"వీరభద్రం, సైకిల్ కి పంక్చర్ వేసావా? రెడీయా!"
" రెడీ మేస్టారూ, తీసుకెళ్లండి"
"ఏంటి, వెంకట లక్ష్మి కనబడటం లేదు.ఇంట్లో ఉందా?"
" లేదు సార్, ఇప్పుడు పదవ తరగతి కొచ్చింది కదా! ఉదయం స్కూలుకి పోయి సాయంకాలం, శలవురోజుల్లో నాకు సాయంగా ఉంటాది. నా ఆడది పోయి సంవత్సరం దాటిపోనాది. ఇంటి పనీ, నాకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. నాకు యాక్సిడెంట్ జరిగి నడుం పడిపోయినప్పటి నుంచి పైన పనులు చూసుకోలేక ఇంటికాడే ఈ సైకిల్ రిపైరు షాపు పెట్టుకుని కూకుని చిన్న చిన్న పనులు చేస్తుంటే వెంకటలక్ష్మి ఇంటి పనులు చేసి నాకు సైకిల్ పంక్చర్లు వెయ్యడం, రిపైర్ పనులు, టైర్లలో గాలి కొట్టడం సాయం చేస్తాది. ఇప్పుడు పెద్ద తరగతి కొచ్చినాది కదా, ఈ ఏడు పబ్లిక్ పరిక్షట. బాగా చదవాలని ఇంటి పనులు, సైకిల్ షాపు పనులు తొందరగా పూర్తి చేసి బడికి పోతాది." సైకిల్ పంక్చరు కిచ్చిన ఎలిమెంటరీ స్కూలు మేస్టారికి తన గోడు వెళ్లబోసుకున్నాడు వీరభద్రం.
"వీరభద్రం , వెంకటలక్ష్మి తెలివైన పిల్ల. బాగా చదివించు. ప్రభుత్వం ఆడపిల్లల చదువులకు ఎన్నో సౌకర్యాలు కలిగిస్తున్నారు. పాఠశాలలు దూరంగా ఉంటే ఉచిత సైకిళ్ళు, పుస్తకాలు, స్కాలర్ షిప్సు ఇంకా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి." పరమేశం మేస్టారు చెప్పుకు పోతున్నారు.
"నిజమే సామీ, సర్కారు ఆడపిల్లల సదువులకి సదుపాయాలు ఇస్తున్నా నా బోటి ఎనకసాయం లేనోళ్లకు ఆడపిల్లని దూరం కాలేజీ సదువులంటే కష్టమే." తన అశక్తత చెప్పాడు వికలాంగుడు వీరభద్రం.
" చూడు, వీరభద్రం! మనకి కస్టాలున్నాయని ఆడపిల్లల భవిష్యత్ పాడు చెయ్యకూడదు. ఏదో ఒక మార్గం చూడాలి. మీ కుటుంబంలో ఎవరైన సహాయం చేసేవారుంటే పిలిపించు." పరమేశం మేస్టారు సలహా ఇచ్చి సైకిల్ తీసుకువెళ్లారు.
మేస్టారు ఇచ్చిన సలహా బాగానే అనిపించింది వీరభద్రానికి. తన బాగు కోసం ఆడపిల్ల భవిష్యత్ పాడుచెయ్యకూడదనుకున్నాడు. తన మేనల్లుడు నర్సిగాడు ఊళ్లో బేవర్సుగా తిరుగుతున్నాడు. ఆణ్ణి నచ్చచెప్పి ఇక్కడికి రప్పిస్తే తనకి సాయంగా ఉంటాడు. తన అక్క, బావకి కట్నం తక్కువ ఇచ్చానని మాటా మాటా పెరిగి అలిగి తనతో తెగతెంపులు చేసుకుంది. బావ తాగి బండి నడిపి యాక్సిడెంట్లో చచ్చి పోతే తన దగ్గరకు రమ్మన్నా పంతం పట్టి ఇటు చూడలేదు. చివరికి నా భార్య చావు బతుకుల్లో ఉన్నా చూడ్డానికి రాలేదు. ఇప్పుడు నర్సిగాణ్ణి ఇటు రానిస్తుందా? ప్రయత్నించి చూద్దాం అని విషయం తెలియచేస్తూ తెలిసిన వారి ద్వారా మేనల్లుడు నర్సింహులుకి కబురు చేసాడు.
వాస్తవానికి నర్సింహులుకి మేనమామంటే సానుభూతే కాని తల్లికి భయపడి రావడం లేదు. మామయ్య పంపిన సమాచారం తెల్సి ఈ పరిస్థితిలో మామయ్య వీరభద్రానికి అండగా ఉండటానికి నిశ్చయించాడు. తల్లి కాదంటున్నా మామయ్య వీరభద్రం దగ్గరకు వచ్చాడు. నర్సింహులు పదవ తరగతి పాసైనా తల్లి గారంబం వల్ల అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. ఇప్పుడు మామయ్య దగ్గర సైకిల్ షాపు పనులు నేర్చుకుని ఎంతో సాయంగా ఉంటున్నాడు.
తనకు ఒక బావ ఉన్నాడని వినడమే కాని ఎప్పుడూ చూడని వెంకటలక్ష్మి నర్సింహులును చూసి ఆశ్చర్య పోయింది. స్మార్ట్ గా బాగానే కనిపించాడు. తండ్రికి వెనక సాయంగా పనిచేస్తున్నాడు. వెంకటలక్ష్మి ఉదయాన్నే ఇంటి పని, వంటపనీ పూర్తి చేసి స్కూలుకి వెల్తూ శ్రద్ధగా చదువుతూ టెన్తు పబ్లిక్ పరీక్షలు రాసింది.
టెన్తు రిజల్ట్స్ వచ్చాయి. వెంకటలక్ష్మి స్కూల్ టాప్ వచ్చింది. పట్నంలో కార్పొరేట్ కాలేజీ మేనేజ్మెంట్ మెరిట్ విద్యార్థిగా ఎంపిక చేసి వారి కాలేజీలో ప్రవేశం కల్పించారు. చదువు పట్ల ఆశక్తి, అణకువ, వినయ విధేయతలతో కాలేజీ మానేజ్మెంట్ వెంకటలక్ష్మిని డిగ్రీ వరకూ నిరాటంకంగా చదువు పూర్తి చేయించారు. వెంకటలక్ష్మి కుటుంబ నేపద్యం తెలిసిన ఒక స్వచ్ఛంద సంస్థ ఆమె అభిరుచి మేరకు ఆటోమొబైల్ సంస్థలో మెకానిజం మైంటినెన్స్ విషయాలలో శిక్షణ పూర్తి చేసింది. ఎందరో ఆటోమొబైల్ సంస్థల వారు వారి షో రూములలో ఎక్కువ జీతంతో మేనేజరు పోస్టుకి ఆఫర్ చేసినా అవేవీ కాదని బేంక్ లోను తీసుకుని ఆటోమొబైల్ షోరూమ్ ప్రారంభించి తక్కువ సమయంలో ఎన్నో ఆటోమొబైల్ షాపులకు దీటుగా నిలబడింది.
తల్లిని కాదని వచ్చి తన చదువు పట్ల ఎంతో ప్రోత్సాహం కలిగిస్తూ వికలాంగుడైన తండ్రికి అన్ని విధాల బాసటగా ఉన్న బావ నర్సింహులును అభిమానించింది. తల్లికి నచ్చ చెప్పి మామయ్యకు, వెంకటలక్ష్మి పై చదువుల కోసం ఎంతో శ్రమ పడ్డాడు బావ. ఇన్ని సంవత్సరాలు తన ఉన్నతికి పాటు పడినందుకు తన కృతజ్ఞత తెలుపుకుంది. బావను పెళ్లి చేసుకుని తన ఆటో మొబైల్ షొ రూములో మేనేజరుగా ఏర్పాటు చేసింది. తన నివాసం పట్నానికి మార్చి చక్కటి భవంతి కారు హంగులు కూర్చుకుంది. తండ్రిని అత్తయ్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటోంది.
పరమేశం మాస్టారి ఆలోచనకు పరిస్థితులు అనుకూలించి తన అక్క, మేనల్లుడు తనకు బాసటగా నిలిచి వెంకటలక్ష్మిని ఇంత ఉన్నత స్థాయిలో చూడటం తలుచుకుని వీరభద్రం మనసు పొంగిపోయింది.
* * *