అద్దె యింటి కష్టం - బి.రాజ్యలక్ష్మి

Adde inti kashtam
రామానికి రాత్రంతా నిద్ర లేదు ,ప్రక్క పోర్షన్ భార్యా భర్తా రాత్రంతా పెద్దగా అరుస్తూ పోట్లాడుకుంటున్నారు కొట్టుకున్నారు కూడా రెండిళ్ళకీ కి మధ్య లో తలుపులు వున్నాయి గోడ లేదు .రామానికి ప్రైవసీ లేదు ,సీతా తనూ మాట్లాడుకోవాలన్నా కష్టసుఖాలు చెప్పుకోవాలన్నా గుసగుసగా చెప్పుకోవాల్సిందే ! ఒక సరదా లేదు పెద్దగా నవ్వడమూ లేదు .అందుకే విసుగొచ్చి యిల్లు మారాలనుకున్నాడు ! అయితే. సీత వాళ్లనాన్నగారికి బాగాలేదని పుట్టింటికి వెళ్లింది .పిల్లలిద్దరూ పసివాళ్లు ,వెళ్లికూడా పదిహేను రోజులయ్యింది .సీత వచ్చేలోపు యిల్లు మార్చెయ్యాలనుకున్నాడు రామం .

రామం డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు ,తన హోదాకు తగ్గ యిల్లు వెతుక్కోవాలనుకున్నాడు .అద్దెక్కువైనా పర్వాలేదు ఆధునికం గా ప్రశాంతం గా వుండే యింటికి మారాలనుకున్నాడు .

ఒకరోజు స్టాఫ్ రూమ్ లో తోటి అధ్యాపకుడు రమణ తాను వుంటున్న యిల్లు ఖాళీ చేస్తున్నట్టు చెప్పాడు .రామం. కారణమడిగాడు ,రమణ ఆర్ధికపరం గా యిబ్బందుల వల్ల అద్దెతక్కువ యింటికి మారాదల్చుకున్నట్టు చెప్పాడు .రామం రమణ. యిల్లు ఒకసారి. వెళ్లాడు చూసాడు కూడా .ఇండిపెండెంట్ యిల్లు ,రణగొణధ్వనులకు దూరం పైగా చుట్టూ గ్రీనరీ చుట్టుప్రక్కల ఇళ్లు కడుతున్నారు .రమణ. యిల్లు ముందు పూలతోట ,వెనుకాల పెరడు ! మూడు వైపులా ప్రహరీ గోడ ,పైన డాబా ! ముందు హాలు ,తర్వాత డ్రాయింగ్ గది ,drawling గది కి అటూయిటూ బెడ్ రూములు అటాచ్డ్ బాత్రూమ్ ,నీళ్ల సమస్య లేదు .వంటిల్లు కూడా బాగుంది .మొత్తానికి రామానికి తన అభిరుచులకు తగిన యిల్లు .సీత కూడా యిష్టపడుతుందని అనుకున్నాడు .

కాలేజీకి నాలుగు రోజులు వరుసగా సెలవులొచ్చాయి .రమణ కూడా సెలవుల్లోనే యిల్లు ఖాళీ చేస్తున్నాడు .రామం కూడా ఆ సెలవుల్లోనే రమణ ఖాళీ చేసిన యింట్లో చేరాలని నిర్ణయించుకున్నాడు .ఇంటి యజమాని శర్మ గారి తో అంతకుముందే చూచాయగా చెప్పాడు .ఉదయం వెళ్లి ఆ రోజు ఖాళీ చేస్తున్నట్టు చెప్పాడు .

“రామం గారూ మా యిల్లు నచ్చలేదా ! ఏదో పాతకాలం యిల్లు ,మీ ఆధునిక జీవనానికి సరిపోదులే , సీత అంటే మాకు అభిమానం ,ఎప్పుడైనా యిటువైపు వస్తే సీత ని తీసుకుని రా రామం “ అన్నాడు యింటియజమాని .ఆయన మాటలకు రామం బాధపడ్డాడు .వాళ్ల ఆత్మీయతకు కరిగిపోయాడు . కానీ బొత్తిగా గోప్యత లేని యింట్లో సరదా సంతోషం లేకుండా తాను మాత్రం ఎన్నాళ్లుండగలడు ?

మంచి ఘడియ చూసుకుని కొత్తింట్లో చేరాడు .సామాన్లు మాత్రం సద్దలేదు .బెడ్ రూమ్ మాత్రం అమర్చుకున్నాడు ! హాయిగా ప్రైవసీ గా వుంది .కిటికీ ప్రక్క సన్నజాజి తీగ మత్తెక్కించేపరిమళం ! ఘంటసాల గారి. పాటలు వింటూ సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ రాత్రంతా మధురం గా గడపొచ్చు అనుకుంటూ మురిసిపోయాడు రామం .

సీత వచ్చింది .కొత్తిల్లు అంతా గిరగిరా తిరిగింది .ఇనస్పెక్షన్ అధికారిణిలాగా ప్రతిమూలా. శల్యపరీక్ష చేసింది .పిల్లలు మాత్రం హాయిగా అంతా పరుగెత్తుతున్నారు ,డాబా యెక్కారు చిందులేస్తున్నారు .రామం ఫైనల్ రిపోర్ట్ కోసం యెదురుచూస్తున్నాడు .కొంగు నడుం చుట్టూ బిగించి !కుచ్చెళ్లు పైకి దోపుకుని చేతిలో చిన్నకర్రతో అపర రుద్రమ్మలా ముక్కుపుటాలు యెగరేస్తూ రామం ముందు నించుంది .కర్ర చూసి కొంపతీసి తన బుర్ర వాయించదుకదా అనుకుంటూ అప్రయత్నం గా బుర్ర తడుముకున్నాడు .

“అసలు మిమ్మల్నెవరువెతకమన్నారు ? నేనేమయినా ఆ యిల్లు నచ్చలేదని చెప్పానా ! ఒక యిరుగూ లేదు పొరుగూ లేదు ,ఒంటికంటి సోమలింగం లా చెట్లూ పుట్టలూ చూస్తూ కూర్చొనా “అంటూ మూతి ముఫై వంకరలు తిప్పింది సీత .రామం హతాశుడయ్యాడు .పెళ్ళాం తన యింటి సెలెక్టన్ చూసి మురిసిపోతుందనుకుంటే ,ఇదేమిటి కథ అడ్డం తిరిగింది !

అసలే అర్భిణి ఆ పైన గర్భిణి అన్నట్టుగా సీత కు పనిమనిషి కుదరలేదు ,కొంచెం దూరం గా వున్న యిళ్లల్లో చేస్తున్న పనివాళ్లను అడిగితే చెయ్యమన్నారు .బయట చిమ్ముకోవడం ,మొక్కలకు నీళ్లు పొయ్యడం ,యింట్లో గిన్నెలు తోముకోవడం ,బట్టలు వుతుక్కోవటం ,గదులు తుడుచుకోవడం మొత్తానికి. చాకిరీ యెక్కువయింది సతమతమవుతున్నది .

“హాయిగా వున్నిల్లు వదిలి. యిక్కడికొచ్చాం !వెనకాల ప్రహరీ లేదు ,కుక్కలూ పిల్లులూ యేమరుపాటున వంటింటి తలుపులు తీసుంటే లోపలికి వస్తున్నాయి ,ఖర్మ ! మొన్న పాలన్నీ పిల్లి త్రాగేసింది .దొంగవాడొచ్చినా దిక్కు లేదు “రామం ఆఫీసు నించి రాగానే పెద్ద చిట్టా విప్పింది సీత .బుద్ధుడిలాగా మౌనముద్ర లో వుండిపోయాడు రామం .

సీత కు అగ్గి కి ఆజ్యం తోడైనట్టు ఒకరోజు వెనుక దొడ్లో తీగ మీద ఆరేసిన జరీచీరె మాయమయింది .అంతే భర్తకు అల్టిమేటం యిచ్చేసింది ,యేమైనా సరే కచ్చితం గా యిల్లు మారిపోవాల్సిందే లేకపోతే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతానన్నది .

రామం యిళ్ల వేట మొదలు పెట్టాడు .బళ్లు తెరిచారు యెక్కడివాళ్లక్కడ సెటిల్ అయ్యారు అందుకని యెక్కడా ఖాళీలు లేవు ,రెండు నెలలు గడిచిపోయాయి . సీత కు పనిమనిషి కుదిరింది .చాకిరీ తప్పింది .సీతలో కాస్త చిరునవ్వు తొంగిచూస్తున్నది .రామం కాస్త వూపిరి పీల్చుకున్నాడు .దొడ్లో ప్రక్కవాళ్లు యిల్లు కట్టుకుని ప్రహరీ గోడ కట్టారు .కుక్కలూ పిల్లులూ గోల తప్పింది .ప్రక్కవాళ్లతో సీతకు. స్నేహం కుదిరింది .

రామం తీవ్రం గా యిల్లు వెతుకుతున్నాడు కానీ యిప్పుడు కథ అడ్డం తిరిగింది సీత కు యిప్పుడు యిల్లు బాగా నచ్చింది .కారణం !! పనిమనిషి కుదిరింది వెనుకాల ప్రహరీ కట్టారు ,యిరుగు పొరుగు యేర్పడ్డారు .సీత. రామాన్ని మెచ్చుకుంటున్నది .అద్దెయిల్లు వెదకడం ఆపెయ్యమన్నది . రామానికి చాలా సంతోషం వేసింది .

ఇందువల్ల మనందరికీ తెలిసింది. యేమనగా ,ఇల్లు వెతకాలంటే యిల్లాలు తప్పనిసరిగా వుండాలి ఆవిడ ఇన్స్పెక్టన్ చెయ్యాలి ,రిపోర్ట్ వ్రాయాలి ,అప్పుడు కానీ. యిల్లు మారడానికి భర్తగారికి అనుమతి లభించదు .భార్య మెచ్చని యిల్లు ,భారమైన శిక్ష కదరా పతిదేవుడికి !!

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్