కంటేనే అమ్మ అని అంటే ఎలా? - పి.కె. జయలక్ష్మి

kantene amma ani ante ela

మాతృత్వం అనేది స్త్రీకి దేవుడిచ్చిన వరం. కాని నవమాసాలు మోసి బిడ్డని కనకపోయినా ప్రతి స్త్రీలోనూ మాతృత్వ భావన అంతర్లీనంగా ఉండి తీరుతుంది.

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి, ఫ్రెషప్ అయి టీ తాగుతుండగా పిన్ని దగ్గర్నుంచి ఫోన్ - "రేపు సాయంత్రం వీలు చూసుకుని ఒకసారి రా"! అంటూ. అలాగే అన్నాను. పిన్ని మా అమ్మకి చిన్నాన్న కూతురే కాదు నాకు మంచి స్నేహితురాలు, శ్రేయోభిలాషీనూ! తరచు కలుస్తూనే ఉంటాము. అయినా ఫోన్ చేసి రమ్మని పిలుస్తోంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది.

మర్నాడు ఉదయం పన్లన్నీ త్వరగా ముగించుకొని నాన్నకి భోజనం పెట్టి, బి.పి మాత్రవేసి సాయంత్రం వేసుకోవాల్సిన చూపించి, మానసిక చికిత్సాలయంలో ఉన్న అమ్మ దగ్గర కాసేపు గడిపి, పిన్ని వాళ్ళింటికి బైలు దేరాను. నేను వెళ్లేసరికి గేటు దగ్గర శ్రీనాథ్ కన్పించాడు. తను నా కొలీగ్. పిన్ని వాళ్ళింట్లో పై వాటాలో అద్దెకుంటున్నాడు. మంచి వ్యక్తి. ఆఫీస్ లో సిన్సియర్ ఎంప్లాయిగా పేరు తెచ్చుకోవడమే కాక అందరికీ పెద్ద తరహాగా, తలలో నాలుకలా ఉంటాడు. నాకు అతనంటే గౌరవభావం. నన్ను చూడగానే "నమస్తే మధుమతి గారూ! ఏంటి ఇలా వచ్చారు?" అని చిరునవ్వుతో పలకరించాడు. "నమస్తే! శ్రీనాథ్ గారు పిన్నిని చూసిపోదామని వచ్చా" అంటూ నవ్వుతూ లోపలి దారి తీసాను. "వస్తానండీ! నాకు బైట చిన్నపని ఉంది" అంటూ అతను 'బై' చెప్పి వెళ్ళిపోయాడు.

నన్ను చూడగానే ఎంతో ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంది. "మధూ! కాఫీ తాగుదువు గాని ముందు బజ్జీలు తిను అంటూ ప్లేటు చేతిలో పెట్టింది. "ఏంటి పిన్నీ ఎప్పుడు వచ్చినా కడుపు నిండా కూరి పెడతావు కదా, నేనేం కొత్త చుట్టాన్నా" అన్నాను కినుకగా - "సర్లేవే నీ కబుర్లు! మీ అమ్మని చూసి వస్తున్నావా? ఎలా ఉంది?" అని ప్రశ్న వినగానే నా ముఖం చిన్నబోయింది. "ఎలా ఉందంటే ఏం చెప్పను పిన్నీ, నన్ను చూడగానే ఎంతో సంతోషిస్తుంది. ఎప్పుడూ పిల్లవాడి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. అదే తన ప్రపంచం. ఆ బొమ్మ కబుర్లన్నీ నేను ఓపిగ్గా వినాల్సిందే! నీకు తెలియందేముంది? ఇంట్లో నాన్న! ముసలి తనంలో తనకి తోడునీడగా ఉండాల్సిన భార్యకి ఆ స్థితి కల్పించినందుకు ఎంతో కుమిలిపోతూ, పశ్చాత్తాప పడుతూ రోజంతా అదే ఆలోచనగా బతుకుతున్నాడు. వీళ్ళిద్దర్నీ చూసుకుంటూ నేను బాధపడ్డం తప్ప ఏం చేయగలను?" ఆవేదనగా అన్నాను. "ఊర్కో మధూ! రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాస్త ఓపిక పట్టాలి దేనికయినా? నీకు ముఫ్ఫయ్ యేళ్ళు వస్తున్నాయి. పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అసలు" డైరెక్ట్ గా పిన్ని అలా అడిగేసరికి ఆశ్చర్యపోయాను. 'ఏంటి పిన్నీ, పెళ్ళా నాకు! నేనసలు పెళ్లి గురించిన ఆలోచనే పెట్టుకోలేదు. అయినా నాకు పెళ్ళేంటి?" "ఏం నీకేం తక్కువ? చక్కగా ఉంటావు, చదువుకొని ఉద్యోగం చేస్తూ పదివేలు సంపాదిస్తున్నావు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకు మించి ఏం అర్హతలు కావాలి?" అంది పిన్నీ కాస్త కోపంగా!

"నిజమే పిన్ని. కాని నాకిప్పుడు ముఫ్ఫై రెండేళ్ళు. నాన్నని నా పిచ్చితల్లిని వాళ్ళ ఖర్మానికి వదిలేసి నా దారి నేను చూసుకుంటే వాళ్ళని పట్టించుకునే దెవరు? వాళ్ళని పెద్ద మనసుతో ఆదరించగలిగే అల్లుడు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతాడు?. అదీ ఆలోచించాలి కదా!" అన్నాను భారంగా నిట్టూరుస్తూ.

"ఆగాగు, అదే నా నీ అనుమానం! దానికి పరిష్కారం నేను చూపిస్తాను. నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఇంక ముసుగులో గుద్దులాట అనవసరం. శ్రీనాథ్ మీద నీ అభిప్రాయం ఏమిటి?" "ఎవరు శ్రీనాథా?" ఉలిక్కి పడ్డాను ఒక్కసారిగా! "శ్రీనాధే, నా కొలీగ్, మా పై వాటాలో ఉన్న ఆ శ్రీనాథ్! అతనికి నీ గురించి, నీ కుటుంబం గురించి అంతా తెల్సు నా ద్వారా! తనకి నువ్వంటే చాలా సదాభిప్రాయం కూడా!" కాని అతనేంటో?... "ఆ! నువ్వు అడగబోయేది నాకు అర్ధమయింది. అతను మీ బాబాయి గారికి దూరపు చుట్టం. వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా తెల్సు. తల్లీ, అన్నగారు గుంటూరులో ఉంటారు. ఇతనికి పెళ్ళయిన రెండేళ్లకే దురదృష్టవశాత్తూ భార్య కేన్సర్ తో చనిపోయింది. ఆ దిగులుతో అక్కడ ఉండలేక మూడేళ్ళ క్రితం ట్రాన్స్ ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చేసాడు. సెలవులకి గుంటూరు వెళ్ళి వస్తూ ఉంటాడు. రెండో పెళ్ళి వాడయినా వయసు ముఫ్ఫై ఆరు సంవత్సరాలే! అతని నడవడిక, ప్రవర్తన నీకు తెలిసే ఉంటుంది. నువ్వు గనుక 'ఎస్' అంటే అతను నీతో మిగిలిన విషయాలు పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాడు. మంచి అవకాశం అన్పిస్తోంది. నాకయితే! నీ ఇష్టం ఇంక!" నా వైపే పరిశీలనగా చూస్తూ అంది పిన్ని! "నా కొంచెం వ్యవధి కావాలి" అన్నాను గోళ్ళ వైపు చూసుకుంటూ! "సరే, వారం రోజులు పోయాక తీరిగ్గా నీ నిర్ణయం చెప్పు. కాని పాజిటివ్ గానే ఉండాలి సుమా" నవ్వుతూ అంది కాఫీ అందిస్తూ!

***

మర్నాడు రెండు రోజులు ఆఫీస్ కి లీవ్ పెట్టేసి ఇంట్లో రిలాక్స్ డ్ గా పడుకుని రకరకాలుగా ఆలోచించడం మొదలు పెట్టాను. ఎలా చూసినా ఈ సంబంధంలో వంకలు పెట్టడానికి గాని, విమర్శించడానికి గాని ఏమీ కన్పించలేదు. మూడో రోజు ఉదయం శ్రీనాథ్ దగ్గర్నుంచి ఫోన్ 'ఆఫీస్ కి ఎందుకు రావడం లేదంటూ?' వెతకపోయిన తీగ తగిలినట్లు లోలోపల ఆనందపడుతూ సాయంత్రం పార్క్ దగ్గరికి రమ్మనమని అభ్యర్ధించాను. అతను 'సరే' అన్నాడు.

***

"ఏంటి మధుమతీ! మీ పిన్నిగారి దగ్గర నేను పెట్టిన ప్రస్తావన మీకు బాధ కల్గించిందా? ఆఫీస్ కి రాకుండా ఇంట్లో ఉండిపోయి ఏం చేసారు? మీకు ఇష్టం లేకపోతే ఆ సంగతి వదిలేయండి. జస్ట్ వి ఆర్ ఫ్రెండ్స్" పార్కులోకి రాగానే శ్రీనాథ్ తప్పుచేసిన వాడిలా పాఠం అప్పచెప్పినట్లు మాట్లాడ్డం నాకు నవ్వు తెప్పించింది.

"అదేం కాదండీ! మీకు మా కుటుంబం గురించి, నా బాధ్యతల గురించి వివరంగా చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను".

"నాకు మీ పిన్ని అంతా చెప్పారు. నేను మీకో విషయం చెప్పాలి" "నా భార్య లత నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. కాని విధి వైపరీత్యం. తను బాబుని ప్రసవించిన ఏడాదికే కాన్సర్ కాటుకు బలయింది. అప్పట్నుంచి తను మా అమ్మదగ్గర పెరుగుతున్నాడు. అందరూ రెండో పెళ్ళి చేసుకోమని పదేపదే చెపుతున్నా నాకు మనస్కరించడం లేదు. వచ్చే అమ్మాయి నాకు భార్య కాగలదు కాని నా ప్రశాంత్ కి తల్లి కాగలదా? "కాని మిమ్మల్ని చూసాక, మీ గురించి తెలిసాక నాకు చాలా నమ్మకం కలిగింది. నా ప్రశాంత్ కి మీ లాంటి సహృదయురాలు, సున్నిత స్వభావి తల్లిగా వస్తే నేను నిశ్చితంగా ఉండగలను అని ఖచ్చితంగా అన్పించింది. మీరు ఏమనుకుంటున్నారో నిర్మొహమాటంగా చెప్పండి. మీ జవాబు ఎలాంటిదైనా ఫర్వాలేదు. తట్టుకోగలను"

శ్రీనాథ్ చెప్పింది విన్నాక నిశ్చేష్టితనయ్యాను. తలలో ఏదో డైనమైట్ పేలిన ఫీలింగ్. ఒక్కసారి సునామీ కల్లోల పరచినట్లు మనసంతా అల్లకల్లోలం. ఏంటి విధి నా మీద పగ బూనిందా? తగిలిన చోటే మళ్ళా మళ్ళా ఎదురు దెబ్బలు? ఎందుకు దేవుడా ఇలా నాతో చెలగాటమాడుతున్నావు? నేనేం పాపం చేసాను? పుట్టిన వెంటనే తల్లిని దూరం చేసావు? నన్ను ప్రాణంగా ప్రేమించిన నేరానికి అమ్మ కాని అమ్మని పిచ్చాస్పత్రి పాలు చేసావు. నాన్నని రోగిష్టిగా మార్చావు ఇప్పుడు నేను దేనికైతే భయపడుతున్నానో అదే మళ్ళీ నా జీవితంలో సంభవించేలా చేస్తున్నావు?

శ్రీనాథ్ కి రెండో భార్యగా, ప్రశాంత్ కి సవతి తల్లిగా కాదు కాదు అమ్మగా... నేను గెలుస్తానా?... ఆలోచనల స్రవంతిలో మునకలు వేస్తున్న నేను శ్రీనాథ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. "ఏంటి మధుమతీ! ఏమైంది? అలా మౌనంగా ఉండిపోయారు?" బలవంతంగా నవ్వుతూ "శ్రీనాథ్! మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీరు నా గతంలోకి ఒకసారి తొంగి చూడాల్సిందే!" అంటూ నన్నెప్పుడూ వెంటాడే గతం కిటికీలు తెరిచాను.

***

నాన్నతో పాటు పెళ్ళికూతురి ముస్తాబులో 'కొత్త అమ్మ' వచ్చిన రోజు ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడుతూనే ఉంది. రాత్రి ఎప్పుడు వచ్చారో ఏమో, నేను నిద్రపోయాను. తెల్లారి లేచేసరికి నన్ను ప్రేమగా చూస్తూ నా దగ్గర కొత్త పెళ్ళికూతురు కూర్చుని వుంది. కొన్ని రోజులు అమ్మ అలాగే చక్కగా అలంకరించుకుని ఉండేది. నెమ్మదిగా చుట్టాలంతా వెళ్ళిపోయారు. తర్వాత బొమ్మలాంటి చక్కని అమ్మ అందరి అమ్మల్లాగానే మామూలు చీర కట్టుకుని ఇంటి పనుల్లో మునిగి పోయింది. నాకు అమ్మ ఇప్పుడు నచ్చసాగింది. తను నన్ను చాలా ముద్దు చేస్తుంది. కథలు చెప్తూ పాలు తాగించేది. పాఠాలు చెప్పేది, నాతో పాటు ఆడేది, పాడేది, నాన్న రోజూ నన్ను అడిగేవారు 'పాలు తాగావా? చదువు కుంటున్నావా?' అని, నేను ఊ కొట్టేదాన్ని, కాని నేనెపుడయినా పాలు తాగకపోతే మాత్రం అమ్మ తప్పకుండా నాన్నకి చెప్పేసేది 'మధు ఇవాళ పాలు తాగలేదు' అని. 'పాలు తాగకపోతే ఏ సేమ్యాయో, పరమాన్నమో చేసి పెట్టవచ్చు కదా నాన్న స్వరంలో కటుత్వం, చిన్నపిల్లనయినా నాకు బాగానే అర్ధమయ్యేది.

ఒకరోజు అమ్మ నన్ను చెంపమీద కొట్టింది. నేను ఏడుస్తుండగా నాన్న వచ్చారు. అమ్మ నా చెయ్యి పట్టుకొని 'గద్దిస్తూ చెప్పు, ఇంకెప్పుడు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళవు కదా!' అడుగుతోంది. నాన్న కోపంగా అమ్మ చేతి నుంచి నా చేతిని విడిపిస్తూ "వచ్చి నాలుగునెలలు కాలేదు ఇంకా, అప్పుడే పిల్ల మీద చెయ్యి చేసుకుంటావా? ఎంత ధైర్యం?" అన్నారు. "తల్లి కూతుర్ని మందలిస్తుంటే మధ్యలో తండ్రి కలగ చేసుకోకూడదండీ' అంటూ అమ్మ లోపలికి వెళ్లి నాకు పాలు, నాన్నకి కాఫీ పట్టుకు వచ్చింది. ఈ నాలుగంతస్థుల భవంతిలో నేను రోజూ ఆడుకోడానికి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం, 'చెప్పేసి వెళ్ళు, త్వరగా ఇంటికి వచ్చి చదువుకో' అని అమ్మ చెప్పడం పరిపాటయిపోయింది. కాని నేను వినేదాన్ని కాదు. పాపం ఆవిడకి నన్ను వెతకడానికి బోల్డు టైం పట్టేసేది. అందుకే కొట్టింది. అదీ నెమ్మదిగా లెంపకాయ కొట్టింది. దానికి నాన్న అంత సీరియస్ ఎందుకయ్యారో నాకు తెలియలేదు. కొన్ని రోజులు పోయాక నేను ఫెయిల్ అయ్యానని స్కూల్ నుంచి లెటర్ వచ్చింది. ఆరోజు కూడా నాన్న అమ్మని బాగా తిట్టారు. "నీ మీద నమ్మకంతో పిల్లని నీ చేతిలో పెడితే మా బాగా బుద్ధి చెప్పావులే! బొత్తిగా బాధ్యత లేదు నీకు. ఇంత చదువుకున్నావు ఏం లాభం దాన్ని చదివించలేక పోయావు" నాన్న కోపంతో ఊగిపోసాగారు.

నాకు వెంటనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు అమ్మ నాకు పాఠం చెప్తోంది. ఎంత చెప్తున్నా నేను దృష్టి పెట్టి వినకపోవడంతో అమ్మ నన్ను తిట్టింది. నాన్న పేపర్లోంచి తల ఎత్తి "అలాగేనా పాఠం చెప్పడం? ఇలా తిడితే ఇంక అదేం చదువుతుంది దాని మొహం? బుర్రలో ఉన్నది కాస్తా తుడిచి పెట్టుకుపోతుంది. నువ్వు చెప్పింది చాలు గాని నేను దానికి ట్యూషన్ పెట్టిస్తా, ఇంక చాలించు నీ పాఠాలు!" అని గట్టిగా అరిచేసరికి ఇద్దరం మ్రాన్పడిపోయాము. 'నేనేం చేసేది? చదువు చెప్పినా మీరు తిడుతున్నారు. చెప్పకపోయినా తిడుతున్నారు. నేను పాపని ప్రేమిస్తాను, తప్పుచేస్తే తిడతాను కూడా! పిల్లల్ని తిట్టని, కొట్టని తల్లి ఎక్కడ ఉంటుందండీ ఈ లోకంలో? మీరు అనవసరంగా మా ఇద్దరి మధ్య అగాధం సృష్టిస్తున్నారు." అమ్మ అనునయంగా చెప్తోంది.

నాన్నకి కోపం నషాళానికి అంటింది. "నాకేం నీతులు చెప్పక్కర్లేదు. ఈ ఏడాది మొత్తం ఏం చేసావు? అది చెప్పు ముందు".

"నేను రాకముందు కూడా స్కూలు రిపోర్టు ఇదే. మీ అమ్మాయి క్లాసులో మిగిలిన పిల్లల్ని కొడుతుందని, సరిగ్గా చదవదని, అల్లరి చేస్తుందని, దానిక్కారణం మీరే! నౌకర్ల పర్యవేక్షణలో పెరిగి తల్లి ప్రేమకు నోచుకోని పిల్ల ఇలాగే తయారవుతోంది. నేనేమైనా అంటే మీరు నా మీద కోప్పడతారు. దాన్ని దార్లో పెట్టడానికి కొంత టైం పడుతుంది." అమ్మ సున్నితంగా చెప్పింది.

అమ్మ, నాన్న రోజూ నాగురించి మాటా మాటా అనుకోవడం, దెబ్బలాడుకోవడం వినీ వినీ నా మీద నాకు కోపం వచ్చేది. నా మూలంగా అమ్మ తిట్లు పడుతోంది. విసిగిపోయి ఎప్పుడయినా నేను నాన్నతో "అమ్మని ఎందుకు తిడతావు నాన్నా? తను నన్ను ఎంతో ప్రేమగా చూస్తోంది తెల్సా" అంటే అమ్మ ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ "మీ మనసులో అనుమానాలన్నీ తుడిచి పారేయండి. ఇల్లు స్వర్గ తుల్యం అవుతుంది. మీరు తాడుని చూసి పాము అనుకుంటున్నారు. నా మనసులో మధు పట్ల ఏవిధమైన వ్యతిరేక భావం లేదు. నన్ను నమ్మండి" అనేది జాలిగా.

నాన్న అనుమానించే తత్త్వం ఎప్పటికీ మారలేదు. ప్రతిసారీ ఏదో ఒక వంకతో అమ్మని తిట్టడమే! కొన్ని రోజులకి మా ఇంట్లోకి చిన్న తమ్ముడు వచ్చాడు. తమ్ముడి రాకతో కొన్ని రోజుల పాటు ఇంట్లో టెన్షన్ దూరమైనా, మళ్ళా మామూలే అయిపోయింది. నేను తమ్ముడితో ఆడుకునేదాన్ని, వాడి బట్టలు మార్చడం, పౌడరు రాయడం నాకెంతో సరదాగా అన్పించేది. వాడి పనులు చేస్తుంటే! చాలా ఆనందం కలిగేది. ఒకరోజు నేను చదువుకుంటున్నాను. బుజ్జిగాడు ఆకలితో ఏడుస్తున్నాడు. అమ్మ వాణ్ణి నాకిచ్చి పాలు తేవడానికి లోపలికి వెళ్ళింది. ఇది చూడగానే నాన్న మండిపడ్డాడు. "రెండేళ్ళలో ఒక్క క్లాసు పాసవలేక పోయింది పిల్ల. నీకసలు బుద్ధి వుందా? చదువుకునే పిల్లకి నీ కొడుకుని ఆడించమని ఇస్తావా?"

"ఏంటండీ ,మీరు మాట్లాడేది? ఒక్క నిముషం పిల్లాణ్ణి ఎత్తుకున్నంత మాత్రాన దాని చదువు పాడయిపోతుందా? మీరు ప్రశాంతంగా ఉండరు. మమ్మల్ని ఉండనివ్వరు. ఇలాంటి వాతావరణంలో పిల్ల ఎలా చదువు మీద మనసు పెట్టగలదు? అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. దాన్ని మీరు ఏదైనా హాస్టల్ లో జాయిన్ చేయండి. ప్రశాంత వాతావరణంలో అది చక్కగా చదువుకోగల్గుతుంది."

నాన్న కళ్ళు నిప్పులు కురిసాయి. "అవున్లే నువ్వు ఇంతకంటే ఏం చేస్తావు? నా పిల్లని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నువ్వు దాన్ని హాస్టల్ పంపించక, ప్రేమతో గుండెలకి హత్తుకుంటావా? అంతా నా పిచ్చిగాని, సవతి తల్లికి ప్రేమ ఎందుకుంటుంది? ఇవాళ దాని తల్లి గనుక వుంటే దాన్ని హాస్టల్ కి పంపమనేదా?"

అమ్మ కళ్ళలోంచి ధారపాతంగా కన్నీరు! బుజ్జి తమ్ముడు అమ్మ ఒళ్ళో కేరింతలు కొడుతున్నాడు. నాన్న మాట్లాడుతూనే ఉన్నారు. "దీన్ని గెంటేస్తున్నట్లు నీకొడుకుని బైటకి విసిరి పారేయగలవా? సర్లే, దీన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి హాయిగా ఉండు నీ కొడుకుతో!"

ఊహించని ఈ ప్రభంజనానికి నిశ్చేష్టంగా ఉండిపోయి నాన్న నోటికి చెయ్యి అడ్డు పెట్టాను. అయినా నా చేయి విదిలించుకొని పక్కగదిలోకి వెళ్ళిపోయారు. నేను అమ్మని రెప్పవేయకుండా చూస్తున్నాను. ఒక్కసారిగా ఆమె ముఖంలో ఏదో చెప్పలేని భావం, తెగింపు...! పెదవులు బిగించి, పిల్లవాణ్ణి గట్టిగా గుండెలు అదుముకొని బైట బాల్కనీలోకి పరుగుతీసింది. క్షణంలో పిల్లవాణ్ణి పై నుంచి కిందకి విసిరేసింది. నేను గట్టిగా కేకలు పెట్టాను. నాన్న పరిగెత్తుకొని వచ్చారు. క్షణంలో పరిస్థితంతా అర్ధమైంది. అమ్మని గట్టిగా చెంప మీద కొట్టడంతో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది.

డోర్ బెల్ మోగింది. చనిపోయిన పిల్లాణ్ణి తీసుకొని కింద పోర్షన్ వాళ్ళు నిలబడి ఉన్నారు. పోలీసులు కూడా వచ్చారు. అమ్మని, నాన్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి! అప్పుడు అమ్మ ఏడుస్తూ, "నన్ను నమ్మండి ఇప్పటికైనా నేను సవతి తల్లినే కాని నా ప్రేమ సవతి ప్రేమ కాదు" అంటూ నాన్న చేతులు పట్టుకొని బతిమాలుతోంది. నేను అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ ఏడుస్తూ నిలబడ్డాను. కాని అమ్మ కళ్ళు ఎక్కడో శూన్యంలో చూస్తున్నాయి. అమ్మని మెంటల్ హాస్పటల్ లో జాయిన్ చేసారు. నేను అప్పట్నుంచి హాస్టల్ లో ఉంటున్నాను. నాన్న కూడా హైదరాబాద్ వదిలేసి కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు లో ఇల్లు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు. బహుశా పశ్చాత్తాపమేమో!

***

"ఇప్పుడు చెప్పండి. మా అమ్మ పరిస్థితి ఇలా అవ్వడానికి కారకులెవరు? రెండో పెళ్ళివాడికి ఇచ్చి చేతులు దులుపుకున్న ఆమె తల్లిదండ్రుల బీదరికమా? సవతి కూతుర్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన ఆమె అమాయకత్వమా? అనుక్షణం ఆ ప్రేమమూర్తిని అనుమానించి కన్న కొడుకుని కాలదన్నుకునేలా చేసిన మా నాన్న కసాయితనమా? ఏదయినా ఒక నిండు జీవితం పువ్వులా వికసించి నలుగురికీ సుగంధమనే ప్రేమ పంచవలసిన తరుణంలో తన బిడ్డని తానే చంపుకొని భర్తని నమ్మించడం కోసం, తన ప్రేమలో కల్తీ లేదని నిరూపించడం కోసం మెంటల్ హాస్పిటల్ పాలయిన ఆ త్యాగమూర్తికి నేనేం చేసి ఋణం తీర్చుకోగలను? నేనేం చేసి అమృతమూర్తిని మునుపటిలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా చేయగలను? నాకు అమ్మే సర్వస్వం. ఆవిడ నాకు పంచిన ప్రేమ మరువలేనిది. మరపురానిది. నా జీవితంలో ఆవిడ పడిన కష్టాలు, రెండో భార్యగా ఆవిడ ఎదుర్కొన్న ఇక్కట్లు, కడగల్లు పునరావృతం కాకూడదనే నా అభిలాష. విన్నారు కదా. మీరే చెప్పండి. ఏం చేయమంటారో?"

శ్రీనాథ్ దీర్ఘంగా విశ్వసించి "తల్లి లేని బిడ్డ ఎంత బాధపడుతుందో, నీకు అనుభవం. అలాగే సవతి తల్లి అయినా కన్న తల్లిలా నిన్ను ఎంత ప్రాణంగా చూసుకుందో, అదీ నీకు అనుభవమే! కాబట్టి నువ్వు పొందిన మాతృప్రేమని విధివంచితుడయిన నా బిడ్డకి పూర్తిగా అందించగలవని నేను గాడంగా విశ్వసిస్తున్నాను. ఇకపోతే నువ్వు భయపడుతున్నట్లు నేను మీ నాన్నలా ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించను. ఆయన కూడా తన చూసిన పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించి ఉంటారని నాకు అన్పిస్తోంది. ఎందుకంటే దాదాపు పాతికేళ్ళ క్రిందటి సహజ పరిస్థితి వేరు. సవతి తల్లి అంటే కష్టాలు పెడుతుందని, తండ్రీ, పిల్లల్ని వేరు చేస్తుందని, సాధిస్తుందని ప్రజల్లో ప్రబలమైన నమ్మకం. ఎక్కడ ఆమె నిన్ను సవతి పిల్లగా భావించి బాధలు పెట్టి, ఇంట్లో పనిమనిషిగా చూస్తుందేమో నని అతి జాగ్రత్తకి పోయి అనవసరంగా ఒక మంచి తల్లిని అపార్ధం చేసుకొని తన కూతురికి శాశ్వతంగా తల్లి ప్రేమను దూరం చేసారు. గతం గతః మళ్ళా ఆ చేదు గతం పునరావృతం కాదు కాకూడదు. నా వైపు నుంచి నీవు నిశ్చింతగా ఉండు. మీ అమ్మా, నాన్న మన దగ్గరే ఉంటారు. మన బాబు ప్రశాంత్ లో మీ అమ్మని తను పోగొట్టుకున్న బిడ్డని చూసుకోనిద్దాం. మీ నాన్నగారి శేష జీవితం ప్రశాంతంగా గడిచేలా చూడ్డం మన ఇద్దరి బాధ్యత" అంటూ శ్రీనాథ్ నాకు తన చేతిని ఆసరాగా అందిస్తూ లేచి నిలబడ్డాడు. అప్పుడే వీడిన మబ్బుల్లోంచి చందమామ తన వెన్నెల కిరణాలని వెదజల్లుతూ ప్రేమగా మా ఇద్దరిని తొంగి చూడసాగాడు.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు