గుండెకాయ - జీడిగుంట నరసింహ మూర్తి

Gundekaaya

" ఇదిగో అబ్బాయి. అత్తల దగ్గర కోడళ్ళు ఉండకపోవడం అది పూర్వం. ఇప్పుడు కాలం మారింది. అత్తలే కోడళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదు. మీకు దగ్గరగా ఒక అద్దె ఇల్లు చూడు. నేనూ, మీ నాన్న హాయిగా మాకు కావలసినవి వండుకుని తింటాము. ఇది నేను నా మనస్పూర్తిగానే చెపుతున్నాను. ఇప్పటికే మన చుట్టాలందరూ ఈ నిర్ణయం తీసుకుని ఏ పోరూ లేకుండా హాయిగా మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు " అంటూ రామేశ్వరమ్మ కొడుకు మాధవరావుతో ఖరాఖండిగా చెప్పేసింది.

ఈ హఠాత్పరిణామానికి మాధవరావు నిలువెల్లా ఆశ్చర్యపోయాడు.

"ఇప్పుడు మీ ఇద్దరికీ ఏమయ్యింది ? అన్నీ బాగానే జరుగుతున్నాయిగా. వేళకు అన్నీ దగ్గరకు వస్తున్నాయి. హాయిగా టీవీలో సీరియళ్ళు చూసుకుంటూ కూర్చునే అవకాశం అందరికీ వస్తుందా ? ఆలోచించు. ఆవేశంలో నువ్వు మాట్లాడే మాటలు మీ ఇద్దరికే కాదు . మన కుటుంబంలోని అందరినీ ఇబ్బందుల్లో పడేస్తాయి" అంటూ తల్లిని సమాధాన పరచబోయాడు.

" నువ్వు చెప్పింది నిజమే. అన్నీ దగ్గరకు వస్తూంటే ఏం మాయరోగం అని అనుకుంటున్నావు కాబోలు. ఇప్పుడు నా వయసు ఎంత అరవై సంవత్సరాలు. కనీసం ఇంకో పది సంవత్సరాలైనా ఇంట్లో అన్ని రకాల వంటలు వండగలిగే సామర్ధ్యం వుంది. భగవంతుడి దయవల్ల ఇంకా భయంకరమైన రోగాలు దరిచేరలేదు. ఇంత తక్కువ వయసులోనే నా కాళ్ళు విరగకొట్టి ఏ పనీ చేయకుండా మూల పడేస్తే ఖచ్చితంగా ఏదో మాయ రోగం వచ్చి చస్తాను. వంటింట్లో నిన్న మొన్నటివరకు చక్రం తిప్పిన నేను ఈ రోజు చేవ చచ్చినట్టు నోరుమూసుకుని ఏది పెడితే అది తినే పరిస్తితి నాకు ఇంకా రాలేదు అని అనుకుంటున్నాను. నీకు తెలుసు . మన ఇంట్లో అందరమూ వంటల్లో చేయితిరిగిన వాళ్లం అని. నిన్న మొన్న వరకు నువ్వు కూడా నాచేత అన్ని రకాల రుచుల వంటలు చేయించుకుని తిన్నావు. మీ నాన్నకు తెలియని వంట అంటూ లేదు. చాలా మందికి హారాల మీద మోజు ఉంటే మనకు ఆహారాల మీద మోజు ఎక్కువ అని మన చుట్టాల్లో విమర్శించే వాళ్ళు లేక పోలేదు. ఆయనకు రుచి కరమైన వంటలు కావాలి. ఏ గడ్డి పడితే అది తినరు . ఆయన బయటనుండి తనకిష్టమైన కూరలు తెచ్చుకుంటే అవి ఈ ఇంట్లో వండటానికి అవకాశం లేదు. ఇంకా ఇరవై ఏళ్లు అయినా బ్రతకాల్సిన ఆయన్ని ఇలా బంధించి నిరుచప్పిడి కూడుతో జీవితాన్ని నిస్సారంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేక పోతున్నాను రా. నేను వంటింట్లోకి వెళ్ళి అన్ని రకాల వంటలు చెయ్యలేనప్పుడు ఈ ఇంట్లో ఎంత స్వేచ్ఛ ఉన్నా అది మాకు నిరుపయోగమే. అందుకే మీ నాన్నా, నేను ఒక నిర్ణయానికొచ్చాము. పక్కనే ఒక అద్దె ఇల్లు తీసుకుని ఉందామని. " అంది రామేశ్వరమ్మ తన మనసులో చాలా రోజులనుండి గూడుకట్టుకుని ఉన్న ఆవేదనను.

"ఏమిటమ్మా . ఈ వయసులో మీ ఇద్దరినీ సుఖపెట్టాలని , ఏ లోటు రాకుండా చూడాలని మేమిద్దరమూ ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు మళ్ళీ అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవాలని చూస్తావు ? హాయిగా సుఖపడే యోగ్యత మీ ఇద్దరికీ కనపడేటట్టుగా లేదు. ఎవరిని చూసినా ఈ వయసులో మా కోడలు మొత్తం పనంతా మా నెత్తిమీద పడేసి మొగుడూ పెళ్లాలిద్దరూ టింగురంగా అంటూ సినిమాలకు షికార్లకు తిరుగుతున్నారు. ఏ మాత్రం జాలి, ప్రేమ లేదు " అంటూ ఇంటికొచ్చిన వాళ్లందరితో చెప్పుకుంటూ ఉంటే అటువంటి అపవాదు నెత్తిమీద వేసుకోవడం ఇష్టం లేక నేను మీ ఇద్దరినీ నెత్తిమీద పెట్టుకుని చూసుకోవాలని అనుకుంటూ ఉంటే ఎవరో నూరిపోసిన మాటలు విని చూస్తూ చూస్తూ వేరు కొంపలో ఎసరు పెట్టాలని అనుకోవడం నాకేమీ నచ్చలేదు. మీరిద్దరూ ఇలాంటి పనులు తలపెడితే మన చుట్టాల్లో నా పరువు ఏమవుతుంది ? మేమిద్దరమూ కలిసి ఏదో ప్లాన్ వేసి వేరే పంపించాం అనుకోరా ? ఇన్నాళ్ళు భద్రంగా కాపాడుకున్న నా విలువలు ఈ దెబ్బతో మంట కలవడం ఖాయం " అంటూ సీరియస్ గానే చెప్పేశాడు మాధవరావు..

"ఒరేయ్. ఏదో జరిగిపోయినట్టు ఇంతగా తలపట్టుకుంటున్నావు కానీ, రేపటినుండి నన్ను వంటింట్లోకి మీ ఆవిడ వారానికి రెండు మూడు సార్లైనా వంట వండటానికి పర్మిషన్ ఇస్తే నాకేమీ అభ్యంతరం లేదురా. మనం అందరమూ ఒకేచోట కలిసి ఉన్నప్పుడు వంటగదిని తనొక్కత్తే ఆక్రమిస్తే మమ్మల్ని అవమాయించినట్టుగా ఉంటుంది. ఈ ఇంట్లో నాకూ వంటగది మీద హక్కు ఉంది. ఏ ఇంట్లో అయితే అత్తగారికి వంటగది మీద హక్కు కోల్పోతుందో ఇక ఆ ఇంట్లో ఆవిడ ఉన్నా లేనట్టే, ఈ విషయం మీకెవరికీ అర్ధం కాదు. మీ తరానికి ఇది బాగున్నా మా తరానికి మాత్రం ఆత్మహత్యా సదృశ్యం లాంటిది . ఈ విషయంలో నాకు స్వేచ్ఛను కలిపిస్తే ఈ ఇంట్లో నాకు వేరే ఏ సమస్య ఉంటుందని అనుకోను. నువ్వూ , నీ పెళ్ళాంతో కూర్చుని బాగా ఆలోచించు. ఒక నిర్ణయానికొచ్చి నాకు చెప్పు. పూర్వంలాగా ఇప్పటి అత్తలు చదువుకోని వాళ్ళు కారు. మేము కూడా డిగ్రీలు పూర్తిచేసినవాళ్లం ఉన్నాము. ఇంకా కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మాకు కూడా ఆత్మాభిమానం ఉంది. నుంచోమంటే నుంచుని, కూర్చోమంటే కూర్చోవడానికి ఈ మారుతున్న సమాజంలో వీలుకాదు" అంటూ డిగ్రీ వరకు చదువుకున్న రామేశ్వరమ్మ కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా చెప్పేసింది.

" అమ్మా. నీ కోరిక అసమంజసంగా ఉంది. . నీ కోడలే కాదు ఈ ప్రపంచంలో ఏ కోడలైనా గుండెకాయలాంటి వంటగదిని అత్తగారికి వదిలేస్తుందని నేను అనుకోను.వాళ్ళ ప్రకారం అది కానీ వాళ్ళు వదులుకుంటే కోడళ్ళకు ఆ ఇంట్లో మిగిలేది శూన్యమే. . అది తప్ప నీకు , నాన్నకు ఎటువంటి సౌకర్యాలు కలిపించాలన్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలన్న నేను సిద్దం. మీ ఇద్దరు ప్రతి సంవత్సరం తీర్ధయాత్రలు చెయ్యడానికి ఫ్లయిట్ కూడా అరేంజ్ చేస్తాను. ఇంతకుమించి ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా తల్లి తండ్రులకు న్యాయం చెయ్యగలడా ? నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు. హాయిగా పుస్తకాలు చదువుకుంటూ, ఫేస్ బుక్ లోనూ, వాట్స్ యాప్లోనూ మిత్రులతో కాలక్షేపం చేసుకో. మన చుట్టాలందరికీ ఫోనులు చేసుకో. మాకు ఏమీ అభ్యంతరం లేదు. ఇంట్లో చిన్న పిల్లలు వున్నారు. వాళ్ళను ఆడిస్తూ ఆనందంగా గడుపు. ఇక నీ ఆలోచన విరమించుకుంటావని అనుకుంటున్నాను " అన్నాడు మాధవరావు ఆఖరిసారిగా.

" నువ్వు ఇంతగా చెపుతున్నావు. మా ఇద్దరినీ చక్కగా చూసుకుంటానని అంటున్నావు. ఈ రోజుల్లో అలా చూసే వాళ్ళు కూడా లేరనుకో. కానీ మాకు ఇంకో ముఖ్యమైన సమస్య ఉందిరా. మనకు ఎక్కువమంది చుట్టాలు ఉన్నారు. కేవలం ఫోనుల్లోనే నేను వాళ్ళతో గడపాలంటే కష్టం. వాళ్ళు మనింటికి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ళకు ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి. మీరిద్దరూ ఇలా వంటింటిలోకి వెళ్లడానికి వీల్లేదు అంటే వాళ్ళ దగ్గర అభాసుపాలై పోతాను. పైగా వాళ్ళు వేరే ఊళ్ళ నుండి వస్తే మన ఇంట్లో వాళ్ళకు పడుకోవడానికి సౌకర్యం చూడాలి. ఇంత చిన్న ఇంట్లో అది కుదరదు. నా బంధువుల విషయంలో నేను త్యాగం చేయలేను. రానున్న మరో పది పదిహేను ఏళ్ళు నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటూ ఆంటీ ముట్టనట్టుగా కూర్చుంటాము అంటే కుదరదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునైనా మనం పక్కన ఒక రెండు గదుల ఇల్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నువ్వు నాతో ఏకీభవిస్తావని అనుకుంటున్నాను " అంటూ రామేశ్వరమ్మ అసలు విషయం బయటపెట్టేసరికి " సరే లేమ్మా. నీ సమస్య అర్ధమయ్యింది . నువ్వు చెప్పింది ఆలోచిద్దాము. కానీ నేను కావాలని మిమ్మల్ని పక్కన వుంచానన్న అపవాదు మాత్రం నాకు రాకూడదు. ఇది నేను భరించలేను. కేవలం ఒక పెద్ద సమస్యను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కొన్నాళ్లు నువ్వు కోరుకున్నట్టుగా చేయాలని ఇప్పుడే ఆలోచన కలిగింది. మీ ఇద్దరూ ఆనందంగా ఉండటం కూడా నాకు కావాలి. ఈ విషయంలో ఎవరు ఏమి అనుకున్నా, ఎటువంటి అపార్ధం చేసుకున్నా నేను లెక్కచేయను. ఇది కేవలం మన కుటుంబం మధ్య ఉన్న అవగాహన మాత్రమే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో. నేను అందరి లాంటి వాడిని కాను. ఈ ఒప్పందం కొన్నాళ్లు మాత్రమే. మీ ఇద్దరికీ ఇక చాలు. ఓపిక లేదు . ఈ వంటలు వండుకోలేము .మాకు వంటగదితో పని లేదు అని మనసులో ఆలోచన కలిగినప్పుడు మా దగ్గరకు వచ్చేయ్యాలని అనుకున్నప్పుడు ఈ తలుపులు ఎప్పుడూ మిమ్మల్ని అక్కున చేర్చుకోవడానికి తెరిచే ఉంటాయి. . అన్నీ నువ్వన్నట్టుగా జరుగుతాయి . హాయిగా పడుకో .." అంటూ తల్లికి భరోసా ఇచ్చి ఒక స్థిర నిర్ణయంతో అక్కడనుండి కదిలాడు మాధవరావు *********.

సమాప్తం

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు