అదొక ప్రభుత్వ ఉన్నత పాఠశాల.
ఆరోజు పాఠశాల వార్షికోత్సవం. సాయంత్రం ఆరు గంటలకు సభ ఆరంభమయ్యింది. ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి రామచంద్రయ్య గారు హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. తమ బిడ్డలు బహుమతులు అందుకోబోయే దృశ్యాలను కళ్ళారా చూడాలని తహ, తహలాడుతున్నారు.
వేదికపై కూర్చొన్న పెద్దల ఉపన్యాసాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అందులో చివరి కార్యక్రమం అందరినీ మరింతగా ఆకట్టుకుంది. అది రామాయణం లోని ‘సీతాదేవి’ ఏకపాత్రాభినయం. లవ, కుశులను శ్రీరామచంద్ర ప్రభువుకు అప్పగించి సీతాదేవి తన తల్లి భూమాత ఒడి లోకి చేరుకునే సన్నివేశాన్ని కన్నులకు కట్టినట్టుగా అభినయించింది చిన్నారి సుమేధ. సభ యావత్తు కంటతడి పెట్టింది. కరతాళ ధ్వనులతో అభినందించింది.
ఇక బహుమతుల కార్యక్రమం.. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. వ్యాయామ ఉపాధ్యాయులు బ్రహ్మానందం బహుమతుల వివరాలు ప్రకటిస్తారని చెబుతూ.. ముఖ్య అతిథి రామచంద్రయ్యగారి చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు అందజేయాలని విజ్ఞప్తి చేసారు.
బ్రహ్మానందం గొంతు సవరించుకుని.. “ముందుగా తరగతిగదుల అలంకరణ విభాగంలో ఎనిమిదవ తరగతికి ప్రధమ బహుమతి. తరగతి నాయకురాలు సుమేధ” అంటూ తనదైన శైలిలో ప్రకటించాడు. విద్యార్థుల కేరింతలు, చప్పట్లు మిన్నంటాయి.
స్వయం పరిపాలనా దినోత్సవం నాడు తెలుగు ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించిన సుమేధకు ప్రధమ బహుమతి. వ్యాసరచన, వక్తృత్వ, పాటల మరియు చిత్రకళా పోటీలలో.. నేటి ఏకపాత్రాభినయానికి గాను సుమేధకు ప్రథమ బహుమతి రావడం సభ సాంతం అభినందనల ఝల్లు కురిపించింది.
“ఈసంవత్సరం మన ఊరిలోని మహిళా అభ్యుదయ సంఘం విద్యార్థులకు కథల పోటీ నిర్వహించింది. అందులో గెలుపొందిన వారికి నగదు బహుమతులు పంపారు. వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదములు తెలుపుతున్నాము” అంటూ మరో ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు బ్రహ్మానందం. సభ ఉత్సుకతతో ఎదురి చూడసాగింది.
“ప్రథమ బహుమతి సుమేధ” అని ప్రకటించగానే రామచంద్రయ్యగారు లేచి సుమేధకు ఎదురుగా వెళ్లి తన హృదయానికి హత్తుకున్నాడు. ఆదృశ్యం చూసి సభ యావత్తు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మరో మారు జేజేలు పలికింది.
“సుమేధా..! నీ శక్తిసామర్థ్యాలు సామాన్యమైనవి కావు. సాహిత్యం మీద పట్టు సాధించడం చాలా గొప్ప విషయం. నువ్వు ఎలా కృషి చేస్తున్నావో సభకు తెలియజేయమ్మా” అంటూ మైకు ముందుకు తీసుకు వెళ్ళాడు రామచంద్రయ్య.
సుమేధ ఏమాత్రమూ తొణకకుండా సభను వినయంగా సంభోదించింది.
“నేను ప్రభుత్వపాఠశాలలో చదవడం మహాభాగ్యం. ఉపాధ్యాయులందరూ చక్కగా పాఠాలు చెబుతున్నారు. వారికి ముందుగా నా వందనాలు” అంటూ శిరస్సు వంచి నమస్కరించింది.
“నాకు సాహిత్యంలో అభిరుచి కలిగించింది మానానమ్మ శారదమ్మగారు. మా తాతగారు పోయాక నానమ్మ మాఇంటికి వచ్చింది. నానమ్మను అనాథాశ్రమంలో చేర్పిస్తామంటే నేను అన్నం తినకుండా మారాం చేసి అడ్డుకున్నాను. నాన్నమ్మ నేను మంచి స్నేహితులమయ్యాం. రాత్రి పడుకునే ముందు నానమ్మ నాకు పౌరాణిక కథలు చెబుతుంది. ‘భారతి’ అనే కలం పేరుతో కథలు రాస్తుంది. వివిధ పత్రిఅకల్లో వచ్చాయి. కాని పుస్తకరూపంలో రాలేదు. నానమ్మకు చిత్రలేఖనం, సంగీతం కూడా వచ్చు. నానమ్మ చూపిన బాటలో నడుస్తున్నాను. అందుకే ఇన్ని బహుమతులు వచ్చాయి” అంటూ కళ్ళు పెద్దవిగా చేసుకుని శారదమ్మ ప్రతిభను హావభావాలతో చూపింది.
“నాకథకు వచ్చిన నగదును మన విద్యాశాఖాధి గారు నానమ్మకు బహుమతిగా అందజేయాలని కోరుకుంటున్నాను. దానిని నానమ్మ తన కథా సంపుటిని అచ్చువేయించదానికి వాడుకోవాలని వేడుకుంటున్నాను” అంటూ శారదమ్మను వేదిక పైకి వినయంగా పిలిచింది.
శారదమ్మ వేదికనెక్కుతుంటే సభ యావత్తు జేజేలు పలికింది.*