రత్నాకరుడు తన గతిని మార్చుకొని ఘోష పెడుతున్నాడన్నట్టుగా, ఆ కాలేజీలో వాతావరణం గోలగోలగా ఉంది. కారణం, ఈ రోజుకి సరిగ్గా వారం తరువాత, కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్ష / కార్యదర్శి పదవులకి జరగబోయే ఎన్నికలు.
ఆ ఎన్నికలలో గెలుపొందడానికి అవకాశమున్న విద్యార్థుల వెనకాతల (కాలేజీ బయటనుండి) నిలబడి, ఊరిలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలవాళ్ళు అన్నిరకాలుగా (అంటే ఆర్ధికంగా, తదితర) ప్రోత్సాహిస్తున్నారు, మద్దత్తు తెలియచేస్తున్నారు. దాంతో - భావి రాజకీయ నాయకులుగా ఎదగాలనుకొనే కొంతమంది ప్రత్యర్దులలో, అంతర్గతంగా పోరు పెద్దదై, ఎవరికి వారే ఎలాగేనా ఈ ఎన్నికలలో గెలవాలని తాపత్రయం పడడమే కాకుండా, గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
అన్నీ ఆలోచించిన కాలేజీ యాజమాన్యం –
వేరే కాలేజీ అధ్యాపకుడు ‘చంద్రశేఖరం’ గారిని ఎన్నికల అధికారిగా నియమించి, ఆయనకి ఆయన కుటుంబానికి, కాలేజీ ప్రాంగణంలోనే వసతి భోజనం ఏర్పాటు చేసి, భౌతికంగా రక్షణ కల్పించేరు. కుటుంబం కూడా తోడుగా ఉండడంతో, అనుభవజ్ఞుడైన ఆయన - తన, తనవారి మొబైళ్ళని ఎన్నికలైనవరకూ ఆపేయాలని నిర్ణయించుకొని - వెంటనే అమలు చేసేరు.
ఆయనకీ కాలేజీ యాజమాన్యానికి మధ్యన ఉన్న శబ్ద మాధ్యమం ఒక ల్యాండ్ లైన్ ఫోన్ మాత్రమే, అదీ కూడా, అయన కార్యాలయం మట్టుకే.
కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా కుటుంబంతో ఆ కాలేజీ ప్రాంగణంలోనే ఉండటంవలన, వారిద్దరూ కలవడానికి మాట్లాడుకోవడానికి పెద్దగా అసదుపాయం లేని పరిస్థితి.
కాలేజీ యాజమాన్యం –
ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న నిర్ణయాధికారం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టుగా; ఆయనకి సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్య్రం ఇస్తున్నట్టుగా; ఈ ఎన్నికలకి సంబంధించి ఆయన నిర్ణయాలు మాత్రమే చెల్లుబడీలో ఉంటాయని, వాటికి తిరుగులేదని; విద్యార్థులూ అభ్యర్థులూ ఈ నిర్ణయాలు గ్రహించి, మసులుకోవాలని –
తాకీదు వెలువరించేరు.
చంద్రశేఖరంగారు తన పని మొదలుపెట్టగానే –
ఎన్నికలు - రహస్య వోటింగ్ తరహాలోనే జరుగుతాయని; కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఎన్నికలరోజున కాలేజీ వారిచ్చిన గుర్తింపు కార్డు ఆధార్ కార్డు తనకి నేరుగా పరీక్షార్థం సమర్పించాలని - అలా చేయని / తన పరీక్షలో గుర్తింపుకు సరిపోని విద్యార్థులు, ఎన్నికలలో ఓటు వేయడానికి అనర్హులని; ఎన్నికలు ఆదివారం కనుక - గురువారం సాయంత్రం 5 గంటల తరువాత, కాలేజీ ప్రాంగణంలో అభ్యర్థుల ప్రచారాలు నిషేధాలని; శుక్రవారం కాలేజీలో చదువులు ఉండవు. కానీ, ఆ రోజు ఉదయం పదకొండు గంటలనించి మధ్యాహ్నం ఒంటి గంటవరకూ అభర్ధులూ విద్యార్థులూ సమావేశమందిరంలో తన ముందు హాజరు అవ్వాలని; ఆ రోజు, ఆ సమయంలో, సమావేశ మందిరంలో కాలేజీ యాజమాన్యం వారు భోదనకి సంబంధించిన వారు ఉండకూడదని; ఆ సమావేశంలో, తన సమక్షంలో, ప్రతీ అభ్యర్ధీ అక్కడున్న విద్యార్థులనుద్దేశించి -- తాను కానీ ఎన్నికలలో గెలిస్తే, విద్యార్థులకి ఏవిధంగా ఉపయోగపడగలరో, పది నిమిషాలకు మించకుండా తెలియచేసుకోవచ్చని; శుక్రవారం ఒంటి గంట ముఫై నిమిషాల నుంచి, ఆదివారం - అనగా, ఎన్నికల రోజు - ఉదయం పది గంటల మధ్యలో, ఏ అభ్యర్థి కానీ ఏ విద్యార్థి కానీ కాలేజీ ప్రాంగణంలో కనిపించకూడదని, అలా కాకుండా, ఏ అభ్యర్థి కానీ కనిపిస్తే, ఆ అభ్యర్థి పేరు ఎన్నికల బరిలో ఉండదని, అలాగే ఏ విద్యార్ధేనా కనిపిస్తే, ఆ విద్యార్థికి ఎన్నికలలో ఓటు వేయడానికి అనుతి ఇవ్వబడదని –
తాకీదు జారీ చేసేరు.
అంతే కాక –
ఎన్నికల బాలెట్ కాగితంలో అభ్యర్థుల పేర్లే కాకుండా ‘నోటా’ అని కూడా ఉంటుందని; ఆ బాలెట్ కాగితంలో ఉన్న పేర్ల ద్వారా, కాలేజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఉండడానికి ఏ అభ్యర్ధీ కూడా అర్హుడు కాడు అనిపిస్తే, విద్యార్థులు తమకి ఇష్టమైన పక్షంలో, ‘నోటా’ కి ఓటు వేయవచ్చని; ఏ విద్యార్థి కానీ బాలెట్ కాగితంలో ఉన్న అభ్యర్థులకి కానీ, ‘నోటా’ కి కానీ, ఓటు వేయని పక్షంలో, ఆ బాలెట్ కాగితం వేరుగా లెక్కింపబడి, చెల్లనిదిగా పరిగణింపబడుతుందని; అభ్యర్థుల కంటే ‘నోటా’ కే ఎక్కువ ఓట్లు వస్తే, మొత్తం ఎన్నిక పరిసమాప్తికి వచ్చి, ఏ అభ్యర్ధీ కాలేజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఉండడానికి అర్హులు కారు -- అని ఘోషింపబడి --- ఎన్నికల మొత్తం ప్రక్రియ పునః ప్రారంభింపబడుతుందని; అలా పునః ప్రారంభింపబడే ఎన్నికల ప్రక్రియలో, ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఎవరూ పోటీకి అర్హులుకారు --
- అని కూడా మరో తాకీదు జారీ చేసేరు.
చంద్రశేఖరంగారి అధ్యక్షతన - ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులూ విద్యార్థులు శుక్రవారం సమావేశమయ్యేరు. సమావేశమందిరం గోలగోలగా ఉంది.
చంద్రశేఖరంగారు : “ముందుగా, మీకు తెలియచేసేదేమిటంటే – ప్రస్తుత సమావేశం సంయమనంతో
నడిపేందుకు మాత్రమే నేను ఇక్కడ ఉండేది. ఇక్కడ అభ్యర్థులు చెప్పే మాటలతో
కానీ, వాటికీ మీ ప్రతిస్పందనలతో కానీ -- నాకు ఏ విధమైన సంబంధం బాధ్యత
లేదు అని మీరంతా గుర్తుంచుకోవాలి. మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే, ప్రస్తుతం
మనం అంతా ఇక్కడ సమావేశమైన ప్రధాన ఉద్దేశానికి స్వాగతం పలుకుదాం.”
సమావేశమందిరం కొద్ది నిమిషాలలోనే, నిశ్శబ్దమైపోయింది.
చంద్రశేఖరంగారు : “నేను ముందే వెలువరించిన ఉత్తరువు అనుసరించి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు
ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి ప్రచార ప్రసంగం వినిపించమని అవ్హానిస్తున్నాను."
అక్కడున్న మైక్ లో ఎన్నికల బరిలో నిలబడ్డ ఒక్కొక్క అభ్యర్థి ఘంటా బజాయించినట్టు గట్టిగా మాట్లాడుతూంటే - వింటున్న విద్యార్థులు గుసగుసలతో మెల్లిగా పక్కనున్న వారితో ప్రతిస్పందిస్తున్నారు.
“ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొడతాను”
“ర్యాగింగ్ లో ముఖ్య పాత్ర వహించేదే వీడు”
“క్లాసుకి క్లాసుకి మధ్య అరగంట విరామం ఏర్పాటు చేయిస్తాను”
“క్లాసుకి క్లాసుకి మధ్యలో వీడికి టీ త్రాగడానికి దమ్ము కొట్టడానికి సమయం కావాలిగా మరి”
“విద్యార్థులు పరీక్షలలో కూర్చునేందుకు ఉన్న క్లాసుల హాజరు శాతం నియమాన్ని తీసివేయిస్తాను”
”అవును మరి, నెలలో 15 రోజులు క్లాసులకి గైర్ హాజరు అయే వీడికి, ఈ వెసులుబాటు లేకపోతె కష్టం”
“పరీక్షలలో అందరినీ ఉత్తీర్ణం చేసి తీరాలని పట్టు పడతాను”
“లేకపోతే, ఈ గొంగళి ఎక్కడ వేసినది అక్కడే మరి”
“పరీక్షలప్పుడు సబ్జెక్టుకి మరో సబ్జెక్టుకి కనీసం రెండు రోజుల వ్యవధి ఉండాలని పట్టు పడతాను”
“ఇంతసేపటికి, అందరికీ పనికొచ్చే ప్రస్తావన తెచ్చేడు వీడు”
“ప్రస్తుతం ఉన్న పరీక్షా సమయం పొడిగించేందుకు పోరాడతాను”
“ఈ ఆలోచన కూడా బాగానే ఉంది”
“కాలేజీకి ప్రస్తుతం ఉండే దసరా, క్రిస్టమస్ మరియు ఎండాకాలం సెలవదినాలు ఇంకా ఎక్కువ
ఇచ్చేటట్టుగా పట్టుపడతాను”
హాలంతా చప్పట్లే చప్పట్లు.
“కాలేజీ వారు విద్యార్ధులకి ప్రతీ నెలలో ఒక రోజు పిక్నిక్ ఉచితంగా ఏర్పాటు చేసేటట్టుగా పోరాడతాను. అంతేకాదు, ఆ ఏర్పాటు ఆదివారం నాడు కాకుండా చూస్తాను”
హాలంతా చప్పట్లే చప్పట్లు.
“కాలేజీ కాంటీన్ లో మనకి కావలసినవి ఉచితంగా లభించే ఏర్పాటు చేస్తాను”
‘హుర్రే హుర్రే’ అని కేకలు.
చంద్రశేఖరంగారు : “అందరూ నిశ్శబ్దంగా ఉండాలి” అని కేక వేసేరు.
అందరూ నిశ్శబ్దంగా ఉండడంతో-
“కాలేజీలో చేరినప్పుడు కట్టిన ఫీజు, నెలా నెలా కడుతున్న ఫీజు కాక, పరీక్షలప్పుడు కూడా ఫీజు కట్టడాలేమిటి? కనుక, పరీక్షలప్పుడు ఫీజు కట్టే అవసరం లేకుండా పోరాడతాను”
హాలంతా చప్పట్లే చప్పట్లు.
“విద్య అన్నది మన రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కు. కనుక, నెలా నెలా కడుతున్న ఫీజులు పోయేటట్టుగా పట్టుపడతాను”
హాలంతా చప్పట్లే చప్పట్లు.
“విద్య అన్నది మన రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కు అయినప్పుడు, కాలేజీలో చేరినప్పుడు కూడా మనం ఎందుకు ఫీజు కట్టాలి. కనుక, ఉచిత విద్య కోసం గట్టిగా పోరాడాతాను”
“ఇదేం జరిగే పని కాదురా నాయనా”
“మనం చదువుకుందికి కావలసిన పుస్తకాల ఉచితంగా లభించడం కోసం పోరాడతాను”
“అలా దొరికేసరికి, సగం పాఠాలు అయిపోతాయేమో”
“ప్రస్తుతం మన కాలేజీలో వ్యాయామశాల లేదు. కనుక ఆ ఏర్పాటు కోసం పోరాడతాను”
“వీడు జిమ్ లో నే కాలం గడిపేయాలని అనుకుంటున్నాడు”
“మనకొక యోగా శిక్షణ కేంద్రం మరియు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రం కాలేజీలో ఉచితంగా లభ్యమయే దిశలో పోరాడతాను”
“వీడి ఆలోచన కూడా అంతే”
“మనకి కాలేజీలో ఉండే ఆటల సదుపాయం అంతంత మాత్రమే. కాబట్టి, ఆ విషయంలో తగిన ఉన్నతి కనపర్చడానికి పోరాడతాను”
“క్లాసులకి రావడం మానేసి ఆటలాడుకుంటూ కూర్చుంటాడు కాబోలు”
“మనం కాలేజీకి రావడానికి మరియు కాలేజీనించి ఇంటికి పోవడానికి కాలేజీ యాజమాన్యం ఉచితంగా బస్సు ఏర్పాటు చేసేటట్టుగా పోరాడతాను”
“ఆ ఏర్పాటు అయ్యేసరికి మనం ముసిలాళ్లమైపోతాం”
“ఆ బస్సులో AC ఉండేటట్టుగా చూస్తాను.”
“ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం”
ఇలా సాగిన ఉపన్యాసాల ముగింపు తదుపరి జరిగిన ఎన్నికలో –
మన దేశంలో జరిగే ఎన్నికల సభలకి, వందలకొద్దీ జనం వచ్చినా, ఓటు వేయడానికి పదుల సంఖ్యలో వచ్చే జనం మాదిరి –
సగానికి పైగా విద్యార్థులు ఒక రోజు సెలవు దొరికిందిలే అన్న ఆనందంతో, ఓటు వేయడానికి రాకపోగా, వచ్చిన మిగతా విద్యార్థులలో 85 శాతం ---
ఎన్నికల బరిలో నిలబడిన ఏ అభ్యర్ధీ కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్ష / కార్యదర్శి పదవులకి అర్హులు కారు అని నోటితో చెప్పక - ‘నోటా’ కే ఓటువేసి --- మరో తడవ ఎన్నిక ప్రక్రియకి తలుపులు తెరిచేరు.
**********