స్నేహమంటే ఇదే - కందర్ప మూర్తి

Snehamante Ide

రేవు పోలవరం బెస్త గ్రామం. ఆ పల్లెల్లో ఉండే వారందరూ సముద్రం మీద చేపల వేటకు బోట్లలో రెండు మూడు రోజులు ప్రయాణం చేసి చేపలతో గ్రామానికి తిరిగి వస్తారు. సముద్రం మీద వేట కెళ్లినప్పుడు వెంట వంట సామగ్రి మంచి నీళ్లు తీసుకు పోతారు. తీరానికి తెచ్చిన చేపల్ని కంట్రాక్టరు కొంటాడు. అదే వారి జీవనోపాధి. ఒక్కొక్కప్పుడు సముద్రం మీద చేపల వేటకెళ్లినప్పుడు అనుకోకుండా తుఫానులు, సముద్ర గాలులు తీవ్రమైనప్పుడు ఇతర సముద్ర తీరాలకు బోట్లు కొట్టుకుపోతే అతికష్టం మీద తిరిగి గ్రామానికి చేరుకుంటారు. దినదిన గండంలా వారి జీవితాలు సాగుతాయి.ఇలా తరాల నుంచి వారి జీవితాలు సాగుతున్నాయి. వారిలో అక్షరాస్యత తక్కువ. ఆ బెస్త గ్రామంలో ఆర్మీ జవాను వెంకటేసానిది ఒక కుటుంబం. అమ్మా నాన్న అన్న చెల్లి ఉంటారు. నాన్న , అన్న సముద్రం మీద చేపల వేట కెళ్లి సంపాదన చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చదువు మీద శ్రద్దతో వెంకటేశం దగ్గరలోని టౌనుకి సైకిలు మీద వెళ్లి హైస్కూలు చదువు పూర్తి చేసాడు. అమ్మా నాన్నా వద్దంటున్నా చెల్లిని తన వెంట తీసుకెళ్లి ఎనిమిదవ తరగతి పూర్తి చేయించాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి చెల్లికి ఉద్యోగస్తుడితో పెళ్లి చేసి ఈ బెస్త గ్రామ వాతావరణం నుంచి పైకి తీసుకు రావాలనుకున్నాడు. అనుకోకుండా టౌన్లో ఆర్మీ రిక్రూట్ మెంట్ జరగడం సిపాయిగా వెంకటేశం సెలక్ట్ జరగడం అయింది. ఆర్మీలో ఉద్యోగం దొరికినందుకు వెంకటేశం ఆనందానికి అంతులేకపోయింది. వెంకటేశానికి మొదటి పోస్టింగు దేశ సరిహద్దు ప్రాంతంలో వచ్చింది. ఇంటికి దూరంగా పోతున్నాడని అమ్మా నాయనా బాధ పడినా వారికి నచ్చచెప్పి తనకి గవర్నమెంటు ఉద్యోగం వచ్చిందని నెల నెలా డబ్బు పంపుతానని, డబ్బు కూడబెట్టి చెల్లికి ఎలాగైనా ఉద్యోగస్తుడితోనే పెళ్ళి జరిపిస్తానని మాట ఇచ్చాడు. ఆర్మీ కేంపులో వెంకటేశానికి సూర్యారావు అని తెలుగు మిత్రుడు జత కలిసాడు. మిగతా సహచరులందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. సూర్యారావు ఊరు వెంకటేశం జిల్లాకు పక్కనే ఉంది.అందువల్ల ఎవరు రెండు నెలల శలవులో ఇంటికి వెళ్లినా మరొకరు బట్టలు, స్వీట్లు, పళ్లూ వెంట పంపుకునేవారు. అలాగే శలవు పూర్తయి వాపసు ఆర్మీ యూనిట్ కి వచ్చేటప్పుడు ఇంటి వాళ్లు చేసి ఇచ్చే వంటకాలు తీసుకు వస్తుంటారు. సూర్యారావు కాపు కులస్తుడు.వారిది వ్యవసాయ కుటుంబం. వెంకటేశం బెస్త కులస్తుడు.. ఐనా వారి మద్య ఎటువంటి భేదభావం లేదు. అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు చెప్పుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. దేశ సరిహద్దు ప్రాంతంలో ఆర్మీ ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తు ఇంటికి డబ్బులు పంపుతున్నాడు వెంకటేశం. వయసు మీరిన తండ్రిని సముద్రం మీదకు చేపల వేటకు వెళ్లనీయడం లేదు. చెల్లి పెళ్లికి డబ్బు జమ చేస్తున్నాడు. తెలిసిన వారి ద్వారా పట్నంలో ఒక ఉద్యోగస్తుడి సంబంధం ఖాయం చేయ గలిగాడు. వారు కట్నం కానుకలు ఎక్కువ అడిగినా చెల్లి సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అన్నిటికీ ఒప్పుకున్నాడు వెంకటేశం. జమ చేసిన డబ్బు లోంచి కొంత కట్నం ఎడ్వాన్సుగా మగ పెళ్లి వారికి మద్యవర్తి ద్వారా ఇప్పించాడు. పెళ్ళి పట్నంలో కల్యాణ మండపంలో చెయ్యడానికి ఏర్పాట్లు జరిగాయి. వెంకటేశం చెల్లికి పెళ్లి నిశ్చయమైందని తెల్సి సూర్యారావు ఆనంద పడ్డాడు. ఎందువల్ల నంటే శలవులో వెంకటేశం పల్లె గ్రామానికి వస్తువులు కానుకలు తీసికెళ్లినప్పుడు వాడి అమ్మా నాయనలతో పాటు చెల్లి చంద్రికను కూడా చూసేవాడు. బెస్త గ్రామంలో ఉన్నా చక్కగా అలంకరించుకుని పద్దతిగా కనబడేది. చెల్లికి పెళ్లి నిశ్చయమైందని పై అధికారులకు అర్జీ పెట్టుకుని రెండు నెలల శలవు మంజూరు చేయించుకున్నాడు వెంకటేశం. జీతం డబ్బులు తీసుకుని చెల్లికి అమ్మ నాయన అన్నయ్య లకు బట్టలు ఖరీదైన వస్తువులు కొని పేక్ చేయించాడు.మిత్రుడు సూర్యారావును కూడా పెళ్లికి ఎలాగైనా రావాలని కోరగా ముందు నువ్వెళ్లి పెళ్ళి ఏర్పాట్లు చూసుకో, తర్వాత నేను పెళ్లి సమయానికి శలవు తీసుకు వస్తానని మాట ఇచ్చాడు. వెంకటేశం రెండు నెలల శలవులో రేవు పోలవరం గ్రామానికి చేరుకుని చెల్లి పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయాడు. మగ పెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతూ ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటున్నాడు. వెంకటేశం శలవులో వచ్చి నెల రోజులు గడిచిపోయాయి. పెళ్లి ముహుర్తం రోజు దగ్గర పడింది. ఇంతలో ఆప్త మిత్రుడు సూర్యారావు కూడా శలవు తీసుకుని మిత్రుడికి సాయం చేద్దామని బెస్త గ్రామం చేరుకున్నాడు. వెంకటేశం ఎంతో సంతోషించాడు.మిత్రులిద్దరూ కలిసి పెళ్లి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. అనుకున్నట్టు పట్నంలో ఫంక్షన్ హాల్ పెళ్లికి సుందరంగా అలంకరించారు. రెండు వైపుల నుంచి పెళ్లి పెద్దలు బంధువులతో మంటపం సందడిగా ఉంది. వెంకటేశం పెళ్లి వారిని ఎదుర్కొనే సందడిలో ఉంటే సూర్యారావు భోజనం ఏర్పాట్లు చూస్తున్నాడు. చలాకీగా తిరుగుతున్న సూర్యారావును చూసిన వారు ఎవరీ అబ్బాయి అని గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. పెళ్లి ముహుర్తం దగ్గర పడింది. పెళ్లి కొడుకు తరపున అనుకున్న దానికంటే చాలామంది వచ్చారు.వారిని చూసి వెంకటేశం ఆందోళన పడ్డాడు. ఐనా కార్యం శుభంగా జరిగిపోవాలని కోరుకున్నాడు.ఇంతలో మగ పెళ్లి వారి వైపు నుంచి గుసగుసలు ప్రారంభమయాయి. అబ్బాయికి బండి (టు వీలర్) కావాలని , అది తెస్తేనే పెళ్లి జరుగుతుందని లేదంటే పెళ్ళి జరగదని పట్టు పట్టారు. ముందు ఒప్పందంలో కట్న కానుకలు తప్ప బండి ప్రస్తావన లేదని ఎంత నచ్చ చెప్పినా మద్యవర్తి చెప్పినా వారు వినడం లేదు. చివరకు పెళ్లి మండపం అల్లర్లు కేకలతో రసాభాసగా మారింది. పెళ్లి తర్వాత బండి పెడతామన్నా వినడం లేదు. ఆఖరి ఘడియల్లో పెళ్లి కుమారుడు మంటపం నుంచి లేచి వెళిపోతుంటే వెంకటేశం పెళ్లి కొడుకు కాళ్లు పట్టుకుని బతిమాలినా ఫలితం లేకపోయింది. పెళ్లి కుమారుడు వెంట బంధువులు కల్యాణ మంటపం వదిలి వెళిపోయారు. ఈ హఠాత్ పరిణామానికీ వెంకటేశం హతాసుడయాడు. చెల్లి పెళ్లి ఉద్యోగస్తుడితో అట్టహాసంగా చెయ్యాలనుకుంటే ఎందుకిలా అయిందని వాపోతున్నాడు. ఇప్పుడు చెల్లి పెళ్లి ఆగిపోతే గ్రామంలో బంధువుల ఎదుట ఎలా తలెత్తుకు తిరగడం , పీటల మీద పెళ్లి ఆగిపోతే చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారని రోదిస్తున్నాడు. ఈ తతంగమంతా ప్రత్యక్షంగా చూస్తున్న సూర్యారావు వెంకటేశం భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ , ఒరే వెంకటేసా , నీకు అబ్యంతరం లేకపోతే ఇదే పెళ్లి మంటపం మీద నీ చెల్లి మెడలో నేను మంగళసూత్రం కడతానని ముందుకు వచ్చాడు. సూర్యారావు మాట విని వెంకటేశం విస్తుపోయాడు. ఆపద్భాంధవుడిలా మిత్రుడి మాటలు ఊరట నిచ్చాయి. వెంకటేశం కుటుంబ సబ్యులు బంధువులు కూడా అంగీకారం తెలపడంతో అదే పెళ్లి మంటపం మీద సూర్యారావు- చంద్రికలు వధూ వరులుగా వివాహం జరిగిపోయింది. ఇదే విధి విలాసమంటే. మిత్రుడి చెల్లి పెళ్లికి అతిధిగా వచ్చి వరుడిగా మారడం విచిత్రం కదూ. సూర్యారావు ఔన్నత్యానికి వెంటేశం కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. చెల్లిని సాదరంగా సూర్యారావు ఊరికి సాగనంపాడు వెంకటేశం. స్నేహితుడి చెల్లి పెళ్లికి వెళ్లిన కొడుకు కోడలితో తిరిగి రావడం పెద్దవాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. పెళ్లిలో జరిగిన రభస విషయం సూర్యారావు వివరంగా తెలియ చేయగా అమ్మ నాన్నలు పెద్ద మనసుతో వారి కులం కాకపోయినా చంద్రికను కోడలిగా అంగీకరించారు. పద్దతి ప్రకారం మిగతా కార్యక్రమాలు పూర్తి చేసారు. ఆర్మీ కేంపులో వెంకటేశం చెల్లి పెళ్ళిలో జరిగిన సంఘటన , తర్వాత శలవులో వెళ్లిన సూర్యారావు పెద్ద మనసుతో మిత్రుడి చెల్లిని వివాహం చేసుకున్న సంగతి తెల్సి అందరూ మెచ్చుకున్నారు. * * *

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్