సుందరి సుబ్బారావు - సుస్మితా రమణమూర్తి

Sundari subbarao

కొత్త దంపతులు సుందరి సుబ్బారావు బీచ్ లో కూర్చున్నారు. సుబ్బారావు కాలేజీలో తెలుగు లెక్షరర్. సాహిత్యాభిమాని. భావుకుడు. తన కవితలు కాలేజీ మేగజైనుకే పరిమితం. అచ్చు పత్రికలకు పంపినా, అవి గోడకు కొట్టిన బంతులు కావడంతో మరోసారి ప్రయత్నించలేదు. కవితలను కంప్యూటర్లో రాసుకుంటూ మురిసిపోతుంటాడు. ‘దేనికైనా సమయం రావాలి. రాసినవి ఉండాలే గాని, ఎప్పటికైనా వాటికీ ఓరోజు తప్పకుండా వస్తుంది ‘ అనుకుని సరిపెట్టుకోవడం అలవాటైంది తనకు. సుందరి హైస్కూలులో లెక్కల టీచరు. సుబ్బారావు ఆమె వేపు తదేకంగా చూస్తున్నాడు. హాసినివో సుహాసినివో స్మితవో సుస్మితవో దేవతవో దేవేరివో అపరంజి బొమ్మవో…… తనలోని భావుకుడు గొంతు విప్పుతున్నాడు. “ కవిగారిలో ఆనందం పొంగి పొరలుతోందే!?...” భార్యమణి మాటలకు పొంగిపోయాడు తను. ఆ కవితను వెంటనే సుందరి హేండ్ బేగ్లోంచి కాగితం తీసి రాసుకుంది. “ మీకు కంప్యూటరు గురించి తెలుసు కదా? ” “ కొంత తెలుసు. డిప్లమో ఇన్ కంప్యూటర్స్ చేసాను “ “ వెరీగుడ్ ” “ నా కవితలు మన కంప్యూటర్ వర్డ్ ఫైల్లో ఉన్నాయి చూడు “ “ తప్పకుండా చూస్తానండీ “ “ దీర్ఘ కవితలు ఎంత బాగా రాస్తున్నా పత్రికలలో అచ్చయ్యే భాగ్యం లేకుండా పోయింది “ “ దిగులు పడకండి. చిన్న చిన్నవి రాయండి. పాఠకులు చిన్న కవితలు వెంటనే చదువుతారు. కంప్యూటర్లో మీ కవితలు నాకు చూపించండి. బాగున్నవి పత్రికలకు నేను పంపుతాను. ఈసారి వారికి నచ్చుతాయేమో చూద్దాం” భార్యామణి ఓదార్పుకి, సలహాకి సుబ్బారావు కాస్త ఊరట చెందాడు. “ కవితలు ఎలా రాస్తారండీ? “ అమాయకంగా ఆమె అడిగిన ప్రశ్నకు నవ్వుకున్నాడు సుబ్బారావు. “ కవితలు రాయాలంటే భాషా పరిజ్ఞానం కావాలి. భాషపై పట్టు రావాలంటే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. కవులు రాసే పదాలు అర్థం కాకుంటే తెలుగు నిఘంటువు చూసి తెలుసు కోవాలి. అలా అలా చదువుతుంటే, కవుల భావుకత , పద ప్రయోగం తెలుస్తాయి. నీలాంటి వారికి ఇవన్నీ ఒకింతట అర్థం కావులే. ముందు నా దగ్గరున్న పుస్తకాలన్నీ చదువు. ఆ తర్వాత నా కవితలు చదువు. అర్థం కాకపోతే నన్నడుగు. వివరించి చెబుతాను “ భర్త గర్వంగా చెప్పిన మాటలకు తలూపింది ఆమె. **** “ ఏఁవండోయ్ శ్రీవారూ! ఈ పత్రిక పదో పేజీలో, దీంట్లో ఆరో పేజీలో ఉన్న కవితలు చూడండి “ సుందరి ఇచ్చిన పత్రికలు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు సుబ్బారావు. ఆ రెండు పత్రికలలో తను రాసిన కవితలు ఉన్నాయి. “ ఈ కవితలు నేను రాసినవే. పత్రికల వాళ్ళ కత్తెరకు నిడివి బాగా తగ్గింది . అయినా భావం అద్భుతంగా ఉంది. మధ్యలో ఈ కిరీటి ఎవరు!?...” “ మీరే సార్! ఇకమీదట మీ కవితలు, కిరీటి పేరుతోనే వస్తాయి. కిరీటి మీ కలం పేరు . ఎలాగుందండీ?” “కిరీటి మంచి పేరు . నా కలం పేరు కిరీటి!“ స్వగతంలా అనుకుంటూ భార్యామణిని మెచ్చుకున్నాడు. “ ఈ శుభ సందర్భంలో ఏదైనా కోరుకోవోయ్!...నీ ముచ్చట వెంటనే తీరుస్తాను “ “ మీ కవితలు పత్రికలలో అచ్చయితే సరస్వతీ మాతకు అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానండీ!” “ అయితే రేపే ఆ గుడికి వెళ్దాం “ “ శ్రీవారు మా మంచివారు! రేపు మాతకు పూజ, అభిషేకం అయింతర్వాత, మీరు తీరుస్తానన్న ఆ ముచ్చట గురించి అమ్మ సన్నిధిలో తెలియజేస్తాను “ “ నీ ఇష్టం. అలాగే!” కవితలు అచ్చయినందుకు సుబ్బారావు గాలిలో తేలిపోతున్నాడు. **** “ అమ్మా! మీరు చెప్పినట్లుగా సరస్వతీ మాతకు అభిషేకం, పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అమ్మ పాదాల దగ్గర పెట్టిన వీటిని తీసుకోండి “ పంతులు గారి మాటలకు సుందరి— “ వాటిని మా వారికి ఇవ్వండి “ అనేసరికి , సుబ్బారావుకి రెండు పుస్తకాలు ఇచ్చారు వారు. సుబ్బారావు ఆశ్చర్యపోతూ ఆమె వేపు చూసాడు . “ నా ముచ్చట తీరుస్తానని మాటిచ్చారు కదా? ఇప్పడు ఈ చదువులమ్మ సన్నిధిలో నా మనసులోని కోరిక విన్నవించుకుంటాను “ అంటూ భర్త వేపు నవ్వుతూ చూసింది తను. సుబ్బారావుకి విషయం అర్థం అవక అయోమయంగా భార్యను చూస్తుండి పోయాడు. “ స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత , ప్రయివేటుకి వస్తున్న పిల్లలకు లెక్కలు చెప్పాలి. ఆ తర్వాత ఇంటిపని, వంటపని చూసుకోవాలి. ఈ పుస్తకాల పని చేసుకోవడానికి అసలు సమయం లేకుండా పోయింది. అందుకనే….” ‘ విషయం చెప్పకుండా ఏదేదో చెబుతుందేఁవిటి!?’ స్వగతంలా అనుకుంటూ ఆశ్చర్య పోతున్నాడు సుబ్బారావు. “ ఈ పుస్తకాలలో చేతి రాతతో ఉన్న నవలను మీరు వర్డ్ ఫైలులో టైపు చేసిపెడితే, ప్రింటు తీసుకుంటాను. నెలాఖరులోగా పోటీకి పంపించాలి. ఈ ఊర్లోనే ఉన్న పత్రిక ఆఫీసులో అందదజేయాలి. వారు ప్రింటు కాపీయే కావాలన్నారు. మీరు తెలుగు పండితులు, పైగా కంప్యూటర్ జ్ఞానులు కాబట్టి, అక్షర దోషాలు లేకుండా టైపు చేయగల సమర్ధులు కదా?...“ భార్య మాటలకు పుస్తకంలో మొదటి పేజీ చూసిన సుబ్బారావుకి విషయం అర్థం అయింది. “అంటే!?....సుప్రసిద్ధ రచయిత్రి శ్రీజ సుందరి సాయివి నీవా!?..” అంటూ విస్మయానందంతో తెరచిన నోరు మూయడం మరచిపోయాడు సుబ్బారావు.

సమాప్తం

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ