పూర్వం హరిహరపురంలో ధనగుప్తుడు అనే వృద్ధ వర్తకుడు ఉండేవాడు. భార్య చనిపోవడంతో ఒంటరి జీవితం గడుపు తున్నాడు. సంతానం లేదు కాని ధనపిపాసి. వ్యాపారంలో కల్తీ , దొంగ కొలతలు చేస్తున్నప్పటికీ మనసున్న మారాజు. ధర్మాత్ముడు. ఉదయం గుడిలో ధర్మకార్యాలకు, దారిలో పశు పక్ష్యాదులకు ఆహారం , బిక్షగాళ్లకు ధన సహాయం చేస్తుంటాడు. ఒకసారి వ్యాపారం నిమిత్తం సరుకులు మూట కట్టి వర్తకుడు మరొక ఊరు వెళ్లవలసి వచ్చింది. ఊరు చేరేసరికి సాయంత్రమైంది. సరుకులు మొయ్యడానికి కూలిమనిషి కోసం ఎదురు చూస్తుంటే దూరంలో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతన్ని దగ్గరకు పిలిచి సరుకుల మూట చూపించి ఎంత డబ్బు కావాలని అడగ్గా మీకు తోచింది ఇవ్వమని చెబుతు ఒక షరతు పెట్టాడు. దారిలో తను చెప్పేది వింటూ ఉ కొట్టాలని చెప్పగా వ్యాపారికి కోపం వచ్చినా గత్యంతరం లేక అంగీకరించాడు. సరుకుల మూట నెత్తిన పెట్టుకుని కూలి మనిషి నడుస్తుంటే వర్తకుడు వెంట వస్తున్నాడు. గమ్యస్థానానికి చేరిన తర్వాత వ్యాపారి కూలివానికి అనుకున్న డబ్బులు ఇచ్చాడు. కూలి డబ్బులు తీసుకుంటు ఆ వ్యక్తి "తను దారిలో చెప్పింది ధ్యానంగా విన్నావా?" అని అడిగాడు. "నా అవుసరం కొద్దీ నీ మాటకు అంగీరరించానే కాని నువ్వేం చెప్పావో తెలియదు " అన్నాడు వ్యాపారి. ఆ మాట విన్న కూలివ్యక్తి కోపంతో " చాలా పెద్ద తప్పు చేసావు శేఠ్! నేను నీ మేలు కోరే ఆ షరతు పెట్టాను. నాకు మా కులదేవత ఆశీర్వాదం వల్ల ఒక వరం ప్రాప్తించింది. సంవత్సరంలో మొదటి అమావాస్య నాడు నాకు నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కల ప్రకారం నేను చూసింది నిజమవుతుంది.ఈ రోజు నేను ఎవరికి సేవ చేస్తే ఆ వ్యక్తి మరునాడు చనిపోతాడని తెల్సింది. కనుక రేపు సాయంకాలం మీరు ఇంటికి వెళ్లిన వెంటనే చనిపోతారు" అన్నాడు. తన చావు కబురు విన్న వ్యాపారికి కోపం వచ్చినా సర్దుకుని "మనిషన్న వాడికి చావు పుట్టుక సహజం కదా , నాకు వయసు మీరిపోయింది కనక మృత్యువు వస్తే చనిపోతానన్నాడు" శేఠ్. "అందుకే చెబుతున్నాను. మీరు చనిపోయిన వెంటనే మీ జీవిని పట్టుకుని యమభటులు నరకానికి తీసుకెళతారు. అక్కడ మీ పాప పుణ్యాలు లెక్క కట్టి ఏది ముందు అనుభవిస్తావని అడిగితే ముందుగా పాప శిక్ష అనుభవించి తర్వాత పుణ్యఫలం కళ్లతో చూస్తానని కోరుకో" అని చెప్పి తన దారిన పోయాడు ఆ వ్యక్తి. మర్నాడు వ్యాపారి తన చావు సాయంకాలమని తెలిసి ఇంటికి చేరిన వెంటనే తన వద్ద నున్న బంగారం సంపద అంతా ఒక సంచిలో ఉంచి మద్యలో తను పడుకున్నాడు. సాయంకాలం యమభటులు వ్యాపారి ప్రాణం కోసం వచ్చి పాశంతో జీవిని తీసుకుపోతుంటే వ్యాపారి అరుస్తూ నా సిరి సంపదలు వెంట తీసుకురండని చెప్పగా "మూర్ఖుడా ! ఇప్పుడు నీ వెంట నువ్వు చేసిన పాప పుణ్యాలే వస్తాయి కాని సంపద కాదు పద "అంటూ యమలోకానికి తీసుకుపోయారు. అక్కడ నరకలోకంలో యమధర్మరాజు సమక్షంలో చిత్రగుప్తుల వారు భూలోకంలో వ్యాపారి చేసిన పాప పుణ్యాల చిట్టా విప్పి చూస్తే ఆయన జీవితంలో మూడు వంతులు పుణ్య కార్యాలు ఒక వంతు పాపకార్యం చేసినట్టు తేలింది. యమధర్మరాజు పాప పుణ్యాలలో ఏది ముందు అనుభవిస్తావని వ్యాపారిని అడిగితే ముందుగా పుణ్యఫలం అనుభవించి తర్వాత పాపఫలం అనుభవిస్తానని చెప్పాడు. మా నరకలోక పద్ధతి ప్రకారం ముందు పాపఫలం తర్వాత పుణ్యఫలం దక్కుతుందనగానే " లేదు, లేదు నాకు పుణ్యఫలం ఎక్కువగా ఉంది కనుక ముందు నేను పుణ్యఫలమే అనుభవిస్తానని" మొండి పట్టు పట్టాడు. సమస్య జటిలమవడంతో యమరాజు వ్యాపారి జీవుణ్ణి వెంట తీసుకుని సృష్టికర్త బ్రహ్మ దేవుల వారి వద్దకు వెళ్లాడు. బ్రహ్మదేవుల వారు కూడా వేదాలు , అన్ని జ్ఞాన పత్రాలు తిరగేసి నప్పటికీ సమస్యకు సరైన సమాధానం దొరకలేదు. బ్రహ్మ దేవుడు కూడా తికమక సమస్యకు జవాబు దొరక్క భూలోక ప్రాణిని , యమరాజును వెంట పెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. బ్రహ్మ ద్వారా భూలోక ప్రాణి మొండి కోరిక తెలుసుకుని అతను చేసిన పుణ్య కార్యాలు పాపకార్యాలు తెలుసుకుని జీవిత ఆఖరి సమయంలో స్వార్థం వదిలి తన సంపాదనలో ఎక్కువ మానవత్వంతో దైవకార్యాలకు , దానధర్మాలకు వినియోగించాడు. వ్యాపారరీత్యా చేసిన పాప కార్యం ఎవరికీ హాని కలిగించలేదు కాబట్టి అది పాపఫలం కింద రాదు. అదీగాక భూలోక జీవి ప్రత్యక్షంగా నన్ను చూసి మరింత పుణ్యం సంపాదించాడు. ఇతడిని ప్రాణాలతో స్వర్గలోక ప్రాప్తి కలిగించమని ఆదేశించాడు వైకుంఠవాసి విష్ణుమూర్తి. కనుక మానవ జనులారా , సద్గురువులు చెప్పే ప్రవచనాలు శ్రద్ధగా వింటే సన్మార్గానికి దారి సుగమవుతుంది. * * *