భార్యాభర్త! మధ్యలో (?). - రాము కోలా.దెందుకూరు

Bharya bhartha madhya0

వంటగదిలో యుద్ద వాతావర్ణం తలపించేలా! వంట సామాగ్రి చేస్తున్న శబ్దాలు మిస్సైల్స్ లా దూసుకు వస్తుంటే!, బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ!, పడక గదిలో నుండి బయటకు వచ్చేసాడు పరాంకుశం అనే భార్యా విధేయుడు. తలపైన ఉన్న నాలుగు వెంట్రుకలను సరిచేసుకుంటూ!. ఎదురుగా ఉగ్రరూపంతో భార్యామణి కాళికాదేవిలా దర్శనమిస్తూ కోపంతో ఊగిపోతుంది. సదరు భార్యామణిని చూస్తూ, దేహంలో వొణుకు మొదలైందని తెలుసుకునేందుకు క్షణకాలం కూడా పెట్టలేదు పరాంకుశానికి. తన ఆధీనం లోనికి రాలేని కాళ్ళూ చేతులు, పెనుతుఫాను తాకిడికి ఊగుతున్న తాటిచేట్లను గుర్తుచేస్తుంటే..! భారీ తుఫాను తాకిడికి చెల్లాచెదురైనా ఊరి బయట పూరి గుడిసెలా ఉంది పరాంకుశం పరిస్థితి. భార్య చేతిలోని అట్లకాడ చూస్తుంటేనే అర్థమవుతుంది!.పరిస్థితి అదుపులో లేదని . బహుశా వంట గదిలో దోశలు సరిగా రాలేదేమో ?. నాన్ స్టిక్ తీసుకుని రమ్మని ఎన్నో సార్లు చెప్పింది. మట్టి బుర్రకు ఏదీ గుర్తుండి చావదు. " పరిస్థితులకు తలవంచక తప్పదు అనుకుంటూ ,నెత్తిమీద ఉన్న నాలుగు వెంట్రుకలను ఊడిపోయేలా తల రుద్దుకుంటూ. ఆలోచనల్లోకి జారుకున్నాడు పాపం పరాంకుశం

"రాత్రి తాగి ఇంటికి వొచ్చింది మనస్సులో పెట్టుకుందా! ఏమిటీ? కొంపదీసి.? తనకు జ్ఞాపకశక్తి అపారంగా ప్రసాదించాడు భగవంతుడు. ఆ విషయం ఎన్నో సార్లు ఋజువు చేసుకుంది కూడాను. అయినా! దొడ్డి దారినే కదా! లోపలకు వొచ్చింది!. తనకు తెలిసే ఛాన్స్ లేనే లేదు! ఇక ధైర్యంగా ముందడుగు వేయవచ్చును!" జారిపోతున్న లుంగీ సరి చేసుకుంటూ!.. ధైర్యంగా అడుగులు ముందుకు వేసాడు ముసిముసిగా నవ్వుతూ...పరాంకుశం.

"భ్రమరాంబికా నీకో విషయం చెప్పాలోయ్ " అన్నాడు గోముగా.!

"నేనూ మీకో విషయం చెప్పాలి! "అంది భ్రమరాంబికా.

వాట్ ఎ కో ఇన్సిడెంట్! అని పైకే అనేసి, పరిస్థితిని అంచనా వేస్తూ, భార్యను కూల్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ! ముసిముసి గా నవ్వుతూ... ఒక్కో అడుగు ముందుకు వేస్తూ. "నీకు తెలుసుకదా! నేను స్కూల్ స్థాయి నుండే మంచి పుట్ బాల్ ప్లేయర్ అని. అదేమిటో ! ఎన్ని సార్లు ట్రై చేసినా! గోల్ చేయలేక పోయా. మా హెడ్ మాస్టర్ ఇది మనసులో పెట్టుకొని ఎన్నెన్ని మాటలు అనేవాడో. కానీ రాత్రి ఏం జరిగింది అనుకున్నావ్! వాటే మిరాకిల్స్ నా ప్రతి కిక్ గోల్ అవుతుంది తెలుసా! ఎప్పుడూ ఊహించలేదు" హహహహహహ..... ఉత్సాహంగా చెప్పుకుంటూ.. మెలికలు తిరుగుతూ, వింతవింత భంగిమల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు పరాంకుశం.

తను భార్య ముఖంలో మారుతున్న మార్పు చూడలేదు పాపం. చూసి ఉంటే!. పీ.టి ఉషకంటే వేగంగా పరుగుతీసేవాడు తన భార్యామణి భ్రమరాంబికాకు అందనంత దూరంగా.

"ఆపుతారా మీ పుట్ బాల్ ప్రహసనం! మీ ప్రాక్టీస్ భాగానే ఉంది ! కానీ! రాత్రిపూట మీరు తన్నింది బాల్ కాదు!.. మంచం పైనున్న నన్ను, మందు ఎక్కువై.." అనే పదాలను నొక్కి మరీ పలుకుతూ! చేతిలో అట్లకాడ మల్లయోధుడు చేతిలో కర్రలాగా తిప్పుతూ, అదోలాంటి చూపులు చూస్తూ నవ్వింది భ్రమరాంబికా.

"చచ్చింది గొర్రె..! అంటే, రాత్రి జరిగింది కలలో కాదా! నిజమా! అంటే! అంతగా తాగేసానా?" అనుకోగానే చెమటలు పట్టెసాయ్ పరాంకుశానికి.. భూమి రెండుగా చీలిపోతుంటే అందులోనికి జారిపోతున్న అనుభూతి కలుగుతుంది. గుండె రెండు వందల యాభై వేగంతో కొట్టుకుంటుంటే చిన్నగా ! వినయంగా. "అవునా! భ్రమరాంబికా.. సారీ రా! స్నానం చేసి వస్తా! తరువాత తీరికగా మాట్లాడుకుందాం.. సరేనా!" మెల్లగా జారుకోబోయాడు.. పరాంకుశం. స్నానం అనే సాకుతో.

అంత తేలికగా వదులుతుందా! భార్యా మణి భ్రమరాంబికా. "మీకు వచ్చిన కల మీరు చెప్పారు!" "మరి! నాకొచ్చిన కల వినరా!" గోముగా అడిగింది భ్రమరాంబికా. చేతిలోని అట్లకాడను పోలీసు లాఠీలా ఊపుతూ..

"తప్పదా!" అన్నాడు పరాంకుశం. అమాయకంగా ముఖం పెట్టి.

"తప్పదు కదా!" అందుకుంది భ్రమరాంబికా.

"సేమ్ టూ సేమ్, మీకు వచ్చినట్లు నాకూ కలవచ్చింది మిస్టర్ పరాంకుశం గారు రాత్రి అదేమీటో! నాకు చిన్న తనం నుండి టేబుల్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం!. నేర్పిస్తా! నేర్పిస్తా! అంటూనే మా బామ్మ పైలోకానికి చెక్కెసింది. ఆ కోరిక తీరదేమో అని ఒకటే బెంగగా ఉండేది. రాత్రితో ఆ బెంగ తీరిపోయింది. ఏమనుకుందో ఏమో? రాత్రి కలలోకి వచ్చింది మా బామ్మ! నీకు చాలా అన్యాయం చేసానమ్మాయ్. నీకు టేబుల్ టెన్నిస్ నేర్పకుండానే బక్కెట్ తన్నెసాను. ఏమనుకోకు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదుగా. రోజు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని మీ ఆయన పడుకుంటారు చూడు, అప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావు కదా! అప్పుడు..ఎంటి వినిపిస్తుందా ! నన్ను తల్చుకో, వచ్చి నీకు త్రికరణ శుద్ధిగా టెబుల్ టెన్నిస్ నేర్పుతా అంది.. ఈ రోజు నుండి ప్రాక్టీసే... ప్రాక్టీస్" చేతిలో అట్లకాడ తిప్పుతూ చెపుతుంది భ్రమరాంబికా.

విన్న పరాంకుశం ప్రాణాలు గాలిలో దీపంలా రెపరెపలాడుతుంటే. భవిష్యత్ తలుచుకుంటూ, స్నానానికి వెళ్ళాడు పరాంకుశం.. రేపటి నుండి తన బ్రతుకు కసాయి వాడి ముందు గొర్రెలా, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ అట్టు ముక్కలా మారబోతోంది అనుకుంటూ. ఆరోజు నుండి మద్యం షాపు వైపు కన్నెత్తి కూడా చూడలేదు పాపం పరాంకుశం. తన భార్య చేతిలో అట్లకాడ గుర్తు చేసుకుంటూ.. తన బట్టతలపై తడుముకుంటూ.

🙏 శుభం🙏

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్