" మీరు రోజు రోజుకీ మారిపోతున్నారు" అద్దంలో చూసి తలదువ్వుకుంటున్న భర్తతో అంది మానస.
" అంటే ఏంటీ ! రోజురోజుకీ నా అందం పెరిగిపోతోందా ? నవ్వుతూ అడిగేడు మనోజ్.
" నేను సీరియస్ గా మాట్లాడ్తున్నాను, జోక్ గా అలా తీసి పడేయకండి "
" సరే ! నేనూ సీరియస్ గానే మాట్లాడ్తాను. నేనేం మారిపోయేను చెప్పు ? "భార్య భుజంమీద చేతులేస్తూ అడిగేడు మనోజ్ .
" చాలా రోజులనుండి గమనిస్తున్నాను . మీరు నాతో ఇదివరకటిలా ఉండడం లేదు."
" ఎప్పుడూ ఒకేలా ఉండడానికి మనమేమైనా ఇప్పుడే పెళ్ళైన కొత్త దంపతులమా చెప్పు ? ఇప్పుడు మనకి బాధ్యతలు పెరిగేయా లేదా ? మనకో పాప ఉంది . నాన్నపోయేక అమ్మ మన దగ్గిర ఉంటోందా మరి?"
" మీరు ఎన్నైనా చెప్పండి , ఇది వరకటిలా మీరు నాతో ప్రేమగా ఉండడం లేదు. "
" నీకేం తక్కువ చేసేనని అలా అంటున్నావ్ చెప్పు ? ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ , వాషింగ్ మెషిన్, ఏసీ సమస్తం ఉన్నాయి కదా ! నీ సుఖానికిప్పుడేం తక్కువైందని ? "
" సుఖం వేరు , సంతోషం వేరు . మీరు కొన్న ఆ సోకాల్డ్ వస్తువులన్నీ ఎలా పడున్నాయో , వాటిలాగే నేనూ ఒక వస్తువులా పడున్నాను ఈ కొంపలో . "
" నీకేమయ్యింది మనూ ! ఈ రోజిలా కొత్తగా మాట్లాడతున్నావు ? నాకు ఆఫీస్ కి ఆల్రెడీ లేటయిందిగానీ , నేవచ్చేక తీరిగ్గా మాట్లాడుకుందాం" అంటూ వెళ్ళబోతున్నమానవ్ దారికి అడ్డంగా నిలబడి, ఈరోజు సెలవైనా మీరు ఆఫీస్ కెళ్తున్నారంటే ఆ ' శశి ' దగ్గిరకేనా " అనడిగింది మానస.
మానస మాటలకి ఖంగుతిన్న మానవ్, తన కంగారు కనబడనీయకుండా "' శశి ' ఎవరూ ?" అనడిగేడు .
" శశి అంటే ఎవరో తెలియకుండానే తన నెంబర్ ఫీడ్ చేసుకున్నారన్నమాట. ఇందాక మీరు స్నానం చేస్తున్నప్పుడు , మీ ఫోన్ రెండు సార్లు మోగితే ఎవరా అని చూసేను . శశి అనుంది. ఫోన్ మాత్రమే కాదు. టింగ్, టింగ్, టింగ్ అంటూ ఓ పది మెసేజ్ లైనా వచ్చిఉంటాయ్ " అని బల్ల మీది ఫోన్ తీసి ఇవ్వబోతోంటే మానస చేతిలోంచి ఫోన్ లాక్కుని చూసేడు మానస్ .
" ఆగకుండా అన్ని మేసేజ్ లిచ్చింది ఆ మహాతల్లేనా ?"
ఫక్కున నవ్వేడు మానవ్. " ఓ అపార్థాల శారదమ్మా! 'శశి' అంటే మా ఆఫీస్ లో పనిచేస్తున్న శశిరేఖ. తనకి పెళ్ళయ్యింది. వాళ్ళ ఆయన కూడా మా ఆఫీస్ లోనే పని చేస్తున్నాడు. నా మీద నమ్మకం లేకపోతే నాతోపాటు మా ఆఫీస్ కొస్తే , ఇద్దర్నీ చూపిస్తాను. సరేనా ! పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోక. ఈ రోజు మా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ ఉంది. అందరూ వచ్చేసేరనీ, నన్ను త్వరగా రమ్మని శశే మెసేజ్ లిచ్చింది. అన్నట్లు మధ్యాహ్నం లంచ్ అక్కడే! తలుపేసుకో " అంటూ హడావుడిగా వెళ్ళిపోయేడు.
ఆ మధ్యాహ్నం మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న మానసకి ఎందుకో మానవ్ మాటల మీద పూర్తిగా నమ్మకం కుదరలేదు . ఎప్పుడూ ఆఫీస్ అవగానే నేరుగా ఇంటికొచ్చేవాడు. అలాంటిది ఈ మధ్య ఇంటికి లేటుగా రావడం, ఎందుకని అడిగితే , జీతాలివ్వలేక ఆఫీస్ లో చాలా మంది స్టాఫ్ ని తీసేసి ఉన్న స్టాఫ్ తోనే వాళ్ళ పని కూడా చేయించుకుంటున్నారనీ , ఎక్కువ గంటలు పని చేయకపోతే , తన ఉద్యోగం కూడా పోయే ప్రమాదముందనీ , అన్ని ఆఫీసులూ ఇలాగే ఏడుస్తున్నాయనీ అన్నాడు. ఒక్కోసారి , చాలా అలసిపోయి ఆకలిగా లేదని చెప్పి , డిన్నర్ కూడా చేయకుండా తనని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పడుకుండి పోతున్నాడు . మానవ్ తనతో నిజమే చెప్తున్నాడా ? లేక తను అనవసరంగా అనుమానపడుతోందా ? లేదు . మానవ్ ఏదో దాస్తున్నాడు తనదగ్గిర. తను వాళ్ళ ఆఫీస్ కెళ్తే , ఆ శశిరేఖ సంగతేంటో తేల్చుకోవచ్చుగా ? అయినా తన ఆఫీస్ కొస్తే పరిచయం చేస్తానని తనే అన్నాడుగా ! ఈ పాటికి ప్రాజెక్ట్ లాంచ్ అయిపోయి లంచ్ చేస్తూ ఉంటారు. మానవ్ కి కోపం వస్తే వచ్చింది, ఇలా మధనపడే బదులు, సెలవు రోజేగా, ఇటు బజార్లో ఏదో పనుండి వచ్చి, ఒకసారి "హల్లో" చెప్పి వెళ్దామని వచ్చేనని చెప్పొచ్చు ననుకుంది. అలాగే శశిని కూడా చూసి- మానవ్ నిజమే చెప్పి ఉంటే
వాళ్ళ ఆయనని కూడా చూసేస్తే, తన అనుమానం కూడా తీరిపోతుంద కదా ! అనుకుంది .
ఆ ఆలోచన రాగానే , పాపని అత్తగారికి అప్పజెప్పి , డ్రెస్ మార్చుకుని బయటకివచ్చి, మానవ్ వాళ్ళ ఆఫీస్ కి బయల్దేరింది. ఆటోదిగి లిఫ్ట్ లో పైకెళ్ళిన మానసకి ఆఫీస్ మెయిన్ డోర్ లాక్ చేసి కనబడడంతో, ' ప్రాజెక్ట్ లాంచ్ ఇక్కడ కాదేమో ' అనుకుంది. సెలవు అవ్వడంవల్లనో, ఏమో చుట్టూ ఎక్కడా సందడి కూడా లేదు. 'ఇప్పుడేం చెయ్యాలి?' అనుకున్న మానస ఇంతలో చటుక్కున ఏదో గుర్తుకొచ్చి తన బాగ్ లోంచి తాళాలగుత్తి బయటకి తీసింది. అప్పుడెప్పుడో మానవ్ టూర్ కి వెళ్తూ, ఆఫీస్ డూప్లికేట్ కీ తనదగ్గిర ఉంచమన్న సంగతి గుర్తుకొచ్చి - తను తప్పు చేస్తోందేమోనన్న అనుమానాన్ని పక్కకినెట్టి - మెయిన్ డోర్ ఆటోమేటిక్ లాక్ చప్పుడుకాకుండా తీసి లోపలికెళ్ళింది . ఆఫీస్ మెయిన్ హాల్ లో గానీ , అటూ ఇటూ రూమ్స్ లో గానీ బల్లలూ , కంప్యూటర్ లూ తప్ప మనుష్య సంచారం లేకపోయేసరికి తననేదో అనుమాన పిశాచం వేధిస్తోందని తనని తనే తిట్టుకుంటూ, తిరిగి మెయిన్ డోర్ వైపు నడుస్తోంటే, ఒక గదిలోనుండి మానవ్ గొంతు వినబడేసరికి ఉలిక్కిపడ్డ మానస చప్పుడు కాకుండా వెళ్ళి ఆ గది తలుపు తోసి చూసింది. ఎదురుగా కనబడిన దృశ్యం చూసిన మానస గొంతు తడారిపోయింది. వాళ్ళు తనని చూసే పరిస్థితిలోనే లేరు.
గుండె దడదడ లాడుతోంటే, బిక్కచచ్చిపోయిన మానస మొహానికి పట్టిన చెమటని చీర చెంగుతో తుడుచుకుంటూ ఆఫీస్ నుండి బయటపడి, ఆటోలో కూలబడింది.
* * * * *
ఇది జరిగిన వారం రోజులకి లాయర్ నోటీస్ అందుకున్నాడు మానస్ .
"ఆఫీస్ లో మీ బాస్ శశిభూషణ్ తో మీ కామకలాపాలు స్వయంగా తన కళ్ళతో చూసిన మీ భార్య మానస - మీతో 'విడాకులు' కోరుకుంటోంది." అన్నది ఆ నోటీస్ సారాంశం.
* * * * *