" రేపు చిన్న లక్ష్మి పుట్టినరోజు, ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేయండి. " అంది దుర్గమ్మ గారు భర్త రాఘవయ్య గారితో. ఆవిడ ఎంత మొత్త మో చెప్పదు. కాని అయిదు వేలు తక్కువ కాకూడదని ఆవిడ ఉద్దేశ్యం అని ఆయన కి తెలుసు. చూస్తున్న పేపర్ పక్కన పెట్టి ఆయన వెంటనే గూగుల్ పే చేసి, చిన్న లక్ష్మి కి వాట్సాప్ మెసేజ్ పెట్టారు. చిన్న లక్ష్మి అని ఎందుకు అంటే, ఆయన అన్నగారి కూతురు పెద్ద లక్ష్మి వేరే ఉంది కనక. ఆయన చాలా కాలం నుంచి అనుసరిస్తున్న ఒక మంచి అలవాటు, చెయ్య వలిసిన పని వెంటనే చేయడం. రెండో మాటు కాఫీ ఇస్తూ " చేశారా? " అంది. ఆయన చేసే ఉంటారని తెలిసినా. రాఘవయ్య గారికి ఆవిడ దగ్గర నుంచి తరుచు వచ్చే అభ్యర్తనలు ఎలా ఉంటాయంటే "ఈ వేళ స్వాతి పెళ్లి రోజు ఏదయినా ట్రాన్స్ఫర్ చేయండి" " ప్రీతి వాళ్ళు వ్రతం చేసు కుంటున్నట్టు చెప్పింది కదా, పీటల మీద బట్టలకి ట్రాన్స్ఫర్ చేయండి " పుట్టినరోజు కాకుండా వేరే అయితేనే ఇలా విడి విడి గా చెబుతుంది. ఆవిడ. కానీ, స్వాతి, ప్రీతీ, జ్యోతి ల పుట్టినరోజు న ఆవిడ ఏమీ చెప్ప కుండానే ముగ్గురికీ ఒకే మాటు ట్రాన్స్ఫర్ చేసి మెసేజ్ పెడతాడు ఆయన. వాళ్ళు ముగ్గురూ ట్రిప్లెట్స్. చిన్న లక్ష్మి తరవాత రాజేష్ పుట్టాడు. అప్పటికి ఆయన నరసాపురం హై స్కూల్ లో లెక్కలు టీచర్. ఇంక పిల్లలు చాలు అని అనుకున్న నిర్ణయం అమలు పరిచే లోపు మళ్ళీ ఆవిడ కి మూడో పురుడు అవసరం అయింది. మూడో పురుడు పుట్టింటిలో కూడదు అన్న సెంటిమెంట్ వాళ్ళ కుటుంబాలలో లేక పోవడం వల్ల పురిటికి రాజమండ్రి వెళ్ళింది. రాఘవయ్య గారు క్లాసు లో ఉండగా బావమరిది నుంచి టెలిగ్రామ్ వచ్చింది. " Durga delivered.mother and the daughters are ok. " ఆయనకి అర్థం కాలేదు. Mother and the daughter బదులు mother and the daughters అని పొరపాటు ఇచ్చాడేమో అనుకున్నాడు. అది పొరపాటు కాబోలు అని సందేహం మళ్ళీ టెలిగ్రామ్ లోనే వెలిబుచ్చితే, అవును పొరపాటు జరిగింది. " mother and three daughters " అని ఉండాలి అని జవాబు. అయితే వాళ్ళు పుట్టిన తరువాత ఆ కుటుంబానికి చాలా అదృష్టం కలిసి వచ్చింది. దుర్గమ్మ గారి కి చాలా ఆస్తి ఉన్న ఒక మేనమామ చని పోతే, ఈవిడ కూడా చాలా మంది వారసులలో ఒకరు గా హైదరాబాద్ లో ఒక పెద్ద స్థలం వచ్చింది. ఎవరో ఒక వారసుడు కోర్టు కు వెడితే, దాని తీర్పు పర్యవసానం గా దుర్గ మ్మ గారికి ఒక ఇళ్ల స్థలం వచ్చింది. కొంత అమ్మి ముగ్గురు కూతుళ్ళ పెళ్లి చేశారు. రిటైర్ అయిన తరువాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. మిగిలిన వారసత్వపు స్థలం డెవలప్మెంట్ కి ఇస్తే వీళ్ళు ఉంటున్న ఫ్లాట్ కాకుండా ఇంకో రెండు ఫ్లాట్స్ వచ్చాయి. వాటి మీద వచ్చే అద్దెలు దుర్గమ్మ గారు ఖర్చు పెట్టడం లో రాఘవయ్య గారు జోక్యం చేసుకోరు. అక్కడికి పంపండి, ఇక్కడికి పంపండి, అని చెప్పడం లో కనపడే అధిఖార స్వరం వెనక కథ అది. వారసత్వపు ఆస్తి రాక ముందే, రాజేష్ చదువు పూర్తి అయి అమెరికా వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఆఫీస్ పని మీద అతను ఇండియా రావడం జరుగుతోంది . రాఘవయ్య గారు రిటైర్ అయిన తరువాత వచ్చే పెన్షన్ తో ఇంటి ఖర్చులు ఆయనే చూసుకుంటారు ఫ్లాట్స్ మీద వచ్చే అదయాన్ని తండ్రి వాడుకోవటం లేదని రాజేష్ గ్రహించి, ఒక మాటు వచ్చినప్పుడు ఆయన ఎక్కువ సేపు పాత టివి చూడటం చూసి ఒక మంచి స్మార్ట్ టి వి కొన్నాడు. ఇంకో మాటు మంచి సెల్ ఫోన్ కొనిచ్చి , వ్వాట్సాప్ అలవాటు చేసి. తరుచు టచ్ లో ఉంటున్నాడు. ఈ మాటు వచ్చి నప్పుడు ఆఫీస్ పని అయిన తరువాత ఒక వారం సెలవు పెట్టి తల్లి తండ్రులతో గడిపాడు. ఆ రోజు ఇంకా నిద్ర లేవ లేదు రాజేష్. ఆరోజు ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్న గదిలో పడుకున్నాడు రాత్రి నెట్ ఫ్లిక్స్ లో ఎదో సినిమా చూసి. ఫోన్ రింగ్ అయితే రాఘవయ్య గారు వచ్చి ఎత్తి ఎవరితో మాట్లాడు తున్నారు. రాజేష్ కి మెలకువ వచ్చినా అలాగే పడుకుని ఉంటే తండ్రి మాటలు చెవి లో పడ్డాయి. తండ్రి మాటలే వినపడుతున్నాయి " ఏమిటి ఇప్పుడు చేశావు? "అరె అదెలా జరిగింది?" " ఆశ్చర్యం గా ఉందే. యాభై యా? అంత పెద్ద అమౌంటా? " " చాలా కాలం అయింది " " నేను మాట్లాడు తాను. నాకు నంబర్ పంపు " అని ఫోన్ పెట్టేసి వెళ్లి పోయారు రాఘవయ్య గారు. ఆయన రాజేష్ నిద్రలోనే ఉన్నాడనే అనుకున్నారు. ఆ రోజు అంతా తండ్రి ఎదో ఆలోచిస్తూ ఉండడం గమనించాడు. ఆ మర్నాడు ప్రొద్దుట బయటికి వెళ్లి వచ్చి, తండ్రి తన గదిలో పేపర్ చదువుతోంటే ఆయన పక్కన కూర్చున్నాడు. పేపర్ మడిచి ఆయన కొడుకు కేసి చూశాడు. రాజేష్ తన జేబులోంచి ఒక కవర్ తీసి " ఇందులో యాభై వేలు ఉన్నాయి. దీనిని మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోండి. ఎవరికీ ఏమీ చెప్ప నక్కర లేదు " అన్నాడు తల్లిని కూడా దృష్టిలో పెట్టు కుని. రాఘవయ్య గారు ముందు ఆశ్చర్య పోయి, తేరుకుని, " ఇప్పుడు నాకు అవసరం ఏముంటుంది రా? పెన్షన్ వస్తోంది కదా! " అని ఒక్క క్షణం ఆగి ఎదో ఆలోచన వచ్చి " రాజేష్ కేసి చూసి " ఎలా ఖర్చు చేసినా పరవాలేదా? మళ్ళి వెనక్కి రాదు. పరవాలేదు గా? అన్నారు. "మీ ఇష్టం. అందుకే ఇస్తున్నాను." అన్నాడు రాజేష్ "అయితే ఒక పని చేస్తావా? "అన్నారు "చెప్పండి నాన్నగారు." అన్నాడు రాజేష్. విజయవాడ లో రమణ మూర్తి అని లోకల్ అడిట్ లో చేస్తున్నాడు. అతని నంబర్ నా సెల్ లో కాంటాక్ట్స్ లో ఉంది తీసుకో. వెళ్లి డబ్బు ఇచ్చి అతని భార్య కి ఆరోగ్యం ఎలా ఉందొ కనుక్కురా " అన్నారు. ఆయన ఆఖరి మాటలు విన్న తరవాత, వెళ్లడం ఎందుకు ఆన్ లైన్ చేయవచ్చుగా అని రాజేష్ అడగ లేదు. మర్నాడు విజయవాడ వెళ్లి రమణ మూర్తి ఇంటికి వెళ్ళాడు రాజేష్. తండ్రి కి అతనికి ఎలా పరిచయమో, తండ్రిని అడగాలని అతనికి తట్ట లేదు. సత్య నారాయణ పురం లో వ్యాయమ శాల కి దగ్గర లో ఉన్న చిన్న ఇంట్లో ఉంటున్నాడు రమణ మూర్తి. కాలింగ్ బెల్ కొట్ట గానే మధ్య వయసు లో ఉన్నావిడ తలుపు తెరిస్తే, రమణ మూర్తి గారిని కలవాలి అని చెబితే, ఆవిడ కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. చొక్కావేసుకుంటూ రమణ మూర్తి వచ్చి రాజేష్ ని ప్రశ్న్తార్ధకం గా చూశాడు. " నేను రాఘవయ్య గారి అబ్బాయిని " అన్నాడు పరిచయం చేసుకుని, " నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు " అని కవర్ ఇచ్చాడు. అతను కుతూహలం గా కవర్ లో చూసి, అందులోంచి డబ్బు తీసి నిర్ఘాంత పోయినట్టు చూశాడు. అతనికి కళ్ళల్లో నీళ్లు తిరగడం రాజేష్ స్పష్టంగా చూశాడు. " నేను మాష్టారి తో తరవాత మాట్లాడతాను " అన్నాడు. ఇంతలో, తలుపు తీసిన ఆవిడ కాఫీ తెచ్చింది ఇద్దరికీ. "నా భార్య మాధవి " అని పరిచయం చేశాడు ఆమె బాగానే ఉండటం చూసి, ఆవిడ లోపలికి వెళ్లిన తరువాత, " ఆవిడ ఆరోగ్యం -- " అని ఆగిపోయాడు " అవునండి, ఆవిడకి బ్రెయిన్ లో ఎదో ట్యూమర్. ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆపరేట్ చేయడానికి కొన్నాళ్ళు ఆగాలని చెప్పారు డాక్టర్లు " అన్నాడు " నేను రామానికి మాత్రమే చెప్పాను. మాష్టారితో చెప్పలేదు. అప్పట్లో రామం కంటే నన్ను ఎక్కువ లైక్ చేసేవారు మాష్టారు " అన్నాడు అతను " ఎవరు మా రామం బాబయ్యా? " అన్నాడు రాజేష్ "అవును వాడు నేను క్లాస్ మేట్స్ మి. చాలా కాలం వాడితో టచ్ లోలేను. మొన్న వాడి నంబర్ ఇంకో క్లాస్ మెట్ దగ్గర తీసుకుని ఫోన్ చేశాను. మళ్ళీ అదంతా నేను మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇది కూడా ఇవ్వడానికి టైం పడుతుందేమో " అన్నాడు చేతిలో కవర్ ఎత్తి చూపుతూ. " నాన్న గారు దానిని తిరిగి ఆశించటం లేదండి. మీరు దాని గురించి ఆలోచించకండి. " అని చెప్పి వచ్చేశాడు. రాజేష్. తిరిగి రాగానే రామం బాబయ్య కి ఫోన్ చేశాడు. రాఘవయ్య గారికి ఒక్కడే తమ్ముడు. ఆయన కీ రామానికి మధ్య నలుగురు చెల్లెళ్ళు ఉండడం వల్ల వయసు లో తేడా ఉంది. అతను వైజాగ్ లో ఉంటాడు. రాజేష్ కి అతనికి వయసు లో పెద్ద తేడా లేదు కాబట్టి చనువు ఎక్కువ. " రమణ మూర్తి గారు నీకు ఫోన్ చేశారట కదా. ఆయన భార్య కి వంట్లో బాగో లేదట కదా. నాన్న పంపితే యాభై వేలు ఇచ్చి వాచ్చాను." అన్నాడు "మీ న్నాన్న పంపాడా? మనం ఎవ్వరం అలా చేయలేము రా " అన్నాడు రామం " ఆయన భార్య వైద్యానికి సహాయం అనుకుంటాను అంతే కదా? " అన్నాడు రాజేష్ " అదేమిటి జరిగినదంతా నీకు తెలియదా? " అన్నాడు రామం " ఏమి జరిగింది? అంతా రామానికి చెప్పాను. మళ్ళీ నేను చెప్పలేను. అని రమణ మూర్తి గారు అంటే నాకు అర్థం కాలేదు. అసలు ఏమి జరిగిందో చెప్పు " అన్నాడు రాజేష్. " ఓరోజు రాత్రి రమణ మూర్తి కి వ్వాట్సాప్ కాలో ఎదో వచ్చిందిట. మీ నాన్న అతనికి ఫోన్ చేసి, చార్ధాం యాత్ర చేసుకుని ఢిల్లీ వచ్చాం. ఇక్కడ హటాత్తు గా మీ అమ్మకి స్పృహ తప్పితే హాస్పిటల్ లో చేర్చానని.అర్జెంటు గా ముప్పై వేలు కావాలంటే, అతను ఏమీ ఆలోచించకుండా పంపాడుట.మళ్ళీ ఇంకో గంటకి ఫోన్ చేసి సీరియస్ అయి ఆపరేషన్ అవసరం అయిందని, ఇంకో ఇరవైవేలు పంపమని కోరాడట. అతని దగ్గర లేకపోతే, ఊళ్ళో ఉన్న తమ్ముడి లేపి అతని ద్వారా పంపాడట. ఆ మరునాడు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. మేష్టారు ఎక్కడ ఉన్నారని ?మీ నాన్న ఎక్కడ ఉన్నాడో చెబితే, ఆశ్చర్య పోయి జరిగింది చెప్పాడు. అంత తెలివి తక్కువగా ఆలా ఎలా మోసపోయావు అని అడిగితే, అప్పుడుమైండ్ బ్లాంక్ అయిపోయి వేరే ఆలోచన ఏమీ రాలేదని, మాష్టారు ట్రబుల్ లో ఉన్నారన్న ధ్యాసలో చేశాను అన్నాడు. భార్య వైద్యానికి దాచిన డబ్బు ఇచ్చాడట. మీ నాన్నకి చెప్ప వద్దన్నాడు. అయినా మొన్న ప్రొద్దుట మీ నాన్నకి చెప్పాను ' అన్నాడు అతని బాబాయి. సరే మళ్ళీ చేస్తానని పెట్టేశాడు రాజేష్. మొదట అతనికి వచ్చిన ఆలోచన, రమణ మూర్తి అంత తెలివి తక్కువ గా ఎలా వల లో పడ్డాడని. డబ్బు అవసరం అయితే, కొడుకునో, కూతుళ్ళనో అడుగుతారు కానీ, ఎప్పుడో చదువు చెప్పిన స్టూడెంట్ ని ఎందుకు అడుగుతారు? అంత తెలివి తక్కువగా డబ్బు చెల్లించిన వడికి, నాన్న గారు ఆ డబ్బు పే చేయడం ఏమిటి? తొందర పడి తండ్రిని ప్రశ్నించే ముందు తానే విశ్లేషించుకోవడం ముఖ్యం అనుకున్నాడు. మొదటి ప్రశ్న కి జవాబు రామం బాబయ్య తో సంభాషణ లోనే దొరికింది. ఆ సమయం లో మాష్టారు కష్టం లో ఉన్నారు అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన రాలేదని, తాను అప్పుడు ప్రవర్తించిన తీరు తలుచుకుంటే తనకే సిగ్గు గా ఉన్నట్టు, ఆ విషయం మళ్ళీ మాట్లాడటం ఇష్టం లేదని చెప్పడం లో తెలుస్తోంది. ఇంకో విషయం. అతను వచ్చి తండ్రి ని అడగ లేదు. ఇంక రెండోది, " ఎలా ఖర్చు చేసినా పరవాలేదా?' అని అడిగి తండ్రి అది తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఆయన ని ప్రశ్నించడం తప్పు అని అనిపించింది. ఏమీ ఆలోచించ కుండా అతను ఎవడికో చెల్లించిన డబ్బు, అది మాష్టారికి ఇస్తున్నాననే భావం తో ఇచ్చాడు. అంతే. అది తనకి ఇచ్చినట్టే అని తండ్రి భావించడం లో ఉదాత్తత అతను గ్రహించాడు. అందుకే ఇంకేమీ అడగకుండా " అతనికి డబ్బు ఇచ్చాను. మీతో మాట్లాడతాను అన్నాడు ' అని తండ్రికి చెప్పి ఊరకున్నాడు. సమాప్తం . . . . .