" రామం , నాకు అమ్మకు అమర్నాథ్ యాత్రకు పెర్మిషన్ వచ్చింది. మెడికల్ టెష్టులు అన్నీ పూర్తయాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్న అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్సించుకునే అవకాశం వచ్చింది. పక్కూరు లక్ష్మీ పురం దివాణం గారి కుటుంబం కూడా తోడుగా ఉంటారు. మాకు హిందీ భాష రాకపోయినా ఆయనకు భాష వచ్చు కనక ప్రయాణంలో ఇబ్బంది ఉండదు. అక్కడి వాతావరణానికి తగ్గ చలి దుస్తులు అన్నీ సమకూర్చుకుంటున్నాము. నీ ప్రస్తుత ఆర్మీ డ్యూటీ శ్రీనగర్ దగ్గరని తెలిపావు. వీలుంటే మమ్మల్ని కలియడానికి ప్రయత్నించు." ఆర్మీ మెడికల్ కేంపులో విధులు నిర్వహిస్తున్న కొడుకు రామారావుకు రిటైర్డ్ టీచర్ వెంకటరావు ఫోన్లో తెలియచేసారు. అవుసరమైన మెడికల్ ఫిజికల్ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకుని రెండు తెలుగు కుటుంబాలు డిల్లీ చేరుకుని కావల్నిన చలి దుస్తులు తినుబండారాలు సమకూర్చుకుని పహెల్ గాం బేస్ కేంప్ చేరుకున్నారు. టెర్రరిస్టుల ఎటాక్ భయంతో రక్షణ దళాలు సతర్కతతో దారి పొడవునా విధులు నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో వస్తున్న అమర్నాథ్ యాత్రికులతో బేస్ కేంప్ లో గుడారాలతో వసతులు , వైద్య సౌకర్యాలు సమకూర్చారు. వాతావరణం అనుకూలించక ప్రయాణంలో జాప్యమవుతోంది. వర్షాలతో కాలి బాట చిత్తడిగా మారి కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందిగా మారింది. ఎవరి అనుకూలతను బట్టి నడక ద్వారా కొందరు డబ్బు ఖర్చుతో కంచర గాడిదలు డోలీలలో ప్రయాణం సాగిస్తున్నారు. అవకాశం ఉన్నచోట యాత్రికులకు వసతులు కలగచేస్తూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై నెల నుంచి ఆగష్టు వరకు అమర్నాథ్ యాత్రికులకు అనుమతులు మంజూరయాయి. ముందుగా అనుమతులు పొందిన కొన్ని వేలమంది యాత్రికులు సురక్షితంగా అమర్నాథ్ హిమలింగాన్ని దర్సనం చేసుకుని స్వస్థలాలకు పయనమయారు. మద్యలో వాతావరణం అనుకూలించక యాత్రికులను ముందుకు పంపడానికి అధికారులు ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. వెంకట్రావు గారి కుటుంబం, దివాణం గారి కుటుంబం బేస్ కేంప్ నుంచి మెల్లగా సాగుతు మంచు లింగ ప్రవేసానికి కొద్ది దూరంలో గుడారాలలో వారి వంతు వచ్చేవరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది అమర్నాథ్ హిమ లింగాన్ని దర్సించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. సాయంకాల మైనందున యాత్రికులు గుడారాలలో బసచేసారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పైన పర్వతాలలో కురిసిన వర్షాలకు వరద పోటెక్కి బురదతో కూడిన నీటి ప్రవాహం ఒక్కసారిగా కిందకు ఉధృతితో వచ్చింది. అనుకోని ఆకస్మిక ఘటనకు అధికారులు నివ్వెరపోయారు.ఏమి చేయలేని పరిస్థితి. బురదతో కూడిన వరదనీరు గుడారాలను ముంచి తుడుచుకు పోయింది. ఎన్నో గుడారాలు వరద నీటిలో కొట్టుకు పోయి అందులో బస చేసిన చాలామంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఆచూకీ తెలియడంలేదు. ఆర్మీ , బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ టిబెటియన్ ఫోర్స్ ఇలా రక్షణ దళాలు రంగంలో దిగాయి. ఎందరినో ప్రాణాలతో రక్షించాయి. గాయపడిన వారిని వాయుసేన హెలీకాఫ్టర్లలో దగ్గరున్న హాస్పిటల్సుకి తరలించారు. ఆర్మీ , బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వైద్య దళాలు బాధితులకు బాసటగా నిలిచి ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఆర్మీ మెడికల్ దళంలో పనిచేస్తున్న మేల్ నర్స్ రామారావు శ్రీనగర్ నుంచి అమర్నాథ్ యాత్రికుల వైద్య సహాయానికి పంపడం జరిగింది. తన అమ్మా నాన్న అమర్నాథ్ యాత్రలో ఉన్నందున వారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్నాడు. ఆర్మీ మెడికల్ శిబిరంలో యాత్రికులకు వైద్య సేవలు అందిస్తూ అధికారులతో తన పేరెంట్స్ గురించి వాకబు చేస్తున్నాడు మేల్ నర్స్ రామారావు.. చనిపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్నాడు. ఒక శిబిరంలో చూసిన తన తల్లి మృతదేహం చూసి స్థబ్దుడయాడు.బురదతో నిండిన శరీరాల్ని శుభ్రం చెయ్యగా వ్యక్తుల గుర్తింపు జరుగుతోంది. మరొక శిబిరంలో తండ్రి గాయాలతో కనబడ్డాడు. అమర్ నాథ్ పవిత్ర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారనుకున్న అమ్మా నాన్నలు ఇలా దుర్ఘటనలో చిక్కుకుంటారనుకో లేదు. ఈ దుర్ఘటనలో తల్లి దుర్మరణం , తండ్రి చావు బతుకుల్లో ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు ఆర్మీ మెడికల్ మేల్ నర్స్ రామారావు. * * *