రంగమ్మ , మొగుడు చనిపోవడంతో పేరాపురం గ్రామంలో చిన్న టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. రంగమ్మకు ఎవరు బంధువులు లేనందున ఒంటరిగా బతుకుతోంది. టీ కొట్టుతో పాటు ఉదయం టిఫిన్ మద్యాహ్నం భోజనం కూడా ఉండటంతో రంగమ్మ రోజంతా పని వత్తిడితో ఉంటుంది. రుచిగా టిఫిన్ భోజనం లభించడం వల్ల కస్టమర్లు ఎక్కువగా ఉంటున్నారు. వెనక సహాయం కోసం ఎంత ప్రయత్నించినా ఎవరు అందుబాటులో లేరు. పేరాపురం రోడ్డు పక్క ఊరైనందున వచ్చేపోయే జనంతో రద్దీగా కనబడుతుంది. ఒకరోజు మద్యాహ్నం పన్నెండేళ్ల కుర్రాడు రంగమ్మ హోటలు దగ్గరకొచ్చి దాహంగా ఉంది మంచినీళ్లు ఇమ్మని జాలిగా అడిగాడు. అప్పటికి హోటల్లో రద్దీ తగ్గి రంగమ్మ టేబుల్ శుభ్రం చేసుకుంటోంది. ఆ అబ్బాయిని చూసి రంగమ్మకు జాలేసింది. మొహం చూస్తే ఎండలో చెమటతో తడిసి నీర్సంగా ఏమి తిన్నట్టు లేదనిపిస్తోంది.రంగమ్మ తనుకూడా అన్నం తినే సమయమైనందున ఆ కుర్రాడిని లోపలికి పిలిచి ఆకులో అన్నం పెట్టి పప్పు కూర చారు వడ్డించి గ్లాసుతో మంచినీళ్ళు పెట్టింది. బాగా ఆకలి మీద ఉన్నాడేమో ఆబగా అన్నం తిని మంచినీళ్ళు తాగేడు. ఆకు మడిచి బయట గంపలో వేసి లోపలికొచ్చి బెంచీ మీద కూర్చున్నాడు. ఇంతలో రంగమ్మ కూడా అన్నం తిని చేతులు తుడుచుకుని ఆకుర్రాడి ఎదురుగా కూర్చుని వివరాలడిగింది. తన పేరు సర్ప రాజనీ , జంగారెడ్డిగూడెం దగ్గర చిన్న గ్రామమని అమ్మ చిన్నప్పుడే సచ్చిపోతే అవ్వ పెంచిందనీ నాన్న పేరు నాగరాజని పాములు పట్టి ఆడించే వాడని ఎవరికైనా పాము కరిచినా మంత్రం వేసి సర్పవేది వేరుతో విషం తగ్గించి ప్రాణాలు కాపాడేవాడని ఎవరింట్లోనైన పాము దూరితే వెళ్లి పట్టుకు వచ్చేవాడని అందువల్ల ఊరిలో అందరూ పాముల నాగరాజని పిలిచే వారని , అవ్వ సచ్చిపోయినాక నాన్న నన్ను పెంచి పాములు పట్టడం, పాము కరిచిన తర్వాత విషం ఎలా దించాలో మంత్రాలు నేర్పుతున్న సమయంలో దేవుడు నా కన్యాయం చేసినాడు. నాన్నకి కల్లు తాగడం అలవాటుంది. ఒకరోజు సాయంకాలం అయ్య కల్లు తాగి మత్తులో ఉంటే సర్పంచి గారింట్లో నాగుపాము దూరినాదని కబురు రాగా తూగుతో పోయి నాగుపామును పట్టుకోపోతే చెయ్యి వణికింది. కోపం మీదున్న పాము కసిగా చేతి మీద కాటు వేసింది. కల్లు మత్తు మీదున్న నాయనకు పాము మంత్రం నోటికి రాలేదట. వెళ్లే తొందరలో సర్పవేది మూలిక వెంట తీసుకుపోనందున పాము విషం ఒంట్లో పాకి అక్కడే సచ్చిపోయినాడట. అనాథనైన నాకు సర్పంచి గారు కొద్ది డబ్బు ఇచ్చినా అవి కూడా రౌడీ కుర్రాళ్లు దోచుకుపోయారు. నాయన నేర్పిన పాము విద్య మద్యలో ఆగి నాకు బ్రతుకు తెరువు లేకపోయినాది. కడుపు నింపుకోడం కోసం నేను లేబరు పనుల కోసం వెతుకులాడినా పని దొరకలేదు. మా ఊరోళ్లు కొందరు ఇటుక బడ్డీ పనులకోసం మరో చోటికి పోతుంటే నేనూ ఆళ్ల వెంట పోగా అక్కడ పని చేసే సూపర్వైజరు చిన్నోళ్లను పనిలోకి తీసుకోమని నాకు పని ఇవ్వలేదు. ఊరోళ్లకి భారంగా ఉండటం ఇష్టం లేక పట్నం చేరి ఏదో ఒక పని చేసుకుని బతకాలని బయలు దేరగా మీఊరు చేరేసరికి ఎండ ముదిరి ఆగినాను "అని కథంతా చెప్పుకున్నాడు సర్పరాజు. సర్పరాజు జీవిత జాలి కధ విన్న రంగమ్మ మనసు కరిగిపోయింది. తన దగ్గరే ఉంటూ హొటల్ పనుల్లో తనకి సహాయంగా ఉండమని ఉదయం టిఫిను రెండు పూటల అన్నం పెడతానని చెప్పింది. తనకీ ఎటుపోవాలో తెలియదు.కడుపు నిండితే చాలని రంగమ్మ చెప్పిన దానికి సర్పరాజు అలాగేనని తన భుజానికున్న మూలికల గుడ్డ సంచిని హోటలు గోడకున్న కొక్కానికి తగల్చమని ఇచ్చాడు. పేరాపురం గ్రామం రోడ్డు పక్కన ఉన్నందున వచ్చేపోయే ప్రయాణికులు , జనాలతో సందడిగా ఉంటుంది. సర్పరాజు వచ్చినప్పటినుంచి రంగమ్మకు బాగా విశ్రాంతి దొరుకుతోంది. తన కొడుకులా చూసుకుంటోంది.తను డబ్బులు చూసుకుంటే సర్పరాజు టిఫిన్లు టీలు భోజనం పనులు చూసుకోడం ప్లేట్లు శుభ్రం చెయ్యడం చేస్తుంటాడు. హోటలుకి కావల్సిన కిరాణా సామాన్లు టౌను నుంచి తేవడం టిఫిన్లు వంటలు చేస్తూ సాయంగా ఉంటున్నాడు.రాత్రి రంగమ్మ హొటలు వెనక గదిలో నిద్రిస్తే సర్పరాజు బయట బెంచీ మీద పడుకుంటాడు. ఊరి జనాలు టిఫిన్ కోసం రంగమ్మ హొటలు కొస్తే ఎవరీ కొత్త కుర్రాడని వివరాలు తెలుసుకున్నారు. రంగమ్మ సర్పంచికి సవిరంగా సర్పరాజు దీన గాధ చెప్పి ఊళ్లో ఉండటానికి ఒప్పించింది. ఒకరోజు రాత్రి సర్పరాజు హొటలు బెంచీ మీద పడుకుని ఉండగా ఊళ్లో ఎవరినో తేలు కుట్టిందని ఏడుపులు గోల వినబడుతోంది.వెంటనే సర్పరాజు గోడ కొయ్యకున్న సంచి భూజానికి తగుల్చుకుని గబగబా ఊర్లో ఏడుపులు వచ్చిన వైపు వెళ్లాడు. సర్పంచి గారమ్మాయిని కాలు మీద ఎర్రతేలు కుట్టిందని ఆఅమ్మాయి ఏడుపుతో పాటు ఇంట్లో వాళ్లు బయట వాళ్లు గుమిగూడి ఏమి చెయ్యడానికి పాలుపోక కంగారు పడుతున్నారు. ఊళ్లో ఎవరికైన జబ్బు దెబ్బలు తగిలితే పక్క ఊరి గ్రామీణ వైద్యుడు ( ఆర్ .యం.పి) పగటి పూటే అందుబాటులో ఉంటాడు. రాత్రయితే దేవుడి మీదే భారం వేస్తారు ఊరి ప్రజలు. సర్పరాజు సర్పంచికి దండం పెట్టి జనాల్ని అమ్మాయికి దూరంగా పంపమని తను తేలు కాటుకి వైద్యం చేస్తానని భుజానికున్న సంచిలోంచి సన్నని వేళ్లున్న మూలికను పైకి తీసి తేలు కుట్టిన భాగంపై పైనుంచి కిందకు అనేకసార్లు దిగలాగేడు. సంచిలోంచి చింతగింజ తీసి బియ్యం నీటితో రంగరించి ఆ గంధం తేలు కుట్టిన చోట పూసాడు.పది నిమిషాల్లో ఆ అమ్మాయికి విషప్రభావం తగ్గింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి దేవుడిలా సర్పరాజు వచ్చి అమ్మాయికి నయం చేసినందుకు అభినందించి పంపేడు. సర్పరాజు తిరిగి వచ్చి బెంచీ మీద పడుకున్నాడు. రంగమ్మకు ఈ విషయం తెలియదు. ఉదయం హోటలు తెరవగానే టిఫిన్ కోసం వచ్చిన ఊరి జనం రాత్రి సర్పంచి గారమ్మాయిని తేలు కుట్టడం బయట పడుకున్న సర్పరాజు వెళ్లి మూలికా వైద్యంతో విష ప్రభావం తగ్గించిన విషయం రంగమ్మ చెవిన పడింది. వాడి సహాయానికి ఎంతో సంతోషించింది.ఊళ్లో ఎవరికి విష పురుగులు కుట్టినా పాము కాటుకు తనకి తండ్రి దగ్గర నుంచి తెలిసిన మూలికావైద్యం మంత్రాలతో సరిచేస్తు ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నాడు.ఊళ్లో అందరికీ సర్పరాజంటే గౌరవభావం ఏర్పడింది.చుట్టు గ్రామాల్లో ఎవరికి పాము కరిచినా తేలు మరేదైన విష కీటకం కుడితే సర్పరాజు కోసం పరుగులు పెట్టి వస్తున్నారు. రంగమ్మ హోటలుకి గిరాకీ పెరిగింది. పేరాపురం ఊరు పేరు పాముల సర్పరాజుతో మారు మోగుతోంది. సర్పరాజు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు.అది అతనికెంతో ఖ్యాతి తెచ్చింది. పక్క గ్రామంలో యం.యల్. ఎ గారి రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా కాలి కింద పరదా లోంచి వచ్చిన పాము కాలి మీద కాటు వేసింది. అది చూసిన జనం పామును కర్రలతో బాది చంపేసారు.జనం గోల ప్రారంభమైంది. యం.యల్.ఎ గారిని కుర్చీలో కూర్చో బెట్టి తొడపైన తువ్వాలుతో గట్టిగా కట్టి ఉంచారు. జనంలో ఎవరో పక్క గ్రామం పేరాపురంలో పాముల మంత్రగాడు ఉన్నాడని చెప్పగానే వారి పి.ఎ వెంటనే బండి వేసుకుని పేరాపురం వచ్చి రంగమ్మ హొటలు వద్దకు వచ్చి ఈ ఊరిలో పాముల మంత్రగాడు ఎక్కడ ఉంటాడని అడగ్గా అక్కడే ఉన్న సర్పరాజు నేనే పాముల మంత్రగాడినని పరిచయం చేసుకున్నాడు. పట్టుమని పదిహేను సంవత్సరాలైన లేని కుర్రాడిని చూసి ఆశ్చర్య పోయాడు పి.ఎ. వెంటనే బండి మీద కూర్చోబెట్టి వెంట యం.యల.ఎ గారు ఉన్న గ్రామానికి తీసుకు వచ్చాడు.సర్పరాజు వెంటనే యం.యల్.ఎ గారిని చచ్చిన పామును పరిశీలించి తన సంచిలోంచి రబ్బరు తాడు పైకి తీసి పాము కాటు వేసిన చోటికి పైన బిగించి రెండు ఎండు తుమ్మ ముల్లులతో పాము కరిచిన చోట గట్టిగా చీరి నోటితో విషంతో కూడిన విషాన్ని పీల్చి ఉమ్మేసాడు. అలా చాలా సార్లు చేసాక ఉప్పు నీటితో గాయాన్ని కడిగి తన నోటిని పుక్కిలించి పాము కరిచిన చోట కట్టు కట్టి రబ్బరు తాడు వసులు చేసాడు. వెంటనే తన సంచిలోంచి సర్పగంధ వేరు ముక్కలు తీసి ఒకటి యం.యల్. ఎ గారి నోటిలో ఉంచి తను ఒక ముక్క నోటిలో వేసుకున్నాడు.గంటలో యం.యల.ఎ గారు కోలుకున్నారు. వెంటనే ఆయన్ని జిల్లా హాస్పిటల్ కు జీపులో తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయన మనసిక స్థితి శరీర ఆరోగ్యం పరిక్ష చెయ్యగా నార్మల్ గా కనిపించారు. పాము కరిచిన గ్రామంలో జరిగిన ప్రథమ చికిత్స వల్ల విష ప్రభావం బాగా తగ్గిందని పాము కాటుకు విరుగుడుగా ఏంటి వీనం ఇంజక్షన్ ఇవ్వగా వారంలో ఆయన కోలుకుని దినసరి కార్యకర్తల్లో పాల్గో గలుగుతున్నారు. సమయానికి భగవంతుడిలా సర్పరాజు అందుబాటులో ఉండి విష ప్రభావం తగ్గించి ప్రాణాలు కాపాడి నందుకు ఆనందించి యం.యల్.ఎ గారు తన వ్యక్తి గత అధికారి ద్వారా ఏమి కావాలో తెలుసుకోమని పంపేరు. ఆ అధికారి పేరాపురం వచ్చి రంగమ్మ హొటలు వద్దున్న సర్పరాజు ను సంప్రదించగా తనకి ఆశ్రయం ఇచ్చిన అమ్మ రంగమ్మ హోటలుకి తాటి పందిరి తీసి రేకుల షెడ్ వేసి వెనక గది కట్టించమని అబ్యర్థించగా వారం రోజుల్లో రంగమ్మ హోటలు స్వరూపం మారిపోయింది. తనకి వెనక ముందు ఎవరూ లేకపోయినా కన్న కొడుకులా వచ్చిన సర్పరాజును చూసి రంగమ్మ మురిసిపోయింది. * * *