ఓ మజ్నూ - వి యస్ శాస్త్రి ఆకెళ్ళ

O majnu

"ఏయ్ బుడంకాయ్, మీ అక్కేదే." సైకిలు మీదే ఉండి ఓ కాలు నేలకి ఆన్చి - సదాశివం అడిగేడు. మూతి ముప్పై వంకర్లుతిప్పి, విననట్టే గుమ్మం ముందు వాకిలిలో ముగ్గు వేస్తున్నాది సుమతి. "టింగరీ నిన్నే, వచ్చేనంటే పిలక సాగదీసేస్తా" విసుగ్గా సదాశివం హెచ్చరించేడు. "మా అమ్మా నాన్న సుమతి అని అందమైన పేరుపెట్టేరు. ఇక్కడ బుడంకాయలు, టింగరోళ్ళు ఎవరూ లేరు. నన్ను పేరుతో పిలిస్తేనే పలుకుతా," అంటూ మోకాలి పిక్కల వరకూ ఎగేసిన లంగాని కిందకి లాక్కుంటూ చీపురూ బకెట్టూ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది సుమతి. "ఖర్మరా బాబూ ఖర్మ. మరదళ్ళంటే ఇలాగే ఉంటారేమో" సదాశివం అనుకుంటూ సైకిల్ దిగి, సుమతిని అనుసరించేడు. గుమ్మం దగ్గర సదాశివం మేనమామ విశ్వనాధం ఎదురొచ్చి "ఏరా బాగున్నావా? అంతా బాగున్నారా. ఏంటి సంగతి?" అంటూ పలకరించేడు. "ఏంలేదు మావయ్య, కూరల మార్కెట్ కి వెళుతూ ఆగేను. ఇల్లేంటి ప్రశాంతంగా ఉంది. అత్త లేదా" అంటూ సదాశివం ఇంటిని వసుంధర ఎక్కడ ఉందోనని జల్లెడ పడుతున్నాడు. "అత్త పెద్దోడితో బజారు కెళ్ళింది. చిన్నోడు ఎవరో ఫ్రెండింటికి వెళ్ళేడు. వసుంధర గుడికెళ్ళింది...పరీక్ష పాసవ్వాలని తెగ మొక్కులు మొక్కుతున్నాదనుకో.. సుమతీ - బావకీ నాకూ కాఫీ పట్టుకురా...." అంటూ, లోపలున్న సుమతికి కాఫీ తెమ్మని ఆర్డరేసేడు విశ్వనాధం. "కాఫీ తాగి ఇంట్లోంచి బయలుదేరాను మావయ్య. ఇప్పుడొద్దు. సాయంత్రం వస్తా, టిఫిను కూడా రడీ చేయించు" అంటూ లేచి వడివడిగా అడుగులు వేసి బయటకొచ్చేడు సదాశివం, 'ఈరోజు వసుంధరతో అటో ఇటో తేల్చుకోవాలి' అని మనసులో అనుకుంటూ. శనివారం అవటంతో గుడిలో భక్తుల కోలాహలం చాలా ఎక్కువగా ఉంది. "ఈ పొట్టిదాన్ని వెతకాలి, ఎక్కడుందో. ఈ వయసులో ఇంత భక్తా. వయసు మళ్ళిన తరవాత విరాగిణి అయిపోతుందేమో" సదాశివం మనసులో అనుకుంటున్నా, అతడి కళ్లు మనసు కంటే వేగంగా వసుంధరని వెతుకుతున్నాయి. దర్శన వరుసలో వసుంధర వెనకగా నిలబడ్డాడు సదాశివం. గంట కొట్టడానికి మీదకి చూసింది ఆమె. గంట ఆమెకి అందనంత ఎత్తులో ఉంది. అప్రయత్నంగా 'ప్చ్' అన్న నిట్టూర్పు వెలువడింది ఆమె నోటంట. "నిన్ను ఎత్తుతాను గంటకొట్టు, పొట్టీ" లోస్వరంలో అన్నాడు సదాశివం. "ఇక్కడ కూడా ప్రత్యక్షమా? శివా..... శివ శివా...." చిరు కోపాన్ని అభినయించి, మంద దరహాసంతో వసుంధర అంది. "ఏం చేస్తామమ్మా, దేవతలు కరుణించటం లేదు, ఎన్ని ప్రదక్షిణలు చేసినా" బేలగా ముఖం పెట్టి, " నీతో పనిపడింది. దర్శనం అవగానే బయటకి రా, ఎదురు చూస్తా అర్జెంటు" అంటూ వరుసలోంచి బయటికి వచ్చేడు సదాశివం. " ఉండొచ్చుగా, ఇద్దరం దర్శనం చేసుకుని వెళదాం" వసుంధర అంది. "నా చేత బొట్టు పెట్టించుకోవడం ఇష్టం అని చెప్పు. నీతో ఎక్కడికి రమ్మన్నా నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ సదాశివం బాణం గురి సరిగా తగిలిందా లేదా అని వసుంధర ముఖంలోకి చూసేడు. "వద్దు. నువ్వు బయట ఉండు. నేను వస్తాను" అంటూ వసుంధర కళ్లు మూసుకుని భగవధ్యానంలోకి వెళ్ళిపోయింది. "ఏంటి సంగతి?" వసుంధర గుడి మంటపం గచ్చునేలని చేత్తో శుభ్రం చేసి, సదాశివం ప్రక్కనే కూర్చుంది. ఎప్పుడూ చూడని అందమేదో వసుంధర లో చూస్తున్నాడు సదాశివం. వదులుగా జుత్తు చివర్లు ముడి వేసి, పావలా కాసంత బొట్టు. పసుపు రాసిన ముఖం. సీదా సాదాగా ఉన్న ముదురు రంగు ఆకుపచ్చ చేనేత చీర. అన్నింటినీ మించి చురుకుగా కదిలే కళ్లు. అది వయసు పొంగు ఆకర్షణ మాత్రం కాదు. మేనత్త మేనమామ పిల్లల మధ్య ఉండే ఆకర్షణ. "ఏంటి ఆలోచించేవు. బొట్టు పట్టించుకోవడం గురించి. నీ అభిప్రాయం చెబితే మా అమ్మ నాన్న లని పంపి మాట్లాడిస్తా. మావయ్య ఎప్పుడు సిధ్ధం ఐతే అప్పుడు పెళ్ళి." అన్నాడు సదాశివం. "ఇది మనకి పెళ్ళి వయసా? చదువుతున్నది ఇంటరు. పాసవుతామో లేదో తెలియదు. ఇద్దరి మధ్య వయసు పెద్దగా తేడా కూడా లేదు. ఆరు నెలల లోపే. పెద్దలు ఒప్పుకుంటారా? ఇంకా చాలా సమయం పడుతుంది పెళ్ళి చేసుకోవడానికి. నీకైనా చదువయి, జీవితంలో స్ధిరపడాలి కదా.... ఈ రోజు ఇష్టం - తరువాత ఉండకపోవచ్చు. నేను ఇంకా ఆలోచన చేయడం లేదు. మా తాత అమ్మమ్మ ఉద్దేశాలని, ఆదేశాలను పాటించాలి..... " అంటూ చెప్పటం ఆపి, చూపుడు వేలితో సదాశివాన్ని పొడుస్తూ "వింటున్నావా లేక కళ్లు మూసుకుని సహస్రం పారాయణం చేస్తున్నావా?" అంటూ వసుంధర అడిగింది. " వింటున్నా.. వింటున్నా, చెప్పు.... నువ్వు మాట్లాడుతూ ఉంటే తంబురా శృతిలానో, నాగస్వరంలానో విన శ్రావ్యంగా ఉంది" అంటూ సదాశివం కళ్లు తెరిచి సమాధానం ఇచ్చేడు. "ఈ మాటలకేం గానీ, ఈ బాజా ఎప్పుడూ ఉన్నదే కదా. నేను ఇంకా ఆలోచన చేయలేదు, నాకు కొంత టైం కావాలి, పద ఆలస్యం అవుతున్నాది." అంటూ బయలుదేరడానికి సిధ్ధమై లేచింది వసుంధర. వసుంధర చేయి పట్టుకుని వెనక్కి కూర్చోమని లాగుతూ "నీకు ఇష్టం అయితే, నేను మా అమ్మ - నాన్న కి చెప్పి - మావయ్య అత్తయ్యలతో మాట్లాడమంటా. మా నాన్న వెనకుండి వ్యాపారం చేయడానికి పీజీలు పీహెచ్డీలూ అక్కర్లేదు. అయినా చదువు ఆపేస్తానని అనటం లేదుగా. నిన్నూ మానేయమని చెప్పటం లేదు కదా. నీ చదువు పూర్తయి, నీ కాళ్ల మీద నిబడేంత వరకూ ఆగుతాను. సరేనా? ఓ మనిషికి జీవితాంతం తోడుగా నిలిచి, పోషించగలమా లేదా అని ఆలోచించాలి. వయసు తేడా ముఖ్యం కాదు. ఒకరి మీద మరొకరికి ప్రేమా - అభిమానం ఉందా లేదా తెలుసుకోవాలి. మా ఇంట్లో నువ్వంటే అందరికీ చాలా ఇష్టం. మా అమ్మకి వాళ్ళ అమ్మ పేరు 'వాసంతి' నీకు ఉందని. అలాగే నాన్న వాళ్ల అమ్మ పేరు 'సుందరి' కూడా నీ పేరులో ఉందని. నీ అభిప్రాయం చెప్పమని అడుగుతున్నా. తొందరగా నిర్ణయం చెబుతావని. ఆలోచించి నీ ఉద్దేశం చెప్పు" అంటూ సదాశివం లేచేడు. "అలాగే మహానుభావా" అంటూ వసుంధర కూడా లేచింది. *. *. *. * సదాశివం ఊరంతా తిరిగి చేయాల్సిన పనులు పూర్తి కాకపోవడంతో, మధ్యాహ్నానికి సముద్ర తీరంలో ఉన్న కొబ్బరి తోటలో సిమెంటు బెంచి మీద చతికిలబడ్డాడు. ఏకాంతం కోరుకునే వారికి, ఏకాంతనొ కోరుకునేవారికి ఈ ప్రదేశం భూతల స్వర్గం. బాహ్య ప్రపంచాన్ని మరపింపజేస్తుంది. ఎండగా ఉన్నా, సముద్ర అలల హోరు, మలయమారుతం లాంటి గాలి మనసుకి ఆహ్లాదం పెంచుతున్నాది. మగత కమ్ముతుంటే, సదాశివం శరీరాన్ని వదులుగా చేసి వెనక్కి చారబడ్డాడు. జాగ్రదావస్త. కళ్ళు మూసుకుని, లయబధ్ధంగా ఒడ్డుని ఢీ కొడుతున్న కెరటాల ధ్వనిని వింటున్నాడు. ఎంత కాలం గడిచిందో తెలియలేదు. "ఏం నాయనా, ఒంటరిగా కూర్చున్నావు. ఇలా ప్రపంచాన్ని మరిస్తే ఎలా" ఎవరిదో ఆడగొంతు. " రెండు వేల ఐదు వందల ఎనభైయారు" కళ్లు తెరవకుండా సదాశివం అన్నాడు. "నిద్రలో డబ్బు మూట దొరికిందా ఏంటి. ఈ లెక్కలేంటి. లేవయ్యా శివా" మళ్లీ అదే ఆడగొంతు. ఎక్కడో విన్న గొంతు. ఎవరిదై ఉంటుంది? సదాశివం కళ్లు తెరవకుండా "కెరటాల లెక్క అమ్మా". ఇంత మారుమూల ప్రాంతంలో నన్ను పలకరించేవారెవరై ఉంటారు అని ఆలోచిస్తూ. కళ్లు నులుముకుంటూ సర్దుకుని కూర్చున్నాడు. ఎదురుగా భ్రమరాంబ ఆంటీ. అతని చిన్న తాత కోడలు. " రా.... రా..... ఆంటీ" అంటూ స్వాగతించేడు సదాశివం. "ఓహ్.... ఆంటీ అంటే నీకు కోపమొస్తుంది కదా...." సారీ.... స్నేహానికి వావి వరసలుంటే అది స్నేహం కాదని మా మిత్రుల ఉవాచ. ఏం చేయను వరసకి పిన్నమ్మవి కదా.... అందరూ బాగున్నారా పిన్నీ" "ఈ కబుర్లకే అందరూ నిన్ను మెచ్చుకునేది, నచ్చుకునేది కూడా. అంతా బాగానే ఉన్నారు. నాకు మాత్రం నిన్ను చూస్తే చాలా అసూయగా ఉంది. నీలా ఇలా కలివిడిగా, నేను ఎందుకు ఉండలేక పోతున్నానా" అని అంటూ భ్రమరాంబ గట్టిగా ఊపిరి తీసుకుని, బెంచికి రెండో చివర కూర్చుంది. ఆమెను తదేకంగా చూస్తున్నాడు సదాశివం. ఇద్దరు పిల్లల తల్లి, సుమారు ముప్పై సంవత్సరాల వయసు - అయినా మోడర్న్ గా ఉంటుంది. రెండు జడలు. ఏడు రంగులు పులిమినట్టున్న పంజాబీ డ్రస్సు. తెల్లటి మేని ఛాయ. కోల ముఖం. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు. పెదాలు రెండు చివరలలో దొంతర పళ్లు..... అందుకే మా బాబాయ్ మూడేళ్ల పాటు వెనకపడి - వాళ్ల అమ్మ నాన్న లని వేధించి మరీ పెళ్ళి చేసుకున్నాడు పైసా కట్నం కూడా లేకుండా.... "చాలబ్బాయ్.... నాకు దిష్టి తగిల్తే మీ బాబయ్య నిన్ను వదలడు.. జాగ్రత్త.." భ్రమరాంబ నవ్వుతూ సదాశివం ని ఈ లోకంలోకి తెచ్చింది. తత్తరపాటు కప్పిపుచ్చుకోవటం సదాశివంకి కష్టం అయింది. "నీ సలహా ప్రకారం ఈ ఉదయం మా వసూకి 'లవ్' కాదు 'మేరేజ్' నోటీసు జారీ చేశాను. టైం అడిగింది. అంతా పద్ధతి ప్రకారం పెద్దల అభీష్టం మేరకే అని కూడా చెప్పేను." ఆమె నుంచి దృష్టి మరల్చుకుంటూ అన్నాడు సదాశివం. "మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా?" భ్రమరాంబ అనుమానం. "అమ్మ నాన్నకి ఓకే. వెళ్లి మాట్లాడవలసింది వాళ్లే కదా. మా ఇద్దరి తాతయ్యల అభిప్రాయం ఆలోచించాలి. ఇంకెవరూ మధ్య వీరంగం వేయకుండా ఉంటే. ఈ పొట్టిది ఏం చెబుతుందో? ..... మా ఇంటరు పరీక్ష ఫలితాలు కంటే ఎక్కువ టెన్షన్ పెడుతున్నాది "... అంటూ సదాశివం కణతలు రుద్దుకున్నాడు. ఎంత సేపు మాట్లాడుతూ కూర్చున్నారో తెలియలేదు. చీకట్లు కమ్ముకుంటుంటే పిచ్చాపాటి ముగిసిందన్న గుర్తుగా సదాశివం లేచి నిలబడ్డాడు. భ్రమరాంబ కూడా చేతికున్న వాచీ చూసుకుని, "నీతో మాట్లాడుతుంటే టైం అసలు తెలియదు ఆనందా. వెళ్ళు వెళ్లి మీ అమ్మ నాన్న కి కూడా చెప్పి వాళ్ళని ఒప్పించు" అంటూ లేచింది. భ్రమరాంబని వాళ్ళ ఇంటి వరకూ తోడుగా వెళ్లి, సదాశివం తన ఇంటి ముఖం పట్టేడు, 'అమ్మా నాన్నలని ఎలా ఒప్పించాలా' అని ఆలోచిస్తూ. "అమ్మా వసుంధర నీకు నచ్చుతుందా? అదే మనింటి కోడలుగా." నెమ్మదిగా తల్లి శకుంతలని విషయ నిర్ధారణ కోసం సదాశివం అడిగేడు. "చదువు పూర్తి కాకుండా పెళ్ళి ఏంట్రా. అయినా వయసు తేడా కూడా లేదు. నాకూ మీ నాన్నగారికీ వయసు తేడా సంవత్సరమే. ఏమంటారో. మా తమ్ముడు ఒప్పుకున్నా, అత్త - వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒప్పుకోవాలిగా. సలక్షణమైన నెమ్మది అయిన పిల్ల. ఎవడు చేసుకుంటాడో ... చాలా అదృష్టవంతుడు. అందులోనూ మా అమ్మ పేరున్నది" కంచంలో భోజనం వడ్డిస్తూ "నీకు ఇష్టం ఐతే సరే. మాతమ్ముడినీ మరదల్నీ అడుగుతాను. నాన్నగారికి కూడా ఓ మాట చెప్తాను". భోజనం చేస్తూనే ఉదయం విషయం మొత్తం పూస గుచ్చినట్టు సదాశివం తల్లికి చెప్పేడు. 'నువ్వు మాత్రం డిగ్రీ పూర్తి చేయాలి, అప్పుడే పెళ్లి' అని కండిషన్ పెట్టింది. సదాశివం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తల్లి కూడా పచ్చ జెండా ఊపి ప్రోత్సాహం ఇవ్వడం బ్రహ్మానందంగా ఉంది. మర్నాడు సదాశివంని తండ్రి రామ్మూర్తి పలకరిచేడు. డిటో తల్లి మాటలే. "వాళ్ళు ఒప్పుకుంటే సరే. లేకపోతే నువ్వు మాత్రం మనసు పాడుచేసుకుని డీలా పడకూడదు. ఆ కండీషన్ ఐతే, వెళ్లి మాట్లాడతాం. అయినా మీ మావయ్య మాట చెల్లుబాటవుతుందా. వాళ్ళ అత్త మామలు కూడా ఒప్పుకోవాలిగా. వాళ్ళ మామగారు పంచాంగం చంకలో పెట్టుకొని తిరుగుతాడు. చూద్దాం. చదువు పూర్తి కాకుండా పెళ్ళి వద్దు. మూడు సంవత్సరాలు ఆగుతారా? వీలైనంత త్వరగా వాళ్లతో మాట్లాడతాం" అంటూ తండ్రి అభయహస్తం ఇచ్చేడు. సదాశివంకి అవధులు లేని ఆనందం. వసుంధరని రోజూ కలవటం. హాజరు వేయించుకోవటం. వార్తలు భ్రమరాంబకి చేరవేయటం అతని దినచర్యగా మారింది. *. * *. *. * నెల రోజుల తరువాత: " రావోయ్ రామ్మూర్తి, అందరూ కులాసాయేనా. రామ్మా శకుంతలా" అంటూ స్వాగత వచనాలు అయ్యిన తరవాత విషయ నిర్ధారణ చేసుకుని విశ్వనాధం వాళ్ల అత్తమామలు పెదవి విరిచేశారు. వాళ్ళ మిత్రుడికి మాట ఇచ్చారని. "అబ్బాయి క్లాస్ వన్ ఆఫీసర్, గవర్నమెంటు ఉద్యోగి. మా విశ్వనాధం వీలునిబట్టి పెళ్ళి చేయడానికి వీలు చేసుకోమని నిన్నే ఉత్తరం రాశాడు" తాంబూలాల ముహూర్తం పెట్టిన తరవాత అందరికీ చెప్పొచ్చని ఆగేము" అంటూ విశ్వనాదం మామగారు చెప్పేశారు. శకుంతలా - విశ్వనాధం, అక్కా తమ్ముడు - ముఖం గంటుపెట్టుకుని ముభావంగా ఉండిపోయారు. ఇంటికి వచ్చే త్రోవలో - శకుంతల రామ్మూర్తి - నిశ్చితార్థం జరిగే వరకూ సదాశివంకి చెప్పకూడదని అనుకున్నారు. నిజం ఎంత కాలం దాగుతుంది. వసుంధర ముఖం చాటేయటం సదాశివంకి అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్లిన సమయంలో బుడంకాయ సుమతి నిజం బయటపెట్టింది. "నీకు తెలుసా, మా అక్కకి పెళ్లి నిశ్చయం అయింది. నీకు చెప్పలేదా? మా తాతయ్య స్నేహితుడి మనవడు. ఓ పెద్ద ఆఫీసర్లే. నిశ్చయ తాంబూలాలుకి ముహూర్తం నిర్ణయించటానికి అమ్మా నాన్న - తాతయ్య అమ్మమ్మ ఊరెళ్లేరు. ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యింది. పొట్టి దానికి ఏం నూరిపోసేవు. మొదటి సారి జీవితంలో అంత గట్టిగా మాట్లాడింది. అమ్మ నాన్న వాదించలేకపోయేరు. మా తాత అమ్మమ్మ బలవంతంగా ఒట్టు వేయించి దాన్ని ఒప్పించేరు" విషయం బయట పెట్టింది సుమతి. సదాశివంకి మరేం వినిపించలేదు. వెనక్కి తిరిగి ఇంటి బయటికొచ్చేడు, బుడంకాయ్ వెనుక నుంచి పిలుస్తున్నా ఆగకుండా. జీవితంలో మొట్టమొదటి సారి వసుంధర పిరికితనం మీద కోపం వచ్చింది. 'పిరికి వాళ్లు ప్రేమించడానికి అనర్హులు' అన్న డైలాగ్ జ్ఞాపకం వచ్చింది. అమ్మా వాళ్ళు మాట్లాడామన్నారు. అంటే వాళ్ళకి కూడా చెప్పలేదా? లేక తెలిసి తనకి చెప్పలేదా? ఇంతకీ వసుంధర తన ప్రేమ విషయం ఇంట్లో వారికి చెప్పలేదా? సదాశివం మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాది. సైకిలెక్కి ఊరంతా తిరుగుతూ, మధ్యాహ్నానికి ఏకాంతం ప్రదేశానికి చేరుకున్నాడు. అదే అలల సందడి, గాలి హోరు, జన సందర్శన, కొబ్బరి ఆకుల మధ్య నుండి కాంతి కిరణాలు. రోజూ అనుభవిస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణం సదాశివంకి ఇప్పుడు చికాకు తెప్పిస్తున్నాది. కళ్ల వెంట నీటి ధార. తలచుకుంటుంటే గుండెల్లో తీవ్రమైన గుబులు. నిస్సత్తువగా సిమెంటు బెంచి మీద కూలబడ్డాడు. వెనక్కి చారబడి ముఖమ్మీద రుమాలు కప్పుకున్నాడు, కన్నీరు ఎవరూ చూడకుండా. ఎక్కడ పొరపాటు జరిగిందోనని ఆలోచిస్తున్నాడు. ఎంత సేపు అలా కూర్చున్నాడో తెలియదు. మళ్లీ అదే గొంతు. "ముఖం మీద ఆ రుమాలు ఏమిటి ఆనందా. దివాలా తీసిన వాడిలా" అంటూ భ్రమరాంబ రుమాలు తీసింది. "ఏమైంది. అలా ఉన్నావు. వసుంధరతో గొడవ పడ్డావా? లేక నీ ప్రేమని తిరగ్గొట్టిందా? లేకపోతే వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదా?" ప్రశ్నల వర్షం కురిపించింది భ్రమరాంబ. సదాశివం సర్దుకుని కూర్చుని, భ్రమరాంబకి కూర్చుందికి జాగా చేసేడు. ఇద్దరూ చాలా సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. సదాశివంకి ఊరట కలిగించే మాటలు కావాలి. ఓదార్పుగా దిశా నిర్దేశం చేయగల శక్తి సామర్థ్యం గల మిత్రులు కావాలి. భ్రమరాంబ భయపడుతున్నాది. ఏం మాట్లాడితే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని. ఆమె పరిస్థితి, మనసు డోలాయమానంగా ఉంది. ఆమెకి - సదాశివం ఏమైపోతాడోనని బెంగపట్టుకుంది. "ఆ పొట్టిది ఇలా చేస్తుందని అనుకోలేదు. మా అమ్మ నాన్న ఏం మాట్లాడేరో, మా మామయ్య అత్తా వాళ్ళు ఇంత త్వరగా పెళ్ళి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. నా ఆలోచన వాళ్ళని భయపెట్టి - తప్పు నిర్ణయం తీసుకున్నారా?" స్వగతంలో అనుకుంటున్నట్లు, కన్నీరు మున్నీరుగా అవుతూ సదాశివం బయటికే మాట్లాడేడు. భ్రమరాంబ నెమ్మదిగా సదాశివం భుజం రాస్తూ, "ఆ అమ్మాయి ఆడపిల్ల, ఎలా చెప్పగలదు. మీ మామయ్య ఇష్టం లేదని నీకు చెప్పొచ్చు కదా. అయినా మామగారింట అల్లుడుకి ఏం స్వతంత్రం ఉంటుంది చెప్పు? అలా కాదు ఇలా చేద్దామని గట్టిగా, ఖరాఖండిగా చెప్పగలడా? మీ అత్తయ్య - అలా మాట్లాడితే సహించలేదు కూడా. సంసారం ఒడుదుడుకులు లేకుండా వాళ్ళు ఆదుకుంటున్నారు కదా. వాళ్ళ మామగారు ఆర్థిక సహాయం చేసేందుకు హామీ ఇచ్చేరేమో" అంది అతని ముఖంలోకి చూస్తూ. "జీవితం నిరాశాజనకంగా వుంది. ఉదయం ఈ విషయం మా టింగరిది చెప్పిన దగ్గర నుండి, ఇక్కడకి వచ్చి కూర్చున్నా" సదాశివం మాట మాటకీ బెక్కుతూ కన్నీళ్ళ తో చెప్పేడు. భ్రమరాంబ భుజం మీద తలపెట్టుకుని అతడు సేదదీరుతున్నాడు. సూర్యుడు తన ఉగ్రం తగ్గించుకుంటూ పడమటి కొండల దిశగా వాలిపోతున్నాడు. భ్రమరాంబకి అర్ధం అయింది ఏంటంటే - ఉదయం నుండీ సదాశివం ఏమీ తినకుండా ఉన్నాడని. ఆమె బెంచి మీద నుండి లేస్తూ "పద ఆనందా, పిల్లలు ట్యూషన్ నుండి వస్తారు. నేను లేకపోతే గోల పెడతారు" అంది. నీరసంగా సదాశివం లేచి నిలబడి "పద పిన్నీ" అంటూ భ్రమరాంబని అనుసరించేడు. "రా లోపలికి. ఓ పావుగంట కూర్చుని వెళ్ళు" అంటూ భ్రమరాంబ బలవంతంగా శివానందంని ఇంట్లోకి తీసుకెళ్ళింది. పిల్లలకి భ్రమరాంబ సేమియా కిచిడి చేసి ప్లేటులో వేసి తెచ్చింది. తినను తిననంటున్న సదాశివంకి - పిల్లలకు పెడుతున్న ఎంగిలి చేత్తో - బలవంతంగా నోట్లో కిచిడి పెట్టింది. కొంచెం తిని చాలు చాలంటూ దూరంగా అతడు జరిగేడు. కొంత సేపటికి సదాశివం మామూలు స్థితికి చేరుకున్నాడు. "ఆకలి లేదు అంటూ సగం తినేశావు" అంది భ్రమరాంబ. "ఏం చేయను. మీ పిల్లలని దెబ్బలాడుతూ, నా వీపు మీద ఎక్కడ చరుస్తావేమోనని భయం వేసింది" అంటూ సదాశివం - చిరునవ్వు జోడించి బుంగమూతి పెట్టి అన్నాడు. మరికొంత సమయం పిల్లలతో కబుర్లు చెప్పి ఇంటికి బయలుదేరాడు. సదాశివంకి మామూలు మనిషి కావడానికి చాలా రోజులు పట్టింది. ఈలోగా పరీక్షా ఫలితాలు రావడం, అతను పాసయి - వసుంధర రెండు సబ్జెక్టుల్లో తప్పటం జరిగింది. అతను పట్టించుకునే స్థితిలో లేడు. పూర్తిగా మారిపోయాడు అనేకంటే మార్పు తెచ్చుకున్నాడు అనటం సబబేమో. సదాశివం ఇంటికి ఓ శుభోదయ వేళలో చిన్న తాత పరబ్రహ్మం వచ్చేడు. రామ్మూర్తి తో ఎవరూ వినకుండా ఓ గంట మాట్లాడి వెళ్లి పోయాడు. రాత్రి భోజనాలు దగ్గర సదాశివం - భ్రమరాంబ పరిచయం విషయం చర్చకు వచ్చింది. విషయం తెలుసుకున్న సదాశివం తండ్రి తో "మీ రక్తం మీద మీకు అనుమానం ఏందుకొచ్చింది నాన్నా. చిన్న తాత మీతో అంటున్నప్పుడు నన్ను పిలవాల్సింది. ఒకేసారి అందరికీ సమాధానం చెప్పేవాడిని కదా. తన పిల్లల ఎంగిలి నాకు పెడితే మీరు అర్థం చేసుకోండి. ఏ బాంధవ్యం ఉందో. మీ వెనక నేనూ వ్యాపార పనుల మీద అన్ని ఊళ్ళూ తిరుగుతున్నానుగా. మీ వర్తక వర్గాలు ఏమైనా అంటే బాధపడాలి. చిన్న తాతకి నేను సమాధానం చెబుతా. మీరు నిశ్చింతగా ఉండండి" అంటూ కంచంలో చేయి కడిగి లేచిపోయాడు. మరో మూడు రోజుల తర్వాత పరబ్రహ్మం బజారులో సదాశివంకి ఎదురు పడ్డాడు. "ఏరా శివా బాగున్నావా? ఉండు మనం కలిసి వెళదాం" అంటూ భుజం మీద చేయి వేసి నడుస్తూ "మా వీధిలో వాళ్ళు నీ గురించి భ్రమరాంబ గురించి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు" అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన పరబ్రహ్మం మాటలని తుంచేస్తూ... "తాతా మీ అన్నయ్య రక్తం మీద మీకు సందేహం ఎందుకొచ్చింది? చిన్నప్పటి నుంచి ఆయన పెంపకంలో పెరిగేనని చెబుతుంటారు కదా. మీ కొడుక్కి నేనే చెప్పేను, ఆఫీసు నుంచి కాస్త త్వరగా రమ్మని. ఆయన ఉద్యోగం అలాంటిది. పిల్లల ఎంగిలి నాకు పెట్టిందంటే నేను ఆమెకు ఏమౌతాను. మీ వయసుకి నాకు మన్నన చేయాలని అనిపించటం లేదు. ఈ విషయాన్ని పిన్ని దగ్గర మాట్లాడకండి. మీ మర్యాద పెద్దరికం రోడ్డున పడుతుంది" సదాశివంకి ఉద్వేగం తగ్గలేదు. ఊపిరి తీసుకోవడం కోసం అర నిమిషం ఆగేడు. ఇదే అదునుగా పరబ్రహ్మం సదాశివం చేతులు పట్టుకుని "తప్పైందిరా శివా నన్ను క్షమించు" అన్నాడు. "క్షమాపణలు నాకెందుకూ. వెళ్లి మా నాన్నకి చెప్పండి" అంటూ సదాశివం - పరబ్రహ్మం చేతులు విదుల్చుకుని వడివడిగా వెళ్లిపోయాడు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయి, రోడ్డున పడిన తనని - తన చెల్లినీ పెంచి పోషించిన అన్నయ్య - ఎప్పుడూ అంటుండేవాడు. "మనం చేసే పని మంచిదైతే ఎవరి మెప్పూ దెప్పూ పట్టించుకోనవసరం లేదు". పరబ్రహ్మం కళ్ళ ముందు అన్నయ్య మెదిలాడు సదాశివం రూపంలో. *. *. *. *. *

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్