చిన్న తప్పెటపై దరువు వేస్తు అడవి అంతా తిరుగుతున్న కుందేలు ' ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా రేపు సింహరాజు గారి పుట్టినరోజు కనుక అందరూ తమశక్తికోద్ది రాజుగారికి బహుమతులు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది ' అంటూ ముందుకు సాగిపోయాడు.రేపు రాజుగారికి ఏంబహుమతి ఇవ్వాలో తెలియని కోతి,అప్పుడేవచ్చిన పిల్లరామచిలుకను అడిగింది.
'నువ్వు ఏబహుమతి ఇవ్వవద్దు పెట్టింది తినిరా,అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక తింగిరి పనిచేసి తన్నులు తిని వస్తుంటావుకదా! రేపటిరోజున జాగ్రత్త' అందిపిల్లరామచిలుక. ' రేపుచూడు నా తెలివితేటలు' అని, సింహరాజుకు బహుమతిగా మంచి పండు ఏదైనా ఇవ్వలి అనుకుంటూ అడవి అంతా తిరిగినా ఏమి దొరకలేదు, ముందురోజు సింహరాజుగారు తనఇంట విందుకు అడవిలోని అన్ని రకాల పండ్లు,తేనే సేకరించడంతో కోతికి ఒక్కపండుకూడా లభించలేదు.
అడవిఅంతా గాలించితిరిగి వస్తుంటే రేగిపండు ఒకటి కనిపించింది దాన్ని తుంచి రేపటిదాకా ఎక్కడ దాచాలో తెలియక నోట్లో పెట్టుకుని బుగ్గలో దాచి,నేరుగా సింహరాజు గుహముందు ఉన్న చెట్టుపై చేరి నిద్రించాడు కోతి. తెల్లవారుతూనే అందరికన్నముందు వరుసలో నిలబడి సింహరాజు రాగానే నమస్కరిస్తూ బుగ్గన ఉన్న రేగి పండు వినయంగా అందించాడు. కోతి ఎంగిలి రేగిపండు బహుమతి ఇవ్వడం చూసిన సింహరాజు కోపంతో అక్కడ ఉన్న ఎలుగు బంట్లతో ' వీడికి నాలుగు తగిలించి ఆఎంగిలి రేగిపండు వాడి చేతే మింగించండి ' అన్నాడు.
కొతినోట్లో రేగి పండు ఉంచి బలంగా నాలుగు తగిలించారు ఎలుగుబంట్లు.
' అయిందా నే చెప్పినట్లే అయిందిగా కుదిరిందా తిక్క' అన్నది పిల్లరామచిలుక. ఇవిఏమి పట్టించుకోని కోతి కిందపడి గిజగిజలాడుతూ కిచకిచ నవ్వసాగింది. అదిచూసిన సింహరాజు ' ఏయ్ ఎవరైనా తంతే ఏడుస్తారు నువ్వేంటి నవ్వుతున్నావు పిచ్చిపట్టిందా? 'అన్నాడు.
' ప్రభూ నేను రేగిపండు కాబట్టి బతికాపోయాను నావెనుక నక్క గుమ్మడి పండుతోఉన్నారు వారు దాన్నిఎలా మనవాళ్ళు మింగించబోతారో అని ' అన్నాడుకోతి. ఫక్కున నవ్వాయి అక్కడ ఉన్న అడవి ప్రాణులు అన్ని.
కోతి సమయస్ధూర్తికి మెచ్చుకున్న సింహరాజు 'నిజమే బహుమతులు తీసుకురావడం అందరికి సాధ్యం కాదు.అందరికి అవకాశం ఉండకపోవచ్చు ఎవరైనా ఇప్పటినుండి పుట్టినరోజులకు,మరేసందర్బలోనైనా బహుమతులు తీసుకువెళ్ళేబదులు వాటిని పండ్లరూపంలో, బలవర్ధకమైన ఆహరరూపంలో పిల్లలకు,వ్యాధిగ్రస్తులకు,వృధ్ధులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి,ఎప్పుడు మనం తినడమేకాదు సాటివారి ఆకలికూడా మనం గమనించాలి,ఇది గుర్తు ఉంచుకోవలసిన ఈవిషయం, అందరికి ఇది తెలియజేయండి 'అన్నాడు సింహరాజు.
రాజు గారి సలహకి,పసందైన విందుకి అడవి ప్రాణులు అన్ని ఆనందం వెలిబుచ్చాయి.