అది విశాఖ పట్నం టౌన్. ఉత్తరాంధ్రకు ముఖ ద్వారం. ఒక పక్క కైలాసగిరి, ఋషికొండ అందాలు అలరిస్తూంటే మరో వైపు నీలాకాశాన్ని ముద్దులాడుతున్న విశాలమైన బంగాళాఖాత సముద్రం.ఇంకొక వైపు డాల్ఫిన్
నోస్ కొండ రక్షణలో హిందుస్థాన్ షిప్ యార్డు, భారత నావికా దళం, స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ హెవీప్లేట్స్ వెస్సెల్స్ వంటి ప్రభుత్వ
సంస్థలు, ఎప్పుడూ సందర్సకులతో సందడిగా కనబడే రామకృష్ణా బీచ్,
ఉత్తరాదిని దక్షిణాదిని అనుసంధానం చేసే రైల్వే కూడలి, ఆంధ్రా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు, బ్రిటిష్ వారి
పాలనకు గుర్తుగా రాతి కట్టడాలు,కింగ్ జార్జి హాస్పిటల్, సెవెన్ హిల్స్ వంటి
ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలు, దైవ ఆధ్యాత్మిక మందిరాలు,అనేక వినోద
దర్సనీయ స్థలాలు ఇలాంటి ఉత్తర దక్షిణ సమ్మేళనమే వైజాగ్ అనబడే
విశాఖపట్నం.
అటువంటి విశాఖపట్నంలో ప్రోవిడెంట్ ఫండ్ ఆఫీసు సూపర్వైజరుగా పనిచేస్తున్నారు జగన్నాథరావు గారు. వారి భార్య మాణిక్యాంబ కలెక్టరాఫీసు
సెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. నివాశం డాబాగార్డెన్స్.భార్యాభర్త
లిద్దరూ వారి ఉద్యోగాలతో బిజీ బిజీయే కాకుండా సంప్రదాయ బద్ద జీవితం.
ఆ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దది కూతురు పేరు శివాని.
పేరు ఆధ్యాత్మికమే కాని ఆకాశంలో ఊహల పల్లకిలో విహరిస్తుంటుంది.
ఎప్పుడూ మొబైల్ ఫోన్, టి.వి. ఛానెళ్ల ప్రోగ్రాములతో కాలక్షేపం.
ఆధునిక భావాలు విలాస జీవితం వైపు మొగ్గు. ఏంకర్, న్యూస్ రీడరయి , స్టేజి మీద తన పెరఫార్మెంట్స్ కనపరిచి ఫ్రెండ్స్ ముందు టాలెంట్ చూపాలనుకుంటుంది.
ఇంట్లో సంప్రదాయ పద్దతులు నచ్చవు. ఇంకా అమ్మమ్మల కాలంలోనే ఉంటారంటుంది అమ్మానాన్నల్ని. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ వెలగబెడుతోంది.
కొడుకు శ్రీనివాస్ ఇంటర్ చదువుతున్నాడు.వాడికి క్రికెట్ పిచ్చి ఎక్కువ. చదువు కన్న ఎక్కడ క్రికెట్ మేచ్ లు జరిగేది, ఐ.పి.యల్, ఇంటర్నేషనల్
టోర్నీల మీదే ధ్యాస.నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ల బయోడేట, వారి
స్కోరు ఎప్పుడు అడిగినా చెప్పగలడు. నాటి గవాస్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్,పటౌడీ, అజారుద్దీన్ నుంచి నేటి సచిన్, ధోని, రాహుల్ ద్రవిడ్, కొహ్లీ, పాండ్య, రాహుల్ శర్మ వంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఆటగాళ్ల పెరఫార్మెంట్స్ , రికార్డులు వారి ఫోటో ఆల్బమ్సు సేకరించి దాచిపెట్టాడు.
తను క్రికెట్ కోచింగుకి వెళతానంటే తండ్రి చివాట్లు పెట్టి ముందు చదువు
మీద ధ్యాస పెట్టమని క్లాసు తీసుకున్నారు.అమ్మ , నాన్న డ్యూటీల కెళ్ళగానే
క్రికెట్ ప్రపంచంలో ములిగిపోతాడు శ్రీనివాస్.
ఇంక అసలు విషయానికొస్తే
శివానీకి ఫేస్బుక్ లో ప్రశాంత్ పరిచయమయాడు. ప్రశాంత్ హైదరాబాదులో ఒక టి.వి. ఛానెల్లో కెమేరామేన్ గా పనిచేస్తున్నాడు.ప్రశాంత్ ది కర్నాటక
రాష్ట్రం. కన్నడంతో పాటు తెలుగు మాట్లాడతాడు. హీరోలా హేండ్సమ్ గానే ఉంటాడు. ఇంకా పెళ్లి కాలేదు.
ప్రశాంత్ ఒకసారి అరకులో షూటింగ్ నిమిత్తం రావడం జరిగింది.అప్పుడు
వైజాగ్ వచ్చి శివానీని కలిసాడు. ఆర్కే బీచ్ లో కబుర్లు, హోటల్ భోజనం, అలా వారి పరిచయం మొగ్గలు తొడిగింది. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ప్రేమాయణం సాగిస్తోంది. ఇంజనీరింగ్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అవగానే
హైదరాబాదు చెక్కెయ్యాలని ప్లాన్లో ఉంది.
కూతురు శివానీ పద్దతులు నచ్చని జగన్నాథరావు దంపతులు
దాని ఇంజనీరింగ్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అవగానే హిందుస్ధాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో ప్లాంట్ ఆఫీసర్ గా జాబ్ చేస్తున్న అక్క కొడుకు మహేష్ తో
పెళ్లి జరిపించాలన్న ప్లాన్లో ఉన్నారు జగన్నాథరావు.
చూచాయగ ఆ విషయం తెల్సిన శివానీకి ఇంట్లో సంబంధం చేసుకోవడం
అసలు ఇష్టం లేదు. తన కళ్ల ముందు ప్రశాంతే కనబడుతున్నాడు. తన ఇంజినీరింగ్ కోర్స్ ఇంక మూడు నెలలు ఉంది. అంతవరకు మెల్లగా టైము
పాస్ చెయ్యాలి. అనుకున్నట్టు మూడు నెలల కాలం గడిచి ఇంజినీరింగ్
ఫైనలియర్ ఎగ్జామ్స్ పూర్తయాయి. ఊపిరి పీల్చుకుంది శివానీ.
కాబోయే బార్యభర్తలే కదా, వారి మద్య అన్యోన్యత పెరుగుతుందని
జగన్నాథరావు మేనల్లుడు మహేష్ ని శలవు లప్పుడు ఇంటికి ఆహ్వానిస్తు వారిద్దర్నీ కైలాష్ గిరి, ఆర్కే బీచ్ వంటి వినోద స్థలాలకు పంపుతున్నారు.
శివానీకి ఇష్టం లేకపోయినా మహేష్ తో షికార్లకు వెల్తూ సమయం కోసం ఎదురు చూస్తోంది.
ముందు ప్లాన్ ప్రకారం ఒకరోజు శివానీ మహేష్ తో ఆర్కే బీచ్ కి
వచ్చింది. సాయంకాలం ఆరు దాటింది. బీచ్ అంతా జనసందోహంగా ఉంది. ఇద్దరూ సముద్రం ఒడ్డున అలలతో ఆడుతున్నారు. చీకట్లు ముసురు తున్నాయి. కొద్ది సేపు తర్వాత మహేష్ శివానీని ఒడ్డుకు వచ్చేయమంటే
ఇంకొంచం సేపని చెప్పగా, మహేష్ పల్లీలు తెస్తానని ఒడ్డుకు వచ్చాడు.
మహేష్ తిరిగి వచ్చేసరికి శివానీ కనబడలేదు.
కంగారుగా బీచ్ అంతా వెతికాడు.అక్కడి జనాల్కి శివానీ గుర్తులు
చెప్పి కనబడిందా అని వెతకసాగేడు. ఎవరూ కూడా మేము చూడలేదని
చెప్పడంతో ఆందోళన ఎక్కువైంది. విషయం జగన్నాథరావు, మాణిక్యాంబ
లకు మొబైల్ ఫోన్ ద్వారా తెలియచేసాడు.
వారు ఇద్దరూ కార్లో ఆర్కే బీచ్ కి చేరి మహేష్ ఉన్న ప్రాంతానికి వచ్చారు.
మహేష్ జరిగిన విషయం వివరంగా చెప్పాడు. ఎంత వెతికినా శివానీ
జాడ లేకపోవడంతో ఒకవేళ సముద్ర అలల ఉదృతిలో నీటిలోకి కొట్టుకు
పోయిందోమని భయపడుతున్నారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా ఎక్కడున్నదీ తెలియలేదు. చివరకు బీచ్ పోలిస్టేషన్లో కంప్లైంటు ఇచ్చారు.
ఘటనా స్థలికి వచ్చిన బీచ్ పోలీసులు బాగా చీకటి పడినందున
వారూ ఎమీ చెయ్యలేకపోయారు. రాత్రంతా శివానీ గురించే ఆలోచనలతో
గడిపారు జగన్నాథరావు దంపతులు. విషయం తెల్సిన బంధువులు,
స్నేహితుల పరామర్సలతో రాత్రి ఇల్లంతా విషాదంగా మారింది.
మర్నాడు తెల్లారగానే బీచ్ పోలీసుల్ని సంప్రదించగా గజ ఈతగాళ్లను
పిలిపించి సముద్రంలో వెతికించారు.లాంచీలతో తిరిగారు. చివరకు నేవీ
హెలికాప్టర్ సాయంతో సముద్రంలో వెతికినా శివానీ జాడ లేదు.
పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్న తమ కూతురు ఇలా
అర్థాంతరంగా కనబడకపోయేసరికి విషాదంలో ములిగారు ఆ దంపతులు.
శివానీ జ్ఞాపకాలతో బాధ పడుతు శలవులో ఉన్న జగన్నాథరావు
ఫోనుకు శివానీ గొంతుకతో ఫోన్ కాల్ వచ్చింది. తను హైదరాబాదులో
ఉన్నానని, మహేష్ బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ప్రశాంత్ తో
తన పరిచయం తర్వాత జరిగిన విషయాలు చెబుతూ, చెప్పకుండా తను
హైదరాబాదు వచ్చి నందుకు క్షమించమని వేడుకుంది.విషయం మాణిక్యాంబ,
బంధువులందరకు తెల్సింది. శివానీ ఎవరితోనో లేచిపోయిందన్న వార్త
గుప్పుమంది.
ఉదయం నుంచి అత్తయ్య, మామయ్యల వెంట ఉండి దైర్యం చెబుతున్న మహేష్ ఈ విషయం విని స్టన్ అయాడు.
బీచ్ లో కనబడకపోతే చనిపోయిందన్న కూతురు బతికే ఉందన్న సంగతి
తెల్సి జగన్నాథరావు దంపతులు ఒక వైపు ఆనంద పడుతున్నా , ఇన్నాళ్లు
తమకు తెలియకుండా ఇంత తతంగం నడిపిన కూతురి మీద కోపం కట్టలు
తెంచుకుంది.
ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మాత్రం ఏం సుఖపడగలను, పెళ్లికి ముందే
తన అయిష్టతను బయట పెట్టి శివానీ మేలే చేసిందని సరిపెట్టుకున్నాడు మహేష్.
పోలీసు కంప్లైంటు ఇచ్చినా శివానీ మేజర్, అదీగాక తన ఇష్ట ప్రకారమే
ఇంటి నుంచి హైదరాబాదు వచ్చేసానని రాత మూలంగా ఇస్తే చేయ గలిగింది
ఏమీ లేదని, ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలని సరిపెట్టుకున్నారు
జగన్నాథరావు దంపతులు.
డబ్బు సంపాదనే కాదు ఎదుగుతున్న పిల్లల అభిరుచులు, అభిప్రాయాలు
తెలుసుకుంటూ పెంచడం కూడా ముఖ్యమన్న పాఠం నేర్చుకున్నారు వారు.
* * * *