భాగవత కథలు - 18
దేవకీ వసుదేవులు
1. భూదేవి విలాపం
పూర్వం ఎంతోమంది దానవశ్రేష్ఠులు భూమిపై పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి ఆ భారం మోయలేక, బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విలపించింది. బ్రహ్మదేవుడు కరుణతో ఆమెను ఓదార్చి, ఆమెతో సహా కొంతమంది దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని దర్శించి పురుషసూక్తం పఠించాడు. విష్ణుమూర్తి ప్రసన్నుడై “దేవతలారా, మీరందరూ మీమీ అంశలతో యదువంశంలో జన్మించండి. నేను వసుదేవునికి పుత్రుడిగా జన్మించి భూభారం తొలగిస్తాను. ఆదిశేషుడు నాకు అన్నగారుగా జన్మిస్తాడు. యోగమాయ తన అంశతో ఒక ముఖ్యమైన కార్య నిర్వహణకై భూమిపైన జన్మిస్తుంది” అని చెప్పాడు.దేవతలు దానికి అంగీకరించి బ్రహ్మదేవుడితో సహా వారి లోకాలకు తిరిగి వెళ్లారు.
2. యదు వంశం
యయాతికి పెద్దకుమారుడు యదువు. ఆ యదుమహారాజు పేరు మీద ఆ వంశానికి యదువంశము అనే పేరు వచ్చింది.ఆ వంశంలో కార్తవీర్యార్జునుడికివేయిమంది కుమారులు. అందులో ఐదుగురు కుమారులుపరశురాముడి బారి నుండి చావు తప్పించుకొన్నారు. వారి వల్ల యదువంశం వృద్ధి చెందింది. ఆ వంశంలో అహూకునికి ఉగ్రసేనుడు, దేవకుడుఅనే ఇద్దరు కుమారులు. ఉగ్రసేనునికి కంసునితో సహా తొమ్మండుగురు కుమారులు,నలుగురు కుమార్తెలు కలిగారు. దేవకునికి నలుగురు కుమారులు; దేవకితో సహా ఏడుగురు కుమార్తెలు కలిగారు.
భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన శూరసేనమహారాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధుర శూరసేన దేశాలను పాలించాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు, పృథ అనే కుమార్తె కలరు. శూరసేనమహారాజు తన స్నేహితుడైన కుంతిభోజునికి పిల్లలు లేకపోవడం వలన తన కుమార్తె పృథను దత్తత ఇచ్చాడు. అందు వలన ఆమెకుకుంతి అనే పేరు వచ్చింది.వసుదేవునికిదేవకుని కుమార్తెలు ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే ఏడుగురుకాక రోహిణి, పౌరవి, మదిర, కౌసల్య, రోచన, ఇళ అనే మరొక ఆరుగురితో కలిసి మొత్తం పదముగ్గురు భార్యలు. పాండవుల తల్లి అయిన కుంతీదేవి స్వయానా వసుదేవుని చెల్లెలు. వసుదేవుని భార్య దేవకి కంసునికి చెల్లెలు (చిన్నాన్న కుమార్తె) అవుతుంది.
3. అశరీరవాణి పలుకులు
వసుదేవుడు దేవకీదేవిని వివాహమాడిన తరువాత ఒకనాడుతన భార్యతో కలిసి రథమెక్కి బయలుదేరాడు. ధనంతో నిండిన పదునెనిమిది వందల రథాలనూ, ఏనుగులు, గుర్రాలు, దాసదాసీజనులను దేవకికి అరణంగా ఇచ్చారు.ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలుపై ప్రేమతో తనే స్వయంగా పగ్గాలుపట్టి రథం త్రోలసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అశరీరవాణి ఆకాశం నుండి ఇలా పలికింది. “కంసా, నీవు నీ చెల్లెలు దేవకీదేవిపై ప్రేమతో రథం నడుపుతున్నావు. ఆ యువతి అష్టమ గర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా!” అని హెచ్చరించింది.
అది విన్న కంసుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. దుర్మార్గుడైన కంసుడు చెల్లెలు అని కూడా చూడకుండా కత్తిదూసి దేవకి కొప్పుపట్టి, రథం నుండి క్రిందటకు లాగి చంపబోయాడు. వసుదేవుడు అడ్డుపడి చల్లని మాటలతో అతనిని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు. “బావా! అమాయకురాలైన నీ చెల్లెల్ని వధించవద్దు. నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను. ఈమెను రక్షించు”. అతని మూర్ఖత్వాన్ని గ్రహించి ఎలాగైనా ఆమెను కాపాడుకోవాలని తలంచి ఆలోచించి మరల ఇలా అన్నాడు. “ఈమెకు పుట్టేన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికింది. ఈమెకు పుట్టిన కొడుకులందరినీ నీకు సమర్పిస్తాను. వారిని నీవు చంపుదువుగాని. ఈమెను వదిలిపెట్టు అని చెప్పాడు”.
కంసుడు ఈ మాటలకు సంతోషించాడు. చెల్లెలి కొప్పు విడిచి వెళ్ళిపోయాడు. వసుదేవుడు దేవకితోసహా తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆమెకు మొదటి కుమారుడు పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగాతీసుకువచ్చి అన్నమాట ప్రకారం కంసునికి ఇచ్చివేశాడు. ఈ విధంగా ఆడినమాట తప్పకుండా కొడుకుని తీసుకొని వచ్చి ఒప్పగించిన వసుదేవుని మాటనిలకడకు మెచ్చుకొని కంసుడు ఇలా అన్నాడు. “ బావా! నీ కొడుకును నీవే తీసుకువెళ్ళు. వీడి వలన నాకు భయంలేదు.నీ ఎనిమిదవ పుత్రుడే నాపాలిట మృత్యువు. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను.” కంసుడిలా అనగానే వసుదేవుడు కొడుకును తీసుకొని తన మందిరానికి తిరిగి వెళ్లాడు.
4. కంసునికి నారదుడి ఉపదేశం
ఇలా ఉండగా ఒకనాడు నారదమహర్షి పనికట్టుకొని కంసుని ఇంటికి వచ్చాడు. అతనితో “వ్రేపల్లెలో ఉన్న నందుడు మొదలైనవారు, దేవకీ వసుదేవులు, యాదవులూఅందరూ దేవతలే గాని మానవులు కాదు. నీవు రాక్షసుడవు. విష్ణువు దేవకీదేవి గర్భాన పుట్టి,దైత్యులనందరినీ సంహరిస్తాడు” అని చెప్పాడు. నారదుని మాటలు విన్న కంసుడు హడలిపోయాడు. తను నారాయణుని చేతిలో వధింపబడ్డ ‘కాలనేమి’ అని తెలుసుకున్నాడు. అప్పుడు కోపంతో దేవకీ వసుదేవులను పట్టి కారాగారంలో బంధించాడు. వారి పుత్రులను విష్ణు స్వరూపులుగా తలచి వెంటనే సంహరించాడు.యదు, భోజ, అంధకార దేశాలనేలుతున్న తన తండ్రి ఉగ్రసేనుణ్ణి పట్టి చెరసాలలో పెట్టాడు. తానే రాజై పరిపాలన సాగించాడు. బాణుడు, మాగధుడు, మహాశనుడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిదుడు, పూతన మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయిన యాదవులు తమ పదవులు విడిచి ధీనులైనిషద, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలు పట్టి పోయారు. కొందరు మాత్రం అహం చంపుకొని కంసుని సేవిస్తూ మధురలోనే ఉండిపోయారు.కంసుడు దేవకీదేవికి పుట్టిన ఆరుగురు కుమారులను వెంటవెంటనే వధించాడు.
5. గోకులంలో బలరాముని జననం
ఆదిశేషుడు విష్ణు తేజస్సుతో దేవకీదేవి గర్భంలో ఏడవసంతానంగా ప్రవేశించాడు.ఆ సమయంలో తనను నమ్మిన యాదవులకు కంసునివలన భయం కలుగుతుందని భావించిన హరి, యోగమాయాదేవితో“నీవు గోపికలు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలలో ఒకరైన రోహిణీదేవి నందగోకులంలో తలదాచుకున్నది. దేవకి గర్భంలోనున్న శేషుని తేజస్సును రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తరవాత నందుని భార్యయైన యశోదాదేవికి నీవు బిడ్డగా పుట్టగలవు. తమ కోరికలను తీర్చగలవని మానవులు నిన్ను పూజిస్తారు. నీకు బలులిస్తారు. నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామాలతో పూజిస్తారు” అని చెప్పాడు. ఆమె శ్రీహరి ఆజ్ఞతో భూలోకానికి వచ్చి దేవకీదేవి గర్భంలో కాంతులు చిందిస్తున్న పిండాన్ని రోహిణీదేవి గర్భంలో ప్రవేశ పెట్టింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిందని అందరూ అనుకొన్నారు.
కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు పుట్టాడు. పిండాన్ని మార్చడం ద్వారా పుట్టాడు గనుక ‘సంకర్షణుడు’ అనీ, చాలా బలవంతుడు కావడం వలన ‘బలభద్రుడు’ అనీ, అందరినీ ఆనందింపజేసేవాడు కాబట్టి ‘రాముడు’ అనీ అతనికి పేర్లు వచ్చాయి.
6. దేవకీ వసుదేవులకు దేవతలదీవెనలు
అనంతరం విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించింది. ఆ వసుదేవుడు తనలో ప్రవేశించిన విష్ణుతేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశింపజేశాడు.ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా నిండి ఉన్నది,అన్నిటికీ ఆత్మ అయినది,బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్నది.దేవకీదేవి కడుపులోవిష్ణుమూర్తి ఉదయభానునివలె వృద్ధి చెందడం మొదలెట్టాడు.ఈ విధంగా విష్ణువును తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి అన్నగారి యింట్లో బంధింపబడి ఉంది. ఈ గర్భాన్ని చూస్తూనే కంసుడు కలవరపడసాగాడు. ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉంటాడు అనుకున్నాడు.కాని గర్భవతియైన చెల్లెలును చంపడం ధర్మం కాదని, తన కీర్తి నాశనమవుతుందని ఊరుకున్నాడు. లోలోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు. విష్ణువుతో ఉన్న శతృత్వం కారణంగా కంసునికి విష్ణువు తప్ప ఇతర విషయం ఏమీ లేకుండా పోయింది.
ఇలా ఉండగా బ్రహ్మదేవుడూ, పరమేశ్వరుడూ దేవతలతోనూ, నారదాది మునులతోనూ కలిసి దేవకీ వసుదేవులు ఉన్నకారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముని స్తోత్రంచేసి ఇలా అన్నారు. “నీవు జన్మించడంవల్ల ఈ భూభారం తగ్గిపోతుంది. లోకాలు రక్షించే నీకు మేము నమస్కారిస్తున్నాము”. వారు దేవకీదేవిని చూచి “తల్లీ, నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు. కంసుని వలన ఏ మాత్రం భయంలేదు. అందరికీ క్షేమం చేకూరుతుంది. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి” అని దీవించి వెళ్ళిపోయారు.
7. కారాగారంలో శ్రీకృష్ణ జనన ఘట్టం
దేవకీదేవి ప్రసవవేదన పడుతుంటే దుష్టుల మనస్సుల్లో ఏదో ఆవేదన కలిగింది. మంచివారికి శుభశకునాలు కనపడ్డాయి. ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండి పోయాయి. ఆకాశం గ్రహాలతోను, నక్షత్రాలతోనూ ప్రకాశించింది. చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. దేవకీదేవి ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు. గంధర్వులు దివ్యంగానే చేసారు. అప్సరసలు నృత్యం చేశారు. ఆ రోజు అర్ధరాత్రివేళ దేవకీదేవి విష్ణువును ప్రసవించింది. ఆ శుభ సమయంలో పుట్టిన బాలుడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామూర్తిగా విలసిల్లాడు.
అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారా చూసాడు. ఆ బాలుడు ఆయనకు దివ్యరూపంతో దర్శనమిచ్చాడు. మేఘవర్ణ శరీరంతో, నాలుగు బాహువులలో గద, శంఖు, చక్ర, పద్మాలను;తలపై మణిమయ స్వర్ణ కిరీటం ధరించి ఉన్నాడు. ఈ పాపడు విష్ణువే అని తలపోసి సాష్టాంగా నమస్కారం చేసాడు. బ్రాహ్మణులకు పదివేల దానం ఇస్తానని మనస్సులోనే తలపోశాడు. దేవకీదేవి కూడా ఆ బాలుని చూసి తన్మయత్వంతో ఇలా ప్రార్థించింది. “నీవు నా కడుపున పుడుతున్నావని విని, దుర్మార్గుడైన కంసుడు మమ్ములను చాలా కాలంగా ఈ కారాగారంలో బంధించి బాధపెట్టాడు. ఆ దుష్టుని శిక్షించి మమ్ములను రక్షించు”.
8. దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతము
అలా విన్నవించిన దేవకీదేవితో మహావిష్ణువు ఇలా అన్నాడు. “అమ్మా, నీవు పూర్వం స్వాయంభువ మన్వంతరంలో ‘పృశ్ని’ అనే మహా పతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు “సుతవుడు” అనే ప్రజాపతి. మీరిద్దరూ ఇంద్రియాలను జయించి మహాతపస్సు చేశారు.అలా పన్నెండువేల సంవత్సరాలు నిష్ఠతో నా నామజపంచేస్తూ నా తత్త్వాన్ని సమీపించారు. అప్పుడు నేను నా సత్యరూపాన్నిచూపి వరాలు కోరుకోమన్నాను. మీరి కష్టసాధ్యమని మోక్షాన్ని కోరుకోకుండా నాకు సాటియైన కుమారుని ప్రసాదించమని మూడు సార్లు కోరుకున్నారు. నా సాటివాడు ఇంకొకరు లేడు కనుక నేనే ఆ జన్మలో మీ కుమారుడు “పృశ్నిగర్భుడు” అనే పేరుతో జన్మించాను. రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అనే దంపతులుగా జన్మించారు. నేను మీకు ‘వామనుడు’ అనే పేరుతో కుమారుడిగా జన్మించాను. మీకిచ్చిన మాట ప్రకారం మూడవ జన్మలో మీకు కుమారుడిగా పుట్టాను. ఇక ముందు మీ యందు నా జన్మలు లేవు. అసలు మీకు ముందు జన్మలే లేవు. మీరు శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు”.
ఇలా చెప్పి శ్రీమహావిష్ణువు వారు చూస్తూ ఉండగానే, ఆ దివ్యరూపం వదలిపెట్టి పసిబాలుడుగా మారిపోయాడు.అప్పుడే పుట్టిన శిశువు వలె ఏడవడం వంటి కొన్ని వేడుకలు చూపించాడు. ఇదంతా కంసునికి తెలియకుండా ఉండడానికి కారాగార బటులను మాయ ఆవరించి అంతసేపూ నిద్ర మత్తులో ముంచింది.
9. నంద గోకులానికి శ్రీకృష్ణుడు
అదే సమయంలో వ్రేపల్లెలో నందుని భార్య యశోదాదేవికి యోగమాయ ఆడుబిడ్డగా జన్మించింది. యోగమాయ పుట్టగానే ఆ ఊరివారిని అందరినీ ఒక చిత్రమైన మైకం ఆవరించింది. శ్రీహరి సంకల్పం వలన వసుదేవుడు తను చేయవలసిన పనులను గ్రహించాడు. తనబిడ్డను తీసుకొని ఆ పురుటిల్లు దాటి వెళ్ళాలని తెలుసుకున్నాడు. హరి మాయవల్ల చేతికున్న సంకెళ్ళు, కాళ్ళ గొలుసులు తెగి పడ్డాయి. కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. పసిబిడ్డను చేతుల్లోకి తీసుకొని రొమ్ముకు హత్తుకొని, మెల్లమెల్లగాఅడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. చావళ్ళు దాటాడు. ద్వారాలు దాటుతూ ఉంటే ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ, పడగలు. విప్పి గొడుగులా పట్టి నడిచాడు.అలా వెళుతుండగా ఆ దారికి యమునానది అడ్డు వచ్చింది.
ఆ నది అతి వేగంగాపరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. అటువంటి యమునానది వసుదేవునికి దారి ఇచ్చింది. వసుదేవుడు యమునానది దాటి వ్రేపల్లెలో నందుని ఇంట ప్రవేశించాడు. అక్కడ అందరూ నిద్రలో ఉన్నారు. తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను యశోదాదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. ఆమె ప్రక్కలోఉన్న పసిపాపను ఎత్తుకొని బయలుదేరాడు.తిరిగి వచ్చి ఆ చిన్నిపాపను దేవకిప్రక్కన మెల్లగా పడుకోబెట్టాడు.
వసుదేవుడు భయంభయంగా తిరిగి కాళ్ళకు సంకెళ్ళు తగిలించుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా వాలిపోయాడు. వసుదేవుడు వచ్చి పిల్లలను మార్చడం తెలియని యశోదాదేవి రాత్రంతా నిద్రలో మునిగి పోయింది. యశోదకు అచ్చం తనలాంటి కన్నులున్న నల్లనయ్య పుట్టాడని అందరూ అనుకొన్నారు.
10. యోగమాయా దేవిహెచ్చరిక
మథురలోని కారాగారంలో చిన్ని పాప అప్పుడు కేరుపెట్టి ఏడ్చింది. ఆ శబ్దానికి కావలి భటులు మేల్కొన్నారు. వెంటనే ఆ వార్తను కంసునికి చేరవేశారు. కంసుడు కంగారుగా కారాగారానికి వచ్చి ఆ పాపను చంపబోయాడు. దేవకి అన్నను అడ్డుకొంది. “అన్నా మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు కాని ఇది నీ మేనకోడలు గదా. ఆడుదానిని చంపడం రాజులకు తగినపని కాదు. పసిబిడ్డలైన ఆరుగురు కొడుకులను వధించావు. ఇది ఇంటి ఆడపడుచు. కనీసం ఈ కూతురునైనా నాకు దానంచేసి పుణ్యం కట్టుకోమని నిన్ను ప్రార్థిస్తున్నాను” అని ప్రాధేయపడింది.
దేవకి ఎంత బ్రతిమాలినా కంసుడు వినలేదు. ఆ చిట్టిపాపను కాళ్ళు పట్టుకులాగి నేలకేసి కొట్టాడు. అయితే ఆ చిట్టిపాప నేలమీద పడకుండా రయ్యిన ఆకాశంలోకి ఎగిరింది. మణిమయహారాలతో ఎంతో అందంగా కనిపించింది. ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు ధరించిన ఆ దేవి, ఆకాశం నుండి కంసుని చూస్తూ కర్కశంగా ఇలా అన్నది. “ఆరుగురు పసిబాలురను వధించిన నీవు పసిపాపను కూడా చంపడానికి పూనుకున్నావు. నిన్ను చంపే వీరు డొకడు నాతోపాటే జన్మించి ఇంకొకచోట పెరుగుతున్నాడులే” అని పలికి అదృశ్యమైంది.
యోగమాయ పలికిన పలుకులు కంసుని చెవుల్లో బాణాల్లా తగిలాయి. మనస్సులో చాలా భయపడ్డాడు. దేవకీ వసుదేవులను దగ్గరకు పిలిపించుకొని, ఆదరించి గౌరవించి వారి భవనానికి పంపించాడు.
బాలకృష్ణుడు గోకులంలో నందుని ఇంట యశోదాదేవి ఒడిలో గారాబంగా పెరిగాడు. ఆ చిన్నికృష్ణుడు బాల్య చేష్టలు చేస్తూ క్రొత్త క్రొత్త లీలలు చేస్తూ గోపాలురను, గోపికలను ఆనందపరిచాడు
*శుభం*