కొత్త జీవితాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

kotta jeevithaalu

పార్క్ లో ఆకాశాన్నంటుతూ విస్తరించుకుని వున్న మఱ్ఱిచెట్టుక్రింద వున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు రఘునాధం, జహంగీర్, జోసఫ్, సుబ్బారావు.

వాళ్ళందరూ రిటైరయినవాళ్ళు. ఆ పార్కుకి వాకింగ్ కోసం ఎవరికి వారుగా వచ్చి, పరిచయాలు పెంచుకుని ఆత్మీయులైపోయారు. ఉదయం ఆరు గంటలకి అందరూ అక్కడ కలుసుకుని ఒక గంట వాకింగ్ చేసి ఆ తర్వాత ఆ బెంచి మీద ఓ అరగంట కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుని ఎవరిళ్ళకి వాళ్ళెళ్ళడం రివాజు.

"వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. సుబ్బారావు ఏంటి మౌనంగా వున్నాడు?" తనలో తను అనుకుంటున్నట్టుగా కాస్త చిన్నగా వినబడి వినబడనట్టుగా అన్నాడు జోసఫ్.

"ఆఁ.. ఇంట్లో ఏదో అనుంటారు.. మనకి మామూలేగా" అన్నాడు జహంగీర్.

"అంతే అంటావా?.. అదే అయితే మనకి చెప్పేవాడే.. ఇంకోటేదో వుంది" అన్నాడు జోసఫ్.

"అదేమీ లేదు. రోజూ మనతో పాటూ వచ్చే రామానుజం రావట్లేదు. ఆయనకి ఎలా వుందో అని ఆందోళనగా వుంది." అన్నాడు కాస్త భయంగా సుబ్బారావు.

"అదా.. మాకూ బెంగగానే వుంది. ఆయనకేమన్నా అర్జంటు పని పడిందేమో?" తేల్చేశాడు రఘునాధం.

"అదే అయితే మన సెల్ కి చేసి కబురు చెప్పేవాడుగా! నేను ఆయన సెల్ కి కాల్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది.. అందుకే ఆయనకేమన్నా అయిందేమోనని భయంగా వుంది"

"నిజమే! మాకు ఇప్పటిదాకా ఆ ఆలోచన రాలేదు.."

"మన మిత్రబృదంలోని వాడు. ఆయనకేమైందో మనం తెలుసుకోవాలిగా. పాపం మనతో ఎంత కలిసి మెలిసి వుండేవాడు? ఏ సీజన్ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా వచ్చేవాడు. మనం వాళ్ళింటికి వెళ్ళి చూసి రావాలి"

"అది సరే భాయ్.. కానీ మనకి అడ్రస్ తెలియదు కదా! ఎట్లా వెళతాం?"

"నిజమే.. ఆయన ఎవరికీ, అడిగినా కూడా అడ్రస్ ఇవ్వలేదు. అంటే బహుశా మనవల్ల ఆయనకేమన్నా ఇబ్బందేమో?"

"అయ్యుండవచ్చు.. కానీ ఎంతో కాలం నుండీ మనతో పాటూ కలిసిపోయిన వ్యక్తి ఇలా రెండు రోజుల్నుండి రాకుండా పోతే ఆయనకి ఏమైందోనని ఆందోళనవుండదూ.."

"అవును.. కానీ అడ్రస్ ఎలా?"

"ఆఁ.. గుర్తొచ్చింది. ఒకసారి పేపర్ వేసే ఒకతను పార్క్ బయట రామానుజంకి నమస్కరించాడు. వాడికి ఆయన అడ్రస్ తెలిసుంటుంది. మనం అర్జంటుగా వాడిని పట్టుకోవాలి"

"అవునండోయ్ గుర్తొచ్చింది.."

"కానీ బాగా టైమయిపోయింది.. ఇప్పుడేం చేయలేం.. రేపు పొద్దుటే వచ్చి.. పార్క్ బయట ఆ పేపర్ వాడిని పట్టుకోవాలి"

"సరే"

మరుసటిరోజు చాలా ముందుగా వచ్చి ఆ పేపర్ వాడి కోసం కాపుకాచారు.

అరగంటకి వాడు కనిపించాడు. వాళ్ళకి ప్రాణం లేచొచ్చింది. వెళ్ళి రామానుజంని వాడికి గుర్తుచేశారు. వాడు తలగోక్కుని.. ముక్కు నలుపుకుని మొత్తానికి గుర్తు తెచ్చుకుని రామానుజం అడ్రస్ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ ఆనందం అంతా ఇంతాకాదు.

అందరూ ఎవరిళ్ళకి వాళ్ళెళ్ళి స్నాన పానాదులు పూర్తి చేసుకుని తిరిగి పదిగంటలకి పార్క్ గేటుదగ్గర కలుసుకుని అక్కడికి కిలోమీటర్ దూరం వుండే రామానుజం ఇంటికి ఆటోలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

పదిగంటలు.

ఎండ పదునెక్కుతూ చుర్రుమంటోంది.

అందరూ కలసి ఆటో మాట్లాడుకుని రామానుజం ఇంటికెళ్ళారు.

పెద్ద ఇల్లే! ఇంటి చుట్టూ విశాలమైన స్థలం.. పూలమొక్కలు.. కొన్ని ఆకుకూరలు, చుట్టూ గోడ.. మధ్యలో గేటు, గేటుకు అటూ ఇటూ కాయలతో పహరా కాస్తున్న కొబ్బరిచెట్లు.

కుక్క వుందేమోనని భయపడుతూ.. గేటు కొద్దిగా తీసి "రామానుజంగారూ.. రామానుజంగారూ.." పిలిచాడు సుబ్బారావు.

అలా నాలుగు సార్లు పిలిచిన తర్వాత ఒకామె కోపంగా వచ్చి "ఎవరు కావాలి?" అంది.

"రా..మాను...జంగా..రు.." నీళ్ళు నములుతూ అన్నాడు రఘునాధం.

‘రండి’ అన్నట్టుగా గేటు తీసి.. ఫాలో అవమన్నట్టుగా లోపలికెళుతూ, ‘ఇంటికి ఎడం పక్క నున్న స్థలం గుండా ఇంటి వెనక్కెళితే, అక్కడ వుండే ఇంట్లో వుంటాడని’ చెప్పింది మాటల్లో కాస్త చిరాకుని మేళవిస్తూ..

వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ చిన్న రేకులగది జీర్ణావస్థలో వుంది.

నెమ్మదిగా రేకు తలుపు తెరిచారు. అది కిర్రు మంటూ తెరుచుకున్నాక చూస్తే లోపల కుక్కిమంచంలో రామానుజం పడుకుని వున్నాడు.

జోసఫ్ గబ గబ వెళ్ళి రామానుజంని లేపాడు.

రామానుజం లేచి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి.. తర్వాత సిగ్గుతో తలదించుకున్నాడు.

"రామానుజం భాయ్ నువ్వెందుకు సిగ్గుపడుతున్నావో.. మాకు అర్ధమైంది. నువ్వీ పరిస్థితుల్లో వున్నావనే కదా! మేమూ ఇంతకంటే గొప్పగా ఉండడం లేదు.. కాకపోతే కాస్త బెటర్." అన్నాడు జహంగీర్.

"అవునండీ.. మీరెందుకు పార్క్ కి వాకింగ్ కి రావడం లేదు? ఆరోగ్యం బాగానే వుంది కదా!" అని రామానుజం చెయ్యి పట్టుకుని వంటి వేడిని పరిశీలిస్తూ అన్నాడు సుబ్బారావు.

"బాగానే వుందండి.. కాకపోతే.. నన్ను మా అబ్బాయి ఓల్డ్ ఏజ్ హోం లో చేరుస్తాడట.. రేపే వెళ్ళిపోతున్నాను. అందుకే మీకు సిగ్గుతో ముఖం చూపించలేక.." అని ఆగిపోయాడు.

"అవునా?.. దారుణమండి. మన పిల్లలు మనల్నివధశాలకి తోలుతున్నట్టనిపిస్తుందండీ.. ఇలాంటివి వింటుంటే!" సుబ్బారావు బాధను వ్యక్తం చేశాడు.

"లాస్టియర్ నుండి మా అబ్బాయికూడా నన్ను వృద్ధాశ్రమంలో చేరుస్తానని ఒకటే గొడవ.. నేనూ వాడిమీద విరుచుకు పడుతూ ఆపుతున్నాను.." జోసఫ్ బాధగా అన్నాడు.

"నేను మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. భగవంతుడు దయచూశాడు. మీరేం అనుకోనంటే ఒక మాట.." అని ఆగాడు.

ఏమిటన్నట్టుగా చూశారందరూ.

"మా అబ్బాయి భోజనానికి వచ్చే టైమైవుండచ్చు.. మీరు త్వరగా బయల్దేరండి.. లేకపోతే వాడికి మా కోడలు మీరొచ్చిన సంగతి.. ఇంకా ఏవేవో కల్పించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంది. నాతో పాటూ మీకూ చీవాట్లు తప్పవు"అన్నాడు కళ్ళనీళ్ళతో.

"మేము వచ్చింది మిమ్మల్ని పరామర్శించి వెళ్ళడానికి కాదు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి.. ఒక్క జోసఫ్ కి తప్ప ఎవరికీ భార్య లేదు. మేమూ మా పిల్లల పంచన గొప్పగా ఏమీ బ్రతకడంలేదు. మనందరం కలసి ఏజ్డ్ బ్యాచిలర్స్ గా ఇల్లు అద్దెకి తీసుకుని ఎందుకుండకూడదు? మనందరికి పెన్షన్ వస్తుంది. ఇన్నాళ్ళూ బాధ్యత బరువులో ఆనందంగా వుండలేకపోయాము. కనీసం జీవిత చరమాంకంలోనన్నా మనకి కావలసినట్టుగా హాయిగా కాలం గడపవచ్చుకదా! చదువుకునేటప్పుడూ.. ఉద్యోగాలు వెతుక్కునేటప్పుడూ.. బ్యాచిలర్స్ గా వుండేవాళ్ళమేగా! ఇప్పుడూ అలాగే వుందాం! ఆరోగ్య సమస్యలువస్తే ఒకరికొకరం తోడుందాం. మరీ మన పరిస్థితి అద్వాన్నమయితే ఓల్డ్ ఫర్ ది ఏజ్డ్ ఎలాగూ వుంది. మనం ఇహ ఎవరిమీదా ఆధార పడనక్కర్లేదు. ఏవంటారు?" అడిగాడు సుబ్బారావు.

"ఎంత మంచి ఆలోచన చేశావు సుబ్బారావు సాబ్! నిజమే ‘ఎప్పుడైనా మనవాళ్ళు ప్రేమ పంచక పోతారా?’ అని మరిచి కాళ్ళ వెంట పడడంకన్నా ఈసడింపులు.. కసురుకోడాలు లేని మనదైన జీవితంగడుపుదాం" అన్నాడు జహంగీర్ సుబ్బారావుని గాఢాలింగనం చేసుకుని.

రామానుజం కూడా కొత్త శక్తితో లేచి సుబ్బారావుచేతిని గట్టిగా పట్టుకుని అభిమానంగా నొక్కాడు.

"మీకైతే ఎలాంటి షరతులూ పెట్టకుండా ఎవరైనా గది అద్దెకిస్తారు. కుర్రాళ్ళు కాదు కదా.. సీనియర్ సిటిజెన్స్ ఆయే.. కాని ఎప్పుడన్నా కాస్త హుషారు ఎక్కువయి.." అంటున్న జోసఫ్ ని మాట్లాడనీయకుండా నోరు మూసేశాడు జహంగీర్.

దాంతో అందరూ నవ్వేశారు.

అందరూ రామానుజం సామాను తీసుకుని.. ఆయన చేతులు పట్టుకుని బయటకి తీసుకెళుతుంటే.. అప్పుడే లోపలికి వస్తున్న ఆయన కొడుకు ఏమీ అర్ధంగాక అందరివంకా పిచ్చిగా చూస్తున్నాడు.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ