అతని పేరేదో ఉంది కానీ, అందరూ మాత్రం ఇప్పుడతన్ని ‘సందట్లో సడేమియా’ గానే గుర్తు పడతారు. తెలుగు రాష్ట్రేతర రాష్ట్రంలోకి పొట్ట చేత బట్టుకొని వచ్చిన అతను అనతికాలంలోనే పాపులారిటీ సంపాదించాడు. దానికి కారణం, అతని వాచాలతతో, అక్కడి అన్ని తెలుగు సంస్థల్లోకి చొచ్చుకుపోవడమే. తెలుగువారి లౌకికానికి తగ్గట్టుగా ఏవో కార్యక్రమాలంటూ హడావిడి చేసి ఆ తర్వాత తుస్సుమనడం అతని ప్రత్యేకత. అంటే ఆరంభశూరుడన్నమాట
ఓ తెలుగు సంస్థలో సభ్యత్వం తీసుకుని కొందరిని కాకాపట్టి, సాంస్కృతిక విభాగానికి సహ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. అధ్యక్షుని మచ్చిక చేసుకుని, సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిని పక్కన పెట్టి, అన్నీ తానై చక్రం తిప్పాడు. తన బంధువుల, మిత్రుల నాట్య, సంగీత బృందాలను, తెలుగు రాష్ట్రాలనుంచి, సంస్థ ఖర్చులతో రప్పించి, వారితో మళ్లీ సంస్థ డబ్బులతో తినీ, తాగి తన పరపతిని పెంచుకున్నాడు. ఖర్చులో గోల్ మాల్ చేసి పబ్బం గడుపుకున్నాడు.
విషయం తెలిసి అక్కడి సభ్యులు తన్ని తగలేశారు. బయటికి మాత్రం ఆ సంస్థ కార్యకలాపాలు నచ్చక, ఆ అవక తవకలను చూసి తట్టుకోలేక తానే సంస్థ నుండి తప్పుకున్నానని టాం టాం చేశాడు.
ఇంకో సంస్థలో చేరాడు. తనకు వచ్చిన కవిత్వంతో కొందరిని ఆకట్టుకున్నాడు. తెలుగేతర రాష్ట్రంలో మనం మన మాతృభాషను, సంస్కృతిని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందని, తన సహజ వాక్చాతుర్యంతో సభ్యులను నమ్మించాడు. ఏ పదవి లేకపోయినా సాహిత్య కార్యదర్శిని మచ్చిక చేసుకుని మన రాష్ట్రాల నుండి తనకు తెలిసిన సాహితీవేత్తలను విమానంలో రప్పించి, వారికి, సంస్థ ఖర్చులతో వసతి భోజనాదులు కల్పించి, సాహిత్య గోష్టులు నిర్వహించాడు. ప్రతిఫలంగా వారిచే తెలుగు రాష్ట్రాల్లో సన్మానాలు, పురస్కారాలు కొట్టేశాడు.
షరా మామూలే, ఆ సంస్థపై నిందలు వేసి తన అక్కసు తీర్చుకున్నాడు.
ఇంకో సంస్థను పట్టాడు. అతని గురించి తెలిసిన కొందరతనికి “సందట్లో సడేమియా” అని నామకరణం చేశారు. అదే స్థిరపడిపోయింది. అక్కడ అతని పప్పులు ఉడకక పోయేసరికి, సంస్థ పదాధికారుల మధ్య విభేదాలు సృష్టించాడు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడా చెప్పి వారిలో వారికి తగవుల తంటా పెట్టాడు. అప్పటిదాకా సజావుగా సాగిన సంస్థ, కుక్కలు చింపిన విస్తరైంది. ఆ ఐరన్ లెగ్ మహాశయుడు పక్కన ఉండి పైశాచికానందం పొందసాగాడు.
అప్పుడు సిటీకి దూరంగా ఉన్న ఇంకో తెలుగు సంస్థను పట్టాడు. వారికి అతని నిర్వాకం తెలియక తొందరగానే అతని బుట్టలో పడ్డారు. అక్కడ తెలుగు నాటక పోటీలు నిర్వహిద్దామని ప్రతిపాదన తెచ్చాడు. సంస్థలో ఉన్న కొందరు ఔత్సాహికులు సై అన్నారు
అన్నీ తానై తెలుగు రాష్ట్రాల నుండి బృందాలను రప్పించాడు. ప్రవేశ రుసుమని వారి దగ్గర వసూలు చేశాడు, కాని ఆ మొత్తం సంస్థలో జమ చేయలేదు. తన అవసరాలకి వాడుకున్నాడు. పోటీల ఖర్చు మాత్రం సంస్థ ఖాతాలో వేశాడు. పోటీలైపోయింతర్వాత లెక్కలు చూస్తే ఏముంది? తామనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపైంది. నిర్వాహక సభ్యులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏ పదవి లేని అతను మాత్రం హాయిగా ఉన్నాడు. తన పబ్బం గడిచినందుకు ఒకింత సంతోషంగా కూడా ఉన్నాడు. అది ఒట్టి పోయిన ఆవని గమణించి ఇంకొంత దూరంలోని వేరే తెలుగు సంస్థ వేటలో పడ్డాడు.
సందట్లో సడేమియా తెలుగేతర రాష్ట్రంలో ఎలా తెలుగు సంస్థలను మోసం చేశాడో? ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. అలాంటి ప్రభుద్దుల నుండి జాగ్రత్త పడే అవసరం, మన తెలుగు వారికి, తెలుగు సంస్థలకు ఎంతైనా ఉంది. మన భాషను, సంస్కృతిని రక్షించుకునే క్రమంలో పరాన్నభుక్కుల నుండి బహు పరాక్!