భాగవత కథలు -21
ప్రద్యుమ్న కుమారుడు
ప్రద్యుమ్నకుమారుని జననం, అపహరణ:
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆమె కోరికపై రాక్షస వివాహం చేసుకున్నాడు. రుక్మిణీదేవి స్వయంగా శ్రీదేవి అవతారం. ఆమె రూపవతి, వివేకవతి, సద్గుణవతి, సౌందర్యవతి మరియు సౌభాగ్యవతి.వారి ప్రేమ ఫలితంగా వారికి ఉదయించిన జ్యేష్ఠపుత్రుడే ప్రద్యుమ్న కుమారుడు.శ్రీకృష్ణుని సంతానంలో పేరుపొందినవాడు. పరాక్రమశాలి.
రుక్మిణీదేవికి కుమారుడు జన్మించిన సందర్బంగా ద్వారకా నగరంఅందంగా అలంకరించ బడింది. ప్రజలు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. రుక్మిణి పురిటి గదిలో కుమారునికి పాలిచ్చి నిద్ర పుచ్చింది. తరువాత అలసటతో తాను కూడా నిద్రపోయింది. అంతఃపురంలో ఉన్న దాసీలు కూడా ఒక్కొక్కరుగా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు.అందరూ అలసి సొలసి నిద్రిస్తున్న సమయంలో శంబరుడు అనే రాక్షసుడు మారు వేషంలో వచ్చి ప్రద్యుమ్నుని దొంగిలించి తీసుకు పోయాడు. ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళి సముద్రంలో పారవేశాడు. కృష్ణునిపై పగబట్టి ఆ బాలుణ్ణి కూడా తన శతృవుగా భావించి శంబరుడు ఇలా చేశాడు.ఆ బాలుడు సముద్రపునీటిలోమునగగానే ఒక పెద్ద చేప అమాంతంగా అతణ్ణి మ్రింగేసింది.
సముద్రజలాల్లో చేపల వేటకు వెళ్ళిన జాలరులు తమ వలలతో చేపలను పట్టడం మొదలెట్టారు. అందులో ఒక జాలరి వలలోప్రద్యుమ్నుని మింగిన పెనుచేప పడింది. జాలరులందరూ అంత పెద్ద చేపను తమ రాజుగారికి కానుకగా ఇవ్వాలనే నిర్ణయించారు. వారు మరికొన్ని చేపలతో బాటుగా ఆ పెనుచేపను వారికి రాజైన శంబరునికి భక్తితో కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండి తెమ్మని వంటశాలకు పంపాడు.వంటవాడు ఆ చేప కడుపు కోయగా అందమైన చంద్రబింబంతో సమానమైన ముఖంతో ప్రకాశిస్తున్న బాలుడు కనుపించాడు.వారు ఆ విషయాన్ని వంటశాలకు అధిపతియైన మాయావతికి విన్నవించారు.
ప్రద్యుమ్నకుమారుని పూర్వజన్మ వృత్తాంతం:
మన్మథుడుశ్రీమహావిష్ణువుకి మానసపుత్రుడు. అత్యంత సౌందర్యవంతుడు. రతీదేవిఆయనభార్య. పూలబాణాలువేసిఎంతటి గొప్ప వైరాగి నందైనా ప్రేమను పుట్టించగల నేర్పరి. వసంతుడు ఆయన సహచరుడు.మన్మథునికి కాముడు, పుష్పధన్యుడు, కందర్పుడు, అనంగుడుఅనే నామాంతరాలు ఉన్నాయి.
తారకాసురుడుఅనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద వరం పొందాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వలన మహాశివునికి జన్మించే కుమారుడు తప్ప ఇతరులు ఎవ్వరూ ఆ రాక్షసుని వధింప లేరు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవిఆత్మార్పణ తరువాత శివుడు కఠోర తపస్సులో నిమగ్నమైనాడు. మహాశివునికి కుమారుడు జన్మించే అవకాశం లేదని తెలిసే తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి అటువంటి వరం పొందాడు.
తారకాసురుని బాధలు భరించలేక దేవతలు దేవేంద్రుడి నాయకత్వంలో వానిని సంహరించే ఉపాయం చెప్పమని బ్రహ్మను వేడుకొన్నారు. బ్రహ్మదేవుడు ఆలోచించి ‘శివుని బ్రహ్మచర్యాన్ని బంగపరిచి పార్వతీదేవి ఆయనను వివాహం చేసుకుంటే వారికి పుట్టిన పుత్రుడు తారకాసురుణ్ణి వధిస్తాడు’ అని సలహా ఇచ్చాడు. తామరరేకుల వంటి నేత్రాలతో, ఆజానుబాహువులతో ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకారంతో,మునీంద్రుల ధైర్యాన్ని సహితం చెదరగొట్టగలవాడూ, స్త్రీపురుషుల కొకరిపైనొకరికి ప్రేమ భావం కలిగించగలవాడూ అయిన మన్మథుడు తప్పక ఈ కార్యాన్ని నెరవేర్చగలడని తలంచిన ఇంద్రుడు మన్మథునికి ఈ పనిని అప్పగిస్తాడు.
మన్మథుడు వసంతుని సాయంతో పరమశివునిపై పూలబాణాలు ప్రయోగించి తపస్సును పాడుచేస్తాడు. తపస్సు నుండి మేల్కొన్న శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మథుని బస్మం చేస్తాడు. ఇది తెలిసిన రతీదేవి వెంటనే వచ్చి తనకు పతిబిక్ష పెట్టమని శివుని వేడుకుంటుంది. ఇందులో మన్మథుని తప్పు లేదని, దేవతల కోరికపై లోక కల్యాణం కోసం నిస్వార్థంగా తపోభంగం కలిగించాడని విన్నవిస్తుంది. శివుడు శాంతించి మన్మథునికి ప్రాణభిక్ష పెట్టిఅనంగుడిగా జీవిస్తాడని చెప్పాడు. శివపార్వతుల పుత్రుడైన కార్తికేయుడు తారకాసురునివధించాడు.
ప్రద్యుమ్నుడు శంబాసురుని వధించుట:
నారదమహర్షి రతీదేవికి మన్మథుడు తిరిగి ప్రద్ముమ్నునిగా పుడతాడనీ, ఆ బాలునిచంపడానికి శంబరుడుప్రయత్నం చేస్తాడనిచెప్పాడు. శంకరుని కోపాగ్నికిఆహుతియైన మన్మథుడు మరల జన్మిస్తాడని తెలిసిన రతీదేవి తన భర్త ఎప్పుడు సాక్షాత్కరిస్తాడా అని ఎదురుచూస్తూ శంబరుని గృహంలో మాయాదేవి అనే పేరుతో జీవిస్తున్నది. వంటశాలలో చేప కడుపులో దొరికిన ఆ బాలుడే మన్మథుడు అని రతీదేవి తెలుసుకొన్నది.
రతీదేవి ఆ బాలుని పుత్రుని వలె పెంచుకోవడానికి శంబరుని అనుమతి తీసుకున్నది. ఆ బాలుని వంటవారివద్ద నుండి తీసుకొని పోషించడం మొదలుపెట్టింది. శీఘ్రకాలంలోనే ఆ బాలుడు యౌవనవంతుడయ్యాడు. అత్యంత సుందరంగా తయారయ్యాడు. ప్రద్యుమ్నుని చక్కదనం చూసిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్యా లనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఆయన సౌందర్యాన్ని వర్ణించడంఎవ్వరితరమూ కాదు. చెరకువింటితో ప్రపంచాన్ని జయించి సమ్మోహితం చేయగలమన్మథుడి అవతారమైన ప్రద్యుమ్నుని,మాయావతి కోరికతో కూడిన చూపులతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది.
అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తల్లీ, నేను నీ కుమారుడ ననే ఆలోచన లేకుండా సిగ్గువీడి కామిని వలె ప్రవర్తిస్తున్నావు. నన్ను పెంచిన మాతృభావం వదిలివేశావు. నీవిట్లు మోహించుట ధర్మం కాదు”.
ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి ఇలా పలికింది. “నీవు విష్ణు పుత్రుడవైన మన్మథుడవు. గత జన్మలో నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు బాలుడవై ఉండగా దయలేని శంబరుడు నిన్ను తల్లితండ్రుల నుండి వేరుచేసి తెచ్చి నిన్ను సముద్రంలో పారవేశాడు. అప్పుడు నిన్నొక పెద్ద చేప మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. నారదుని వల్ల జరుగబోయేది నాకు ముందే తెలియడం వల్ల నేను మాయావతిగా మారువేషంలో నీ కోసమే ఇక్కడ ఉన్నాను”.
మరల అతనితో “ఈ శంబరుడు మాయలమారి. దుర్మార్గుడు. యుద్ధాలలో దేవతలను జయించి విర్రవీగుతున్నాడు. ఇతనిని సమ్మోహనానిది బాణాలతో నీవు సంహరించు. పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి నప్పటి నుండి నీ తల్లి రుక్మిణీదేవి దుఃఖిస్తూనే ఉంది” అని చెప్పింది. ఈ విధంగా చెప్పి మాయావతి రూపంలో ఉన్న రతీదేవి ప్రద్యుమ్నునికి“మహామాయ”అనే విద్యను ఉపదేశించింది.
ప్రద్యుమ్నుడు కవచము ధరించి, ధనుర్బాణములను చేత దాల్చాడు. శంబరుణ్ణిరణానికి ఆహ్వానించాడు. శంబరుడు తోకతొక్కిన త్రాచులాగ కఠోరంగా గర్జిస్తూ తన గదాదండంతో ప్రద్యుమ్నుని కొట్టాడు. ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుడి గదను విరగగొట్టి, తన గదతో చావబాదాడు. అప్పుడు ఆ అసురుడు బాణాలను ప్రయోగించాడు. వెంటనే ప్రద్యుమ్నుడు అన్ని రకాల మాయలను నాశనం చేయగల “సాత్త్వికమాయ” అనే విద్యతో ఆ శరపరంపరను ఆపాడు. తన కరవాలంతో ఆ రాక్షసుని శిరస్సును ఖండించాడు. దేవతలు ప్రద్యుమ్నుని విజయానికి ఆనందంతో అతనిపై పుష్పవర్షం కురిపించారు.
శంబరుణ్ణి సంహరించిన తరువాత రతీప్రద్యుమ్నులు ఆకాశమార్గాన ద్వారకలోని రుక్మిణీదేవి మందిరం దగ్గరకు చేరారు. ప్రద్యుమ్నుని ఏమరుపాటుగా చూసిన అంతఃపుర కాంతలు అతనిని కృష్ణుడు అని బ్రమపడ్డారు. శ్రీకృష్ణుని పట్టపుదేవి ప్రద్యుమ్నుని చూసి “ఈ సుకుమారుడు ఎక్కడినుండి వేంచేశాడో, ఈ బాలుని కన్న తల్లి పూర్వజన్మలో ఎన్ని నోములు నోచిందో. నా కుమారుడు ఉంటే ఇప్పటికి ఇంత పెద్దవాడయ్యేవాడుగా. ఇతడు నా పుత్రుడు కావచ్చు. లేకపోతే శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకు వచ్చాయి”అని భావించింది.
ఈ విధంగా రుక్మిణి ఆలోచిస్తుండగా కావలివాడి వలన విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, దేవకీ వసుదేవులు అక్కడకు చేరుకొన్నారు. సర్వం తెలిసినా కృష్ణుడు మౌనం వహించాడు. అప్పుడు నారద మునీంద్రుడు అక్కడకు వచ్చి శంబరుడు బాలుని అపహరించినప్పటి నుండి జరిగిన వృత్తాంతం వివరించాడు. రుక్మిణీ దేవి తన పుత్రుని కౌగలించుకొని ఇంత కాలానికి నిన్ను చూసి ధన్యురాలనయ్యాను అని ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలకు,తన కుమారుని రక్షించినందుకు సంతోషించింది.రతీదేవి పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోయింది.
రుక్మిణీదేవి సోదరుడు రుక్మి,తన కుమార్తె రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులందరినీ ఆహ్వానించాడు. ఈ వార్త విన్న ప్రద్యుమ్నుడు సంతోషించాడు. రమణీయమైన రథాన్ని అధిరోహించి యదుకుల సింహకిశోరమైన ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో విదర్భకు వెళ్ళాడు.అలా పట్టణంలో ప్రవేశించిన ప్రద్యుమ్నుడు అచ్చట చేరిన రాజకుమారులపై తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. రాకుమారు లందరూ ప్రద్యుమ్నుని దాడికి ఎదురు నిలువ లేక పారిపోయారు. రుక్మి శ్రీకృష్ణుడి వల్ల పొందిన అవమానం మరచి పోలేదు. అయినా తన చెల్లెలుపై గల అభిమానంతో మేనల్లునికి తన కుమార్తె నిచ్చి వివాహం జరిపించాడు. ప్రద్యుమ్నుడు సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు.ప్రద్యుమ్న రుక్మవతీ దంపతులకు పరాక్రమవంతుడైన అనిరుద్ధుడు అనే ఒక పుత్రుడు జన్మించాడు.
*శుభం*