రత్నగిరిని రత్నాకరుడు పాలించే వాడు. అతనికి రత్నాలు అంటే ఎంతో మక్కువ. అందుకే నవరత్నఖచిత స్వర్ణమయ సింహాసనాన్ని అధిష్టించేవాడు.ఈ ప్రపంచంలో విలువైనవి రత్నాలు మాత్రమేనని భావించేవాడు. ఆ కారణంగా తన అంత:పురం గోడలు, ప్రాకారాన్ని సైతం నవరత్నాలతో ధగధగ మెరిసేలా రూపొందించాడు. నవరత్న ఖచిత సింహాసనాన్ని అధిష్టిస్తే తన సామ్రాజ్య ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తే సంపన్నదేశంగా కీర్తి లభిస్తుందని విశ్వసించేవాడు.
సంపన్నదేశం మాటేమిటోగాని, ప్రజలు తిండి లేక ఆకలి దప్పులతో అలమటించసాగారు. దీనికి తోడు నవరత్న ఖచిత సింహాసనానికి దొంగల బెడద ఎక్కువైంది. ఏ నిమిషానికి ఎవరు వచ్చి దోచుకెళతారో అన్న భయం రత్నాకరుడిని వేధించింది.
కొద్ది రోజుల తర్వాత తన రత్నఖచిత సింహాసనాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఇక ప్రాకారాలు, గోడలపై పొదిగిన రత్నాలను సైతం దొంగలు లాక్కెళ్ల సాగారు. వాటిని రక్షించలేక రత్నాకరుడు ఆందోళన చెందాడు. ఎంతఖర్చు వెచ్చించి రక్షక భటులను నియమించినా దొంగలు వారి కళ్లుకప్పి రత్నాలను ఒక్కొక్కటిగా లాక్కెళ్లసాగారు. ఇక వాటిని రక్షించడం తన వల్ల కాదని నిరాశ, నిస్పృహలతో వదిలేశాడు.
అదే సమయంలో ఆ ఊరికి విద్యారణ్య మహర్షి వచ్చాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సులభంగా పరిష్కరిస్తారని ప్రజలు అనుకుంటుండగా రాజు విన్నాడు.
ఓ రోజు రాజ భవనానికి సమీపంలో చెట్టు వద్ద కూర్చున్న విద్యారణ్య మహర్షిని కలిశాడు రత్నాకరుడు. ఆయన తపో నిష్టలో ఉన్నాడు. కాసేపటికి కళ్లు తెరచి చూశాడు.
‘‘ ఏమిటి నాయనా.. నీ సమస్య?’’ ప్రశ్నించాడు విద్యారణ్య మహర్షి.
‘‘ స్వామీ.. ఎంతో విలువైన రత్నమయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినా నిలువలేదు. దొంగలు దోచుకుపోతున్నారు.. మార్గం ఏమిటి..?’’ ప్రశ్నించాడు రత్నాకరుడు.
‘‘ నాయనా వివేక దృష్టితో పరిశీలిస్తే రత్నాలు రాళ్ల ముక్కలు తప్ప మరేమీ కాదు.. ఏది ప్రజలకు ఆరోగ్యం, విజ్ఞానం ఇస్తుందో అదే నిజమైన రత్నం.. అదే విలువైన వస్తువు.. నవరత్నాల వల్ల ఆరోగ్యాభివృద్ధి గాని, జ్ఞానాభివృద్ధి గాని రావు..’’ అన్నాడు విద్యారణ్య మహర్షి.
‘‘ శుద్ధమైన ఆహారం స్వీకరించడం వల్ల మనిషికి ఆరోగ్యం వస్తుంది. మంచి నీరు తాగడం వల్ల మానవునికి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.. మంచి విద్యనభ్యసిస్తే అజ్ఞానం తొలగిపోయి వివేకం వస్తుంది.. అప్పుడు మనిషి తనకు తానే అభివృద్ధి చెందుతాడు..ఇవి మాత్రమే ప్రపంచంలో నిజమైన రత్నాలు’’ అన్నాడు విద్యారణ్యమహర్షి.
‘‘ అదేమిటి స్వామీ.. ప్రపంచమంతా నవ రత్నాలు ఎంతో విలువైనవని భావిస్తుంటే విజ్ఞానమే విలువైందని అంటారేమిటి స్వామీ..?’ ప్రశ్నించాడు రత్నాకరుడు.
‘‘ నాయనా నువ్వెంత విలువైందని భావించిన రత్నాలు సంపాదించినా అవి నీ వద్ద నిలిచాయా? ఎవరో దోచుకెళ్లారు కదా..? ఈ ప్రపంచంలో సంపద, ధనం, వస్తువులు, బంగారం, ఏదీ నిలువదు.. అన్నీ దోచుకుపోయే వస్తువులే.. ఒక్క జ్ఞానం మాత్రమే దోచుకోలేని వస్తువు.. అది ఎంత నేర్చుకున్నా తరిగిపోని వస్తువు..సంపదను పెంచి ధనవంతుడిని చేస్తుంది..’’ అన్నాడు విద్యారణ్య మహర్షి.
రత్నాకరుడికి విద్యారణ్యుడి మాటలు బోధపడ్డాయి. ఆ తర్వాత రాజ్య మంతా తిరిగి తను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడు. రాజ్యంలో ఎంతో మంది ఆహారం లేక అల్లాడుతుండటం కళ్లారా చూశాడు. చాలా మంది పేదలు, వారి పిల్లలు ధరించడానికి సరైన బట్టలు లేక తిరుగుతున్న వారిని మనసు చలించింది. ఎందరో చదువు లేక పనులు లేక తిరుగుతూ అష్టకష్టాలు పడటం గమనించాడు. తను చేసిన తప్పిదం గ్రహించాడు.
ప్రజలకు అవసరమైన కూడు, గుడ్డ, నీడ, విద్య కల్పనపై దృష్టి సారించాడు. అనతి కాలంలోనే ప్రజలు విద్యావంతులై తమ తెలివితో పక్క రాజ్యాలకు వెళ్లి ఉపాధి పొందారు. ఇప్పుడు రత్నగిరి రాజ్యానికి ఆర్థిక ఇబ్బందులు రాలేదు. ప్రజలందరూ ఎవరి కాళ్లపై వారు నిలబడి ఆనందంతో గడపసాగారు. ఇదే ప్రజలకు తానిచ్చే నిజమైన రత్నం అని సంతోషించాడు రత్నాకరుడు.