"రంగీ! ఓ రంగీ! ఒకసారి ఇలా రావే!" ఆఫీసు నుండి ఇంటికి వచ్చి, సామాన్లు సర్దుకుంటూ రాజారాం పిలిచాడు.
"అలానే అయ్యగారు, వత్తునానండీ!" చీర కుచ్చులు, పయట సరిచేసుకుంటూ వచ్చింది రంగమ్మ అలియాస్ రంగి.
"ఏం చేస్తున్నావు? చిన్నపని వుంది చేయవే?"
"అలాగేనండీ! అయ్యగారూ! మీరేమో చిన్న పనులంటారు. అమ్మగారు వచ్చేవేళాయింది. ఆమె వచ్చేటప్పటికి అన్ని పనులు పూర్తి అవ్వలంటారు లేకపోతే కోప్పడతారు" అని పైకి అంటూనే
"ఊ! అంటే అమ్మగారికి కోపం, ఊహూం! అంటే అయ్యగారికి కోపం. వీరిద్దరి మధ్య పనిమనిషిగా నలిగిపోతున్నాను" లోలోన నసుక్కుంటూ, పైకి బాగానే మాట్లడుతూ, టీవిలో వస్తున్న వార్తలు చూసి “అయ్యగారూ! టీవీలో ఇలా చెబుతున్నారేమిటండీ?” అని అమాయకంగా అడిగింది.
“ఏమైందీ రంగి?” అన్నాడు రాజారాం.
“వార్తలు చూస్తుంటే . . . . అ .. య్య .. గా. . రూ . . .”
“చూస్తుంటే ఏమయింది?”
“యాభై మందిని పెళ్ళీ చేసుకోమంటున్నారు? ఒక్కొక్కళ్ళు యాభై మందిని చేసుకుంటే ఎలా కుదురుతుందండీ? అసలే ఒక్క మొగుడుతోనే వేగలేక పోతున్నాము మరీ యాభై మందిని చేసుకోమంటే ఎలాగండీ అయ్యగారూ?
“ఒసేయ్! రంగీ యాభై మందిని పెళ్ళి చేసుకోమనలేదు?”
“మరి టీవీలో అలాగే చెబుతున్నారు కదండీ!” అంది అమాయకంగా
“అది కాదు రంగీ! ఎక్కువ మంది ఒకచోట చేరితే కరోనా వ్యాప్తి చెందుతుంది. అందుకని ప్రభుత్వం యాభైమంది మించకుండా పెళ్ళిలు చేసుకోమంటుంది. అంతేగాని యాభై మందిని పెళ్ళి చేసుకోమనలేదు.”
“అర్థమయ్యింది అయ్యగారూ! కరోనా వ్యాప్తి చెందకుండా వుండాలంటే ఎక్కువ మంది ఒక చోట చేరకుండా వుండాలి కాబట్టి తక్కువ మందితో పెళ్ళిలు చేసుకోవాలన్న మాట” అని అనుమానం నివృత్తి కావడంతో సంతృప్తి వ్యక్తం చేసింది.
అదే సమయంలోనే రాజారాం భార్య అనసూయ ఆఫీసు నుండి ఇంటికి చేరుకుంది. గేటు పక్కనే రంగి వేసుకొచ్చే హైహీల్స్ చెప్పులు చూడగానే ఇది ఆల్రెడీ వచ్చేసిందన్న మాట. నేను ఎన్నిసార్లు చెప్పిన నా కంటే ముందే ఇంటికి చేరుకుంటుంది అసలే ఇది వయస్సులో వుంది. పిల్లల తల్లైన చూడడానికి నాకంటే బాగానే కనిపిస్తుంది. ఎప్పుడూ మేకప్ వుండడంతో పాటు లౌక్యం అంటూ విచిత్ర విపరీతార్థాలు తీయడంతో పాటు మితిమీరిన లోకజ్ఞానంతో మనల్ని కన్ చేసేస్తుంది. కొన్ని రోజులు క్రితం ఏమైందో గుర్తుచేసుకుంది అనసూయ. . . . . . .
“డాబా మీదకు వెళ్ళి బట్టలు తీసుకురావే రంగీ” అన్నానో లేదో
“పేదరికంతో మీ దగ్గర పనిచేస్తున్నాను గానీ మీరు చెప్పినవన్నీ నేను చేయలేనండీ!” అని కోపంగా అంది రంగి.
“నేనేమి అన్నానే రంగీ”
“డాబా మీదకు వెళ్ళి నన్ను బట్టలు తీసుకుని రమ్మంటారా?”
“ఔను”
“నాకు, మాన మర్యాదలు లేవంటారా?” అంటూ దెబ్బలాడింది.
“ఏమిటో కాస్త వివరంగా చెప్పవే, నీ బాధ ఏమిటో?”
“డాబా మీద నుండీ బట్టలు లేకుండా ఇప్పుకొని రమ్మంటారా!” అంటూ వుక్రోశంగా చూసింది రంగి.
“ఒసేయ్! రంగీ! అది కాదే డాబా మీదకు వెళ్ళి వుతికి, ఆరేసిన బట్టలు తీసుకురమ్మన్నాను.”
“అయ్యో! అమ్మగారండీ! నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను” అంటూ భోరున విలపించిన విషయం అనసూయ గుర్తుచేసుకుంది.
రాజారాం ఉదయం నా కంటే ముందే డ్యూటీకి వెళ్ళి, నాకంటే ముందు ఇంటికి వస్తాడు. ఆ సమయానికి మిగతా ఇళ్ళు పనిచూసుకుని రంగి వస్తుంది. వీళ్ళిద్దరి వ్యవహారం చూస్తే ఎప్పుడో నా కొంప ముంచేటట్టు వున్నారు. ఎవరైనా పెద్దవయస్సున్న వాళ్లను పనికి రమ్మంటుంటే ఖాళీలేదని కొందరు, ఓపిక లేదని కొందరు చెబుతున్నారు. ఏదో రకంగా దీన్ని తప్పిదామంటే పనులన్నీ నేను చేసుకోలేను. ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో దీనికేమీ తెలియదు. ఏం చేస్తున్నారో నెమ్మదిగా వెళ్ళి చూద్దాం అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరకు అనుమానంతో పాటు అసూయ కలిగిన అనసూయ చేరుకుంది.
అనసూయకు ఇంతలో మొన్నీ మధ్య యుట్యూబ్ చూసిన వీడియో గుర్తుకొచ్చింది. భార్య డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపు భార్యలేని సమయంలో పనిమనిషితో సరదాలు, సరసాలు ఎక్కువ అవడంతో, వారికి అడ్డుగావున్న కట్టుకున్న భార్యనే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రికరించిన విషయం జ్ఞప్తికొచ్చింది.
ఆమె అనుమానం కొద్ది, హాల్లోంచి మాటలు వినిపించి, వినిపించనట్లు వినిపిస్తున్నాయి. అనుమానం, అపార్థంతో నిండిన అనసూయ తప్పు చేస్తే వెంటనే బాధపడడం సారీ చెప్పడం ఆమెకు అలవాటుగా మారిపోయాయి. అందుకే అనసూయను భర్త సరదాగా “సారీల అనసూయ, అసూయ ఎందుకే” అంటూ వెటకారమాడుతుంటాడు. అనుమానం నిండుగున్న అనసూయ కిటికిలోంచి చూద్దామంటే కర్టన్ అడ్డుగా వుండడం వల్ల సరిగా కనిపించక పోవడంతో, చెవి తలుపుకు అన్చి వింటుంది.
“అయ్యగారూ! నెమ్మదిగా!” కొంచెం బాధగా అంది రంగి.
“అలాగే రంగి, కంగారు పడకు” ఓదార్పుగా అన్నాడు రాజారాం.
“ఊ” అంది రంగి.
“అలాగే” అంటూ రాజారాం, రంగీ సీరియస్ గా పనిచేసుకుంటున్నారు.
“అయ్యగారూ, కాస్తా నెమ్మదిగా” అంది రంగీ వెంటనే కొంచెం ముందుకు వంగి, ఆమె చెప్పినట్లే చేస్తున్నాడు.
బయట నుంచి వాళ్ళ మాటలు వింటున్న అనసూయకు ఎక్కడో కాలిపోతుంది. వీళ్ళిద్దరి యవ్వారాం ఇంత వరకు వచ్చింది.
“ఏదేమైనా, ఈ రోజు రంగి పని అవుట్. రాజారాం విషయం అమ్మనాన్నలతో చెప్పి విడాకులిచ్చేయాలి. లేకపోతే నేను బయటకు వెళ్ళి వచ్చేలోపు వీళ్ళిద్దరు ఎంత గ్రంథం నడుపుతున్నారు” అంటూ తలుపును బలంగా నెట్టుకుంటూ వెళ్ళింది అనసూయ. ఒక్కసారిగా అనసూయ అలా రాగానే
“ఏమైందీ అనసూయా! తలుపు తట్టకుండా ఒక్కసారిగా గెంటావు?” న్న రాజారాం వారి పనికి ఆటంకం కలిగించడంతో విసుక్కున్నాడు.
“ఏమీ లేద” ని ముభావంగా అంది.
ఎందుకంటే తను వూహించుకుంది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి. వాళ్ళ మాటలు వింటుంటే ఎంతో అనుమానం కలిగి అపార్థం చేసుకున్నాను. వాళ్ళు చేస్తున్న పని ఒకటి. నాకు వాళ్ళ మాటలు వలన అర్థమైంది ఒకటి. అందుకే కదా మన పెద్దలు చెప్పారు “చెవులతో విన్నదంతా నిజం కాదు. కంటితో చూసి నిజానిజాలు తెలుసుకోవాలి. వింటుంటే ఏదేదో అనుకున్నాను, గాని కంటితో చూస్తేనే తెలిసింది నిజం అందుకే ఏమి మాట్లాడానికైనా, ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కంటితో చూడకుండా నిర్ణయానికి రాకూడదు లేదంటే వాళ్ళిద్దరూ ఎంత బాధ పడేవారు." అని తనలో తాను బాధ పడింది. ఇంతకూ రాజారాం, రంగీ ఇద్దరూ కలిసి మడత మంచానికి గుడ్డ పెడుతూ, దానికి ఇనపవూచ ఎక్కిస్తున్నారు.
అయితే నేను వేరేవిధంగా అర్థం చేసుకుని, అపార్థం చేసుకున్నానని తనలో తనే బాధ పడుతూ, మనస్సులోనే వాళ్ళిద్దరికి “సారి” చెప్పుకుంటూ, “మా ఆయన బంగారం” అంటూ మనస్సులోనే మురిసిపోయింది అనసూయ.
కలం పేరు : బామాశ్రీ ;
పూర్తిపేరు: బాలాజీ మామిడిశెట్టి