సునందుడు తపోవనంలో తపస్సు చేసుకుంటున్న ముని కపిలేశ్వరుని కుమారుడు. సునందుడి వయసు పది వత్సరాలు. తల్లి ఎలాగుంటుందో తెలియదు. పసివాడిగా ఉన్నప్పుడే తండ్రి తపోవనానికి తీసుకు వచ్చి తనకు ఆహారం సమకూర్పచడం పరిచర్యలు చెయ్యడం సాగిస్తున్నాడు. సునందుడికి అడవి తప్ప బయటి ప్రపంచం ఎలా గుంటుందో తెలియదు. వాస్తవానికి కుంతల రాజ్యాధీసుడు కరణ్ వర్మ యుద్దాలలో జననష్టం తను ఎంతో ప్రేమగా చూసుకునే రాణి ముకుంద సర్ప కాటుతో మరణించడంతో వైరాగ్యం చెంది రాజ మహలు ఆడంబరాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవితం గడపాలని వెంట తీసుకుని తపోవనం చేరి ముని కపిలేశ్వురునిగా తపస్సు ప్రారంభించాడు. ఒకసారి బాలుడు సునందుడు నీటి కోసం దగ్గరలో నది దగ్గరకు తొట్టె పట్టుకుని వెళ్లాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న గజదొంగ జగ్గూ బృందం సునందుడిని చూసి తమకు సేవలకు పనికొస్తాడని బలవంతంగా తమ స్తావరం కొండ గుహకి తీసుకుపోయారు. వారి అశ్వాలకు గడ్డి తెచ్చి వెయ్యడం , వారికి సేవలు చెయ్యడం, పగలు దొంగలు బయటకు పోయేటప్పుడు తమ దొంగ సొత్తు కు కాపలాగా ఉంచి గుహ ముఖద్వారం వద్ద పెద్ద బండ అడ్డుగా పెట్టి వెళ్లేవారు. గుహ మద్యలో పైన పెద్ద రంద్రం ద్వారా గాలి వెలుతురు వస్తాయి. రాత్రి తైల కాగడాల వెలుగు ఉంటుంది. సునందుడికి అడవిలో ఏది ఎక్కడ ఉంటుందో తెలియడం లేదు. దొంగల గుంపు కర్కోటకులు. ఏమాత్రం వారికి వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రాణాలు తీసేస్తారు. కుందేళ్లు, లేళ్లు, పక్షుల్ని వనజంతువుల్ని తెచ్చి అతి కిరాతకంగా వాటిని చంపి మాంసం కాల్చుకు తింటారు. సునందుడు ముని కుమరుడైనందున శాకాహారిగానే కొనసాగుతున్నాడు. ఇప్పుడు సునందుడికి ఇరవై వత్సరాలు వచ్చాయి. దొంగల మద్య ఉన్నా సాధు జీవిగానే బతుకు తున్నాడు. ఒకసారి జగ్గూ దొంగల గుంపు రాజ కోటలో ఖజానా దొంగిలించడానికి ఆలోచన చేసారు. వెంట ముని కుమారుణ్ణి తీసుకుపోయారు. అడవి దాటి బయటి లోకం తెలియని సునందుడు రాజమహలు భవంతులు సైనికుల పహరా చూసి కొత్త లోకంలో కొచ్చినట్టు విచిత్రంగా చూస్తున్నాడు. దొంగలు అశ్వాల్ని అందుబాటులో ఉంచమని చెప్పి ఖజానా దొంగతనానికి బయలుదేరారు. కల్యాణదుర్గం రాజ్యాధీసుడు ధీరజ్ వర్మ రాజ్యంలో కల్లోలం సృష్టిస్తున్న జగ్గూ బందిపోటు ముఠాను మట్టు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తు న్నప్పటికీ తప్పించుకు పోతున్నాడు. జగ్గూ దొంగల ముఠాను పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటించాడు మహరాజు. జగ్గూ దొంగల ముఠా అర్థరాత్రి కోట ప్రహరీ దాటి రాణివాసం వైపు బయలుదేరారు. ఇంతలో కోట బయట సునందుడు చూస్తున్న అశ్వాలలో ఒక అశ్వాన్ని సర్పం కాటువేయడంతో అది అరుచుకుంటూ పరుగులు తీసింది. దాని వెంట మిగతా అశ్వాలు భయపడి చెల్లాచెదురయాయి. ఈ సందడికి పహరా సైనికులు ఏదో అనర్థం జరిగిందని మిగతా సైనికుల్ని మేల్కొలిపారు. కాగడాలతో కోటలోపల వెతకడం మొదలెట్టారు. నాలుగు వైపుల కాగడాల వెలుగుల్లో జగ్గూ దొంగల ముఠా సైనికులు చుట్టుముట్టడంతో తప్పించుకోడానికి దారి లేక రాజ సైనికులకు లొంగిపోక తప్పలేదు.నాలుగు వైపుల సైనికులు చుట్టుముట్టి దొంగల ముఠాను గొలుసులతో బంధించి బందికఖానాలో ఉంచారు. కోట బయట అమాయకంగా సంచరిస్తున్న ముని కుమారుని ఆకారంలో ఉన్న సునందుడిని సైనికులు బంధించి మహరాజు ముందు ప్రవేశ పెట్టారు. రాజకళతో మునికుమారుని రూపంలో అమయకంగా కనబడుతున్న యువకుడిని బందిపోటు జగ్గూ ముఠాలో ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఎవరు నువ్వు? దొంగల ముఠాతో ఎందుకు కలిసి ఉన్నావని ప్రశ్నించాడు మహరాజు ధీరజవర్మ. సునందుడు తన బాల్యం నుంచి దొంగల ఆధీనంలో ఎలా చిక్కిందీ తనకు అడవి జీవితం తప్ప రాజరికం తెలియదని మొదటిసారి ఈ కోట రాజమందిరం చూస్తున్నాననీ అమాయకంగా చెప్పాడు. అమాయకుడైన సునందుడి మాటలకు మహరాజు ఆనందభరితుడై అతని ద్వారా అడవిలో జగ్గూ దొంగల ముఠా గుహలో దాచి ఉంచిన సంపద రాజ ఖజానాకు తరలించారు. సునందుడి వల్ల ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతున్న జగ్గూ దొంగల ముఠా సైనికులకు చిక్కినందున రాజ్యంలో ప్రజలు నిర్భయంగా నిద్రపో గలుగుతున్నారు. సునందుడిని రాజ కొలువులో ఉంచి గొప్ప సైనికుడిగా తీర్చి దిద్ది సేనాపతిగా నియమించాడు మహరాజు.రాజవంశంలో జన్మించిన సునందుడు చివరకు రాజసౌధంలో ఆదరణీయ పదవిలో నియమితుడయాడు. *