" దొరా, ఎవరో పెద్దాయన బాబాలాగ పెద్ద తెల్ల జుత్తు, గుబురు గెడ్డం , మీసాలు బుజం ఎనక పెద్ద సంచితో గూడెం వైపు దారి ఎతుక్కుంటూ వత్తన్నాడు " ఎగుసుకుంటు వచ్చి చెబుతున్నాడు తిప్పడు. " ఎవుర్రా , ఈ ఏలప్పుడు మన గూడెం కాసి వచ్చేది. ఏడనుంచి అడవిగొడ్డు మీదికి ఉరికినా పెమాదమే" గూడెం దొర ఆందోళన కనబరిచాడు. " తెలవదు దొరా, నానూ బయపడుతు తమకి ఇసయం చెబుదామని దగ్గిర కొచ్చినా" జవాబు చెప్పినాడు. " అసలే దొమ్మరిగొడ్లు తిరుగాడే ఏల, ఎవరో ఏటో బేగెళ్లి ఈడకు తోలుకు రా" తొందర చేసాడు కోయదొర. కోయ తిప్పడు చేతి బరిస కర్రతో పరుగున పోయి గూడెం దారి వెతుకుతున్న ఆ ఆసామిని వెంటతీసుకుని కోయ గూడేనికి తీసుకు వచ్చాడు. పెరిగిన తెల్ల జుత్తు, గుబురు మీసాలతో భుజాన గుడ్డ సంచితో మాసిన బట్టలతో వచ్చిన వ్యక్తిని పైనుంచి కిందకు చూస్తున్నాడు కోయదొర. "ఏంటి సామీ ! తమరు ఎవురు? అడవి గొడ్లు తిరిగే ఈ అడవిలోకి వచ్చినారు. మనిసి సాయం నేకపోతే ఒంటరిగా ఈ గూడెంలో తిరగడానికి మామే బయపడతాము. తమరు బయం లేకుండా ఇటొచ్చినారు."తన సంశయం చెప్పినాడు కోయదొర. " నీ పేరేంటి దొరా?"అడిగాడు అజ్ఞాత వ్యక్తి. " నా పేరు సింగం దొర సామీ! మాతాత ముత్తాతల నుంచి ఈ అడవి బూముల్నే నమ్మి జీవనం సాగిత్తునాము." జవాబు చెప్పాడు. నా పేరు భగవాన్లు. నాకెవరు లేరు. బ్రహ్మచారిని. నన్ను చేరదీసిన మా గురువు పరమహంస నాకు విద్యతో పాటు ఆయుర్వేదంలో ఎన్నో వైద్య విధానాలు నేర్పి వీటిని నిస్వార్ధంగా మానవసేవకు వినియోగించాలని ఆదేశించారు. వారి మాట ప్రకారం అన్ని ప్రాంతాల్లో సంచరిస్తు కావల్సిన వారికి ఆయుర్వేదంలో నా సేవలు అందిస్తున్నాను. అడవి మద్యలో కోయగూడెంలో మౌలిక వసతులు వైద్యం అందక గిరిజనులు చనిపోతున్న వార్తలు తెలిసి ఈ అడవిలో మీ కోయగూడెం కోసం దారులు వెతుకుతుంటే మీ అనుచరులు నన్ను మీ దగ్గరకు తీసుకు వచ్చారు. ఈ అడవి ప్రాంతంలో అద్భుతమైన సంజీవని వంటి మూలికలు, తైలాలు , చెట్ల బెరడు దొరుకుతాయని తెల్సింది. నాకు తెల్సిన వైద్యం మీ గిరిజనులకు ఉపయోగించి సేవ చెయ్యాలని వచ్చాను" తను వచ్చిన విషయం తెలియచేసాడు ఆయుర్వేద వైద్యుడు భగవాన్లు. "వద్దు సామీ, ఈ అడవిలో తమరు ఉండలేరు.రేతిరి పొద్దుగాల చిరుతలు, ఎలుగ్గొడ్లు, దొమ్మరి గొడ్లు , పాములు తిరుగుతూనే ఉంటాయి. మాము పుట్టిన కాడనుంచి ఈడనే జీవనం గడుపుతున్నాం. చావైనా బతుకైనా ఈ అడవి జీవులతోనే మా సావాసం.కందమూలాలో, చెవులపిల్లులో,పిట్టలు ఏది దొరికితే దానితోనే మా ఆకలి తీరతాది. తుఫాను గాలైనా, చలిగాలైనా మా గుడిసెల్లోనే బతుకు సాగిపోతాది. ఈ పోడు బూముల్ని దున్నుకుని ఏది పండితే దాంతో కడుపు నిండుతాది.ఈ మజ్జెల కాడ పట్నం బాబులు లేబరోళ్లను ఎంటపెట్టుకుని మంచి గందం, టేకు చెట్లు కోసుకుపోతన్నారు. అడవిగొడ్లు బయంతో మా గూడేల వైపు పరుగులు తీత్తున్నాయి. మా పేనాలకు బయం పట్టుకుంది" అని భగవాన్లకి అక్కడి పరిస్థితులు తెలియ చేస్తుండగా ఒక కోయ కుర్రాడు పరుగున వచ్చి " దొరా, కుర్రోడి పెల్లాం చిమిలికి జరంతో ఒల్లు కాలిపోతన్నాది. కుర్రోడు పుట్ట తేనె తేడానికి అడవిలోకి పోనాడు. గుడిసెలో ఎవురూ లేరు. చిమిలి జరంతో తల్లడిల్లు పోతోంది. ముసిల్ది బక్కమ్మ గూడెంలో ఎటుపోనాదో తెలవడం లేదు. పసరు మందు ఏసే వారెవరు లేరు" అని గాబరాగా చెప్పుకు పోతున్నాడు. వెంటనే ఆయుర్వేద వైద్యుడు భగవాన్లు కలగచేసుకుని " సింగం దొరా, నేను కోయ పడుచు జ్వరానికి వైద్యం చేసి తగ్గిస్తానని, తన వెంట తోడుగా ఎవరినైన పంపితే వెళ్లి చూస్తానన్నాడు" సింగం దొర గత్యంతరం లేక కోయ కుర్రాడిని తోడిచ్చి చిమిలి ఉన్న గుడిసెకు పంపేడు. అక్కడికి చేరిన వైద్యుడు భగవాన్లు గిరిజన పడుచు చిమిలిని పరీక్ష చేసి పరిస్థితి అర్థం చేసుకుని వెంట వచ్చిన కోయ కుర్రాడి చేత చల్లటి నీళ్లు పొడి గుడ్డ తెప్పించి తడిపి నుదుటున మెడ చేతులు కాళ్లు ఒళ్లు తుడవగా కొంత సేపటికి జ్వరం అదుపులో కొచ్చి కుమిలి దాహం అని పెదాలు కదుపుతుండగా భగవాన్లు అర్థం చేసుకుని అక్కడే వెదురు కందెలో ఉన్న పుట్టతేనెను చల్లటి నీటిలో కలిపి తాగించాడు. కొంత సేపటికి కుమిలికి జ్వరం తగ్గి వంట్లో శక్తి వచ్చి కళ్లు తెరిచింది. వెంట వచ్చిన కోయకుర్రాడు ఆనందంతో గెంతులేసాడు. ఈ విషయం సింగం దొరకు తెలిసి చిన్నోడు, బక్కడు, తుంబడు సేవకులతో గుడిసెకు వచ్చి చూడగా కుమిలి తడిక మంచం మీద కూకుని కనబడింది. ఈ వార్త గూడెం అంతా పాకి ఎవరో పట్నం డాక్టరు సామి వచ్చి జరంతో చావుబతుకుల మద్య ఉన్న కుమిలికి వైద్యం చేసి బతికించాడని చూడటానికి గుడిసె వద్దకు చేరుకున్నారు. ఈ మద్య జ్వరాలు , వాంతులు ,విరేచనాలతో, కామెర్లతో గూడెంలో పిల్లా పెద్దా చాలమంది చచ్చి పోతున్నారు.సరైన వైద్యం అందక బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో అనుభవమున్న భగవాన్లు గూడెంలో అపరిశుభ్రత, సరిగ్గా పక్వం కాని తిండి, కలుషిత నీరు, దోమల మూలంగా మలేరియా జ్వరాలు, కామెర్లు, వాంతులు అని తెలుసుకుని వారిలో చైతన్యం కలిగించారు. పరిసరాల శుభ్రత, వేప ఆకులు మరిగించి జల్లించడం, మరిగించిన నీటిని తాగేలా చూడటం , జంతువుల మాంసం బాగా ఉడికించి తినేలా చెయ్యడం, పెంపుడు జంతువుల్ని దూరంలో పెంచడం, శరీర శుభ్రత, బాలింతలకు పోషకాహారం అందేలా ఏర్పాట్లు, గుగ్గిలం బెరడు ధూపం వంటి ఎన్నో ఆరోగ్య సూత్రాల్ని అమలు చెయ్యడంతో కోయ గూడెం రూపురేఖలే మారిపోయాయి. వైద్యుడు భగవాన్లు వచ్చి నప్పటినుంచీ గూడెం ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ రోజువారీ పనులు చేసుకుంటు ఆదాయం సంపాదిస్తున్నారు. పిల్లలు పెద్దలు చలాకీగా తిరుగుతుండటం చూసి సింగం దొర మనసు ఆనందంగా ఉంది. డాక్టరు బాబు వచ్చి దేవుడిలా అందర్నీ వైద్యంతో చల్లగా చూస్తున్నాడని మురిసిపోయాడు. వైద్యుడు భగవాన్లు శాకాహారి. బ్రహ్మచారి. హనుమాన్ దైవ భక్తుడు. రోజూ హనుమాన్ చాలీసా పఠనం చేస్తుంటాడు. కోయదొర డాక్టరు బాబుకి ఇబ్బంది కలగకుండా గూడేనికి ఒక వైపు ఎత్తైన దిమ్మ ఏర్పాటు చేసి దాని మీద తుంగ గడ్డి వెదురు బొంగులతో చక్కటి చక్కటి కుటీరం కట్టించి చుట్టూ రక్షణగా వెదురు తడికల గోడ ఉంచారు. ఆయనకి రోజూ ఫలాలు , పాలు, వెదురు బియ్యం అన్నాన్ని సమకూరుస్తున్నారు. వైద్యుడు భగవాన్లు తోడుగా ఎవరో ఒకరిని తీసుకుని అడవిలో విలువైన మూలికలు , ఆకులు , వేర్లు సేకరించి పసర్లు, తైలాలు, చూర్ణాలు తయారు చేసి గాయాలు, జ్వరాలు, చర్మ వ్యాధులకు మందులు తయారు చేస్తున్నాడు. సర్పగంధ వంటి పాముకాటుకు విషకీటకాలకు విరుగుడు మూలికలు దగ్గర ఉంచుకున్నాడు. గూడేనికి మూడు కోసుల దూరంలో ఉన్న రంపచోడారం వారాంత సంతకు వాగులు గుట్టలు దాటి పనసపళ్లు, అరటి పళ్లు, దోసకాయలు, బొబ్బాస, తియ్య దుంపలు, సొరకాయలు, పుట్టతేనె, కూరగాయలు అమ్ముకుని నిత్యం అవుసరమైన ఉప్పు నూని సరుకులు బట్టలు కొని తెచ్చుకుంటారు జనాలు.వానలు, వరదలప్పుడు సంతకు పోవడం కష్టమే. ప్రతి సంవత్సరం దసరా పండగకు గుట్ట మీదున్న మోదకొండమ్మ పండగ ఆనందంగా జరుపుకోవడం గూడెం ప్రజలు ఆనవాయితీ. వారి సాంప్రదాయ కోయ వేష ధారణతో కొమ్ముబూరాలు వాయిద్యాల మద్య ఎనుబోతును కొండ దేవతకు బలిచ్చి చల్లగా చూడమని కోరుకుంటారు. ఈ సంవత్సరం మోద కొండమ్మకు బలిగా ఎనుబోతును ఇవ్వడం జీవహింసని, పర్యావరణానికి హానికరమని దానికి బదులుగా అరటి బోదెను నరకమని సలహా ఇచ్చాడు వైద్యుడు భగవాన్లు. కొండ దేవతకు కోపం వత్తే గూడెం ప్రజల్ని శపించి నాశనం చేస్తాదని గూడెం పెద్దలు, సింగం దొర మొర పెట్టుకున్నారు. "కొండదేవతకు కోపం వస్తే నన్ను బలి తీసుకోమనండి. నేను కదా జంతు బలి వద్దన్నది, కనక గూడెం కోసం నా ప్రాణాలు ఇస్తాను" అని వారికి నచ్చ చెప్పి అరటి బోదెను బలిగా సమర్పించారు. తర్వాత గూడెం ప్రజలకు ఏమీ కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. అప్పటి నుంచి మోదకొండమ్మకు జంతుబలి నిషేధమైంది. గూడేనికి మోదకొండమ్మ దేవత తర్వాత తమరే మా దేవుడని వైద్యుడు భగవాన్లను కొనియాడారు గూడెం జనాలు. * * *