ఓడలు బళ్లైతే? - జీడిగుంట నరసింహ మూర్తి

Vodalu ballaite

" సర్ మన కంపినీలోని రసాయనాల దుష్ఫలితాల వల్లనో ఏమో గత కొన్ని రోజులుగా నేను ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. డాక్టర్ల సలహాపై ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. తమరు దయతో అంగీకరించి నన్ను సాధ్యమైనంత త్వరలో రిలీవ్ చేస్తారని ఆశిస్తున్నాను " అన్నాడు మధు వైస్ ప్రెసిడెంట్ రామన్ తో ఫోనులో. . ఆయన కార్పొరేట్ ఆఫీస్ డిల్లీలో ఉంటాడు. .

వైస్ ప్రెసిడెంట్ రామన్ మధు ఆకస్మిక నిర్ణయానికి అదిరిపడ్డాడు. ఆయనకు కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. . మధును తనే స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు. కంపినీలో వారసత్వ ధోరణులు పెరిగిపోయి ఊహించని రీతిలో ప్రతి ఒక్కరిలో అలసత్వం ప్రబలిపోయి తాత, తండ్రి , కొడుకు అంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ కంపినీలో ఉద్యోగాలను కొనసాగించుకుంటూ కంపినీ సమకూర్చిన ఇళ్ళల్లోనే కాలు మీద కాలు వేసుకుని హాయిగా జీవితాన్ని లాగేస్తున్న దరిమిలా , ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు నాణ్యత మీద కూడా ప్రభావం చూపుతోందన్న విషయం బోధపడి టాప్ మేనేజ్మెంట్ కొన్ని ముఖ్యమైన పోస్టులకు బయటవారినుండి దరఖాస్తులు కోరింది. ఆ విధంగా ఎక్కువ అనుభవంతో వచ్చిన వాడే మధు.

" అదేమిటి మధూ. ఈ కంపినీలో చాలా మంది ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. వాళ్ళల్లో ఏ ఒక్కరికీ మనం తయారుచేసే రసాయనాల వల్ల ఇబ్బంది కలిగినట్టు రికార్డు లేదు. అవసరమైతే కొన్నాళ్లు మంచి ట్రీట్మెంట్ కోసం మీరు సెలవు పెడితే పెట్టండి. అంతే కానీ ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నాను " అన్నాడు వైస్ ప్రెసిడెంట్ మధును కన్విన్స్ చేస్తూ.

"నిజమే కావచ్చు సర్. కానీ నేను ఎక్కువగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తో ఉండటం వల్ల నాకు ఊపిరితిత్తులపై ప్రభావం చూపినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాను " అన్నాడు మధు ప్రాధేయపూర్వకంగా.

నిజానికి మధు ఉద్యోగం రిజైన్ చెయ్యాలనుకోవడానికి అనారోగ్యం ఒక వంకే కానీ దానికన్నా బలమైన కారణం ఇంకొకటుంది. . వారం రోజుల క్రితం జరిగిన సంఘటన అతన్ని విపరీతంగా బాధించింది. ఆ కంపినీలో భారీ ఎత్తున సరుకు కొనే రాఘవన్ అండ్ కంపినీ, వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ విషయంలో వారి అల్టిమేట్ కస్టమర్లు కోరుకుంటున్న విధంగా కొన్ని మార్పులు సూచించడం, నాణ్యతా ప్రమాణాలు ఇప్పుడున్న విధంగానే కొనసాగితే భవిష్యత్తులో అమ్మకాలు పూర్తిగా పడిపోతాయి అంటూ మధు మీద ఒత్తిడి తీసుకురావడం, అందుకు మధు ఈ మార్పులు చెయ్యడం తన చేతిలో లేదని, టాప్ మేనేజ్మెంట్ తో మాట్లాడుకోమని ఖరాఖండిగా చెప్పేయ్యడంతో రాఘవన్ అండ్ కంపినీ యజమాని చతుర్వేది మధుపై తీవ్రంగా మండిపడ్డాడు.

రాఘవన్ అండ్ కంపినీ ఒక పెద్ద కొనుగోలు సంస్థ. . ఇంకా ఇటువంటి భారీ కొనుగోళ్ళు చేసే వారు ఏడెనిమిది మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆ రసాయన కంపినీ ఛైర్మన్ విపరీతమైన విలువ ఇస్తూ ఉంటాడు. అందుకే వీళ్ళందరిలో అహంకారం నరనరాలా వ్యాపించి ఉంటుంది.

" ఆ మాత్రం నిర్ణయం తీసుకోలేని వాడివి అక్కడ ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు ? నువ్వు ఆ పోస్టుకు అనర్హుడివి " అంటూ ఇష్టమొచ్చినట్టు దుయ్యబట్టాడు చతుర్వేది. .

"ఏం మాట్లాడుతున్నారు మీరు ? మీరు చెప్పిన దాంట్లో ఎంతో అధికంగా డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఉంది. . .ఆ నిర్ణయం ఒక్క టాప్ మేనేజ్మెంట్ చేతిలోనే ఉంది. . ఎన్నో కంపినీలలో పేరు పొంది ఈ కెమికల్ కంపినీ వైస్ ప్రెసిడెంట్ ప్రశంశలు అందుకున్న నన్ను అనర్హుడివి అనడానికి మీరేమేనా నా బాసా ? లేదా మేనేజ్మెంట్ వ్యక్తులా ? నన్ను శాసించడానికి మీకు ఏ అర్హత లేదు. మీరేమీ నాకు జీత భత్యాలు ఇవ్వడం లేదు. ఇక ఈ విషయంలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుని పని చేయించుకోండి. " అంటూ కోపంగా ఫోను పెట్టేశాడు మధు.

ఆ రోజు రాత్రి రాఘవన్ అండ్ కంపినీ ప్రొప్రయిటర్ చతుర్వేది నుండి మధుకు మరోసారి ఫోన్ వచ్చింది.

" మిస్టర్ నువ్వేదో ఆ కంపినీలో పెద్ద పొడిచేస్తున్నావు అనుకుంటున్నావేమో? ఎన్నో కోట్లు రూపాయలు ఆదాయాన్ని సమకూర్చే మా లాంటి కొనుగోలుదారులను నోటికొచ్చినట్టు ఉచ్చ నీచాలు తెలియకుండా నీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఐదు నిమిషాల్లో నీ సీటుకే ఎసరు పెట్టించగలను . ఈ క్షణం నుండి నీ రోజులు లెక్కెట్టుకో . నువ్వు అక్కడ ఎంత కాలం ఉంటావో మేమూ చూస్తాం " అంటూ ఫోన్ పెట్టేశాడు.

మధు ఎన్నో చోట్ల ఉద్యోగాలు చేశాడు కానీ ఈ విధమైన అనుభవం ఎక్కడా కాలేదు. నిజానికి తన పైన ఒక బాస్ ఉన్నాడు కానీ ఈ విషయం చెపితే అతని నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. తనని ఇక్కడనుండి తియ్యించాలనే వీళ్ళందరూ కలిసి పన్నాగం చేస్తున్నట్టు అతనికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఇటువంటి నాగు పాములను పక్కలో పెట్టుకుని నిద్రించడం చాలా ప్రమాదకరం అని మర్నాడే ఒక నిర్ణయానికొచ్చేశాడు మధు. ఆ కంపినీలో ఉద్యోగం మానేసి వేరే చోటకు పోవాలని అతని ఉద్దేశ్యం . తన రాజీనామా వెనక అసలు కారణం వైస్ ప్రెసిడెంట్ కు చెపితే మరీ లోకువైపోతాడని, తననో అసమర్ధుడి కింద లెక్క కడతారని అనిపించి అనారోగ్య కారణం అంటూ సాకు చెప్పాడు.

అనారోగ్యం కారణంతో పదవీ విరమణ చేస్తున్న వారిని బలవంతంగా ఉంచి పని చేయించడానికి ఏ ఫ్యాక్టరీ రూల్స్ ఒప్పుకోవు. ఏదైనా జరగరానిది జరిగితే దానికి కంపినీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే వైస్ ప్రెసిడెంట్ మధు రాజీనామాన్ని వెంటనే అంగీకరించక తప్పలేదు. . అయితే ఎందుకో మధులాంటి తెలివైన వాడిని వదులుకోవడానికి మనస్కరించక పోయినా అతనికి ఏదో విధంగా సహాయ పడాలని నిర్ణయానికొచ్చాడు.

"చూడండి మధూ. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్న మిమ్మల్ని మీ పనితనం నన్ను బాగా ఆకట్టుకున్నా కూడా ఇక్కడే ఉండమని చెప్పలేక పోతున్నాను. అయితే మీకు అభ్యంతరం లేకపోతే నేనో సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను . మన కంపినీ డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాదులోనే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కనుక ప్రస్తుతం మీరు వారి దగ్గర కొంతకాలం ఉండండి. మీకు మార్కెటింగ్ లో ఎలాగూ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ ఆర్డర్లు చూస్తూ ఉండండి. . నేను కూడా వారితో మాట్లాడతాను . అక్కడ మీరు పని చెయ్యడం వల్ల మీరు మీ వూళ్లోనే ఉండి మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్లవుతారు. వైద్య సహాయం కూడా అందుతుంది. మరోపక్క కంపినీకి అవసరమైన మీ సలహాలు కూడా మేము మీ ద్వారా పొందటానికి కూడా అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు మీ ఆరోగ్యం బాగా కుదుటపడితే ఇదే కంపినీలో మీ స్థానం మళ్ళీ మీకు వచ్చేటట్టుగా మేనేజ్మెంట్ తో మాట్లాడుతాను. . నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను " అన్నాడు వైస్ ప్రెసిడెంట్ రామన్ .

ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కోవాలంటే కష్టమైన పనే. వైస్ ప్రెసిడెంట్ గారి సలహా బాగానే ఉన్నట్టు తోచింది. ఏదో విధంగా రాఘవన్ అండ్ కంపినీ వాళ్ళ పోరు తప్పితే చాలు అనుకుని వెంటనే ఆనందంగా ఒప్పుకున్నాడు మధు.

కంపినీకు కొన్ని విధానాలు ఉంటాయి కనుక వెంటనే కాకపోయినా ఒక నెల రోజులు తర్వాత మధు ఆ కంపినీలో తన విధులనుండి బయటపడ్డాడు. హైదరాబాద్ లోని డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వెళ్ళి తన ప్రస్తుత పరిస్తితి గురించి వివరించి , వైస్ ప్రెసిడెంట్ సలహాపై మీ వద్ద పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పడానికి సిద్దమయ్యాడు . . నిజానికి తను చదివిన చదువుకు, చేసిన ఉద్యోగాలకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పని చెయ్యడం అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన విషయమే.

హైదరాబాద్ వెళ్ళగానే మున్ముందుగా రాజన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ కంపెనీ కిరణ్ కుమార్ ను కలుసుకున్నాడు. ఆయన అంతకు ముంధు రోజువరకు ప్రత్యేకంగా మధు సేవలు అన్ని రకాలుగా ఉపయోగించుకుని విపరీతమైన లాభాలు గడించిన సౌత్ డిస్ట్రిబ్యూటర్. మధును చూడగానే ఆయన మొహం ఎందుకో మాడిపోయింది.

" అయితే మీరు ఆ కంపినీ వదిలేశారన్న మాట. . ఇప్పుడు మీరు మాకు ఏ విధంగా ఉపయోగ పడగలరు ? నీళ్ళలో నుండి బయటకు వచ్చిన మొసలి బల్లితో సమానం. మీరూ అంతే కదా. . మా పని మీద మిమ్మల్ని కంపినీకి పంపిస్తే ఒకసారి అక్కడ వదిలేసి వచ్చాక మిమ్మల్ని ఎవరైనా గౌరవించి పనులు చేసి పెడతారా ? ఖచ్చితంగా అనుమానమే. పైగా మీరు అక్కడ ఒక పెద్ద ఉద్యోగం చేసి వచ్చారు. అక్కడ ఇచ్చే జీతంలో సగం కూడా మేము ఇవ్వలేము. మరో పక్క అనారోగ్య కారణాలతో ఉద్యోగం వదిలేసి వచ్చినట్టు తెలుస్తోంది. . ఇక్కడ మాత్రం ఆ ఇబ్బంది ఉండదని గ్యారంటీ ఏమిటి ? మాకు కొంత సమయం కావాలి. ఈ విషయం గురించి మా భాగస్తులతో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొస్తాము . ఈ లోపు మీరే ఏదైనా మంచి ఉద్యోగానికి ప్రయత్నం చేయండి " అంటూ కనీసం ' టీ' కూడా ఆఫర్ చేయకుండా పంపించేశాడు ఆ బడా డిస్ట్రిబ్యూటర్ . మరో డిస్ట్రిబ్యూటర్ కూడా అదే స్తాయిలో మాట్లాడేసరికి మధుకు చాలా అవమానం అయిపోయింది. ఇంత బ్రతుకు బ్రతికి ఈ రోజు ఇలా రోడ్డు మీద పడినందుకు తనని తనే నిందించుకున్నాడు. వైస్ ప్రెసిడెంట్ సిఫార్స్ ను కూడా వీళ్ళు లెక్కచెయ్యలేదంటే వీళ్ళందరూ తనకు ఉద్యోగం ఇవ్వకుండా ఉండటంలో ఒక నిర్ణయానికొచ్చేశారు అని పూర్తిగా అర్ధం అవుతోంది. . ఒక సారి ఉద్యోగం వదిలేశాక మళ్ళీ ఈ పరిసరాల్లో వేలాడటం తన లాంటి ఆత్మాభిమానం కలవాడికి తగదు కాక తగదు అని అనుకున్నాడు మధు..

స్వతహాగా టెక్నికల్ గా ఎంతో అనుభవం ఉన్న మధు బరోడాలో తన పాత మిత్రుడి కంపినీలో ఉద్యోగం సంపాదించాడు. . అక్కడ బాగానే స్తిరపడుతున్నానని అనుకునే లోపలే ఏమి జరిగిందో ఏమో ఒక ఆరునెలల తర్వాత కంపినీలో ఏవో అనుకోని సమస్యలు వచ్చాయని ఒక స్థాయి పెద్ద ఉద్యోగస్తులను తొలగింపు క్రమంలో మధు కూడా బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.అన్ని చోట్లా తనకు ఇలా ఎందుకు చుక్క ఎదురవుతోందో తెలియక మధు చాలా కాలం మదనపడ్డాడు.

అనుకోకుండా ఒకరోజు మధు అంతకు ముందు పనిచేసిన కెమికల్ కంపినీలోని కొలీగ్ ఈశ్వర్ నుండి ఫోన్ వచ్చింది. మాటల మధ్యన మధు గత కొంత కాలంగా తను ఎదుర్కుంటున్న పరిస్తితులను వివరించి చెప్పాడు.

"అవును మధూ గారూ . నేను కూడా విన్నాను . మీరు ఏ వుద్యోగంలోనూ నిలబడలేక పోతున్నారని. దీనికంతటికీ కారణం నాకు బాగా తెలుసు. ఒక రోజు రాఘవన్ అండ్ కంపినీ ప్రొప్రయిటర్ చతుర్వేది నన్ను ఏదో కారణంతో బెదిరింపు చర్యలు మొదలు పెట్టాడు. ." మధుకు జీవితం అంటూ లేకుండా చేసినట్టే నీక్కూడా చేస్తాను జాగ్రత్త" అంటూ హెచ్చరించడంతో నాకు మీరు ఈ కంపినీ నుండి బయటకు వెళ్లిపోవడానికి కారణం ఈ చతుర్వేదే అని అర్ధం అయ్యింది. . అతనే మీ మీద కక్ష కట్టి దుష్ప్రచారం చేసి మీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తున్నాడని తెలుసుకున్నాను. నా సలహా ఏమిటంటే పస్తుత పరిస్తితిలో మీరు ఏ కెమికల్ పరిశ్రమలోనూ కాకుండా వేరే లైన్ మార్చుకుంటే బాగుంటుంది. రసాయన పరిశ్రమలలో అతని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. . ఏది ఏమైనా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి." అంటూ ఫోన్ పెట్టేశాడు ఈశ్వర్.

చతుర్వేది లాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారని , వాళ్ళు తనకు హాని తలపెట్టే అవకాశం ఉంటుందని భావించి తనకున్న అనుభవాన్ని పురస్కరించుకుని కొన్నాళ్ల తర్వాత కొంతమంది మిత్రుల సహాయంతో బ్యాంకులో లోన్ తీసుకుని కొత్తగా ఒక రసాయన పరిశ్రమ ప్రారంబించాడు మధు. వ్యాపారానికి కావలసిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని , వాటిలోని మెళుకువలను తెలుసుకున్నాడు.

ఈ మధ్యకాలంలోనే పేపర్లో ఒక ఆశ్చర్యకరమైన వార్త మధు కళ్లబడింది. గతంలో తను చేసిన కెమికల్ కంపినీలో ప్రోడక్ట్ కు క్రమంగా డిమాండ్ తగ్గిపోయి , నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో అలసత్వం చూపడంతో పైగా పేరుకుపోయిన నష్టాలతో కంపినీ మూతపడే పరిస్తితికి రావడంతో వైస్ ప్రెసిడెంట్ రామన్ గారు అందులోంచి తప్పుకోవడంతో చేసేది లేక అందులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా వేరే దారి చూసుకున్నట్టు ప్రముఖంగా ఆ పేపర్లో వార్త .

కొన్నాళ్ళ తర్వాత విషయం.

"మీ కోసం ఎవరో వచ్చారు" అంటూ మేనేజింగ్ డైరెక్టర్కు పియ్యే శ్రీకాంత్ ఫోన్ చేసి చెప్పాడు.

లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి నిలువెత్తునా ఆశ్చర్య పోయాడు మాధవి కెమికల్స్ లిమిటెడ్ ఎండీ మధు.

ఆ వ్యక్తి రాఘవన్ అండ్ కంపెనీ ప్రొప్రయిటర్ చతుర్వేది. చాలా ఇబ్బందిగానే కూర్చున్నాడు అతను. వాళ్ళ మధ్య ఒక అరగంట సేపు సంభాషణ జరిగింది.

"అవును మధు సాబ్. ఆ కంపినీలో నాకు తిరుగులేదు అనుకున్నాను. చైర్మెన్ కూడా నేను ఎంత చెపితే అంత అని విర్రవీగాను. ఇష్టానుసారంగా మిమ్మల్ని దూషించాను. అహంకారంతో మీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా అడ్డుపడ్డాను. ఆ పాపమే నాకూ, మాలాంటి వారిని కొట్టింది. ఆ కంపినీ అనతికాలంలోనే నష్టాలతో కుప్పకూలిపోయింది. ఉద్యోగస్తులు చెట్టుకొకళ్లు, పుట్టకొకళ్లు పట్టుకుని వెళ్ళి పోయారు. మమ్మల్ని కనిపెట్టుకుని కాపాడిన వైస్ ప్రెసిడెంట్ రామన్ గారు పత్తా లేకుండా పోయాడు. కంపినీలో మేము పెట్టిన డిపాజిట్లు కూడా పోయాయి. ఏ కోర్ట్ కెళ్లినా ఇప్పుడిప్పుడే అవి వెనక్కి వచ్చేటట్టుగా లేవు. మేమంతా వీధిన పడిపోయాము. మా మీద ఆధార పడిన మా పిల్లల భవిష్యత్తు అంధకారమైపోయింది. ఈ మధ్య పేపర్లో మీ కొత్త కంపినీ వివరాలు చూసి దాని మేనేజింగ్ డైరెక్టర్ మీరే అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. మీ లాంటి తెలివిగలవారు, మంచివారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాణిస్తారని అర్ధం అయ్యింది. నేను మీకు తలపెట్టిన హానికి స్వయంగా మిమ్మల్ని కలుసుకుని నా పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేనూ ఇప్పుడు చాలా మందిలా ఒక సామాన్యుడిని. నాలో అహంకారం కాలి బూడిదైపోయింది. . ఇక వెళ్తాను మధు సార్. నన్ను గుర్తు పెట్టుకోండి ...." అంటూ పశ్చాత్తాప హృదయంతో లేచాడు చతుర్వేది.

అంత పెద్ద వ్యక్తి తనముందు ఒక అపరాధిలా , అన్నీ పోగొట్టుకున్న వాడిలా నిలబడటం చూశాక సహృదయుడు అని పేరు పొందిన మధు మనసును కలచి వేసింది. . నిజానికి అతను తనకు ఎన్నో రకాలుగా అపకారం తలబెట్ట చూశాడు. కానీ అతను చేసిన పనికి తను కూడా అదే రీతిలో వంచించడం మానవత్వం అనిపించుకోదు కదా. తన కంపినీ అభివృద్దిలోకి రావాలంటే అన్ని రాగద్వేషాలకు అతీతంగా ఉండగలిగినప్పుడే అది సాధ్యం అవుతుంది. ఇలా ఆ క్షణంలో మధు మనసంతా ప్రశాంతంగా ఆలోచించసాగింది.

" అయ్యో ఎంత మాట ? అప్పుడున్న పరిస్తితిలో మీరు నాతో చనువుగా అలా అని ఉంటారు. కానీ ఆ సమయంలో నేను కొద్దిగా సంయమనం పాటించి వుండాల్సింది. నేను కూడా మిమ్మల్ని అవమానించాను. వ్యవస్థలలో ఎలా ఉండాలో అని నాకూ అర్ధమయ్యింది. నాక్కూడా అది ఒక గుణపాఠమే. మీలాంటి పెద్దవారికి నాలాంటి చిన్న వాడు ఏదైనా ఆఫర్ చెయ్యాలనుకుంటే అది అహంకారం, మూర్ఖత్వం అవుతుంది కానీ మీకు ఎటువంటి పరిస్తితిలలోనూ ఏదైనా అవసరం పడినా, అడగాలని అనుకున్నా నేనున్నానని మర్చిపోవద్దు. మా ప్రోడక్ట్ కు మీలాంటి అనుభవం ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఉంటే కంపినీ ముందు ముందు ఒక లాభసాటి కంపినీ గా మారుతుందని నా నమ్మకం. . పాత విషయాలు ఎవరమూ మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం నుండి ఇక్కడే వదిలేద్దాము. " అన్నాడు మధు. అతని కంఠంలో అభ్యర్ధన కనిపిస్తోంది.

ఆ క్షణంలో మధు చతుర్వేది దృష్టిలో హిమాలయ పర్వతం అంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అప్రయత్నంగా అతని కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి .నిజంగా ఇది అతనికి ఊహించని పరిణామం. అహంకారంతో కుప్పకూలిన తనని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మధు సహృదయతకు , ఔదార్యానికి మనసా వాచా జోహార్లు అర్పించాడు. ****

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్