భాగవత కథలు -22
శ్రీకృష్ణుని విజయగాథ
బలిచక్రవర్తి నూరుగురు పుత్రులలో బాణుడు పెద్దవాడు. శత్రు భయంకరుడు. పరమశివుని పరమభక్తుడు. తన పరాక్రమంతో దేవతలను ఓడించిన బాణాసురుడు భక్తి భావంతో పరమేశ్వరుని దర్శనానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారంచేసాడు. శంకరుడు నాట్యం చేస్తుంటే డమరుకం వాయించి మెప్పించి, స్తుతించాడు. ఓదేవా! నీవు పార్వతీ సమేతంగా నా కోటకు రక్షణగా ఉండి నన్ను రక్షించు అని ప్రార్థించాడు. బక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా బాణుడి రాజధాని శోణాపురం చేరాడు. భూతగణాలతో కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు.
ఒకనాడు బాణాసురుడు హరుని పాదపద్మాలకు నమస్కరించి స్తుతించాడు. అహంకారంతో భుజాలు పొంగగా “ ఓ దేవా! యుద్ధంలో నన్నెదిరించి తన బాహుబలాన్ని చూపించగల వీరుడెవ్వడూ ఈ భూ మండలంలో కనిపించడం లేదు. నీవు ప్రసాదించిన నా వేయిచేతులూ యుద్ధం చేయాలనే కోరికతో ఉబలాటపడుతున్నాయి. నీవు తప్ప నన్నెదిరించగల ధీరుడెవ్వడూ ఈ విశాల ప్రపంచంలో లేడు.ఈ కోరిక నేనెలా తీర్చుకోవాలో శలవీయండి” అని అన్నాడు.
బాణుడి ప్రగల్భాలకు పరమశివుడు అసహ్యించుకొని ఇలా అన్నాడు. “ఓ మూర్ఖుడా తొందరపడకు. నీ రథానికి పైనున్న జండా అకారణంగా ఎప్పుడు క్రింద పడుతుందో అప్పుడు నాయంత వానితో నీ యుద్ధం జరుగుతుంది. నీ భుజాల దురద తీరుతుంది.” అని చెప్పాడు. పరమేశ్వరుడి పలుకులు విని తన కోరిక తీరుతుందని ఆనందంతో బాణుడు తన భవనానికి వెళ్ళి సుఖ సంతోషాలలో మునిగిపోయాడు. ‘ఎప్పుడు తన రథకేతనం నేత కూలుతుందా’ అని యుద్ధానికై ఎదురు చూస్తున్నాడు.
బాణాసురుడికి ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె పేరు ఉషాకన్య. ఆమె సౌందర్యవతి, సద్గుణవతి. ఒకనాడు ఆమె తన సౌధంలో మెత్తని పాన్పుపై నిద్రిస్తుండగా ఒక సౌందర్యవంతుడైన యువకునితో సుఖించినట్లు కల వచ్చింది. కలలో వచ్చిన యువకుడిని ఆమె అంతకు ముందెన్నడూ చూడలేదు. అది కలకాదు, వాస్తవమేమో ననే భ్రాంతి కలిగింది. ఉషాబాల విరహవేదనతో బాధపడుతున్నది. తన మనోవికారాన్ని చెలికత్తెలకు తెలియకుండా జాగ్రత్త పడింది.
స్నేహితురాలైన చిత్రరేఖ ఉషాకన్య మానసిక స్థితిని గమనించింది. చిత్రరేఖ బాణాసురుని మంత్రియైన కుంభాండుని కుమార్తె. “ఓ సఖీ, నిన్ను చూస్తుంటే చేతికి చిక్కిన ప్రియుణ్ణి కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ఏమిజరిగింది? నేనేమైనా సహాయం చేయగలనా?” అని అడిగింది.
“చెలీ, నాకు నీకంటే దగ్గరవారిం కెవరు ఉన్నారు? నాకొక కల వచ్చింది. ఆ కలలో వివిధాలంకార శోభితుడు, అభినవ మన్మథుడు అయిన ఒక నవయౌవనుడు కన్పించాడు. నన్ను గాఢంగా కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు. నన్ను ఆనందంలో ముంచి అంతలోనే మాయమయ్యాడు.” అని ఉషాబాల తన స్నేహితురాలికి చెప్పింది.
“ఎందుకు నీవు విచారిస్తావు. నా నేర్పరితనంతో దేవమానవ యక్షకిన్నెర శ్రేష్టుల చిత్రాలు వ్రాసి చూపిస్తాను. నీ మనోహరుడిని నువ్వు గుర్తిస్తే వానిని నీ చెంతకు తీసుకు వస్తాను” అని తన స్నేహితురాలితో చెప్పింది చిత్రలేఖ. దానికి ఉషాకన్య సమ్మతించిన వెంటనే సౌందర్యవతుల చిత్రాలను తయారుచేసి వారి వివరాలను చెప్పడం మొదలు పెట్టింది.
వీరు అమరులు, వీరు గంధర్వులు, వీరు యక్షులు వీరిలో నీ ప్రియుని గుర్తించు అని చూపించింది. అందులో ఉషాకన్యకు తనకు కలలో కనిపించిన యువకుడు లేడు. అప్పుడు భూలోకంలోని ఎందరో రాకుమారుల చిత్రాలు చూపించింది. కాని ఫలితం లేదు. అప్పుడు యదువంశ వీరులైన బలరామ, శ్రీకృష్ణ, ప్రద్యుమ్నుల చిత్రాలను చూపించింది. శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుని చిత్రపటం చూసినంతనే ఉషాకన్య ఇతనే నేమో అని అనుమానించింది. ఇంతలో చిత్రలేఖ ప్రద్యుమ్నుని కుమారుడైన అనిరుద్ధుని చిత్రాన్ని చూపించి ఈ సుందర యువకుడు శ్రీకృష్ణుని మనుమడు, ప్రద్యుమ్నుని కుమారుడు అయిన అనిరుద్ధుడు అని చెప్పింది. అపర మన్మథుడు, పద్మనేత్రుడు అయిన అనిరుద్ధుని చిత్రాన్ని చూసినంతనే ఉషాకుమారి సంతోషంతో ఇలా పలికింది. “సఖీ, నా కలలోకి వచ్చి నా మనస్సును దొంగిలించిన దొంగ ఇతనే”.
“నేను శీఘ్రంగా వెళ్ళి ఈ కుమార రత్నాన్ని తీసుకొని వస్తాను. అంత వరకూ నీవు విచారం మాను” అని చెప్పింది చిత్రలేఖ. వాయుమార్గంలో శ్రీకృష్ణుని పట్టణమైన ద్వారకకు బయలుదేరి వెళ్లింది.
అక్కడ ద్వారకలో రాజప్రాసాదంలో, చంద్రకాంత శిలాభవనంలో, హంసతూలికాతల్పంపై నిద్రిస్తున్న అనిరుద్ధుని యోగవిద్యా నైపుణ్యంతో ఎత్తుకొని శోణాపురం చేరింది. ఉషాసుందరి గదిలో పానుపుపై అనిరుద్ధుణ్ణి పడుకోబెట్టింది. ఉషాబాలతో ఇలా పలికింది. “ప్రియసఖీ, రణశూరుడూ, శత్రుసంహారుడూ, నవమన్మథాకారుడూ, అయిన నీ హృదయచోరుని అనిరుద్ధుడినితీసుకు వచ్చాను. మీరిద్దరూ ప్రణయలోకంలో విహరించండి. మీ మధ్య నేనెందుకు?” అని చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయింది.
మరునాడు ఉదయం అనిరుద్ధుడు నిద్రమేల్కొని ఉషాకుమారిని చూసాడు. మొదటి చూపులోనే ఆ సుందరిపై ప్రేమ కలిగింది. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. ఆ మృదు తల్పంపై అనిరుద్ధుడు సరససల్లాపాలతో ఉషాసుందరిని ఉత్సాహపరుస్తూ శృంగార లీలావిలాసాలతో ఓలలాడారు. వారికి పగలు రాత్రి తెలియడకుండా ఆనందసాగరంలో ములిగిపోయారు. కొన్నాళ్ళకు ఉషాబాల గర్భం దాల్చింది. అంతఃపుర దాసీలు ఈ విషయం బాణాసురునికి వినయంగా విన్నవించారు.
రాక్షసరాజు ఆగ్రహవేశంతో కరవాలం ధరించి అంతఃపురానికి వెళ్లాడు. అక్కడ మన్మథునివలె అలరారే అనిరుద్ధుణ్ణి చూసాడు. బంధించమని సైనికులకు ఆజ్ఞాపించాడు. అనిరుద్ధుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాడు. అతని ధాటికి ఆగలేక దానవ సైనికులు పారిపోయారు. అప్పుడు బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించాడు. ఇది చూసి ఉషాకాంత దుఃఖంలో ములిగిపోయింది. అదే సమయంలో సుడిగాలి వీచింది. ఆ గాలిదెబ్బకు బాణాసురుని జెండా భయంకర శబ్దం చేస్తూ నేల కూలింది. ఇది చూసిన దానవరాజు తనకు తగినవానితో సమరం జరుగుతుందని సంతోషించాడు.
ద్వారకలో అనిరుద్ధుడు కనపడ నందుకు యాదవులంతా విచారించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన నారదమహర్షి పురుషోత్తముని స్తుతించి అనిరుద్ధుడి సమాచారం తెలిపాడు. శ్రీకృష్ణుడు బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, మొదలైన యాదవ వీరులతో కలిసి పన్నెండు అక్షౌహిణుల సైన్యంతో బాణాసురునిపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. యాదవవీరులు శోణాపురాన్ని చుట్టి ముట్టడించారు. రాక్షసరాజు అత్యుత్సాహంతో, అమిత పరాక్రమంతో యుద్ధరంగానికి బయలుదేరాడు.
భక్తవత్సలుడైన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్న కొడుకుల కన్న అధికంగా అభిమానిస్తాడు. కనుక బాణుని పక్షాన యుద్ధం చేయాలని ప్రమథగణంతో కలిసి త్రిశూలాన్నిధరించి బయలుదేరాడు. ఇరుపక్షాల మధ్య భీకర సమరం జరిగింది. శ్రీకృష్ణుడు తన ధనుస్సును ఎక్కుపెట్టి బాణవర్షాన్ని కురిపించాడు. ఇది సహించని పరమేశ్వరుడు శ్రీకృష్ణునిపై శరపరంపరలను ప్రయోగించాడు. ఆ బాణాలను కృష్ణుడు మధ్యలోనే పిండి చేశాడు. అప్పుడు శివుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వాసుదేవుడు దానిని అవలీలగా చేతితోనే మరలించాడు. అనంతరం పరమేశ్వరుడు మిక్కిలి కోపంతో పాశుపతాస్త్రాన్ని సాధించాడు. కృష్ణుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పరమశివుని అస్త్రాలన్నింటినీ శాంతింప జేసాడు. వెనువెంటనే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావంతో శంకరుడు నందీశ్వరుని నూపురంపై వాలిపోయాడు.
బలరాముడు కుంభాండక, కూపకర్ణులను; ప్రద్యుమ్నుడు కుమారస్వామిని; సాంబుడు బాణుని కుమారుని పరాజితులు చేశారు.బాణుని సైన్యం దీనత్వంతో పారిపోవనారంభించింది. అప్పుడు బాణాసురుడు మిక్కిల కోపంతో తన వేయిబాహువు లున్నాయన్న అహంకారంతో శ్రీకృష్ణునిపై దాడిచేశాడు. శ్రీకృష్ణుడు విజృంభించి బాణుని ధనస్సును ద్వంసం చేసి సారథిని సంహరించాడు. తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. బాణుడు ఏమీచేయలేక నిశ్చేష్టుడయ్యాడు. ఆ సమయంలో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకరాకారంతో అరుదెంచింది. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వైష్ణవజ్వరాన్ని ప్రయోగించాడు. శివజ్వరం ఓడిపోయి పారిపోయింది. వైష్ణవజ్వరం వెంటపడి తరిమింది. శివజ్వరానికి దిక్కుతోచక వాసుదేవుని పాదాలపై పడి శరణు వేడింది.
బాణాసురుడు మళ్ళీ యుద్ధసన్నద్ధుడై రణరంగానికి వచ్చి శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు. ఒకేసారిగా వేయిచేతులతో బాణాలను వేశాడు. శ్రీకృష్ణుడు తన అర్ధచంద్రాకార బాణాలతో వాటిని మార్గమధ్యంలోనే త్రుంచివేశాడు. దేవతలచే పూజింపబడే సుదర్శన చక్రాన్ని బాణాసురునిపై ప్రయోగించాడు. పరమేశ్వరుడికి బాణాసురుడి పై ఎంతో దయ. అందువలన పురుషసూక్తం పఠించి శ్రీకృష్ణుని స్తుతించి శాంతింపజేసాడు..
శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వు నవ్వుతూ పరమశివునితో “నీ ఇష్టమైన కోరిక తీరుస్తాను. ఈ బాణాసురుడు నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. అతని వంశస్థులను చంపనని ప్రహ్లాదునకు మాట ఇచ్చాను. అందువలన ఈ బాణుని చంపను. ఇతని అహంకారానికి మూలమైన భుజబల గర్వాన్ని అణచివేసాను. అందుకనే నాలుగు చేతులు తప్ప తక్కిన హస్తాలను నరికి వేశాను. ఈ బాణాసురుడు నీ భక్తుల్లో అగ్రేసరుడిగా స్తుతింపబడుతూ జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు" అని చెప్పాడు. పరమేశ్వరుడు పరమానందం పొందాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో సంతోషించిన బాణుడు గోవిందుని పాదాలకు అభివందనం చేశాడు.
అనంతరం బాణుడు తన నగరానికి వెళ్ళి ఉషా అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాదుల నిచ్చి బంగారు రథంపై ఎక్కించి మిక్కిలి వైభవంగా తీసుకు వచ్చి గోవిందునకు అప్పగించాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుడి వద్ద శలవు తీసుకొని పరివార సమేతంగా ద్వారకకు వెళ్లాడు. అక్కడ అత్యంత వైభవంగా ఉషా అనిరుద్ధుల వివాహం జరిగింది.
ఈ శ్రీకృష్ణుడి విజయగాథను పఠించినవారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి. ఇహపర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి.
*శుభం*