మేకలాపురమనే గ్రామంలో బాలమురుగనాథం, వజ్రనాథమని ఇద్దరు స్నేహితులు పక్కపక్క ఇళ్ళల్లో ఉంటున్నారు. ఇద్దరూ పౌరోహిత్యం చేసుకుని కడుపు నింపుకుంటున్నారు. ఒకరినొకరు బాలా అనీ వజ్రం అనీ పిలుచుకుంటారు. ఆ చుట్టుప్రక్కల మూడు నాలుగు గ్రామాలకి వీళ్ళిద్దరే పురోహితులు కావటాన తిండికి ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది జీవితం.
బాలా కంటే ఏడాది చిన్నవాడు వజ్రం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ జంటగా వెళ్ళడం ఏ పని చేసినా, ఆఖరికి చెంబులు పట్టుకుని చెరువు గట్టుకి ‘ఆ పనికి’ వెళ్ళినా కలిసి వెళ్ళడం...ఏళ్ళ తరబడీ చూసీ చూసీ గ్రామస్తులు, ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలని చేర్చి, ముద్దుగా...బావ లూ అని పిలవటం విని ‘ఆహా భలే! ఊరివాళ్ళు మనకి బంధం కూడా కలిపేరు” అనుకుని మురిసిపోయారు.
’ఈ బంధం’ మీరనుకునే ఈ కాలపు ‘ఆ బంధం’ అనుకుని పొరపడేరు సుమండీ!
నా అన్నవాళ్ళు లేకపోవడం, పెద్ద అందగాళ్ళు కాకపోవడం, ఆస్తిపాస్తులంటూ ఏమీ లేకపోవడం...ఇలా కారణాలేమైతేనేమి ముప్పయ్యారు దాటినా ఇంకా బ్రహ్మచరులుగానే ఉండిపోయారు బా...వ...లు!
చిన్నతనంనుంచీ ఇరువురినీ ఎరిగున్న పెద్దలు ‘అయ్యో పాపం’ అని జాలిపడినా ఊళ్ళో కుర్రకారు మాత్రం...
”మన బావలకోసం అక్కలెక్కడ పుట్టారోరా?”
“పాపం ఇంకా పుట్టలేదేమోరా?”
“బావా బావా పన్నీరూ అక్కలనెప్పుడు తెస్తారూ?”
“భలె భలె భలె భలే పెదబావా భళిరే భళిరే అహా చినబావా...” ఇలా పాటలు పాడుతూ పరాచికాలాడి ఏడ్పించటం, బావలు ముఖం గంటు పెట్టుకోవడం పరిపాటి అయిపోయింది.
ఇలా ఉండగా మేకలాపురం పక్కగ్రామం కుక్కుటాపురంలో, ఒక ధనవంతుల ఇంట్లో నాలుగు రోజులు పూజలు చేయించే పని తగిలింది బావలకి.
అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడనుంచి అక్కడికి వెళ్ళాలంటే మధ్యనున్న చిట్టడవి దాటాలి అందుకు ఎంత లేదన్నా సుమారు నాలుగు గంటలపైనే పడుతుంది.
మర్నాడు బయలుదేరి వెళ్ళాలనగా ఒంట్లో నలతగా అనిపించి “ఒరే వజ్రం నువ్వు ముందు వెళ్ళి కార్యక్రమాలు మొదలుపెట్టరా నేను ఇవాళ విశ్రాంతి తీసుకుని పొద్దున్నే బయలుదేరొస్తాను” అన్నాడు బాలా.
“అమ్మో నేనొక్కడినా అందులోనూ ఆ చిట్టడవిలోంచా వద్దు బాబూ” భయంగా అన్నాడు వజ్రం.
“ఓరి పిరికి సన్నాసీ అలా అంటే ఎలాగరా? నిక్షేపంలాంటి బేరం చేజారిపోతుంది! పైగా ఈ మధ్య ఆ ఊర్లో ఎవడో మనకి పోటీగా తయారై బేరాలన్నీ లాక్కుందామని ప్రయత్నిస్తున్నాడట”
“ఏడిసాడు. నేనలా జరగనిస్తానా! సర్లే వెళతాను కానీ నువ్వు మాత్రం తప్పక రావాలి” వాగ్దానం తీసుకున్నాడు.
“జాగ్రత్తగా వెళ్ళు. సమయానికి తిను. మంచినీళ్ళు పెట్టుకున్నావా దగ్గర? ఫోను పెట్టుకున్నావా? అదిక్కడా అక్కడా పెట్టేయకు. మధ్య మధ్యలో చేస్తుండు” కనపడేంతవరకూ వజ్రానికి జాగ్రత్తలు చెప్పీ చెప్పీ సొమ్మసిల్లి పడుకుండిపోయాడు బాలా.
స్నేహితుడికి తనపై ఉన్న ప్రేమకి లోలోన ఆనందిస్తూనే ‘ఇప్పటివరకూ ఒక్కడినే ఏ పూజలకీ వెళ్ళలేదు అందునా ఈ అడవిలోంచి! క్రూరజంతువులు దగ్గరకొస్తే తరమడానికి కర్ర దగ్గరున్నా ఏదో భయంగా ఉంది. దేవుడా దేవుడా నువ్వే రక్ష’ ఆంజనేయ దండకం చదువుకుంటూ నడక సాగించాడు వజ్రం.
కొంత దూరం వెళ్లాక దాహం వేసి నీళ్ళు త్రాగుదామని చూస్తే సీసా ఖాళీ...‘అయ్యో నీళ్ళు అయిపోయాయే! అయినా అదే పనిగా త్రాగుతుంటే మరి అయిపోవూ…ఇప్పుడెలా?’ చుట్టుప్రక్కల చూసాడు.
కొంచం దూరంలో నీళ్ళతో కళకళలాడుతూ పెద్ద చెరువు కనిపించేసరికి ప్రాణం లేచొచ్చి గబగబా అటుగా అడుగులు వేసాడు.
చేతి సంచీ గట్టు మీద పెట్టి చెరువులో దిగబోతుండగా “ఓరీ ఆగక్కడ” అని హూంకరింపు వినిపించింది.
అంతే ఒక్క గెంతులో గట్టుపైకొచ్చి భయంతో వణుకుతూ “ఎ..ఎవ్..ఎవర్...ఎవరక్కడ?” కీచుగా అరిచాడు.
ఎంతసేపటికీ సమాధానం రాకపోయేటప్పటికి ‘ఆ....దాహంతో నోరు పిడచగట్టుకుపోయి బుర్ర పనిచేయక నేనే భ్రమ పడ్డానేమో?’ మళ్ళీ చెరువులోకి దిగడానికి ఉపక్రమించాడు.
“ఓరీ! చెప్తుంటే నీక్కాదూ నువ్వు చెరువులోకి దిగరాదు” ఈసారి మరింత బిగ్గరగా హూంకరిస్తూ మగ ముఖం కొండచిలువ శరీరం ఉన్న ఒక ఆకారం చెరువులోంచి ప్రత్యక్షమైంది.
“అమ్మో బాబో కాపాడండీ రక్షించండీ” బిగ్గరగా కేకలు పెట్టాడు.
“హుష్! నోర్మూసేయ్. అరుపులు వింటే నాకెక్కడో మండుతుంది” కసిరింది ఆకారం.
“ఎక్కడో చెప్పవా...చెప్పవా?” భయం సంగతి మర్చిపోయి ఆసక్తిగా అడిగాడు వజ్రం.
“నోర్ముయ్ అది నీకు అనవసరం. నువ్వెవరు ఇక్కడికెందుకు వచ్చావు చెప్పు లేకపోతే నిన్ను తినేస్తాను?”
“అసలు ముందు నువ్వెవరో ఈ చెరువులో ఎందుకున్నావో చెప్పు” ఎదురు దబాయించాడు.
“నన్ను యక్షుడు అంటారు. ఈ చెరువు నా నివాసం”
“ఓహో అలాగా! సర్లే నాకు దాహం వేస్తోంది కాసిని నీళ్ళు తాగి ఇదిగో ఇందులో పట్టుకుని నా దారిన నేను పోతా” సీసా చూపిస్తూ అన్నాడు.
“నీళ్ళు త్రాగుతావేం? అయితే ముందు అటు చూడు”
యక్షుడు చెప్పిన వైపు చూడగా దూరంగా చెట్టు క్రింద కుళాయి ఉన్న ఒక కుండ కనిపించింది. దానిపై ఏదో వ్రాసుంది...కళ్ళు చికిలించుకుని చదివాడు ‘చేతులు శుభ్రం చేసుకునే ఔషధం’ అనుంది.
“అదేమిటీ?”
“ముందక్కడ చేతులు కడుక్కుని ఆ తరువాత ఇక్కడికి రా” గదిమాడు యక్షుడు.
“ఎందుకూ అదేదో ఇక్కడే కడుక్కుంటానూ” వంగాడు.
“వీల్లేదు. దాంతోనే కడుక్కోవాలి”
“చోద్యం కాకపోతే ఎవరైనా మందు నీళ్ళతో చెయ్యి కడుక్కుని మంచి నీళ్ళు త్రాగుతారా?”
“అంటే నేను చేస్తే చోద్యం మీరు చేస్తే సముచితమూనా? ఇప్పుడు మీ మనుషులంతా అదే చేస్తున్నారటగా అదేదో సానీ....ఆ...సానిజరంట దానితో చేతులు కడుక్కుంటేగానీ ఏదీ తినట్లేదూ తాగటంలేదట కదా?”
‘సానిజరా! అదేంటబ్బా’ బుర్రగోక్కుని కాసేపటికి అర్థమై ఫెళఫెళా నవ్వుతూ “ఓహ్హొ...హ్హో...చంపావు పో! సాని వెలయాలు కాదు...శానిటైజర్...ఈ మధ్య కొరోనా అనీ ఒకటి పట్టుకుందిలే మానవలోకాన్ని. దాని బారిన పడకుండా ఉండటానికి అలా చేస్తున్నాము”
“అదే మరి! అదేదో మీనుంచి అంటకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. ఆట్టే వాగక చేతులు కడుక్కో ఫో”
ఈసురోమంటూ వెళ్ళి చేయికడుక్కొచ్చి చెరువులో దిగబోతుండగా “ఆగు” మళ్ళీ యక్షుడి వారింపుకి తలెత్తి చూసాడు...
!+!+!
సొమ్మసిల్లి పడుకుండిపోయిన బాలా, గాలికి కిటికీ కొట్టుకున్న శబ్దానికి, ఉలిక్కిపడి లేచి సమయం చూసాడు...సాయంత్రం ఆరయ్యింది. చటుక్కున లేచి కూర్చుని ఫోన్ చూసాడు...ఎవరూ చేయలేదు.
“వెళ్ళే ముందు లక్షసార్లు చెప్పాను ఫోన్ చేస్తుండరా అని ఈ మధ్య బొత్తిగా లక్ష్య పెట్టడం మానేసాడు. ఏ చెట్టు క్రిందో పడి నిద్రోతున్నాడేమో!” నుదురు బాదుకుని ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు.
అయితే రాత్రి పదైనా వజ్రం నుంచి ఫోన్ రాకపోవడంతో “ఎంత నెమ్మదిగా నడిచినా ఈ పాటికి చేరి ఉండాలే” అనుకుని పౌరోహిత్యం చేయాల్సిన ఇంటికి ఫోన్ చేసాడు.
“హలో ఎవరూ?” అవతలినుంచి బొంగురు గొంతు .
“జగన్నాథంగారిని పిలుస్తారా?”
“ఇక్కడ ఆ పేరున్న వాళ్ళెవరూ లేరయ్యా” అవతలి వ్యక్తి మాటలు వినగానే బాలాకి చటుక్కున గుర్తొచ్చింది...జగన్నాథం 10 నిమిషాలకోసారి 20 సెకన్లు అన్నీ మర్చిపోతుంటాడనీ అందుకని అందరూ అతనని గజనీ అని పిలుస్తారనీ ఆమాటున అతని అసలు పేరు మరుగునపడిపోయినదనీ ఎవరో చెప్పడం...
“అబ్బా అదేనయ్యా గజనీగారనీ ఉన్నారే...పిలవండి కొంచం”
“పిలవడమేంటి నీ పిండాకూడు..నేనే ఆ గజనీని ఇంతకీ నువ్వెవరో చెప్పి తగలడు” అరిచినంత పనిజేసాడు.
“రామ రామ.....ఇన్ని అపభ్రంశపు మాటలు మాట్లాడే వీడు పురోహితుడెలా అయ్యాడో ఖర్మ” తిట్టుకుని “నేనయ్యా బావని” అన్నాడు.
“బావా ఎవరికీ?” సందేహం సదరు గజనీ గొంతులో.
“ఛ..ఛ...ఏంటిదీ నేను కూడా! వాడ్ని అనడమెందుకూ మమ్మల్నీ అందరూ బావలు బావలూ అని పిలవడంతో మా అసలు పేర్లు మర్చేపోయాను సుమా” అనుకుని “ఆ..ఆ..అదేనయ్యా నేను బాలనాథాన్ని”
నువ్వెవరంటే నువ్వెరని తెలుసుకునే ప్రయత్నంలో పది నిమిషాలు గడిచిపోయాయి...
“ఎవరూ ఫోన్ చేసిందీ?” గజనీగారికి బుర్ర శూన్యమైందని అర్థమై ఇరవై సెకన్లాగి “మావాడు వజ్రం చేరుకున్నాడా” గబగబా ఉపోధ్ఘాతంతో సహా గుక్కతిప్పుకోకుండా అయిదే అయిదు నిమిషాల్లో అడిగేసాడు.
“ఎక్కడా ఇంకా దిగబడందే? ఇక్కడ పూజకి అంతా సిద్ధంగా ఉంది. ఇంకాసేపు చూసి అదేదో నేనే మొదలెట్టి ఛస్తాను. ఇక పెట్టేయ్” ఫోన్ కట్ చేసాడు గజనీ ఉర్ఫ్ జగన్నాథం.
వజ్రం ఏమయ్యాడోననుకుంటూ “బేరం పోతే పోయింది ఒక్కణ్ణీ పంపించకుండా ఉండాల్సిందేమో. గమ్మున తెల్లారితే బాగుండు” మిత్రుణ్ణి కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కోడి కూసీ కూయగానే అడవి బాట పట్టాడు బాల.
!+!+!
చెరువులోకి దిగి నీళ్ళు త్రాగబోతున్న తనని యక్షుడు మళ్ళీ ఆపేటప్పటికి చిర్రెత్తి “నువ్వు చెప్పినట్లే చేసాగా ఇంకేంటీ?” విసుక్కున్నాడు వజ్ర.
“ఊరికే చిరాకుపడక! నిన్ను ఐదు ప్రశ్నలడుగుతాను వాటికి సరైన సమాధానాలు చెప్తేనే నీళ్ళు త్రాగడానికి అనుమతిస్తాను లేకుంటే నిన్ను తినేస్తాను”
“మధ్యలో ఈ తిరకాసేంటీ? ఈ ప్రశ్నలేంటీ చెప్పలేకపోతే తినేయడమేంటీ?” భయంతో అరిచాడు.
“అదంతే...ఇది నా చెరువు నా ఇష్టం”
“చెరువులూ చెట్లూ అన్నీ అందరికీ చెందుతాయి” దబాయించాడు.
“అబ్బో అంత తెలుస్తే నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నీళ్ళు త్రాగి పో”
చటుక్కున జ్ఞప్తికి వచ్చింది శాస్త్రాలలో చదివిన యక్ష ప్రశ్నల గురించి...’ఓహో! అదన్నమాట సంగతి. అప్పుడు ధర్మరాజుని అడిగినట్లే ఇప్పుడు నన్ను అడుగుతాడన్న మాట! హూ! అడగనీ వీడికి తెలీదు నేను అన్ని శాస్త్రాలూ అవపోసన పట్టాననీ’
“ఏమిటి ఆలోచనలోపడ్దావు తప్పించుకుందామనా?”
“నాకంత అవసరం లేదు. ఏవో ప్రశ్నలన్నావుగా అడుగు” ముక్కు ఎగబీల్చి బింకం ప్రదర్శించాడు.
“నా మొదటి ప్రశ్న : గాలికన్నా వేగంగా ప్రయాణించేది ఏది?”
‘ఆ...తెలుసు తెలుసు ఇది అలనాటి యక్ష ప్రశ్నల్లో మొదటిది. ఓస్ ఇంత తేలిక ప్రశ్నా’ అనుకుని “మనసు” ఠక్కున చెప్పాడు.
“తప్పు” ఠపీమని కొట్టిపారేసాడు యక్షుడు.
‘అదెలా? నాకు గుర్తున్నంతవరకూ ఇదేనే జవాబు?’ వజ్ర ప్రతిఘటించబోయేలోగానే రెండవ ప్రశ్న సంధించాడు “మానవుడికి సహాయపడేది ఏది?”
“ధైర్యం” ఇది కచ్చితంగా సరైన జవాబే ధీమాగా ఉన్నాడు వజ్ర.
“మళ్ళీ తప్పు”
“జ్ఞానం అంటే ఏమిటి?”
“మంచి చెడ్డల్ని గుర్తించగలగడం”
“ఒరే నువ్వొట్టి శుంఠవని నాకర్థమవుతోంది” ఆ మాటలకి వజ్రానికి కోపం వచ్చినా తమాయించుకుని “అంతా మోసం. సరైన జవాబులే చెప్తున్నా నన్ను తినొచ్చనీ తప్పులంటున్నావు” గోల పెట్టాడు.
“మీ మనుషులలాగా కాదు నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. నువ్వు అన్నీ తప్పు సమాధానాలే చెప్తున్నావు. ఇక నోరుమూసుకుని నాల్గవ ప్రశ్న విను: మూర్ఖుడెవడు?”
“ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు”
“నీకు చావు మూడింది” వజ్రాకి కళ్ళమ్మట నీళ్ళొక్కటే తక్కువ. కాళ్ళు వణకటం మొదలెట్టాయి. అసలే దాహం తోడు భయంతో ఇప్పుడు నాలుక మరింత పిడుచ కట్టింది.
“మానవాళికి కావల్సిందేమిటీ?”
“శాంతి”
“నువ్వు ఉత్తి శుంఠవి కాదు పరమ శుంఠవి. చివరిసారిగా ఆ దైవాన్ని ప్రార్థించుకో”
“వద్దు వద్దు నన్ను చంపకు” ఏడుపు మొదలెట్టాడు.
“సర్లే! చాలా రాత్రైంది నాకూ ఆకలి చచ్చి నిద్రొస్తోంది. నన్ను తాకకుండా అలా గట్టు మీద దూరంగా కూర్చో. ముక్కుకి ముసుగు పెట్టుకో ఇప్పుడైనా , అసలే కొరోనా రోజులు కూడానూ” అదమాయించి వజ్రం చుట్టూరా తన శరీరాన్ని కాపలాగా చుట్టి నిద్రలోకి జారుకున్నాడు యక్షుడు.
తనకి రోజులు చెల్లాయని అర్థమై “ఒరేయ్ బాలా నిన్ను చూడకుండానే పోతున్నానురా” భయంతో దైవ స్మరణ చేస్తూ అలా రాత్రంతా కూర్చున్నాడు వజ్రం...
!+!+!
అడవిమార్గాన వడివడిగా నడుచుకుంటూ వస్తున్న బాలనాథం, చెరువు గట్టున పెద్ద పాము చుట్టా మధ్యలో కునికిపాట్లు పడుతున్న స్నేహితుడూ కనిపించగానే సంతోషం పట్టలేక “ఒరేయ్ వజ్రం” బిగ్గరగా పిలిచాడు.
“ఒరే బాలా వచ్చావా! చూడరా నా స్థితి. నన్ను కాపాడరా”
“భయపడకు నేనొచ్చేసాగా. అసలేమైందిరా?”
ఈ గోలకి యక్షుడికి నిద్రాభంగమై “ఎవడురా అదీ?” హూంకరించాడు.
“ముందు నువ్వెవరో చెప్పు ఎందుకు నా మిత్రుడిని ఇలా బంధించావు?” గద్దించాడు బాల.
“ఓహో చిన్న శుంఠకి పెద్ద శుంఠ తోడన్న మాట. నాకు ఆకలేస్తోంది. ముందు వీడ్ని తిని ఆ తరువాత నీ సంగతి చూస్తాను” వజ్రాన్ని మింగడానికి నోరు తెరిచాడు.
“అరే ఎలా కనిపెట్టావు వాడు నాకంటే వయసులో పెద్దని?” వజ్రం సందేహం వెలిబుచ్చాడు అంత తికమకలోనూ!
“మరదే సంధి ప్రేలాపన అంటే. ఏరా మృత్యువుతో చెలగాటమాడుతున్నావా?" వికటాట్టహాసం చేసాడు యక్షుడు.
“వజ్రం నోర్ముయ్యరా” కసిరి “అయ్యా! అసలు నా మిత్రుడు చేసిన తప్పేంటో చెప్పు దయచేసి”
“చూడబోతే సంస్కారిలా ఉన్నావు. అయితే విను”
అంతా సవివరంగా చెప్పి ... “అలా వీడిక్కడ బందీ అయ్యాడు” అని ముగించాడు.
“ఊ...అయితే నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను కానీ ముందు దాహంతో అలమటిస్తున్న నా మిత్రుడికి కాసిని మంచి నీళ్ళు తాగించనీ.”
“సరే అలాగే కానీ, అయితే ముందు అదిగో అక్కడికి వెళ్ళి చేతులు కడుక్కుని రా”
“ఆ అవసరం లేదు” భుజాన తగుల్చుకున్న చేతి సంచీలోంచి శానిటైజర్ తీసి చేతులు శుభ్రం చేసుకున్నాడు. ముక్కుకి మాస్కు తగుల్చుకుని మిత్రుడి దాహం తీర్చాడు.
“అబ్బో అబ్బో! అన్నీ పద్ధతిగా చేస్తున్నావే” మెచ్చుకుని “ఒరేయ్ వజ్రం చూసి నేర్చుకోరా” ఉచిత సలహా పడేసాడు యక్షుడు.
“అయ్యా ఇప్పుడు అడుగు నీ ప్రశ్నలు” ఎదురుగా నిలబడ్డాడు బాలా.
“మొదటి ప్రశ్న : గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏది?” వచ్చినప్పట్నుంచీ యక్షుడి తీరుతెన్నులు గమనిస్తున్న బాలాకి అర్థమైంది ఎలాంటి జవాబులు చెప్పాలో...
“ఓమిక్రాన్” తడుముకోకుండా చెప్పాడు.
వీడేదో తెలివిగా కనిపిస్తున్నా తన ప్రశ్నలకి జవాబులు చెప్పడం కల్ల ఎంచక్కా ఇద్దరినీ కడుపారా ఆరగించొచ్చు అనుకుని లోలోన మురిసిపోతున్న యక్షుడికి, బాలా సమాధానం ఆశ్చర్యం కలిగించింది!
“ఇదెక్కడినుంచి వచ్చిందిప్పుడు పులి మీద పుట్రలాగా....కొరోనా ఏమైంది?” విసుక్కున్నాడు యక్షుడు.
“ఏమీ కాలేదు అదీ ఉంది ఇదీ వచ్చింది”
“ఏడిసినట్లే ఉంది ఈ గోల. సర్లేగానీ రెండవప్రశ్న విను : కష్ట కాలంలో మానవుడికి అక్కరకు వచ్చేది ఏమిటి?”
“శానిటైజరూ మాస్కూ”
“శభాష్! మూడవ ప్రశ్న : జ్ఞానం అంటే ఏమిటి?”
“బతికుంటే బలుసాకు తినొచ్చని తెలిసి ఉండటం”
“వారెవ్వా అదుర్స్! నాల్గవ ప్రశ్న : మూర్ఖుడెవరు?”
“మహమ్మారి ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి నాకేం కాదులే అని మోర విరుచుకు తిరిగేవాడు”
“అధ్భుతః! ఐదవదీ ఆఖరిదీ ప్రశ్న: మానవాళికి అత్యవసరంగా ఏం కావాలి?”
“వ్యాక్సిన్”
“ఆహా ఓహో! ఏం తెలివీ ఏం తెలివీ! అన్నీ నికార్సైన జవాబులే. నీ సమయస్ఫూర్తికి మెచ్చి మూడు వరాలు ప్రసాదిస్తున్నాను కోరుకో”
“నా స్నేహితుడికి ప్రాణ భిక్ష పెట్టు”
“తథాస్తు”
“ఈ చెరువును అందరికీ దాహం తీర్చేలా అమృత తుల్యం చేసి ఇక్కడనుండి వెళ్ళిపో”
“తథాస్తు”
“మానవాళిని ఈ మహమ్మారుల బారినుంచి కాపాడు”
“ఆ..ఆ....ఆహ..ఆహ....అది మాత్రం నా చేతిలో లేదు”
“ఎందుకని? మీకు మహత్తర శక్తులుంటాయని విన్నానే”
“ఉంటాయి కానీ యమధర్మ రాజునుంచి మాకు ఖచ్ఛితమైన ఆజ్ఞలు...అటువంటిది చేయవద్దని”
“అదేమిటీ ఎందుకనీ?” నివ్వెరపోయాడు.
“ఈ మహమ్మారి జన్మకి కారణం, తమంత గొప్పవారు లేరనుకుని విర్రవీగి ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన మానవులు అంటే మీరేనట! అది క్షమించరాని తప్పిదమనీ అందుకు మానవాళి శిక్ష అనుభవించాల్సిందేననీ చెప్పాడు”
“అన్యాయం. ఏ ఒక్కరి తప్పువల్లనో అమాయకులు ఎంతమందో ప్రాణాలు కోల్పోతున్నారు కదా?”
“అది నిర్ణయించుకోవలసింది కూడా మీరే. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటారో లేక ప్రపంచాన్ని గెలవాలన్న దురాశలో సవ్య మార్గం వీడి ఎదుటివాడిని తొక్కేసే కుటిల ఆలోచనలతో వినాశనాన్ని కొని తెచ్చుకుంటారో... మీ చేతుల్లోనే ఉన్నాయి మీ సుఖశాంతులు” బాలా ఆలోచనలోపడ్డాడు.
“యక్షా నేను చెప్పిన జవాబులు పురాణంలో ధర్మరాజు చెప్పినవే కదా మరి తప్పన్నావేం?” అడిగాడు వజ్రం.
“కాలమాన పరిస్థితుల ప్రకారం జవాబులు మారుతుంటాయి. ప్రస్తుత కాలానికి బాలా సమాధానాలే అతుకుతాయి”
“అన్యాయం..అన్యాయం”
“అన్యాయమేముంది? మీ పూర్వీకులు చెప్పినవన్నీ మీరు పాటిస్తున్నారా? లేదుగా! ఇంక తర్కం అనవసరం” ఖరాకండిగా చెప్పాడు.
“అయితే నువ్వు నేటి యక్షుడివా?”
“పోనీ అలాగే అనుకో! ఇదిగో బాలా నువ్వు కోరినట్లు జనావళిని ఈ కొరోనా లేదా ఇందాకా అదేదో ఓ....మీకురాను అంటూ ఏదో అన్నావే క్రొత్తది వచ్చిందని, వాటినుండి కాపాడలేకపోయినా, నీ తెలివికీ భూతదయకీ మెచ్చి మరొక వరం ఇవ్వదలిచాను కోరుకో!
“ఈ మహమ్మారి బారినపడి ఆపదలో చిక్కుకున్న బీదాబిక్కీకి సహాయపడడానికి నిన్ను తలుచుకున్న తత్ క్షణమే అవసర సామగ్రి అమరేలాగా వరమియ్యి”
“తథాస్తు” అని కళ్ళు మూసుకుని ఏదో మంత్ర పఠనం చేసి, చేయి ఒకసారి చెరువు పైన గుండ్రంగా తిప్పి “ఇదిగో నీకిచ్చిన మాట ప్రకారం చెరువును అమృతతుల్యం చేసాను. శుభం” దీవించి మాయమయ్యాడు యక్షుడు.
“జయహో యక్షుడా జయహో...జయహో ” దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు బావలు!
*****