అందమైన ముద్దు - వారణాసి భానుమూర్తి రావు

Andamaina muddu

అతడ్ని నేను మొదటి సారి చూస్తున్నాను. మా అన్నయ్యకు ఇంజనీరింగ్ లో క్లాస్ మేట్. మా అన్నయ్య హైదరాబాదు లో మల్టీ నేషనల్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. ఇతను ఐర్లాండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడో ?? ఎవరైనా చక్కని రూపంతో పాటు , డ్రెస్స్, పర్సనల్ హైజీన్ , బాడీ లాంగ్వేజ్ , మాటల్లో మృదుత్వం , ముహంలో గ్లో, కళ్ళల్లో మెరుపు వున్న పురుషుడు పురుషోత్తముడు గాక మరేంటి? అతను హీరో మహేష్ బాబు లాగా చక్కగా ఉన్నాడు. ఇక ఏ హీరో కైనా కొన్ని అవలక్షణాలు వుంటాయేమో గానీ మహేష్ బాబును భూతద్దం పెట్టి వెతికినా, ఏ ఆంగిల్ లో చూసినా నవ మన్మధుడు లా కన బడతాడు. అందుకే మహేష్ బాబు నా సూపర్ హీరో ! అతను వెకేషన్ మీద హైదరాబాదు కు వచ్చాడు. పార్క్ హయత్ హోటల్లో ఉన్న అతడ్ని బలవంతం చేసి పిలుచు కొచ్చాడు మా అన్నయ్య. అన్నయ్య బాత్ రూం లో ఉన్నాడు.

" మీ పేరు? " తొలిసారిగా పలకరించాడు అతను.

" అన్నయ్య చెప్ప లేదా? ''

"లేదు "

" శివాని" ఎంత చదువు కొన్నా ఆడ పిల్లకు సిగ్గు సహజమేనేమో ! అతడి కళ్ళు మెరిసి పోతున్నాయి. అలాంటి మెరుపు ఉన్న కళ్ళు మెన్ లో చాలా అరుదు.

"మీరు చాలా అందంగా ఉన్నారు " అన్నాడు అతను.

" థాంక్స్ " మీరు నా కంటే అందంగా ఉన్నారని చెప్ప లేక పోతున్నాను. ఏదో అడ్డు వస్తోంది.

"ఇంట్లో ఎవరూ లేరా? "

" అమ్మా నాన్నా విజయ వాడలో ఉంటారు. నేనూ అన్నయ్య ఈ ఫ్లాట్ లో వుంటాము " అన్నాను నేను. " అతడిని చూస్తూంటే ...." ఆ పాట చెవుల్లో గింగురు మని మ్రోగుతోంది.‌ ఇంకా చాలా పాటలు యూ టూబ్ ప్లే లిస్ట్ లా నా చెవుల్లో మారు మ్రోగుతున్నాయి.

" మీ పేరు ? " అడిగాను నేను .

" అన్నయ్య చెప్పలేదా? అన్నాడు అతను .

"లేదు "

"మహేష్ "

ఒక్క సారిగా నా మైండ్ బ్లాంక్ అయింది. నా సూపర్ హీరో పేరు.

" మీరు నిజంగా మహేష్ బాబులా ఉన్నారు "

" మీరు ఆతని ఫానా? '

"అవును "

"మీ క్వాలిఫికేషన్ ? "

" ఎం టెక్ కెమిస్ట్రీ "

" టఫ్ సబ్జెక్ట్ "

"అఫ్ కోర్స్ "

" మీరు..." అని చెబుతుండగా అడ్డు పడ్డాను నేను.

" ప్లీస్ ..మీరు అనకండి.‌ శివానీ అని పిలవండి చాలు " అన్నాను .

" అలాగే శివానీ..నువ్వు గూడా మహేష్ అని పిలువు "

" ఓకె " అన్నాను నేను.

" కాఫీ ...టీ ..కూల్ డ్రింక్స్ "

" అలాంటి అలవాట్లు లేవు ''

" పోనీ మిల్క్ ''

" నో ప్లీస్ . ఓన్లీ గ్లాస్ ఆఫ్ వాటర్ "

అక్వాగార్డ్ ఆర్ వో వాటర్ తెచ్చి ఇచ్చాను. అన్నయ్య బాత్ రూం నుండి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాడు.

" సారీ రా..మా చెల్లిని నీకు ఇంట్రడూస్ చెయ్యలేదు " అన్నయ్య అన్నాడు. మహేష్ నవ్వాడు.

" శివానీ , ఎం టెక్ కెమిస్ట్రీ " అన్నాడు మహేష్ తనకు తెలుసు అన్నట్లుగా.

మహేష్ గొంతులో నుండి నా పేరు విన్నంతనే పులకరించి పొయ్యాను. అతడ్ని చూసినా, మాట్లాడినా, అతని దగ్గరగా వెళ్ళినా ,అతని మాటలు విన్నా నాకు ఎందుకో గూస్ బంప్స్ వస్తున్నాయి.

' మా చెల్లికి సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఇష్టం లేదురా! అందుకే సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది. ఇక్కడే హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొంటోంది ."

" గుడ్ కారీర్ " అన్నాడు మహేష్ .

" ఇక్కడ చాలా మంచి బాబాయ్ హోటల్ వుంది. ఇడ్లీ ఫేమస్. నేను బ్రేక్ ఫాస్ట్ తెస్తాను. మీరు మాట్లాడు కొంటూ వుండండి. " అన్నాడు మా అన్నయ్య.

" ఎందుకూ స్విగ్గీ వుంది కదరా? " అన్నాడు మహేష్.

" నో..ఈ టేస్ట్ రాదురా! " మా అన్నయ్య ఆక్టీవా వేసుకొని బయటకు వెళ్ళిపొయ్యాడు.

టీ వీ ఆన్‌ చేశాను నేను . జెమినీ లో పాట వస్తోంది. " మనసున ఉన్నది. చెప్పాలనున్నది ...బయటకు రాలేదెలా? " నా మనసులో గూడా ఏవేవో చెప్పాలని అతని గురించి ఇంకా తెలుసు కోవాలని , అతడి అందం‌ గురించి పొగడాలని అనిపిస్తోంది. కానీ ఏదో భయం. సిగ్గు..

" ఐర్లండ్ ఎలా ఉంటుంది? "

"మోస్ట్ బ్యూటిఫుల్ ఐలండ్ కంట్రీ "

" మీరికా ఇండియా రారా? "

" ఇప్పట్లో రాను "

" మీ పెళ్ళి "

' ఇప్పట్లో అనుకోలేదు " అడిగిన దానికే సమాధానం ఇస్తున్నాడు. నా గురించి , నా అందం‌ గురించి పట్టించు కోవడం లేదు అతను.

"మీరు చాలా అందంగా ఉన్నారు " టాపిక్ మార్చాను.

" మీ కంటేనా? " అమ్మయ్య..దారి లోకి వచ్చాడు. ప్రతి ఆడపిల్ల తన అందాన్ని ఎవరో ఒకరు పొగడాలను కొంటుంది. అదీ నచ్చిన మగవాడయితే.. ఆ ఫీలింగ్ మరీ బాగుంటుంది.

" నేనెలా ఉన్నాను? " నవ్వుతూ అన్నాను.

" మీరు మీలా ఉన్నారు '' ఏదైనా సినిమా హీరోయిన్ లా వున్నావని చెబుతాడ నుకొన్నాను .

" చెప్పాలా? " నాకు మీరు చాలా నచ్చేశారు " అన్నాడు మహేష్

"ఎలా? "

" మీరు అచ్చం తెలుగు అమ్మాయిలా నాజూగ్గా నాణ్యంగా ఉన్నారు" నాకు భూమి మీద నుండి తేలిపోయినట్లుంది.

" అబ్బ తేలినట్లుందే ...." ఆ పాట నా చెవుల్లో గింగురు మంటోంది.

" మిమ్మల్ని ఒక్కటి అడగ వచ్చా? " ధైర్యం చేసి అడిగాను.

" ఓ కే శివానీ ! అడుగు "

మహేష్ ఇంకో గంటలో వెళ్ళి పోతాడు. తరువాత ఇంత అందమైన పిల్ల వాడు కళ్ళెదుట నుండి మాయమై పోతాడు. ఎందుకో కొందర్ని చూస్తే ఎన్నో జన్మల నుండీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ‌అతడు లేదా ఆమె మనకు తోడుగా ఉండి పోతే బాగుండు అనిపిస్తుంది. అది ప్రేమా? ఆరాధనా? అట్రాక్షనా? ఇంద్రియ భావోద్రేకమా? తెలీదు.

" మీరు ఏదో అడగాలనుకొన్నారు? " అని నా కళ్ళల్లోకి చూశాడు మహేష్.

" మిమ్మల్ని ఒక సారి కిస్ చెయ్య వచ్చా? " స్ట్రైట్ గా అడిగేశాను. అలా అడగవచ్చో లేదో నాకు తెలీదు. అలా అడగడంలో తప్పు లేదనిపించింది.‌ మనుషుల్ని ఆరాధించడంలో తప్పు లేదు. ఆ ఆరాధన ఎన్నో రకాలుగా బహిర్గతం చేస్తాము .‌ అలాంటి ఆరాధన తోనే తను ఒక కిస్ అడిగింది. అంత కంటే ఇక ఏమీ దురుద్దేశాలు లేవు. చిన్న పిల్లల్ని చూసినా ఠక్కున ముద్దు పెడతాము. అదొక్క ప్రేమ. పెంపుడు జంతువుల్ని హత్తు కొంటాము. అమ్మా నాన్నలతో , అక్కా చెల్లెళ్ళతో ఎంతో అనురాగం తో ముద్దుల వర్షం కురిపిస్తాము. అన్నయ్య , తమ్ముడు , అమ్మమ్మ , బామ్మ , తాత ఇలా అందరితో ఎన్నో రకాలుగా ప్రేమని బహిర్గతం చేస్తాము . నాకు ఈ మహేష్ మీదున్నది ఆరాధనో , ప్రేమో నాకు తెలీదు‌. ఏదో ఒక మధుర మైన భావన అతడ్ని చూస్తూనే కలిగింది‌ . బహుశా అతడి మొత్తం పెర్సనాలిటీ గావచ్చు. మానరిజం కావచ్చు. అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు. ఇంకా ఏదో తెలియని భావం కావచ్చు. అతను స్టన్ అయి పొయ్యాడు.

" తెలుగు అమ్మాయిలు మారి పొయ్యారు. ఫారిన్ లో ఇవన్నీ కామన్ " అన్నాడు మహేష్ నవ్వుతూ. కానీ అతను లోపల జంకు తున్నాడు. అంతలో అన్నయ్య ఫోన్ ... మహేష్ కి‌ చేశాడు.

" ఏదో ఒకటి తీసుకు రారా!" అన్నాడు మహేష్ .

" ................." అన్నయ్య మాట్లాడింది నాకు వినబడ లేదు.

" అలాగే! పెసరట్టు ఉప్మా , ఇడ్లి పట్టుకురా " అని ఫోన్ ఆఫ్ చేశాడు మహేష్. నాకు ఏది కావాలో అడగడానికి మళ్ళీ ధైర్యం చాలడం లేదు.‌‌

" మీరు ....ఏదో.... కిస్ ! నసిగాడు మహేష్. అంతలో అన్నయ్య వచ్చేశాడు. చేతుల్లో బ్రేక్ ఫాస్ట్ పాకెట్లు ఉన్నాయి. ముగ్గురూ డైనింగ్ టేబిల్ మీద కూర్చొని టిఫిన్ బాగా లాగించేశాము.‌

" ఈ టేస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ లో గూడా రాదు.‌ " అన్నాడు అన్నయ్య.

" అవును రా! చాలా టేస్టీ గా వున్నాయి ఐటెమ్స్ అన్నీ . థాంక్స్ ఫార్ డెలిసియస్ ఫూడ్ " అన్నాడు మహేష్ వాష్ బేసిన్ లో చేతులు కడుక్కొంటూ.‌ ప్రక్కనున్న నాప్ కిన్ తో చేతులు డ్రై చేసుకొన్నాడు. బ్రేక్ ఫాస్ట్ ముగించాక అన్నయ్య మళ్ళీ వాష్ రూం‌కి వెళ్ళాడు.‌ ఒక్క సారిగా మహేష్ నా దగ్గర కొచ్చి నా బుగ్గ మీద తన సున్నిత మైన అధరాలతో ఒక చిన్న పెక్ ఇచ్చాడు . అతడు దగ్గరగా వచ్చిన పుడు ఫారిన్ పెర్ ఫూమ్ నన్ను మత్తు లోనికి తీసుకు వెళ్ళింది. అతని ఫేస్ నా చెంపలకు అతి దగ్గరగా వచ్చినపుడు నా బాడీ అంతా విచిత్ర ప్రకంపనాలతో కదిలి పోయింది. మహేష్ చేస్తున్న బ్రీతింగ్ గాలులు నా ముహాన్ని కప్పేశాయి. నాకు ఆ క్షణంలో ఏమి జరుగు తున్నదో అర్థం కాలేదు. నేను ఏదో లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. అన్నయ్య వాష్ రూం నుండి బయటకు వచ్చాడు. మహేష్ షూ వేసుకొంటున్నాడు.

" థాంక్స్ రా ఫర్ యువర్ గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ " అని బై చెబుతున్నాడు మహేష్. నా గుండెని ఎవరో లాగినట్లు అనిపిస్తోంది. ఈ వ్యక్తి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి పోతే బాగుంటుంది అని అనుకొన్నాను.

"హాయ్ ..శివానీ! బై... టేక్ కేర్... విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ యువర్ సివిల్స్ . నెక్స్ట్ టైం‌, ఐ విల్ సీ యూ యాజ్ ఆన్ ఐ ఏ ఎస్ ఆఫీసర్ ." అని విష్ చేశాడు మహేష్ .

ట్రావెల్స్ వారు పంపిన ఫోర్డ్ కార్ లో వెళ్ళి పొయ్యాడు మహేష్. ఎందుకో నా కళ్ళల్లో కన్నీరు నిండి పోయింది.‌ అన్నయ్యకు తెలియ కుండా నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొన్నాను.

****************************

సివిల్స్ లో చాలా కష్ట పడినా ఎందుకో గట్టెక్క లేక పొయ్యాను.‌ నాకు ఆ జాబ్‌ అందని ద్రాక్ష లాగా అయింది. ఒక డోర్ క్లోస్ అయినా ఇంకొక్క డోర్ ఓపెన్ అవుతుంది అని అంటారు. బహుశా నాకు ఇంకొక మార్గం చూపెడతాడేమో దేవుడు. నేను ఎప్పుడో వెబ్ సైట్ చూసి ఒక పెద్ద ప్రవేటు మహిళా కాలేజీకి లెక్చరర్ గా అప్లయి చేశాను.‌ కెమిస్త్రీ ఫాకల్టీ దొరకడం‌ కష్టం . ఇంటర్వూ కి పిలిచారు.‌ నా పెర్ఫాఫెన్ చూసి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశారు. పాతిక వేలు జీతం . వుమెన్స్ కాలేజి.

మూడు నెలలు హాయిగా గడిచాయి కొత్త వుద్యోగంలో. అమ్మా నాన్నలు పెళ్ళి ప్రపోసల్స్ తెస్తున్నారు. వాట్సప్ లో అన్ని డిటైల్స్ అబ్బాయిల జాతకాలు పంపిస్తున్నారు. నా కెవరూ నచ్చడం లేదు. ఆది వారం ఒక రోజు ఒక ఇంగ్లీష్ నవల చదువుతున్నాను.‌ ఆ పేజీల్లోంచి ఒక ఫోటో వచ్చి క్రింద పడింది. ఫ్రేం సైజ్ వున్న ఫోటో అది. తీసి చూశాను. మహేష్ ఫోటో అది. ఈ ఫోటో ఈ నవల లో ఎవరు పెట్టారబ్బా అని ఆ రాత్రంతా ఆలోచిస్తూ మహేష్ ఫోటో వంకే చూస్తూ వుండి పొయ్యాను. మధుర మైన ఆ ఏకాంత క్షణాల్ని గుర్తుకు చేసుకొన్నది. తనువంతా గగుర్పాటు అయుంది.

అంత సుందరా కారుడు నన్ను పెళ్ళి చేసుకొంటాడా? తలపు లన్నీ మహేష్ మీదనే ! కొన్ని కలలు నిజమవుతాయి. కొన్ని కలలు కల్లలు గానే మిగిలి పోతాయి. మహేష్ ని మరచి పోదామన్నా కుదరడం లేదు. రాత్రి అయిందంటే చాలు. అతనితో ఏ కాష్మీర్ లోనో , గోవా లోనో తిరుగు తున్నట్లు , అతనితో కలిసి సముద్ర బీచ్ లలో ఆడుతున్నట్లు కలలు‌‌. అతనితో కలిసి విదేశాలలో హానీ మూన్ కి వెడుతున్నట్టు కలలు. కలలంతే! వస్తూనే వుంటాయి మధురాతి మధురంగా! మనకు ఎందుకో కొంతమంది కలల్లో తరచుగా వస్తూనే వుంటారు. మహేష్ చాలా సార్లు కలలో వచ్చాడు.

ఒక రోజు అమ్మా నాన్నలు విజయ వాడ నుండి వచ్చారు. అమ్మా నాన్నా ఇద్దరూ విజయ వాడలో ప్రభుత్వ కాలేజీ లో లెక్చరర్లు. వారికి చాలా మందితో పరిచయాలున్నాయి‌ . అందుకే నాన్న గారికి సంబంధాలు చాలా వస్తాయి.

" ఇంకా ఎన్ని రోజులు ఇలా వుంటావు? నీ పెళ్ళి చేస్తే మా బాధ్యత తీరి పోతుంది గదా? " అన్నారు నాన్న గారు.

" నా కిప్పుడు పెళ్ళి చేసుకోవాలని లేదు నాన్నా! " అన్నాను నేను.

" నీకప్పుడే పాతిక సంవత్సరాలు దాటాయి. ఆడ పిల్లలు ఈ వయసులోనే పెళ్ళి చేసు కోవాలి. నీ కోసం పది సంబంధాలు వెతికి తీసు కొచ్చాను. ఈ పదిలో నీకు ఎవరైనా నచ్చితే పెళ్ళి చేసేస్తాము."

" నాన్నా..నేను మళ్ళీ IAS కి సెకండ్ అటెంప్ట్ చేసి సాధించాలను కొన్నాను." అన్నాను. నాన్నకు చాలా కోపమొచ్చింది.

" ఆశయాలు వుండడంలో తప్పు లేదు. కానీ ఏది ముందో , ఏది తరువాతనో ప్రయారటైజ్ చేసు కోవాలి. అంది వచ్చిన అవకాశాల్ని వదలు కొన్నావో , మళ్ళీ అలాంటి అవకాశం‌ వస్తుందో రాదో తెలియదు. ఆడపిల్లలయినా ,మగ పిల్ల లయినా కరెక్ట్ ఏజ్ లో పెళ్ళి చేసు కోవాలి. ఆ తరువాత మంచి సంబంధాలు దొరకడం కష్టం. ఇప్పుడు నీకు పెళ్ళి చేసు కోవడం ఇంపార్టెంట్ ." అన్నారు నాన్న గారు.

నాన్న గారు తన దగ్గరున్న పెళ్ళి ప్రపోజల్స్ ఫోల్డర్ ని నా ముందు వుంచారు.‌ నేను ఒకటొక్కటే అబ్బాయి ఫోటో లను చూస్తున్నాను.‌ తొమ్మిది ఫోటోలో ఉన్న అబ్బాయిలు ఎవరూ నచ్చ లేదు. పదవ ఫోటో చూసిన తరువాత నమ్మ శక్యం కాలేదు. మహేష్ ఫోటో అది.‌

" నాన్నా ! ఈ అబ్బాయి పేరెంట్స్ నీకు తెలుసా? " అడిగాను నేను.

" నా కొలీగ్ రామా రావు కొడుకు.‌మంచి సంబ ధం అమ్మా ఇది.‌అబ్బాయి గూడా చాలా బాగుంటాడు. అతను ఎక్కడో ఏదో ఫారిన్ కంట్రీ లో పనిచేస్తున్నాడంట. అమెరికాలో అయితే గాదు.‌ అంతే గాదమ్మా! ఇతను మీ అన్నయ్య క్లాస్ మేట్ విజయ వాడలో ! " అన్నాడు నాన్న గారు.

పరుగు పరుగున నా బెడ్ రూంలోకి వెళ్ళి దిండు కింద పెట్టిన ఇంగ్లీష్ నవల లోపల దాచిన ఫోటో ను చూశాను. నా కళ్ళు సజల నేత్రాలయ్యాయి. మహేష్ ఫోటో ..ఇదేనేమో కో ఇన్సిడెన్స్ అంటారు. కొన్ని కొన్ని సార్లు జీవితంలో అనుకోకుండా కొన్ని విచిత్రంగా జరుగు తుంటాయి . అలాంటి సంఘటనే ఇది. మనసులో ఒక ముద్ర పడితే దా‌నిని ఇక చెడిపెయ్యలేము. మహేష్ గూడా తన మస్తిష్కంలో చెరగని ముద్ర వేశాడు. అతడ్ని మరీ అడిగి పెట్టించుకొన్న ముద్దు ఇంకా తనని ఏదో ఫాంటసీ లోకానికి తీసుకు వెడుతోంది . ఆతని స్పర్శలోని వెచ్చదనం ఇంకా తనని తన్మయత్వం లోకి తీసుకెడుతోంది. ఒక మనిషి పట్ల ఇంత ఆరాధన వుంటుందా? ప్రేమ , ఆకర్షణ ఒక మనిషిని ఇలా హిప్నటైజ్ చేస్తుందా? అందుకేనేమో ప్రేమికులు కొందరు చరిత్రలో అమరు జీవు లయ్యారు.

పరుగున హాల్లోకి వెళ్ళి " నాన్నా ! ఐ లైక్ దిస్ బాయ్.‌మీరు వెంటనే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి " అన్నాను.

అమ్మా నాన్నల సంతోషానికి అవధులు లేక పోయింది.

" నీ డీటైల్స్ , నీ ఫోటో వాళ్ళ పారెంట్స్ ఎప్పుడో ఆక్సెప్ట్ చేశారు. ఈ ప్రపోజల్ నీ ఆక్సెప్టన్స్ కోసమే అమ్మా! " అని అన్నాడు నాన్న.

*************************************

" ఆరు నెలల తరువాత నాన్న , అమ్మా , మావయ్య , అత్త గారు అందరూ వీడ్కోలు చెబుతున్నారు ముంబై ఏర్ పోర్ట్ లో . నేనూ , మహేష్ కొత్తగా పెళ్ళి కళతో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని జంటగా అందరికీ బై చెబుతున్నాము. మా హానీమూన్ ట్రిప్ కి స్విడ్జర్లాండ్ ప్లాన్ చేశాము. బిజినెస్ క్లాస్ లో నేను మహేష్ ఒడిలో కరిగి పొయాను.

"యూ ఆర్ లుకింగ్ మోస్ట్ బ్యూటి ఫుల్ " అన్నాడు మహేష్.

అంతలో ఏర్ హోస్టస్ మా వంకే చూస్తూ నవ్వుతూ వుంది. ఆమె చేతిలో ఒక ప్లాకార్డ్ వుంది. అది మా సీటు వెనకాల పెట్టి విష్ చేసింది. " జస్ట్ మారీడ్ .డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ " అని వ్రాసి ఉంది.‌

మహేష్ నా చెవిలో గుస గుస లాడాడు.‌ " నీకొక్క రహస్యం చెప్పనా? " అన్నాడు.

ఏమిటది అన్నట్లు చూశాను.

"నీ ఇంగ్లీషు నవలలో నా ఫోటొ ఎవరికీ తెలీకుండా పెట్టింది నేనే! నీకు ముద్దు పెట్టిన రోజే డిసైడ్ అయి పొయ్యాను నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని.‌ అందుకే థ్రూ ప్రాపర్ చానల్ లో నా ప్రొఫైల్ నీ దగ్గరకి వచ్చింది " అన్నాడు మహేష్ నవ్వుతూ.‌

మహేష్ ఈ సారి నా అధరాలను చుంబిస్తూ మళ్ళీ ముద్దు పెట్టాడు. ఈ ముద్దే మమ్మల్ని భార్యా భర్తలుగా కలిపిందేమో !!

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్