
వీరి పేరేంటి? నాకు అలాంటి మనుష్యులంటే, నిజంగా చెప్పలేనంత చులకన భావం. నాకు తెలుసు వెంటనే మీరు, "ఎందుకు" అని అడుగుతారని. " రాత్రి పూట రోడ్ల మీదుండే, ద్విచక్ర వాహనాల నుండి పెట్రోలు దొంగతనం చేసేది ఇలాంటి పనికిమాలిన… వెధవలే. ఇంటి ఆవరణలోని, మురికిగుంటల మీద వుంచే ఇనుపమూతల్ని, చెప్పుల్ని, సైకిళ్లని, ఆరేసిన బట్టల్ని, ఇలా ఎన్నెన్ని చెప్పను…ఆ పనులు చేసేది ఎవరో నేను చెప్పను. నాతో చెప్పించడానికి కూడా ప్రయత్నం చేయకండి దయచేసి." " అరే, పది, పన్నెండేళ్లు మించి వుండవు ఆ పిల్లలకి…వాళ్లని…మీరు ...ఆడిపోసుకొంటారా ! అంటూ అంత గట్టిగా బుగ్గలు నొక్కుకోకండి. అంత ఆశ్చర్యంగా చూడకండి. నన్ను నమ్మండి. నాకున్న అనుభవం మీకు లేదు. ఇప్పుడు అర్ధమయ్యిందా?, నేను' ఆ పిల్లాడు అంత గట్టిగా సార్…సార్… అంటూ నా ద్విచక్ర వాహనం వెంబడిస్తూ, అరుస్తున్నా, పట్టించుకోకుండా ……సా..గి..పోవాలనే నా తాపత్రయం. అరే వీడు నా పాలిట సైoధవుడులా తగిలాడు. ఇక తప్పేది లేదు. గుడి ముందు నెమ్మదిగా ఆగి, "చెప్పరా ...ఎందుకు... నా వెనుకే…" అసహ్యంగా కాకపోయినా, అసహనంగానే కసురుకొన్నాను వాడ్ని. నా వాహనం వెనుకే, పరిగెడుతూ రావడం వలన కాబోలు, డొక్కలు ఎగరేస్తూ, ఆయాస పడుతూ చెప్పాడు. "సార్...సార్... మీ సైడ్ స్టాండు…" వాడికి మాటలు రావడం కష్టంగా వుంది. అందుకు కారణం తెలుస్తోంది. కానీ,వాడి కళ్ళలో మాటల్లో చెప్పలేనంత, తృప్తి, సంతోషం కనిపిస్తున్నాయి నాకు. వాడి మాటలు విని, వెంటనే బైక్ సైడ్ స్టాండు తీశాను. లేక పోతే, కొంచెం ముందున్న స్పీడ్ బ్రేకర్ కి ఆ స్టాండ్ తగిలి…బండి మీద నుంచి పడి…… కానీ, ఇప్పుడు నా గొంతు పెగలడం లేదు. వాడికి ధన్యవాదాలు కూడా చెప్పలేక పోతున్నా. కన్నీరు నిండిన నా కళ్ళకి వాడి రూపు కనిపించడం లేదు. గుడిలో దేవుడూ కనిపించడంలేదు. ****