేరు పొందాడు.
" ఏ శుభకార్యాలకు రాకుండా భీష్మించుకుని కూర్చుంటావు. త్వరలో నీ కూతురు పెళ్లి చెయ్యాలన్న విషయం గుర్తుంచుకో. ఆ పెళ్ళికి నీ బంధువులు ఎలా వస్తారని అనుకుంటున్నావు ?" అంటూ అతని బాబాయి ఒకటే ఘోష పెట్టెయ్యడంతో తప్పని సరి పరిస్తితులలో రెండు రోజుల ప్రోగ్రామ్ వేసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ నాణాలున్న బోర్నవిటా డబ్బా కూడా తీసుకువెళ్దామంటే మధ్యలో ఎవరైనా ఈ నాణాలు ఎక్కడినుండి వచ్చాయి అని పట్టుకుంటే మొదలుకే మోసం వస్తుందని దేవుడి మీద భారం వేసి ఇంటికి గట్టి తాళాలు వేసి బయలుదేరాడు. పెళ్ళిలో అటూ ఇటూ తిరుగుతున్నా మనసంతా ఇంటిమీదే ఉంది. తనూ తన కుటుంబం అర్జెంట్గా ఊరు వెళ్తున్నట్టు ఎవరికీ చెప్పాలన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. .
చాలా రోజుల తర్వాత ఇలా పెళ్లి వాళ్ళతో కూర్చుని సరదాగా అందరినీ నవ్విస్తూ మధ్య మధ్యలో కూల్ డ్రింకులు ఆరారా సేవిస్తూ తన్మయత్వం చెందుతున్న రామనాధం జేబులో ఉన్న సెల్ ఫోన్ మోగింది. ఆతృతగా తీశాడు. .
"రామనాధం గారు మీరు అర్జెంట్ గా రావాలి. మీ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. దొంగలు పడినట్టున్నారు. మీ ఇంటి దగ్గర మన కంపినీ వాళ్ళు ప్రస్తుతం సెక్యూరిటీని ఉంచారు. మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. లేకపోతే ఉన్న సామానుకూడా పోతాయి. దానికన్నా ముందు అసలు విలువైన సామానులు ఏమైనా పోయి ఉంటే పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడానికి మీరుండాలి. . మీరు ఐదారు గంటలలో ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోండి వస్తూ వస్తూ మీ భార్యను కూడా తీసుకురండి. ఆవిడకైతే ఏమేమి పోయాయో తెలుస్తుంది." అని ఎవరో తన నెంబర్ తెలిసిన వాళ్ళు ఫోన్ చెయ్యడంతో రామనాధం గుండాగినంత పనయ్యింది. తను అనుమానిస్తూనే వెళ్ళాడు. చివరకు అదే జరిగింది. ఎక్కడో అటకమీద మూలకు పెట్టిన వెండి నాణాలు ఆ దొంగల కళ్ల పడి ఉంటాయా ?తనకు తెలిసి ఇంట్లో అది తప్ప ఖరీదైన ఆభరణాలు కూడా ఏమీ పెట్టలేదు. మహా అయితే పట్టు బట్టలు, స్టీల్ సామాన్లు ఉన్నాయి. అవి పట్టుకుపోయినా మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇరవై ఏళ్ల నుండి సంపాదించుకుంటూ వస్తున్న వెండి నాణాలు వాడి కళ్ల పడకుండా ఉంటే బాగుండును. " అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకు మనసులోనే మొక్కుకున్నాడు.
నవ్వుతూ తుళ్లుతూ ఉన్న రామనాధం మొహం హఠాత్తుగా వివర్ణం అవ్వడంతో పక్కనున్న వాళ్ళు ఏమయ్యింది అంటూ గట్టిగా అతని భుజాలు పట్టుకుని కుదిపేశారు.
ఆ వార్త ఆ నోటా ఈ నోటా వెళ్ళి పెళ్లి పందిరి అంతా పాకింది. రామనాధం భార్య రాధమ్మ దడదడ లాడుతున్న గుండెలతో అతని దగ్గరికి వచ్చింది. "అయ్యో ఎంత పని జరిగిందండీ. ఇప్పుడు ఏం చెయ్యడం ? ఏమేమి పోయాయో వాళ్ళు చెప్పారా ? " అంటూ పక్కకు పిలిచి " ఏమండీ మీకో విషయం చెప్పకుండా దాచాను. నేను ప్రతి అక్షయ తృతీయకు ఎంతో కొంత బంగారం కొని ఇంట్లోనే చాలా సీక్రెట్గా ఒక చోట దాచి ఉంచానండీ. అది కూడా ఆ దొంగల కళ్ల బడి ఉంటుందా కొంపదీసి ? " అంటూ చావు కబురు చల్లగా చెప్పింది రామనాధం భార్య. .
రామనాధం మొహం మరింత నల్లబడింది. "ఇంకా మెల్లిగా చెపుతున్నావు. అవన్నీ ఎప్పుడో ఊడ్చేసి ఉంటారు. పదా. బట్టలు సర్ధుకో. వెంటనే మనం వెళ్లిపోవాలి. మనకు ఈ పెళ్లిళ్లు , శుభకార్యాలు ఆచ్చి రావు." అంటూ పెళ్లాన్ని కంగారు పెట్టేశాడు. . .
రామనాధం కుటుంబం పడుతూ లేస్తూ వాళ్ళ ఊరు చేరేసరికి ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్నారు.
"వచ్చారా స్వామీ. పొద్దున్నుండి మీ ఇల్లు కాపలా కాయలేక చస్తున్నాం. ముందు చూసుకోండి ఏమేమి పోయాయో. మేమేమి లోపలికి వెళ్లలేదు. అంతా ఆ పోలీసాయనే చూసుకుంటున్నాడు " ఆన్నాడు వారిలో ఒకరు బాధ్యత తప్పిందని ఊపిరి పీల్చుకుంటూ .
పోలీసు ఆయన దొడ్డివైపు కిటికీలు , తలుపులు పరిశీలిస్తున్నాడు. గ్రిల్ తలుపు తాళం పగలకొట్టిన సుత్తి లాంటి పరికరం చూసి "ఇటువంటి పరికరం దొంగల దగ్గర ఉంటే బ్యాంక్ తాళాలు కూడా ఈజీగా పగలకొట్టేయ్యొచ్చు " అంటూ నవ్వుతూ దాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు. .
వస్తూనే రామనాధం భార్య వంటింటిలోకి పరిగెత్తింది గోడకు ఆన్చి పెట్టిన ప్రిజ్జు వెనకాల ఉన్న గోడ రంగులో కలిసిపోయి ఉన్న చిన్న అల్మారాలో దాచుకున్న పెట్టేలోని తృతీయ అక్షయ తాలూకు బంగారు ఆభరణాలు గల్లంతవడంతో తలబాదుకుంటూ సోఖాండాలు పెట్టసాగింది.
" ఉండవే బాబూ. నా కష్టార్జితం నా వెండి నాణాలు కూడా మొత్తం ఊడ్చుకుపోయారు. వాళ్ళు బాగుపడరు " అంటూ అక్కడికక్కడ శపించేశాడు రామనాధం
చూస్తూంటే ఆ దొంగలు తమకు కావలసినవి దొరకబుచ్చుకోవడానికి వెతకని ప్రదేశం అంటూ లేదు. బీరువాలు అన్నీ తెరిచి ఉన్నాయి. బట్టలన్నీ చెల్లా చెదరా పడి ఉన్నాయి. ప్రిజ్జులో ఉంచిన అప్పుడెప్పుడో కొద్దిగా తక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిసి కొన్న రెండు కేజీల జీడిపప్పుల ప్యాకెట్, కిస్మిస్ పొట్లం కూడా మాయం చేశారు. నిరాశ , నిస్పృహల మధ్య తలపట్టుకుని కూర్చున్న రామనాధం దంపతులకు అతని ఆఫీసులో వాళ్లెవరో జాలిపడి హోటల్ నుండి టిఫిన్ తెప్పించి పెట్టారు. ఆ షాకు నుండి ఆ కుటుంబం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.
ఎవరు ఎంత బలవంతం పెట్టినా ఎంత దగ్గర వాళ్ళు పోయినా కూడా ఈ సారి ఇల్లు కదిలే ప్రసక్తి లేదని ఆ కుటుంబం తీర్మానించుకుంది. బంగారం, వెండి ఇతర సామానులు పోయి బాధ పడుతున్న ఆ కుటుంబాన్ని ఓదార్చే వాళ్ళు లేకపోగా ఆ తర్వాత కాలంలో "మా ఇంటికి పెళ్ళికి రాకుండా ఎగ్గొట్టాడు.. రేపు వీడి కూతురు పెళ్ళికి , కొడుకు పెళ్లికి మనం కూడా చస్తే వెళ్ల కూడదు " అనుకుని కక్ష కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. .
ఇది జరిగిన కొన్నాళ్ళకు రాధమ్మ పక్కింటి వాళ్ళు "మాకు తెలిసిన బంగారపు షాపు వాడున్నాడు. ఆ పాత గాజులు, మెడలో మంగళసూత్రం గొలుసు ఇస్తే కొత్తవి చేసి ఇస్తాడు. ఆ షాపు వాడిమీద మాకు బాగా నమ్మకం . మీరు కూడా చేయించుకోండి. చూడటానికి మీ వస్తువులు బాగా పాతపడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి " అంటూ సలహా ఇవ్వడంతో నిజమే తన వస్తువులు కిలం పట్టి ఉన్నాయి . కొత్తవి ఎలాగూ చేయించుకోలేము. షాపు వాడు కరగబెట్టి కొత్తవి చేసి ఇస్తే ఎవరైనా అడిగితే కొత్తవి చేయించుకున్నాం అని గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది " అనుకుంటూ ఒక రోజు పక్కింటావిడతో బంగారం షాపు వాడి దగ్గరకు వెళ్ళి తన తల్లి, అత్తగారి వారసత్వంగా వచ్చిన నాలుగు గాజులు, ఎప్పుడైనా తెగి పడిపోయేలా ఉన్న సూత్రాల గొలుసు ఇచ్చేసి వాడిచ్చిన రిసీట్ తీసుకుని ఇంటికి వచ్చింది.
నాలుగు రోజులుగా ఆ బంగారపు షాపు తలుపులు వేసి ఉండటంతో రామనాధం, అతని భార్య కంగారుపడ్డారు . పక్క వాళ్ళ నడిగితే "అర్జెంట్గా ఎవరో పోయారని ఊరెళ్ళాడు " అనడంతో హిస్టీరియా వచ్చినంత పనయ్యి ఆ షాపు వాడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లారు . చివరకు తెలిసింది ఏమిటంటే ఆ షాపు వాడికి బోళ్ళన్ని అప్పులున్నాయని , అప్పులు వాళ్ళు వేధించుకు తింటూ ఉండటంతో ఇంట్లో కూడా చెప్పకుండా ఏదో వూరు వెళ్ళి పోయాడని " ఏడుస్తూ అతని భార్య చెప్పడంతో తలపట్టుకుని అటువంటి దొంగ షాపు వాడిని చూపించిన పక్కింటి సుబ్బమ్మను చెడామడా తిట్టి పోశారు.
" భలే వారు. మాకెప్పుడూ ఇలా జరగలేదు. మీ దురదృష్టం అలా వుంది . మేమేం చెయ్యమంటారు.? వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయండి " అంటూ ఉచిత సలహా పారేసింది సుబ్బమ్మ. .
ఏ రోజైనా షాపు తెరుచుకుంటుందేమో అంటూ చూసిన వాళ్ళకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మరోపక్క మా ఆయన ఏమయ్యాడో అంటూ షాపు వాడి పెళ్ళాం నెత్తీ,నోరు బాదుకోవడం దరిమిలా ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు రామనాధాన్ని పిలిపించి "అతను వాళ్ళ వూరు పారిపోయాడని తెలిసింది . మీరు కంప్లయింట్ ఇస్తే వాడిని బాగా చితకకొట్టి మీ నగలు వచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ టార్చర్ తట్టుకోలేక ఏ ఆత్మహత్యో చేసుకుంటే మీకూ మాకూ కూడా మంచిది కాదు. ఆలోచించండి. ఇలాంటి కేసులు మా దృష్టికి చాలా వచ్చాయి. కానీ అప్పులు పాలయ్యి పారిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కూడా ఎక్కువే. " అన్నారు పోలీసు వాళ్ళు నిస్సహాయంగా మొహం పెట్టి. .
" అమ్మో, ఇటువంటి రిస్కులు మేము తీసుకోలేమండీ. వాడు చావడానికి కారణమయ్యి వాళ్ళ కుటుంబ ఉసురు పోసుకోవడానికి మేము సిద్దంగా లేము. వాడిని కొట్టకుండా నగలు వచ్చే ఉపాయం ఏదైనా ఉంటేనే చేయండి. లేకపోతే ఆ నగలు పోతే పోయాయి అనుకుని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాం " అంది రామనాధం భార్య పెద్దమనసు చేసుకుని
"మెత్తగా చెపితే వినరండీ. విరగకొడితే కానీ మీ నగలు రావు . మీ ఇష్టం " అంటూ పోలీసులు చేతులెత్తేశారు.
"పోనీలెండి. ఆ షాపు వాడి భార్యను, పిల్లలను చూస్తూంటే నాకు ఎంతో బాధేసింది. ఒక కుటుంబాన్ని కాపాడాం అనుకుని ఊరుకుందాం. జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రమాదాలలో ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. అంతవరకు అదృష్టవంతులమే. ఎవరి బాధలు వాళ్ళవి . షాపు వాడు పిల్లలు గలవాడు. వాళ్ళ ఉసురు మనం పోసుకోవద్దు. ఇప్పటివరకు జరిగిన ఈ అనుభవాలతో జాగ్రత్తగా ఉందాం. బ్రతికి బాగుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు .విలువైనవి ఎన్నో పోగొట్టుకొని ఉండొచ్చు. కానీ మానవత్వానికి మించిన విలువైనది లేదు " అని రామనాధం భార్య స్త్రీ సహజమైన మనసుతో అనునయంగా చెప్తూ ఉంటే "అవును నువ్వు చెప్పింది నిజమే . పోయినవి మన సొమ్ము కాదు అనుకుందాం " అనుకుని మనసును ఒకరికొకరు దిటవు పరచుకుని ఇంట్లోకి అడుగుబెట్టారు ఆ దంపతులు ******
సమాప్తం