ధర్మగిరిలో ధర్మయ్య అనే ఓ భూస్వామి వున్నాడు. అతని కొడుకు ధర్మేంద్రకు ఇరవై ఏళ్లు సమీపిస్తోంది. అయినా చదువు రాలేదు. ఇక తన కొడుక్కి చదువు రాదని ఎందుకూ కొరగాడని కుమిలిపోసాగారు. అతని తల్లిదండ్రులు ధర్మేంద్రకు తల్లిదండ్రుల ఆవేదన పట్టలేదు.అల్లరి చిల్లరగా తిరిగాడు. ధర్మయ్య తనకు వున్న భూ లావాదేవీలు, అందులో పండే వరి, గోధుమ, చెరకు పంటల్ని అమ్మేపనిని నిర్వహిస్తున్నాడు. హఠాత్తుగా ధర్మయ్యకు జ్వరం వచ్చింది. పది రోజులు మంచం మీది నుంచి లేవలేదు.
ఇక పంట వ్యవహారాలన్ని నిర్వహించాల్సిన బాధ్యత ధర్మేంద్రపై పడిరది. ఒకడే కొడుకు కావడంతో పంట వ్యవహారాలన్ని ఎలా చూసుకుంటాడో ఏమో అని అతని తల్లి రాజేశ్వరి ఆందోళన చెందింది.
ధర్మేంద్ర పొలం వద్దకు వెళ్లాడు. చెరకు కొడుతున్నారు. ఇంకా పది ఎకరాల్లో చెరకు పంటకు కట్టింగ్ ఆర్డర్ రాలేదు. ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాడు. అక్కడ ఫీల్డు ఆఫీసర్‌ని కలిసి తనకు కట్టింగ్‌ఆర్డర్ ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ఆయన అగ్రిమెంటు పేపరుపై సంతకం పెట్టాలని కోరాడు. ధరేంద్ర ఏమీ మాట్లాడకుండా అయోమయంతో దిక్కులు చూశాడు. తనకు సంతకం రాదని తల అడ్డం తిప్పి వేలిముద్ర పెట్టడానికి సిద్ధమయ్యాడు.
ఫీల్డు ఆఫీసరు నవ్వుకున్నాడు. ఇది అవమానకరంగా భావించాడు ధర్మేంద్ర. తను ఎలాగైనా చదువుకోవాలో అర్థం కాలేదు. ఆలోచించసాగాడు.
పంట వ్యవహారాలన్నీ అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్న ధర్మేంద్రను దారిలోకి ఎలా తేవాలని ఆలోచించారు అతని తల్లిదండ్రులు. పెళ్లి చేసేస్తే తిక్క కుదురుతుందనుకున్నారు. 23 ఏళ్లు వయసు వచ్చింది. ఆ ఊళ్లోనే పక్క వీధిలో వుంటున్న రామయ్య కూతురు చాలా విద్యావంతురాలైన రమ్మతో వివాహం చేశారు.
ఇప్పుడు పంటలు, పాడి, ఇంటి వ్యవహారాలన్నీ తనే స్వయంగా చూసుకునేది రమ్య. వున్న 50 పాడి ఆవుల పోషణ, పాలు అమ్మడం, డెయిరీకి వెళ్లి బిల్లులు తేవడం వంటి వ్యవహారాలన్నీ చకచక చేయసాగింది. వున్న 50 ఆవులతో ఇంకో 50 ఆవులు కొని మనుషుల్ని నియమించి పాలను సమీపంలోని డెయిరీకి విక్రయించేది. ఆదాయం బాగా రావడంతో స్వయంగా డెయిరీని ఏర్పాటు చేసింది. డెయిరీకి భర్త ధర్మేంద్రను ఎండీగా నియమించింది. తనకు చదువు రాకపోవడంతో తికమక పడ్డాడు ధర్మేంద్ర. అతడిని చూసి ఫ్యాక్టరీకి వచ్చే వాళ్లందరూ నవ్వుకున్నారు. ధర్మేంద్రకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఇది చూసి అతని భార్య రమ్య అతనికి ట్యూషన్లు చెప్పించింది. రెండేళ్ల తర్వాత ఓపెన్ వర్సిటీలో డిగ్రీ చేయించింది. ఆ తర్వాత ఎంబిఎ చదివించింది. ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చే వాళ్లవైపు వెర్రిగా చూడడం ఆపి ప్రతి వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ చాకచక్యంగా పరిష్కరించసాగాడు. పంట అమ్మకాలు, లావాదేవీలు కూడా తనే స్వయంగా చూసుకోసాగాడు ధర్మేంద్ర. నిత్యం పనుల్లో నిమగ్నమై అత్తామామ బాగోగులు చూసుకోలేని రమ్యకు ఇప్పుడు ఊరట లభించింది. ఇంట్లోనే వుంటూ అత్తా మామల శ్రేయస్సును పర్యవేక్షించింది.
చదువులేని కొడుకును ఇంతగా మార్చి ప్రయోజకుడిని చేసినందుకు సంతోషించారు ధర్మేంద్ర తల్లిదండ్రులు. కొడుకుని చక్కదిద్ది కాపురాన్ని మార్చేసిన కోడలు రమ్యకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ధర్మేంద్ర తల్లిదండ్రులు.