కాలేజీ నుండి వస్తూనే మంచమ్మీద వాలిపోయాడు కిరణ్. సామాన్యంగా ఇంటికి రాగానే కిరణ్ బ్యాట్ పుచ్చుకుని బయటకు వెళ్ళిపోతాడు. అతని కోసం అక్కడ పెద్ద కుర్ర క్రికెట్ టీం ఎదురుచూస్తూంటుంది.
ఆ రోజు వచ్చీ రాగానే మంచం ఎక్కి దుప్పటీ కప్పుకుని పడుకున్న కిరణ్ ను చూసి కంగారుగా వెళ్ళి ఒంటిమీద చెయ్యివేసి చూశాను. . ఒళ్ళు కాలిపోతోంది. కాలేజీకి వెళ్ళేటప్పుడే ఒళ్ళు నొప్పులు , జ్వరంగా ఉన్నట్టుగా అనిపించింది అని చెప్పాడు కిరణ్.
నేను ఇంకా ఒక్క క్షణం అక్కడ నిలబడలేక పోయాను . ఐదు నిమిషాలలో తయారయ్యి కిరణ్ ను తీసుకుని ఆటోలో తెలిసిన ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను.
అంతకు ముందు ఎంత ఉందో తెలియదు కానీ ఆసుపత్రి మొహం చూడగానే జ్వరం నూట రెండు డిగ్రీలు చూపిస్తోంది.
ఆసుపత్రిలో కిటకిట లాడిపోతున్న రోగుల నేపధ్యంలో డాక్టర్ గారి మొహం బాగానే వికసించి కనిపిస్తోంది. అందులోనూ ఇప్పుడు జ్వరాల సీజన్. ఏ ఆసుపత్రి చూసినా జ్వరాలతో బాధపతున్న రోగులే అని మాధ్యమాలు ఘోషిస్తున్నాయి.
అన్నిటికీ ఒకటే మంత్రం లాగా డాక్టర్ గారు పరపరా యాంటీ బయాటిక్స్ రాసేస్తున్నారు.
" ఆహారం ఏమి తీసుకోవచ్చాంటారు డాక్టర్ గారు ?" అని అడిగాను కుర్చీలోంచి లేస్తూ. .
" ప్రత్యేకంగా ఏమీ లేదు. కుర్రాడికి సయిస్తే అన్నం కూడా పెట్టండి. . ఇప్పటి జ్వరాలకు పత్యాలు అవసరం లేదు " అన్నాడు డాక్టర్ వేరే పేషెంట్ ను చూస్తూ.
"జ్వరం కొద్దిగా ఎక్కువగా ఉంది కదా డాక్టర్ . అన్నం తింటే పర్వాలేదంటారా ?" సందేహంగా అడిగాను.
'"చెప్పాను కదమ్మా.సయిస్తే తినమని " అన్నాడు డాక్టర్ మొహం అదోలా పెట్టి. కన్సల్టింగ్ ఫీజు బాగానే ముడుతోంది కాబట్టి సాధ్యమైనంతవరకు వచ్చినవాళ్ళకు సానుకూలంగానే సమాధానం చెపుతున్నాడు. .
** ** ** **
కిరణ్ కు అన్నాన్ని మెత్తగా నలిపి దాంట్లో చారు కలిపి ఇచ్చాను .
"అయ్యో మజ్జిగ పోసుకోవచ్చా అని అడగటం మర్చిపోయాను ఈ హడావిడిలో . ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే తిట్టుకుంటాడేమో" అని గొణుక్కుంటూ ఉంటే" ఏమిటమ్మా అసలు నూట రెండు డిగ్రీలు జ్వరం ఉన్న వాడిని అన్నమే తినమన్నప్పుడు ఇక మజ్జిగ అయితేనేం ఏదైతేనేం సయిస్తే అన్నీ తినొచ్చనేగా దాని అర్ధం " అన్నాడు కిరణ్ కలిపించుకుని.
"ఏమోరా. డాక్టర్లు చెప్పారని మనం అపత్యం చెయ్యడం మంచిది కాదు. ఈ రోజు ఒక్క రోజు ఆగుదాము. రేపు జ్వరం కొద్దిగా తగ్గు ముఖం పట్టాక మజ్జిగ అన్నం కూడా తిందువు గానీ " అంటూ సర్దిచెప్పాను. .
ఆ కాస్త అన్నం పడ్డాక కిరణ్ మంచం ఎక్కాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. "జ్వరం వచ్చినప్పుడు అన్నం లాంటి పదార్ధం కడుపులోకి వెళ్లినప్పుడు రెండు మూడు గంటలైనా నిద్రపోకూడదు అని అలా గానీ చేసినట్లైతే మళ్ళీ జ్వరం తిరగబెడుతుందని" నా చిన్నప్పుడు పిల్లల్ని పడుకోకుండా పక్కన పెద్దవాళ్ళు కాపలా కాయడం నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు కిరణ్ ను పడుకోకుండా ఎలా ఆపడం ఆయన ఇంట్లో ఉండి ఉంటే ఆ బాధ్యత ఆయనకు అప్పగిద్దామంటే అర్జెంట్ ఆఫీసు పనిమీద క్యాంపుకు వెళ్ళారు .
అదృష్టవశాత్తు కిరణ్ మంచం ఎక్కినా సెల్ ఫోనులో ఏవో చూసుకుంటూ ఉండిపోయాడు.
ఆ పక్కనే ఈజీ ఛైర్లో పడుకుని వాడిని ఒక కంట గమనిస్తూ పాత రోజుల జ్ఞాపకాలలోకి జారుకున్నాను .
" సుమారు నలభై రెండేళ్ల క్రితం సంగతి . నలుగురు అన్నదమ్ముల తర్వాత నేను చివర దానిని. అప్పట్లో మంచినీళ్ళు పరిశుభ్రంగా సప్లయ్ చేయకపోవడం , ఏ పదార్ధం హైజినిక్ గా ఉండక పోవడం వల్లనో ఏమో జ్వరాలు లాంటి రోగాలు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గేవి కావు. ఇప్పటిలాగా యాంటీ బైయాటిక్ మందులు ఎక్కువగా వాడకంలో లేకపోవడంతో వచ్చిన జ్వరాలు, ఇన్ఫెక్షన్లు కనీసం వారం పది రోజులకు గానీ తగ్గేవి కావు.ఇక జ్వరం వచ్చిన తర్వాత పెట్టె పత్యాలు గురించి చెప్పాలంటే వాటిని మా పెద్ద వాళ్ళు "పుళ్ళ పత్యాలు " అని అభివర్ణించే వారు. .పూర్తిగా సబ్ నార్మల్ వస్తే కానీ అన్నం తినడానికి వీల్లేదు. ఆ అన్నం కూడా బియ్యాన్ని వేయించి వండేవాళ్లు. పాత చింతకాయ పచ్చడో, నిమ్మకాయ ఊరగాయతో పాటు బీరకాయ , , పొట్ల కాయ కూరో వండి, దాంట్లో ఒకే ఒక పచ్చిమిరప కాయ వేసి నేతితో పోపు పెట్టి జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకు తినిపించే వాళ్ళు. సడన్గా మమ్మల్ని ఎవరైనా చూశారంటే ఒక చీపురు పుల్లను చూసినట్టుగా ఆశ్చర్య పోయే వాళ్ళు. జ్వరం వచ్చి తగ్గాక అంతగా చిక్కిపోయి ఉండేవాళ్లం. మా పిల్లలం వీధి అరుగుమీద కూర్చుని పొట్లకాయలు , బీర కాయలు అమ్మే వాళ్ళు ఎవరైనా వస్తారా అని ఎదురుతెన్నులు చూసే వాళ్ళం. . మాకు జ్వరం తగ్గాక కూడా ఒక నెలరోజులవరకు పత్యంగా ఈ రెండు కూరలే. ఇంకో విషయం. కనీసం ఒక వారం అయినా పొద్దున్నే భోజనం తప్ప రాత్రి అన్నం వాసన కూడా చూడటానికి అవకాశం లేదు. ఇక టైఫాయిడ్ లాంటి భయంకరమైన జ్వరాలు వచ్చాయంటే జ్వరాలు నెలలు తరబడి తగ్గేవి కావు. . ఇక ఆ కాలంలో పొరపాటున కూడా స్నానం చెయ్యడానికి వీల్లేదు. వేడినీళ్ళ గుడ్డతో ఒళ్ళంతా తుడవడమే. ఇంట్లో ఒక గదిలో జ్వరాల మంచం ఉండేది . పిల్లలు ఎక్కువమంది ఉండటం వల్ల ఒకరికి జ్వరం తగ్గగానే మరొకరు ఆ మంచం ఆక్రమించే వాళ్ళం. . ఇది చాలదన్నట్టు ఆట్లమ్మ, పొంగు లాంటి అమ్మవారు ఎప్పుడూ ఇంట్లోనే కాపురం ఉండేవారు. ఈ క్రమంలో పిల్లల చదువులు అటకెక్కెవి. అందరూ అత్తేసరు మార్కులతోనే ఎలాగో అలా గట్టెక్కే వాళ్ళం. మాకు ఇంటికి దగ్గరలోనే ఒక ఆసుపత్రి ఉండేది. అప్పుడే కొత్తగా మెడిసిన్ పాసయ్యి నర్సింగ్ హోం పెట్టారు ఒక దంపతులు. మా కుటుంబం మొత్తం వాళ్ళ దగ్గరే వైద్యం. మేము ఆర్ధికంగా అంతగా ఉన్న వాళ్ళం కాకపోవడంతో పాపం ఆ డాక్టర్లు మామీద ప్రత్యేకమైన శ్రద్ద చూపించే వాళ్ళు. . ఫీజ్ కూడా చాలా తక్కువగా తీసుకునే వారు. . ఇప్పుడు చూస్తూంటే జ్వరం అనేది ఒక రోగమే కాదు. గూగుల్ లో చూసి ఎవరికి వారు మందులు వేసుకుని జ్వరం తగ్గించేసుకుంటున్నారు. ఇక పూర్వమ్లా పథ్యం అనేదే లేదు. ఈ రోజు డాక్టర్ సయిస్తే ఏదైనా తినమన్నాడు అంటే వైద్య రంగంలో ఎంతగా విప్లవాత్మక మార్పులు వచ్చాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది." "అమ్మా ఇక నిద్ర వస్తోంది. ఒక గంటసేపు పడుకుంటాను " అన్నాడు కిరణ్ పెద్దగా ఆవలిస్తూ. నాకు మాత్రం ఎందుకో శంకగా ఉంది. అసలే కరోనా కాలం. కరోనా వచ్చిందంటే ముందు ఎవరైనా ముందు అడిగేది "జ్వరం ఉందా ?" అని . మా వీధిలో దాదాపు అందరికీ కోవిడ్ వచ్చి కోలుకున్నారు. మేము మాత్రం ఎలాగో తప్పించుకుంటూ వస్తున్నాం. అసలే ఆయన ఊళ్ళో లేరు. ఈ పరిస్తితిలో వీడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. కరోనా రెండు మూడు దశలు అయిపోయాయి. ఇక ఆ వైరస్ తో భయం లేదు అని డాక్టర్లు చెపుతున్నా వచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ వస్తున్న దాఖలాలు చాలా కనిపిస్తున్న తరుణంలో అసలు రాకుండా కాపాడుకుంటూ వస్తున్న మమ్మల్ని మాత్రం ఆ మహమ్మారి వదిలిపెడుతుందా అన్న భయం నాలో అణువణువూ వ్యాపించింది. ఆ రాత్రి కిరణ్ పడుకున్నాడే కానీ మంచమ్మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. వాడితో పాటు నాకు కూడా నిద్ర లేదు. ఆయననుండి ఫోన్ వచ్చింది "వాడు ఎలా ఉన్నాడని ?" "జ్వరం అయితే 102 ఉంది కానీ డాక్టర్ అందరికీ రాసిచ్చినట్టు యాంటీ బయాటిక్ మందులు రాసిచ్చాడు. సయిస్తే అన్నం కూడా తినమని చెప్పాడు. అదే చేశాను " అన్నాను '' సరే. నాకు రావడానికి ఇంకో రెండు రోజులు పడుతుంది. వాడు అసలే దుడుకు స్వభావం కలవాడు. ఏది పెడితే అది జాలిపడి పెట్టకు.బయట కరోనా ఎక్కడా తగ్గినట్టు అనిపించడం లేదు. ఎవరూ టెస్ట్ చేయించుకోకుండా మందుల షాపు వాళ్ళిచ్చిన మందులు వేసుకోవడంతో అందరికీ పాజిటివ్ వున్నా ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడం లేదు. అందుకే వాళ్ళు కరోనా పూర్తి కంట్రోల్లో వుందని చెపుతున్నారు. మనం రిస్క్ తీసుకోలేము. కొద్దిగా వాడిని కనిపెట్టుకుని ఉండు. ఒకసారి జ్వరం ఎంతుందో చూడలేకపోయావా ?" అన్నాడు . '"ఇందాకే చూశాను. పొద్దున్న ఎంతుందో అంతే ఉంది. కాళ్ళు కూడా లాగుతున్నాయి అంటున్నాడు. ఎందుకైనా మంచిది మీరు ముందే బయలుదేరి వచ్చేయొచ్చుగా. అవసరమైతే ఇంకో మంచి ఆసుపత్రికి తీసుకెళ్దురు గానీ " అన్నాను దిగులుగా. "ఒక పని చెయ్యవోయ్. ఈ జ్వరాలను నమ్మడానికి వీల్లేదు.. అందరిలా మనం కూడా అదే తగ్గుతుంది అని ఊరుకోక రేపు కోవిడ్ -19 స్వాబ్ పీసీఆర్ టెస్ట్ చేయించు. సాయంత్రానికల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. అందులో ఏమీ లేదని తెలిస్తే ఈ జ్వరానికి భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే అది నీకూ , నాకూ కూడా అంటుతుంది.డబ్బులైనా పర్వాలేదు. ముందా పని చూడు " అన్నాడు నిజానికి నాకు ఆయన చెప్పే అంతవరకు ఆ అనుమానం రాలేదు. తర్వాత రోజు ఆయన చెప్పినట్టే టెస్ట్ చేయించాను. సాయంత్రానికల్లా రిజల్ట్ రానే వచ్చింది. ఇంకేముంది కొంప ములిగింది కరోనా పాజిటివ్ అని వచ్చింది." వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి . ఇప్పుడు జ్వరాలు అప్పట్లా లేవు" అని ఇందాకటి వరకు అనుకున్నాను కానీ కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చి మామూలు జ్వరం కూడా కొంపలు ముంచే అంతవరకు తీసుకు వెళ్తాయి అని ఇప్పుడే నాకు అర్ధం అయ్యింది. ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ ,నీరసం ముంచుకొచ్చాయి. నుదుటకు పట్టిన చెమటను తుడుచుకుంటూ అప్పటికప్పుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పాను పాజిటివ్ వచ్చిందని కిరణ్కు వినపడకుండా వేరే రూములోంచి. . నేను చెప్పిన విషయం విని ఆయన షాక్ తిన్నట్టయ్యాడు. అతని కంఠంలో తీవ్రత చోటు చేసుకుంది. "అవును.నేను ముందే అనుకున్నాను. కరోనా నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదని. వాడు ఊరుమీద పడి తిరుగుతున్నా నీ కంట్రోల్ అసలు లేదు. . నోటికి మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళడం ఎప్పుడైనా చూశావా ?. ఎక్కడో అంటించేసుకొచ్చాడు. ఇక నీకు , నాకూ కూడా అంటుకోవడం ఖాయం. " అంటున్నాడు తీక్షణంగా . "ఏదీ ఆ రిపోర్ట్ ఇటియ్యి" అంటూ కిరణ్ నా చేతిలోంచి కాయితాలు లాక్కున్నాడు. అప్పటివరకూ సెల్ ఫోనులో కామిడీ షో చూస్తూ నవ్వుకుంటున్న వాడి పెదవులమీద నవ్వు మాయమయ్యింది. "అమ్మా ఎందుకైనా మంచిది. నువ్వు కొంచం దూరంగా ఉండమ్మా. ఈ రోగం నీకు కూడా అంటుకుందంటే ఇక ఇంట్లో చాకిరీ చేసే వాళ్లెవరు ? ఇక నాన్న కూడా వచ్చారంటే ఆయన్ను మాత్రం వదిలిపెడుతుందా ? నువ్వు డాక్టర్ గారికి ఫోన్ చేసి నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పి ఏవైనా టాబ్లెట్స్ ఆన్లైన్ లో ఇమ్మని చెప్పు. ఆ టాబ్లెట్స్ అవి నేను క్రమం తప్పకుండా వేసుకుంటాను. నువ్వు మాత్రం రిస్క్ తీసుకోకు. " అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. "అదెలా వీలవుతుంది రా. నాక్కూడా వస్తే వచ్చింది. నిన్ను పట్టించుకోకుండా దూరంగా ఉండటం ఎలా సాధ్యం అవుతుంది ? నాకు ఇమ్యూనిటీ ఉందిలే. భగవంతుడు దయవల్ల నాకేమీ కాదు. నువ్వు ఆందోళన పడకు. నేను మాస్కు పెట్టుకుని జాగ్రత్తగా ఉంటానులే . చిన్న పిల్లాడివి . నీకేదేనా అయితే మేము తట్టుకోలేము " అని వాడికి ధైర్యం చెపుతూంటే నాలో బిగపట్టి ఉంచిన ఏడుపు పైకి పొంగుకొచ్చింది. " ఏమీ లేదమ్మ . అది కరోనా అని చెప్పలేము. మా భాషలో దాన్ని ఒమిక్రాన్ అంటున్నాము.అది కూడా పిల్లాడికి చాలా లైట్ గా వచ్చింది. అసలు ఈ ఒమిక్రాన్ వల్ల ఎవరికీ ఎటువంటి సమస్యా వచ్చినట్టు రికార్డులు లేవు. నేనిచ్చిన టాబ్లెట్స్ వాడితే రెండు రోజుల్లో మీ కుర్రాడు లేచి తిరుగుతాడు. ఇంట్లో ఎంతమందికొచ్చినా ఇదే వైద్యం. ఎవరికీ ఏమీ కాదు. ఆసుపత్రుల వెంట తిరగాల్సిన అవసరం అసలు లేదు " అని డాక్టర్ ఫోన్ లో చెప్తూంటే నాలో కొండంత ధైర్యం కలిగింది. డాక్టర్ గారి మాటలు ఉన్నది ఉన్నట్టు మా ఆయనకు ఫోనులో చెప్పి "మీరు కూడా ధైర్యంగా ఉండండి .అన్నిటికీ డాక్టర్ ఉన్నారు. ఇంకా భగవంతుడు మన వెంటే ఎలాగూ ఉంటాడు " అంటూ చెప్పేశాక నా మనసు తేలిక పడింది. మా వారు క్యాంపునుండి తిరిగి రాగానే కిరణ్ ఇంట్లో హుషారుగా తిరుగుతూ ఉండటం ఆయన్ని ఆశ్చర్యంలో పడేసింది. వాడు తనకు అసలు కరోనా వచ్చిన లక్షణాలు ఏ మాత్రమూ లేవని చెప్పాడు. ఆయన ఎలాగూ వచ్చేశారు కనుక మరోసారి వాడికీ, నాకూ కూడా టెస్ట్ చేయించేశారు. ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. జీవితంలో ఇంతకన్నా సాధించాల్సినది ఏదీ లేదు అన్న ధీమా ఆ క్షణంలో కలిగింది. ముందుగా మా కుటుంబానికి ఈ ప్యాండమిక్ పరిస్తితులలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఏ మాత్రమూ క్రుంగిపోకుండా కాపాడి అతి తక్కువ ఖర్చుతో బయట పడేసిన మా డాక్టర్ గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ***** సమాప్తం