అనుకోని బంధం - జీడిగుంట నరసింహ మూర్తి

Anukoni bandham

ఆవిడ పేరు నిర్మల. మా పక్క వాటాలో ఒక్క గదిలో ఉంటోంది. ఏదో ఆఫీసులో చేస్తోంది అనుకుంటా. . ఉదయాన్నే పది గంటలకు కాలనీ బస్సు పట్టుకుని మళ్ళీ సాయంత్రం ఏడూ ఆ ప్రాంతంలో ఉసూరుమని ఇంటికి వస్తుంది. వయసు మూప్పై అయిదుకు అటూ ఇటూ ఉంటాయేమో. పెళ్లి అయినట్టుగా లేదు. పెద్ద కళ్ళద్దాలుతో , ఎర్రగా పొట్టిగా ఉంటుంది. చూస్తూంటే ఆమెకు బంధువులు కూడా ఎవరూ ఉన్నట్టు లేరు. ఎప్పుడూ ఎవరూ ఇంటికి వస్తున్నట్టు అలికిడి లేదు. . ఆ ఒక్కగదిలోనే గ్యాస్ స్టవ్ పెట్టుకుని జీవితాన్ని ఒంటరిగా లాగేస్తోంది. ఆ గదికి ఆనుకుని బయట ఆవిడ కోసం ప్రత్యేకంగా బాత్ రూమ్ ఉంది. ఆవిడ స్నానానికి ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియనట్టుగా ఉదయాన్నే పనులు కానిచ్చేస్తుంది. ఆవిడ గొంతు వినపడటం మాకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. .

మేము ఆ ఇంటికి వచ్చేటప్పటికే నిర్మలగారు ఆ గదిలో ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. పాపం ఎవరి సాయం లేకుండా ఒంటరి జీవితం గడుపుతోంది. ఒకటి రెండుసార్లు ఆవిడను పలకరించాలని మా ఆవిడ ప్రయత్నం చేసినా అవకాశం దొరకలేదు. ఆఫీసునుండి వచ్చేటప్పుడు , వెళ్ళేటప్పుడు అటూ ఇటూ చూడకుండా తిన్నగా తన రూములోకి వెళ్లిపోతుంది.

మా ఇంట్లో అవసరమైన దానికన్నా ఎక్కువ కూరలు , పులుసులు వండుకోవడం అలవాటు. ఏ ఆదివారం పూటో ఆ అమ్మాయికి ఏ కూరో , పులుసో ఇద్దామని అనుకున్నా ఆవిడ పద్ధతి చూస్తూంటే అవి తీసుకుంటుందో లేదో అనుమానమే. . ఇంట్లో ఉన్నా కూడా తలుపు మూసే ఉంటుంది. బహుశా భద్రత కోసం అయ్యి ఉంటుంది. .

నిర్మలగారి మెడలో బాగానే నగలు కనిపిస్తున్నాయి. ఏదో మంచి ఉద్యోగమే చేస్తోందని పిస్తోంది. బాగా డబ్బున్న దానిలా కనపడినా ఒంటికాయి కొమ్ములాగా పెళ్లీ పెడాకులు లేకుండా ఎలా ఉండగగలుగుతోందో అన్న అనుమానం కలిగినా మనకెందుకులే అని ఊరుకున్నాము.

ఒక సారి మా ఇంట్లో మా పిల్లాడి పుట్టిన రోజు పార్టీ ఉంటే పక్క వాటాలోనే ఉంటోంది కదా పిలవకపోతే బాగోదని మా ఆవిడ నిర్మల గారి గుమ్మం దగ్గరే నిలబడి " సాయంత్రం మా ఇంట్లో మా అబ్బాయి బర్త్ డే ఫంక్షన్ వుంది. మీరు కూడా తప్పకుండా రావాలి " అని గబగబా చెప్పేసి వచ్చేసింది. . ఆవిడ వస్తానని చెప్పలేదు రానని చెప్పలేదు ఒక చిరునవ్వు మాత్రం నవ్వి ఊరుకుంది.

ఆ సాయంత్రం తెలిసిన వాళ్ళందరూ వచ్చి పిల్లాడిని ఆశీర్వదించి వెళ్లారు. నిర్మల గారు వస్తుందేమో అని నేనూ , మా ఆవిడ కూడా ఎదురు చూసాము. రోజూ ఏడుగంటలకల్లా ఇంటికొచ్చే ఆవిడ ఆ రోజు ఎనిమిది దాటినా రాలేదు. బహుశా మొహమాటపడి ఆఫీసులో ఎక్కువసేపు కూర్చుని ఉండి ఉంటుంది అని అనుకున్నాను.

ఫంక్షన్ అదీ ముగిశాక పెరుగు ప్యాకెట్ తెద్దామని బయట షాపుకు వెళ్ళాను . అక్కడ బస్ స్టాప్ దగ్గర నిర్మల గారు అయోమయంగా చూస్తూ నిలబడి ఉండటం గమనించి ఆశ్చర్యపోయాను . . ఆమె చుట్టూ కొంతమంది జనం మూగి ఉన్నారు. నాకు అనుమానం వచ్చి షాపు వాడిని కనుక్కున్నాను " ఏమిటి ఈ వేళలో ఆవిడ ఇక్కడ నిల్చుని ఉంది. చుట్టూ ఆ జనం ఏమిటి ?"అని .

" ఆవిడ బస్సు దిగీ దిగగానే ఎవడో దొంగ ఆమె మెడలో మొత్తం నగలు ఒలిచేసి పారిపోయాడుట. అప్పుడే కరెంట్ పోయి ఉండటంతో ఆవిడ గమనించినట్టుగా లేదు. కరెంట్ రాగానే చూసుకుంటే మెడలో నగలు లేవు. పాపం అమాయకురాలిలా ఉంది గట్టిగా అరవలేదు కూడా. నిస్సహాయంగా అటూ ఇటూ చూస్తూండి పోయిందిట . మాకు అనుమానం వచ్చి అడిగితే చెపుతోంది అంతా కలిపితే కనీసం నగలు రెండు లక్షలు పైగానే చేస్తాయిట . ఏమీ చేయలేని పరిస్తితిలో మాతో చెప్పి చెప్పుకుని ఏడుస్తోంది . "అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావమ్మా?" అని అడిగితే కరెంట్ పోవడం వల్ల చీకట్లో తెలియలేదు అని అమాయకంగా చెప్పింది. ఎవరో చాలా రోజులనుండి ఈమెను గమనిస్తున్నారని మాకు అనుమానం. ఆవిడకెవరూ తోడూ నీడా లేరని చెప్తున్నారు ఇక్కడం మూగిన జనం. " అన్నాడు షాపు వాడు బాధను వ్యక్తం చేస్తూ.

ఇక నేను కలిపించుకోకపోతే బాగుండదని ఆమె దగ్గరికి వెళ్ళి " చాలా దురదృష్టం నిర్మల గారూ . నేను మీకు సోదరుడిలాంటి వాడిని. పైగా పక్క పక్క ఇళ్ళల్లో ఉంటున్నాము. జరిగింది కొద్దిగా వివరంగా చెపితే నేనేదైనా సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను " అన్నాను

ఆవిడ తలవంచుకుని మాట్లాడుతూనే " ఏమో నండీ ఎప్పుడూ ఇలా కాలేదు. నేను బస్సు దిగిన చోట ఈ రోజు లైట్లు కూడా వెలగడం లేదు. ముందుకు వెళ్లడానికి సాహసం చేయలేక పక్కనే వున్న షాపు దగ్గర కొద్దిసేపు నిలబడదాం అనుకున్నాను. ఈ లోపే ఎవరో దొంగ నా నోరు మూసేసి మెడలో ఉన్న నగలు లాక్కుపోయాడు " అంటూ బేలగా చెప్పింది .

"ఒంటరి జీవితానికి పాపం ఎన్ని సమస్యలు ? " అని మనసులో అనుకుని "పదండి. ఇంటికి. ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం. ఇలా బజార్లో నిలబడి ఉండటం వల్ల ఏమీ ఉపయోగం లేదు " అంటూ ఆమెతో పాటు నడిచాను.

వెళ్తూనే జరిగిన విషయం మా ఆవిడకు చెప్పాను.

"అయ్యో ఎంత పని జరిగింది ?చాలా రోజులనుండి చూస్తున్నాను . అన్ని నగలు వేసుకు వెళ్లొద్దని చెప్పాలని ప్రయత్నించినా ఆవిడ మనకు ఎప్పుడూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. " అంది నిష్టూరంగా తను .

"నిర్మల గారికి ఆ కేకూ, బిర్యానీ తీసుకెళ్లి ఇయ్యి. ఇంత ప్రమాదం జరిగాక ఇప్పుడేం వండుకుంటారు ? తీసుకోకపోయినా బలవంతంగానైనా ఇచ్చేయ్యి " అన్నాను ఆమెపైన జాలి పడుతూ. .

మా ఆవిడ వెంటనే అక్కడనుండి కదలలేదు. తనకు ఏదైనా సహాయం చేద్దామని ఎన్నో సార్లు అనుకున్నా బెల్లం కొట్టిన రాయిలా ఎప్పుడూ మాటా మంచీ లేకుండా మౌనంగా ఉంటూ ఉండటం వల్ల మా ఆవిడ కూడా కాస్త బెట్టు చూపించాలని అనుకుంటోంది. వెంటనే అక్కడనుండి కదలకుండా టీవీ దగ్గర కూర్చుండి పోయింది. .

మానవత్వం గురించి టన్నుల టన్నుల కొద్దీ పేపర్లు కథలు వ్రాసి పారేస్తూ ఉంటారు. గంటలు గంటలు వేదికలమీద ఉపన్యాసాలు దంచేస్తూ ఉంటారు . కానీ నిజజీవితానికి వచ్చేసరికి ప్రతి వాడూ మనకెందుకులే అని తటస్తంగా ఉండే వాళ్ళే ఎక్కువ. . కానీ నాకెందుకో నిర్మల గారి విషయంలో చూస్తూ ఊరుకో బుద్ది కాలేదు. మా ఆవిడను కొద్దిగా సీరియస్గానే హెచ్చరించి మేము మా పిల్లాడి పుట్టిన రోజు కోసం చేసుకున్న పదార్ధాలను తీసుకెళ్లి ఇమ్మని పురమాయించాను .

పెద్ద పళ్ళెంలో బిర్యానీ, స్వీట్స్ తో వెళ్ళిన తనని చూడగానే అప్పటివరకూ దూరంగా మసులుతూ ఉండే నిర్మల గారు చిన్న పిల్లలా కౌగిలించుకుని ఏడవసాగింది. ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. పెదవులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి. ఈ ఊహించని సంఘటనకు మా ఆవిడకు కూడా మనసు నవనీతంలా కరిగిపోయింది. అసంకల్పితంగా ఆమె తలమీద చెయ్యి వేసి మంచమ్మీద కూర్చోబెట్టి " మీరేమీ కంగారూ పడకండి నిర్మలగారు . ముందు కాస్త ఎంగిలి పడండి. మీ నగల విషయం ఆయన చూస్తారు. ఆయన మేనమామ పోలీసు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. నేను కూడా ఆయనకు మీ విషయంలో సహాయపడమని చెపుతాను. మీరు మొహమాట పడకుండా ఆయనకు కంప్లైంట్ లెటర్ వ్రాసి ఇవ్వండి. పోయింది ఏ వెయ్యో రెండు వేలో కాదు సరిపెట్టుకోవడానికి. .లక్షల్లో ఉంటుందని నేననుకుంటున్నాను " అంటూ నిర్మలను బలవంతం చేసింది మానవతా దృక్పథంతో. .

జరిగిన సంఘటనకు నిర్మల గారు మానసికంగా క్రుంగిపోయినట్టు కనిపిస్తోంది. ఆఫీసులో మొహం చూపించలేనని అనుకుందో ఏమో ఒక మూడు నాలుగు రోజుల పాటు అటువైపు వెళ్లనే లేదు. గదిలోపల నుండి సన్నగా మూలుగు వినపడుతూంటే కంగారుగా మేమిద్దరం నిర్మల గారి తలుపు కొట్టాం .బలవంతాన తూలుతూ లేచి తలుపు తీసింది , అనుమానం వచ్చి చూస్తే ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది.

"లేదు ఆవిడ మానసికంగా అప్సెట్ అయినట్టుగా కనిపిస్తోంది. వెంటనే ఎవరికైనా డాక్టర్కి చూపించడం అవసరం . మీరు బయటకెళ్లి ఒక ఆటొ తీసుకురండి ." అంది మా ఆవిడ నన్ను కంగారుపెడుతూ.

నేనింకా ఏమీ ఆలోచించదల్చుకోలేదు. మరో అరగంటలో మా ఆవిడ నిర్మలగారిని ఆటోలో అదే కాలనీలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు తీసుకుని ఆమెతో పాటు అదే ఆటోలో ఇంటికి తీసుకొచ్చింది.

అనుకున్న ప్రకారం నేను నిర్మల గారు వ్రాసిచ్చిన రిటెన్ కంప్లయింట్ పోలీసు డిపార్ట్మెంట్ లో మా మేనమామ గారికి వ్యక్తిగతంగా ఇచ్చి సాధ్యమైనంత త్వరగా ఆవిడ నగలు దొరికేటట్టుగా చూడమని చెప్పాను.

నేనూ, మా ఆవిడ చూపిస్తున్న ఆదరణ వల్లనేమో నిర్మలగారిలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తోంది. రోజుకు అరగంటసేపైనా మా ఆవిడతో మాట్లాడుతోంది. మనిషిలో కూడా బేలతనం తగ్గింది. రానూ రానూ వాళ్ళిద్దరి మధ్య చనువు పెరిగింది. తను వండిన పదార్ధాలు తీసుకుంటోంది. ఖాళీ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి కూరలు తరిగిపెట్టడం, బియ్యం ఏరిపెట్టడం చేస్తోంది.

నేను తీసుకున్న శ్రద్దవల్ల , మా మేనమామ వ్యక్తిగతంగా దర్యాప్తు ఫలితంగా నిర్మల గారి నగలు త్వరగానే పట్టుకోగలిగారు. అవి చూశాక ఆమె మొహంలో కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె మా ఇంట్లో ఒక సభ్యురాలిగా మారిపోయింది. మాకు కూడా నిర్మల గారిలో కలిగిన మార్పుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఒక ఒంటరి స్త్రీకి మరింత సాయపడి ఆవిడ జీవితాన్ని దారిలో పెట్టాలని మా ఇద్దరికీ అనిపించింది. దాని పర్యవసానమే నేను మా ఆఫీసులో పని చేస్తున్న సెక్షన్ ఆఫీసర్ తో నిర్మలగారి ప్రస్తావన తీసుకురావడం. ఏవో వ్యక్తిగత కారణాల వల్ల మా కొలీగ్ రాజేష్ పెళ్ళికి దూరంగా ఉండటం , ఇప్పుడు నిర్మల విషయంలో నాకు అతన్ని పెళ్లి విషయం కదిపే అవకాశం వచ్చింది. ఎప్పుడూ పెళ్లి విషయంలో చర్చించడానికి ఏ మాత్రమూ ఇష్టపడని రాజేష్ నేను నిర్మల గారి విషయం చెప్పినప్పుడు కాదూ అవును అనకుండా మౌనంగా ఉండటంతో , మౌనం అర్ధాంగీకారం అనుకుని విషయాన్ని ముందుకు తీసుకెళ్లాను. దాని ఫలితమే ఒక ఆదివారం నాడు రాజేష్ మా ఇంటికి రావడం, అప్పటికే నిర్మల గారితో మాట్లాడి ఉండటంతో మా ఇంట్లోనే వాళ్ళ పెళ్లి చూపులు జరిగాయి. ఇదంతా నిర్మల గారు కలలో కూడా ఊహించని విషయం. తను ఎవరికోసం ఉద్యోగం చేస్తోందో, ఎవరి కోసం జీవిస్తోందో ఆమెకే తెలియని పరిస్తితులు. జరుగుతున్న పెను మార్పులుతో ఆమెను ఆవహించిన ఒంటరితనం, దిగులు పారిపోయాయి.

సరిగ్గా అదే సమయంలో నిర్మల తన వాళ్ళను గురించి బయటపెట్టింది. తన తల్లి తండ్రులు కాకినాడ దగ్గర చిన్న గ్రామంలో ఉంటున్నారని , ఇంట్లో వాళ్ళు చేయబూనిన బలవంతపు పెళ్లి ఇష్టం లేక వాళ్ళకు దూరంగా ఇంట్లో ఉన్న నగలతో పారిపోయి వచ్చి వాళ్ళకు దూరంగా ఈ వూళ్ళో ఉద్యోగం చేసుకుంటున్నాని , గత కొన్నేళ్లుగా తన గురించి ఏ వివరాలు వాళ్ళకు తెలియదని, అయితే వాళ్ళు ఇప్పుడు సజీవంగానే ఉన్నారని తనకు తెలుసని , తనకు పెళ్లి మీద ఏ ఆసక్తి లేదని మీలాంటి మంచి మనుషులు నా జీవితంలో ప్రవేశించి తిరిగి ఆశలు కలిపించారనీ చెప్పుకు రావడంతో నేను, మా ఆవిడ విభ్రమ చెందాము. ఇప్పుడు నా ఆలోచనలు నిర్మల తల్లి తండ్రుల చుట్టూ పరిభ్రమించసాగాయి. కొన్ని బంధాలు అవతలి వారితో ఏ అనుబంధమూ లేకుండానే విడదీయరాని బంధంగా పెనవేసుకుపోతాయి. . అదే నిర్మల విషయంలో కూడా మాకు జరిగింది. . వెంటనే నిర్మల నుండి ఆమె తల్లి తండ్రుల అడ్రెస్ సేకరించాను. దాని ఫలితమే నా కాకినాడ ప్రయాణం. కూతురు క్షేమంగానే ఉందని తెలిసిన నిర్మల తల్లి తండ్రులలో ఆనందానికి అవధులు లేవు. ఆ క్షణంలో వాళ్ళు నన్నో దేవుడిగా భావించారు. మేము కూడా మీ అమ్మాయి నిర్మల మా జీవితంలో తటస్త పడటం ఒక వింతల్లో వింత గా అనుకుంటున్నామని మాటల్లో మాటగా ఆమె పెళ్లి విషయం బయట పెట్టాను.

ఇప్పుడు వారికి వేరే ఆలోచనలు లేవు. తమ కూతురు బ్రతికి ఉండటమే వారికి కావలసింది.

నిర్మల తల్లి తండ్రుల సమక్షంలో ఆమె పెళ్లి గుళ్ళో సాధ్యమైనంత ఘనంగా జరిపించడంతో , ఒక మంచి పని చేసి ఒక నిండు జీవితాన్ని నిలబెట్టామన్న తృప్తి మాలో ఎప్పటికీ సజీవంగా మిగిలిపోయింది. *****

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్