#అమ్మమ్మ ఇంటికి దారి# మస్తాన్ తాత ఇంటికి అనుకుని "షేక్ మెహబూబ్ సాహెబ్ "గారి ఇల్లు ఉండేది .వీరి ఇంటి ప్రక్కనే ఒక నీళ్ళ బావి పురాతనమైంది ఉండేది . వీరి కుమారుడు "డాక్టర్ బాబు "పేరుతోనే ఊరిలో చిన్ని చిన్ని వైద్య సేవలు అందిస్తూ ఉండేవారు షేక్ మహబూబ్ సాహెబ్ గారి పెద్ద అల్లుడు పఠాన్ లియాఖత్ వలి.వీరి కిరాణా దుకాణం నిత్యం ఎంతో రద్దీగా ఉండేది .కారణం చుట్టూ ఉన్నటువంటి 150 కుటుంబాలకు వీరిది ఒక్కటే చిల్లర కొట్టు కావడం, అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం . ఇక్కడ ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే డబ్బులు ఉండనవసరం లేదు ,దానికి తగ్గట్టుగా పెసలు, వడ్లు ,తదితర చిరుధాన్యాలు చెల్లించి తమకు కావలసిన వస్తువులను తీసుకెళ్లే అవకాశం ఆరోజుల్లోనే కల్పించారు పఠాన్ లియాఖత్ వలి గారు. వీరికి ఆ రోజుల్లోనే సుమారుగా 50 బస్తాల వడ్లు నిల్వ ఉంచే పాతర అనేది ఉండేది అంటే ,వీరి వ్యాపారం ఎంతగా ఉండేదో ఒక్కసారి ఊహించవచ్చు. వీరి ఇంటికి కాస్త అందుబాట్లోనే "పెంటు సాహెబ్ గారి ఇల్లు" ఉండేది.మేము బాబాయ్ అని పిలిచే వాళ్ళం. గ్రామంలో పంచాయతీ వ్యవస్థ లేని రోజుల్లోనే మోతాదులు అనేవాళ్ళు ఉండేవారు.. బాబాయి అదే విభాగంలో ప్రజలకు అధికారులకు అందుబాట్లో ఉండే వారు.,భూమి శిస్తు వాసులు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన శిస్తు వసులు కార్యక్రమంలో వీరి సేవలు ముఖ్యభూమిక పోషిస్తుండేవి. వీరి కుమారుడు మాకు జూనియర్ మస్తాన్,ప్రస్తుతం ఖమ్మం లో నివాసం ఉంటూ, కైకొండాయిగూడెం .VRO గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తరువాత రజక బజార్లో ముచ్చింతల వీరభద్రం గారు తరువాత, మునిగంటి సీతారాముల గారు తరువాత మునిగంటి రాఘవులు గారు( మీరు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించేవారు) వీరి ఇళ్ళు దాటిన తరువాత గుగ్గిళ్ళ బొర్రయ్య అనే వారు ఉండేవారు .వీరు ఆ రోజుల్లో తేలు మంత్రం పెట్టె వారు. పిల్లలకు చిన్ని చిన్ని శారీరక రుగ్మతలు వచ్చినా దద్దుపోసినా ఆ రోజులలో (అమ్మవారు పోసింది) అనే వారు .ఇలాంటివి కనిపించిన వెంటనే బొర్రయ్య తాతయ్య దగ్గరికి వచ్చి మంత్రం పెట్టించే వాళ్ళు. తలకు పార్స నొప్పి, నిద్రలో నడుము పట్టుకోవడం,విపరితంగా దగ్గు(కోరినంత దగ్గు అనేవారు) వస్తుంటే వీరి దగ్గరకు తీసుకు వెళ్ళేవారు..వీరి మాట మహత్యమో,లేక చేతి స్పర్శ గొప్పతనమో కానీ ఇవి వెంటనే తగ్గిపోయేవి. వీరి ఇంటికి దగ్గరగా బండి కాశయ్య, చిలకమ్మా దంపతులు ఉండేవారు,.స్కూల్లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ డే రోజుల్లో ఇస్త్రీ బట్టలు వేసుకుని వెళ్ళాలనే కోరికకు పావలా తీసుకుని వీరి దగ్గరికి వెళితే ,బట్టలను ఇస్త్రీ చేసి పేపర్లో నీటుగా సర్దేసి అందించేవారు.బొగ్గుల ఇస్త్రీ ఎంతటి కమ్మటి వాసన వచ్చేదో. వీరి ఇంటికి కాస్త దగ్గరలోనే గుగ్గిల్ల.చిన్నోడు పెద్దోడు అనేటటువంటి మామిడికాయల వ్యాపారస్థులు అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు ,దెందుకూరులో దాదాపుగా మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే, వీరి దగ్గరే మామిడికాయలు కొనుగోలు చేసేవారు అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. వీరు విజయవాడ నుండి మామిడికాయలు తీసుకు వచ్చేవారు వీరికి కాస్త దగ్గరగా కుమ్మరి అచ్చియ్య గారి ఇల్లు ఉండేది. వీరు వివాహ శుభకార్యాలకు కావలసిన గలిగె ముంతలు సరఫరా చేస్తూ ఉండేవారు . వీరి ఇంటికి ఆనుకుని దునుకు రామచంద్రయ్య,సీతారమ్మ ఇల్లు ఉండేది. వీరి పిల్లల్లో వెంకటేశ్వర్లు తోటి నాకు కాస్త అనుబంధం ఉండేది .వీరు మంచి నీటి కుండలు తయారుచేయడం కాల్చడంలో సిద్ధహస్తులు.. కుండల తయారి విధానం ఎంత అద్బుతంగా ఉంటుందో అంత శ్రమతో కూడి ఉంటుంది అనేది వీరి దగ్గరే చూస్తూ తెలుసుకున్నాను. వీరి ఇంటికి ఎదురుగా "అమ్మమ్మ ఇల్లు" (ముగింపు మరుసటి భాగంలో..)