(మొదటి భాగం). అమ్మమ్మ ఇంటికి సాగే నాప్రయాణంలో నాకెన్నో దృశ్యాలు కనిపించేవి.! . వాటిని ఎంతో ఇష్టంగా చూస్తూ అమ్మమ్మ కోసం సాగే నా అడుగులు నాకు జీవిత పాఠం నేర్పేవి. అందరూ సుపరిచయస్తులే.ఆత్మీయులే. ప్రధానంగా కనిపించేది తూర్పున రోడ్డుకు అడ్డుగా నిర్మించిన రైల్వే లైన్ గేట్లు. రైలు వచ్చే ముందు దించడం,వెళ్ళిన తరువాత లేవనేత్తడం.చూసేందుకు బలే సరదాగా ఉండేది. నా చిన్నతనంలో. బొగ్గుతో నడిచే పొగ బండి చుక్కల బుక్ చుక్కల బుక్ అంటూ నీటి ఆవిరి వదిలే శబ్దం వినడానికి ఎంతో బాగుండేది. తరువాత వేగంగా దూసుకు వస్తున్న సూఫర్ ఫాస్ట్ రైలు చూడ్డం,దాటి పోవడం, ఎంత థ్రిల్లింగ్ గా ఉండేదో.. రైలు వేగానికి గుండె దడ దడ లాడేది , చెట్లు ఊగిపోయేవి,పట్టాల దగ్గర చిన్ని చిన్ని రాళ్ళు గాలిలో కొట్టుకు పోతుండేవి. అదో అద్భుతమైన దృశ్యం. అలా చూస్తుండగానే రైలు కనుమరుగౌతుంటే, వెనుకే గార్డు చేతితో ఊపుతున్న పచ్చ జెండా మాకోసంమే అనేలా ఉండేది.... గార్డు బాక్స్. కేరింతలతో మేము చేతులు ఊపేవాళ్ళం. ఆ జెండాను ఎదో మా కోసమే ఊపేసినంతగా సంబరపడిపోతూ.. వీడ్కోలు పలికేందుకు పోటీపడే వాళ్ళం. అంత కంటే. థ్రిల్లింగ్ కలిగించేది, రైలు పట్టాల పైన ఉంచిన పది పైసలు,పిన్నీసులు . రైలు వెళ్ళిన తరువాత శోధించు కోవడం, దొరకగానే ఆనందంతో కేరింతలు .రైలు బరువుకు పది పైసలు రెండంతలు,పిన్నీసు చిన్ని కత్తిలా మారి వింతగా కనిపించేది. ఇక ఊరుల్లోకి వెళ్ళడానికి మట్టి రోడ్డు పైన నాలుగు అడుగులు వేయగానే ,మొదట కనిపించేది గేటు గోపయ్య పూరిపాక. రైలు వస్తుంటే జెండాను ఊపేయడమే ఇతని పని, గేటు కాపలాదారు అన్న మాట. మరో రెండడుగులు వేసిన తరువాత చెరువులోని నీరు అలుగులా పారుతూ కాళ్ళను అల్లరిగా తాకేవి. అందులో చిన్ని చిన్ని చేపపిల్ల లను పట్టుకునేందుకు చేసే ప్రయత్నం ఎంత మధురమో. మరో నాలుగైదు అడుగులు వేయగానే,పెనుముచ్చు కిష్టయ్యగారి ఇల్లు,వీరు గుంటూరు జిల్లా మండె పూడి నుండి వచ్చిన వారే.వీరి ప్రథమ అల్లుడు కల్లూరి కోటేశ్వరరావు గారు . వీరు వాణిజ్య పంటలైన పుగాకు,మిర్చీ పండించడంలో సిద్ధహస్తులు., వీరి రెండవ కుమారుడు రవి బాబు నా క్లాస్మేట్ కావడంతో వారి కుటుంబంతో నాకు చక్కటి అనుబందం ఉంది. తీరిక సమయాల్లో ఎక్కువగా నేను వీరి ఇంటికి వెళ్ళె వాడిని. స్కూల్ సెలవు ఇచ్చారంటే వీరి చేలో మిరపకాయలను కోయడానికి కూలికి వెళ్ళే వాడిని. రోజుకు రెండు రూపాయల యాభై పైసలు కూలి ఆరోజుల్లో. కోటేశ్వరరావు గారి ఇంటిలోని కర్వేపాకు చెట్టు కమ్మని వాసన వెదజల్లేది. ఇంటి ముందు పూల మొక్కల పరిమళం మత్తుగా ముక్కును తాకుతుంటే, వీరి ఇంటికి వెనుక వైపునే ఉన్న ఎతైన తాటి చెట్లు. తలలు ఊపుతూ స్వాగతం పలికేవి.దారిన సాగే బాటసారులకు ,మావైపు ఓసారి చూడవచ్చును కదా అన్నట్లు. మరో నాలుగైదు అడుగు వేయగానే కొలహలం, సందడిగా, చిరునవ్వులు,ఉరుకులు పరుగులు,సందడి సందడిగా వాతావరణం కని పించేది.కూలీల సమూహం అంతా అక్కడే దెందుకూరులో వాణిజ్య పంటలను పరిచయం చేసింది , ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన రైతులే అనేది ఆనాటి వాస్తవం.. అప్పటి వరకు వరి, జొన్నలు, సజ్జలు.రాగులు, కూరగాయలు మాత్రమే పండించే దెందుకూరు రైతులకు ,,పొగాకు, మిర్చి పత్తి,వంటి వాణిజ్య పంటలను పరిచయం చేసిన కుటుంబ సముదాయంలో గుంటూరు జిల్లా మండెపూడి నుండి వచ్చిన ,కోటా వెంకటాద్రి గారు అని చెపుతారు. కోటా వెంకటాద్రి గారి సంతానమే కోటా ఆంజనేయులు గారు,రామారావు గారు,హనుమంతరావు గారు,వెంకట్రావు గారు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి ఒక చిన్న సంస్థానంలా కనిపించేవి. ఉమ్మడి కుటుంబాలపై గౌరవం కలిగించింది నాకు వారి కుటుంబ అనుబందాలే. పుగాకు బ్యారెన్ లు అక్కడే మూడు ఉన్నట్లుగా గుర్తు,ఎప్పుడు పెద్ద పెద్ద మొద్దులు కాలుతూ ఉండేవి. మరో ప్రక్కన తెచ్చిన పుగాకు, ట్రాక్టర్లు, పచ్చి ఆకును గుర్రాలు అనబడే కర్రలు అల్లికలు,పురికొస తాడుతో అటు ఇటు మెలికలు వేస్తూ చేతులు కదిలించే విధానం,కూలీల పాటలు,ఆకులకు ఉన్న మడ్డి అంటు కోకుండా వంటికి కట్టుకునే బట్టలు విచిత్రంగా కనిపించేవి. ఇక్కడ పని చేసే కూలీలకు మేస్త్రి అద్దంకి జయమ్మ అనే ఆమె ఉండే వారు.ఆమె ఎన్నో సార్లు నన్ను పనికి తీసుకెళ్ళింది. కోటా వారి కుటుంబాల దగ్గరే సంవత్సరం మొత్తంగా ఎదో ఒక పని దొరుకుతునే ఉండేది. పని చేసిన కూలీలను ఆర్దిక,అవసరాలను గుర్తించి ఆదుకుంటారునే పేరు బాగా కోటా ఆంజనేయులు గారిది అని చెప్పుకునే వారు. సంవత్సరం మొత్తం తమ వద్దే పని చేసిన కూలీల సంతోషం కోసం ప్రతి సంవత్సరం దేవుని ఊరేగింపు తో,ప్రభలు కట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం అనేది కోటా హనుమంత రావు గారి ఇంటి వద్ద నుండి మొదలైయ్యేది.. యువకులను ఉర్రూతలూగించే డాన్స్ ప్రోగ్రాం రాత్రి ఏడు గంటలకు ఉండి ఉదయం ఐదు వరకు సాగేది. అక్కడే సువిశాలమైన ఖాళీ స్థలంలో పక్కనే పెద్ద రైస్ మిల్లు ఉండేది, రైస్ మిల్లు దగ్గరకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి బియ్యం పట్టించుకోవాలని ఎందరో రైతులు వచ్చేవారు. రైస్ మిల్లుకు ఎదురుగా ఖాళీ ప్రాంతంలో మిరపకాయలు రాసులుగా పోసి ఉండేవి. ఇవి కోటా వారి,మరియు కొల్లూరి వారి పొలముల్లోని పంటలే అని వేరే చెప్పాలా... చుట్టు జనం తాలు మిరపకాయలు ఏరుతూ,సొంత పనిలా చేసుకుంటుండే వారు. అక్కడ అంతా బంధుత్వం వయసులోనే పలకరించుకునే వారు..బాబాయి,పిన్ని,అన్నా,తమ్ముడు,తాతా ,పెద్దమ్మా అంటూ... ఇక కోటా వెంకట్రావు గారి రెండవ అబ్బాయ్ నరసింహారావు నా క్లాస్మెంట్ కావడంతో ఆ ఇల్లు మధ్య ఎక్కువగా కలిసి తిరుగుతూనే ఉండే వాడిని. కోటా హనుమంతరావు గారు చాలా ఎత్తుగా తెల్లని పంచే కట్టుకుని హుందాగా కనిపించే వారు. వారి పెద్దమ్మాయి విజయక్క,వారి అబ్బాయి శ్రీనివాసరావు తో కాస్త పరిచయం ఉండేది నాకు. కోటా వెంకట్రావు గారి ఇంటికి ప్రక్కనే .చెరుకూరి సీతారామయ్య గారి ఇల్లు, ప్రక్కనే వీరివి రెండు పుగాకు బ్యారన్స్ ఉండేవి. నిత్యం జన సంచారం,వెలుగుతున్న పొగాకు బ్యారన్ లు. తెలవారు జామునే ఆకు ఇరవడానికి వచ్చే కూలీలతో ఎప్పుడూ.సందడి సందడిగా ఉండే ప్రాంతం అది. వీరి ఇంటికి ఎదురుగా పెద్ద చెరువు.,ఆ చెరువు కట్టపైన గంధసిరి,వెంకటేశ్వర్లు,సీతమ్మ దంపతులు ఉండేవారు,ఊరిలో పెళ్ళిల్లకు భోజనాలు చేయడానికి చిన్న చాపలు పరిచేవారు కూర్చోవడానికి,అప్పట్లో కుర్చీలు ,బల్లులు ,లేవు కనుక . అడుగు వెడల్పుతో చాపలు అల్లి వీరు.తెచ్చేవారు. మరి కాస్త ముందుకు సాగితే ముక్కును తాకేది ఒక రకమైన వాసన....... (రెండవ భాగం మరుసటి రోజు.)