భాగవత కథలు – 20
శ్రీకృష్ణుని గురుదక్షిణ
శ్రీకృష్ణ బలరాములు కంసుని వధించిన అనంతరం తమ తల్లిదండ్రులైనదేవకీ వసుదేవులను చెఱనుండి విడిపించారు. వారితో “మా కారణంగా కంసుడు మిమ్ములను చెరసాల్లో ఉంచి బాధిస్తూ ఉంటే సామర్థ్యం ఉండి కూడా ఆపలేకపోయాము. మమ్మల్ని క్షమించండి” అన్నారు. దేవకీ వసుదేవులు పుత్రులను ఒడులలో కూర్చుండబెట్టుకొని కన్నీళ్ళతో వారి శిరస్సులు తడిపారు. మాటలు రాక మౌనం వహించారు.
శ్రీకృష్ణుడు మాతామహుడైన ఉగ్రసేనుణ్ణి తిలకించి ఇలా అన్నాడు. “రాజేంద్రా! యయాతి శాపంవల్ల వీరులైనప్పటికీ యాదవులు సింహాసనం అధిష్టించడానికి వీలు లేదు. కావున ఈ రాజ్యానికి నీవే అధిపతిగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాము”. ఇలా చెప్పి ఉగ్రసేనుణ్ణి మథురా నగరానికి రాజుగా నియమించాడు.
ఒకనాడు బలరాముడితో కలిసి నందుని వద్దకు వెళ్ళి యిట్లన్నాడు. “తండ్రీ! మేము బాల్యమంతా మా తల్లినీ తండ్రిని చూడలేదు. నిన్నూ యశోదమ్మనీ మాత్రమే తల్లితండ్రులుగా బావిస్తూ వచ్చాము. మమ్ములను మీరు ఎంతో గారాబంగా పెంచారు. ఇక్కడ మథురానగరంలో పనులు పూర్తిచేసుకొని వ్రేపల్లెకు వస్తాము”. ఆ మాటలు విని నందుడు అనురాగంతో కంట నీరు పెట్టుకొని మిగిలిన పెద్దలతో కలిసి వ్రేపల్లెకు వెళ్ళిపోయాడు.
అనంతరం వసుదేవుడు తన కుమారులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యదావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు.బలరామకృష్ణులు ఉపనయన మంత్రోపదేశములను గ్రహించినవారై విప్రులు, రాజులు, పెద్దలు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైనవారందరూ దీవెన లీయగా క్షత్రియత్వం అందుకున్నారు. అనంతరం వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానం,సువర్ణదానం మొదలైన ఎన్నో దానాలు చేసాడు. యాచకులకు వారికి అవసరమైన సమస్త వస్తువులు సమర్పించాడు.
ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని ప్రారంభించిన బలరామకృష్ణులు “ఈభూమిపై మానవులందరూ గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా!’అని బోధించాలని తలంచారు. సమస్త విజ్ఞానానికి కర్తలు, జగద్గురువులూ అయినప్పటికీ,ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ కాశీపట్నం చేరారు. అక్కడ ఉంటున్న అవంతీపట్టణ వాస్తవ్యుడూ, సమస్తవిద్యలచే విలసిల్లేవాడూ అయిన సాందీపని అనే పండితశ్రేష్ఠుని సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో, సత్ప్రవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయనను సేవించారు. ఆ ఆచార్యులు వారి వినయవిధేయతలకు ఎంతో సంతోషించారు.
సాందీపని గురువర్యులు రామకృష్ణులకు నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, ధనుర్విధ్య, తంత్రము,ధర్మశాస్త్రాలు,న్యాయ తర్క శాస్త్రాలు,రాజనీతి మొదలైన వాటిని తేటతెల్లంగా బోధించారు. రామకృష్ణులు మిక్కిల నేర్పరులైనందున అరవైనాలుగు రోజులలో చక్కగా రోజుకొక్కొక్క కళ వంతుననేర్చుకున్నారు. గురువులకు గురువులైనవారూ, లోకగురువులూ అయిన రామకృష్ణులు సంతోషంగా గురుశిష్య న్యాయంతో సాందీపనిని సేవించారు.
ఈ విధంగా కృతార్థులైన శిష్యులను చూచి వారి తెలివితేటలకు ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి సాందీపని ఇలా అన్నారు. “నాయనలారా, మా కుమారుడు కొద్ది రోజుల క్రితం సముద్రంలో ప్రభాస ఘట్టాన స్నానం చేస్తూ నీటిలో మునిగి పోయాడు. అంతే, తరువాత ఎంత వెదికినా మరల కనపడలేదు. దయాసముద్రులు, పరాక్రమవంతులూ అయిన మీరు మాకు శిష్యులైనారు కనుక గురుదక్షిణగా మా కుమారుణ్ణి తెచ్చి ఇవ్వండి. ఇది మీ కర్తవ్యంగా గుర్తించండి. శిష్యులు బలవంతులైతే గురువుకి కీర్తి లభిస్తుంది. అఖండ పరాక్రమంతో విరజిల్లే మీరు శిష్యులై ఉండి గురువు కోరిక నెరవేర్చడం న్యాయం కదా!”.
గురువుగారైన సాందీపని మాటలు విని ఆయన కోరిక తీర్చడానికి రథం అధిరోహించి సముద్రుని సమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు.“ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుణ్ణి తిరిగి మాకు అప్పగించు. లేనట్టయితో మా పదునైన బాణాలకు నీవు గురి అవుతావు”.
ఆ మాటలు విన్న సాగరుడు. “యాదవేశ్వరులారా, ప్రభాసతీర్థంలో అందమైన ఆకారం కలవాడు, మంచివాడు అయిన బ్రాహ్మణకుమారుడు స్నానం చేస్తుండగా పెద్ద కెరటం ఒక్కటి పైకిలేచి భయంకరమైన వేగంతో అతణ్ణి లోపలకు తీసుకుపోయింది. అలా లోపలికి వచ్చిన వానిని పంచజనుడు అనే దైత్యుడు మ్రింగి వేశాడు” అని చెప్పాడు.
శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖం తాలూకు ధ్వని విని పంచజనుడు భయంతో వణికిపోయాడు. శ్రీకృష్ణుడు సముద్రజలంలో ప్రవేశించాడు. అగ్నిజ్వాలల వంటి బాణాలతో పంచజనుని పడగొట్టాడు. వాని పొట్ట చీల్చివేశాడు. కాని పంచజనుని పొట్టలో బ్రాహ్మణ బాలుడు కనపడ లేదు.
రాక్షస విరోధియైన శ్రీకృష్ణుడు పంచజనుని శరీరం నుండి తయారైన ‘పాంచజన్యం’అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. కార్యతత్పరుడై బలరామునితో కలిసి మరల రథాన్ని అధిరోహించి‘సంయమని’అని పేరుగల యముని పట్టణాన్ని చేరుకున్నాడు. అలా వెళ్ళి ఆ పట్టణం వాకిటప్రళయకాల మేఘంవలె గంభీర ధ్వనితో భీతిగొలిపే తన శంఖాన్ని పూరించాడు.
ఆ శంఖధ్వని విని యమధర్మరాజు ఒక్కసారిగా తృళ్ళి పడ్డాడు.నా భుజబలాన్ని లెక్కచెయ్యక నా మనస్సుకు కోపం కలిగేటట్లు నగర పొలిమేరలో ఎవడో శంఖం పూరిస్తున్నాడు. వాడు ఈరోజు నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు అని అనుకుంటూ కోపంతో మండి పడుతూ యమధర్మరాజు వచ్చాడు.
అలా వచ్చి బలరామకృష్ణులను చూచాడు. వారు ధర్మాన్ని రక్షించడానికి భూలోకంలో అవతరించిన నరనారాయణులుగా గుర్తించాడు. భక్తితో పూజించాడు. ఆ పరమాత్మకు నమస్కరించి ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించమని అడిగాడు.
యముని మాటలు విన్న అచ్యుతుడు “ ఓ యమ ధర్మరాజా, చెపుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు కలుగబట్టి దండించడానికి తెప్పించుకున్నావు. అతణ్ణి మాకు అప్పగించు. నేను మా గురువుగారికి గురుదక్షిణగా వీనిని తిరిగి తీసుకు వస్తానని మాట ఇచ్చాను” అన్నాడు.
శ్రీకృష్ణుడి మాటలు విన్న యమధర్మరాజు ‘ఇడుగో వీడే వీనిని తీసుకుపోండి’ అని భక్తితో గురుపుత్రునిఇచ్చివేశాడు. రామకృష్ణులుదుర్మార్గులను శిక్షించే యమధర్మరాజు వద్ద శలవు తీసుకొని గురుపుత్రునితో సహా గురువుగారిఆశ్రమానికి బయలుదేరారు.
ఈ విధంగా యముని వద్ద నుండి గురుపుత్రుని తెచ్చి గురువర్యుడైన సాందీపనికి ఇచ్చి రామకృష్ణులు ‘ఇంకా ఏమి కావాలో శలవియ్యండి’ అని వినయంగా అడిగారు. అప్పుడు సాందీపుని వారితో ఇలా అన్నాడు. “ వీరకుమారులారా, గురువు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు నలుదిక్కులా వ్యాపిస్తుంది. మీరు నా శిష్యులు కావడం నా అదృష్టం. ఇంతవరకు ఎవడైనా తన గురువులకు అతడడిగిన ఇటువంటి దక్షిణ ఇచ్చినవాడు ఉన్నాడా? యమపురికి వెళ్ళి,చచ్చిన పిల్లవాణ్ణి తెచ్చియిచ్చుట ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్దాసక్తులతో మాకు మేలు కలిగించారు.ఇది మా పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి ?”
“ఓ పుణ్యాత్ములారా నేను ధన్యుడనైనాను. మీ కీర్తి సమస్త లోకాల్లోను విస్తరిల్లుగాక!” అని సాందీపని దీవించాడు.గురువుగారి వద్ద దీవెనలు అందుకున్న రామకృష్ణులు వారి వద్ద శలవు తీసుకొని తిరిగి రథాన్ని ఎక్కి మధురా నగరం చేరి శంఖాన్ని పూరించారు. అపుడు ప్రజలు వారిని చూసి, పోయిన ధనాన్ని పొందినంతగా సంతోషించారు.
*శుభం*