భాగవత కథలు – 23
శ్రీకృష్ణుడి స్నేహధర్మం
శ్రీకృష్షుని బాల్యస్నేహితుడు కుచేలుడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. విజ్ఞానవంతుడు. పరమ శాంతమూర్తి. అన్నిటికీ మించి అభిమానధనుడు. తన ఇంటిలో దారిద్ర్యం తాండవిస్తున్నా ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనకు ప్రాప్తించిన కాసులతో ఏదో విధంగా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు.
కుచేలుడు ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాడు. భర్తతో అప్పుడు ఆమె “ శ్రీకృష్ణుడు మీ బాల్య స్నేహితుడు. ఆ మహానుభావుణ్ణి దర్శించండి. అతని కృపను పొంది ఆకలితో తల్లడిల్లుతున్న మన పిల్లల్ని కాపాడండి. వాసుదేవుడు భక్తవత్సలుడు. ఆశ్రయించిన వారిని తప్పక రక్షిస్తాడు. విపత్కర పరిస్థితిలో ఎవరైనా ఒక్కసారి ఆ భక్తజన మందారుని పాదపద్మాలను స్మరిస్తే చాలు ఆ భగవంతుడు కనికరిస్తాడు. అటువంటిది బాల్య స్నేహితులైన మిమ్ములను ఆ స్వామి అనుగ్రహించకుండా ఉంటాడా? ” అని చెప్పింది.
ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. తన ఇల్లాలితో “అవును, నిజమే. శ్రీకృష్ణుణ్ణి దర్శించడం పరమ కల్యాణప్రదమే. అయినా ఇన్ని సంవత్సరాల తరువాత ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక తీసుకుపోవడం బాగుంటుంది కదా!” అన్నాడు. ఆమె కుచేలుని అభిప్రాయంతో ఏకీభవించింది. అతని చినిగిన కండువాలో అటుకులు కొన్ని ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవిందుని దర్శించాలనే ఉత్సాహంతో బయలుదేరాడు.
ద్వారకకు వెళ్తూ దారిలో కుచేలుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. “ద్వారకలో అంతఃపురంలో ఉన్న కృష్ణుణ్ణి ఎలా కలవగలను? ద్వారపాలకులు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదైనా బహుమానం ఇద్దామన్నా నాదగ్గర ఏమీ లేదు. అయినా కృష్ణుడి అనుగ్రహమే అన్నిటికీ మూలం. బారమంతా ఆయనదే”. ఇలా అనుకుంటూ ద్వారక చేరి రాజమార్గంలో కొన్ని వీథులు దాటాడు.
అలా వెళ్తూ వెళ్తూ, తనకు తెలియకుండానే శ్రీకృష్ణుని భవన సముదాయం దగ్గరకు చేరాడు. ఎత్తైన ప్రాంగణాలతో ప్రకాశిస్తూ మణులతో పొదగబడ్డ బంగారు భవనం చూసిన కుచేలుడు పరమానందం చెందాడు. ఆ భవనంలోకి వెళ్లాడు. ఎవ్వరూ అతనిని అడ్డగించ లేదు. ఆ భవనసముదాయంలో నున్న ఒక మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికాతల్పం మీద సతీమణితో సరసాలాడుతున్న సౌంధర్యమూర్తి శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు. అతని కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలాయి.
నిరంతరం బీదతనంతో బాదపడుతూ బక్కచిక్కిన శరీరంతో, చినిగిన వస్త్రాలు ధరించిన కుచేలుణ్ణి చూడగానే కృష్ణుడు గబగబా పాన్పునుండి దిగాడు. కుచేలునికి ఎదురుగా వెళ్ళి అతణ్ణి కౌగలించుకున్నాడు. అనురాగంతో తోడ్కొని వచ్చి తన పాన్పు మీద కూర్చుండబెట్టాడు. కుచేలుడు కూర్చున్న తరువాత బంగారు కలశంతో అతని పాదాలు కడిగాడు. ఆ పాదజలాన్ని తన శిరస్సు మీద జల్లు కున్నాడు.
ఇదంతా చూస్తున్న అంతఃపుర కాంతలు ఆశ్చర్యంతో ‘ఈ బ్రాహ్మణుడు ముందు జన్మలలో ఎంత పెద్ద తపస్సు చేసాడో, రుక్మిణీదేవి ఏమి అనుకుంటుందో అని కూడా ఆలోచించకుండా కృష్ణుడు లేచి వెళ్ళి ఈ భూసురునికి స్వాగతం చెప్పాడు. ఆయనతో సేవలు చేయించుకొని ప్రక్కన పాన్పు మీద కూర్చున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతటి అదృష్టవంతుడో కదా!’ అనుకున్నారు.
ఆ కాంతలు అలా అనుకుంటున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. తాము గురుకులంలో గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాలను గుర్తుకు తెచ్చుకొని ప్రస్తావించాడు.
“భూసురోత్తమా, మనం గురుమందిరంలో ఆచార్యుల వద్ద విద్య నేర్చి ప్రజ్ఞావంతులమైన సంగతి గుర్తుందా కదా! వేదపండితుల ఇంట్లో పుట్టిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తూంది కదా! నీ భార్యా పిల్లలను పట్టించు కుంటున్నావా లేక ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటున్నావా? మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపంలాంటి వాడు. బ్రహ్మానందంలో నిమగ్నమైన చిత్తం కలవాడు. నిజానికి నేను సమస్త లోకాలకు విజ్ఞానాన్ని ప్రసాదించే గురువునై ఉండి కూడా గురుసేవ శ్రేష్టమైనదని బోధించడానికి అలా ఆచరించాను”.
“ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాం. ఆ సమయంలో ఆకాశమంతా నల్లటి మేఘాలతో ఆవరించి సుడిగాలులు వీచి నిలువనీయకుండా చేసాయి. మెరుపులతో పెద్ద వర్షం ఆగకుండా కురుస్తోంది. చీకటి దట్టంగా అలుముకుంది. మనమిద్దరమూ తడిసి ముద్దయినాము. మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని దారి తెలియక రాత్రంతా ఆ అడవిలో తిరుగుతానే ఉన్నాము. ఎట్టకేలకు సూర్యోదయమైంది. మన గురువుగారైన సాందీపని మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. గజగజమని వణుకుతున్న మనల్ని చూసి చాలా బాధ పడ్డారు. మీకిక ధన దారాపుత్ర సంపదలూ, దీర్ఘాయువూ, విజయశ్రీలు చేకూరుతాయని దీవించారు. ఇవన్నీ నీకు గుర్తున్నాయి కదా!” అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.
ఈ విధంగా చదువుకున్న రోజుల్లోని చిన్ననాటి ముచ్చట్లను గుర్తుంచుకొని తన మిత్రుడు పలికిన పలుకులకు కుచేలుడు ఉప్పొంగిపోయాడు. “దామోదరా! మనం గురువుగారి ఇంట్లో ఉన్న కాలంలో సంతోషంతో చేయని పనులంటూ ఉన్నాయా. నీవు ముల్లోకాలకు గురువు. అలాంటి నీకు గురుడంటూ మరొక్కడున్నాడా! నీతో కలిసి నేను విద్యాభ్యాసం చేయడం నీ లీలయే గాని మరేమీ కాదు” అన్నాడు కుచేలుడు.
కృష్ణుడు చిరునవ్వు నవ్వి “మిత్రమా! నువ్విక్కడకు వస్తూ భక్తితో నా కోసం ఏమి బహుమానం తెచ్చావు? నువ్వు ఏది తెచ్చినా నేను స్వీకరిస్తాను. మధురాన్నంగా భావించి ఆరగిస్తాను. భక్తి లేనివాడు ఏమి తెచ్చినా అది నాకు ప్రియం కాదు” అని అన్నాడు.
దామోదరుని మాటలకు కుచేలుడు సంతోషించాడు. తాను తెచ్చిన అటుకులు అర్పించలేక మౌనంగా ఉండిపోయాడు. పరమాత్మ కుచేలుడు వచ్చిన కారణాన్ని తెలుసుకున్నాడు. పూర్వజన్మలో ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించ లేదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా వద్దకు వచ్చాడు. అన్ని రకాల సంపదలను ఇతనికి ఇవ్వాలని భగవంతుడు నిర్ణయించుకున్నాడు. కుచేలుడు చిరిగిన ఉత్తరీయంలో ముడివేసి తెచ్చిన అటుకులు ముడిని చూసి ‘ఇదేమిటి’ అని అడుగుతూ ముడిని విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు. ‘నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి నివ్వడానికి ఇవి చాలు’ అంటూ ఆ అటుకుల్ని ఆరగించాడు. అవి తిన్న తరువాత మళ్ళీ ఇంకొక పిడికెడు తీసుకున్నాడు. అప్పుడు రుక్మిణీదేవి ‘స్వామీ! మీరు తిన్న అటుకులు చాలు’ అని వారించింది.
కుచేలుడు ఆ రాత్రి కృష్ణుని మందిరంలో మధురములైన వివిధ పదార్థాలు ఆరగించాడు. మెత్తని పాన్పుమీద నిదురించి తాను స్వర్గభోగాన్ని అనుభవించినట్లుగా భావించాడు. మరునాడు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాదికములు ముగించుకొని తన నగరానికి బయలుదేరాడు. కుచేలుడు వెళుతూ కృష్ణుని దర్శించిన ఆనందంతో ఇలా అనుకున్నాడు.
“గర్భదరిద్రుడనైన నేనెక్కడ? పరమాత్మ స్వరూపుడైన వాసుదేవుడెక్కడ? నన్ను తోడబుట్టిన వాడివలె కౌగిట చేర్చుకున్నాడు. సకల మర్యాదలు చేశాడు. ఆయన పట్టపురాణి విసనకర్రతో విసిరింది. శ్రీకృష్ణుడు నా పాదాలొత్తాడు. కాని నాకు ధనమేమీ ఇవ్వాలని ఆయన అనుకోలేదు. నాకు ధనమిస్తే గర్వంతో కళ్ళుమూసుకుపోయి తనని సేవించనని తలచాడేమో? లేకపోతే ఆ అపార కరుణాసముద్రుడు నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయకుండా ఉంటాడా?”. ఇలా ఆలోచిస్తూ కుచేలుడు తన నగరం చేరుకున్నాడు.
నగరంలో తన వీధిలోకి ప్రవేశించిన కుచేలుడు తన ఎదుట గొప్ప కాంతితో ప్రకాశించే పాలరాతి కట్టడం, దాని ఆవరణలో చక్కని ఉద్యానవనాలూ, సరోవరాలూ, బంగారు భూషణాలు ధరించిన దాస దాసీ జనమూ కలిగి వెలుగొందే ఎత్తైన మందిరాన్ని చూసి ఆశ్చర్య పడ్డాడు. సిరిసంపదలకు నిలయమైన ఈ ఇల్లు ఎవరిది? నా శిధిలమైన పూరిల్లు ఎక్కడ? అని ఆలోచిస్తున్నాడు.
ఇలా అనుకుంటున్న సమయంలో దేవకాంతలు లాంటి యువతులు వచ్చి కుచేలుని ‘లోపలకు దయచేయండి’ అంటూ స్వాగతం పలికారు. అతణ్ణి అంతఃపురం లోనికి తీసుకుపోయారు. ఇలా వచ్చిన కుచేలుని చూసి ఆయన భార్య ఎంతో సంతోషించింది. ఎంతో ఆనందంగా ఎదురు వచ్చింది. మహాలక్ష్మిలాగా ఉన్న ఆమె కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, భర్త పాదాలకు నమస్కరించింది. పరిచారికలతో సేవలందుకొంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూశాడు. ఆ దంపతులుద్దరూ ఒకరిపైనొకరు ప్రేమతో, శ్రీకృష్ణుని అనుగ్రహం వలన కలిగిన ఐశ్వర్యానికి అపారమైన ఆనందాన్ని పొందారు.
పద్మరాగ మణులు పొదిగిన స్థంబాలతో, ఇంద్రనీలాలు పొదిగిన కిటికీలతో, హంసతూలికాతల్పాలతో, బంగారం పొదిగిన శయన మందిరాలతో, రత్నాల గద్దెలతో ప్రకాశిస్తున్న ఆ భవనం లోనికి కుచేలుడు సతీ సమేతంగా ప్రవేశించాడు. కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకు లోనుకాకుండా హాయిగా జీవించాడు.
కుచేలుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని గురించి ఇలా తలపోసాడు. “ నేను ధనం ఆశించి జనార్థనుని దగ్గరకు వెళ్లాను. ఆ మహానుభావుడు నా సంగతి అంతా తెలిసికూడా నన్నేమీ అడగలేదు. మాసిన నా శరీరం, చిరిగిన నా బట్టలు చూసి నన్ను ఏవగించుకోలేదు. నన్ను అతిథి సత్కారాలతో ఆదరించాడు. నేను పట్టుకు వెళ్లిన అటుకులు స్వీకరించి ఆరగించాడు. మరునాడు నాకు సాదరంగా వీడ్కోలిచ్చి పంపి ఈ సకల సంపదలూ అనుగ్రహించాడు. భక్తితో సజ్జనులు సమర్పించిన ప్రసాదం కొంచెమైనా భగవంతుడు దానిని స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడనడానికి నా వృత్తాంతమా ఉదాహరణ. అటువంటి కరుణాసాగరుడైన గోవిందునిమీద నాకు జన్మజన్మలకూ నిండైన భక్తి ఉండు గాక!”.
ఈ విధంగా తలపోసిన కుచేలుడు హరినామస్మరణ మరువకుండా తన ఇల్లాలితో జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా నిర్వికారుడై, తోటివారికి సాయం చేస్తూ హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ చరితార్థుడయ్యాడు.
*శుభం*