భాగవతకథలు - 24 నారద మహర్షి - కందుల నాగేశ్వరరావు

Narada maharshi

భాగవతకథలు – 24

నారద మహర్షి

నారద మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు.శ్రీహరికి పరమభక్తుడు. ఎల్లప్పుడూ ‘నారాయణ’ నామాన్ని జపిస్తూ లోక సంచారం చేస్తూ ఉంటాడు. ముల్లోకాలలో అఖండమైన పేరుప్రతిష్ఠలు సంపాదించినవాడు. శాస్త్రపురాణ విశారదుడు. అప్పుడప్పుడు లోకకల్యాణార్థం కొన్ని కలహాలు సృష్టిస్తూ ఉంటాడు. ఆయన చేతిలోనున్న మహతి అనే వీణ తీగలోనుండి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆయన నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తన మనే అమృతధారలో మహాయోగులందరూ పరవశించిపోతుంటారు.

నారదునికి బ్రహ్మదేవుడు సృష్టి రహస్యం తెలుపుట:

నారదుడు బ్రహ్మదేవునితో “తండ్రీ నీవు చతుర్ముఖుడవు. దేవతలలో పెద్దవాడవు. సృష్టికర్తవు. ఈ జగత్తుయొక్క సృష్టి నిర్మాణానికి హేతువేమిటి? దీనికి ప్రయోజనమేమిటి? ఈ జగత్తు ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ లయమవుతుంది? నీవే అందరికీ ప్రభువువా లేక నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా?” అని ప్రశ్నించాడు.

“కుమారా, నిత్యం ఎందరో మహర్షులు నా దగ్గరకు వస్తారు. కాని వారెవరూ నీలాగ నన్ను ప్రశ్నించలేదు. నా ప్రభువు రహస్యం నీవు నన్నడగడం నాకు చాలా ఆనందంగా ఉంది. చెబుతాను శ్రద్ధగా విను” అని బ్రహ్మదేవుడు నారదునికి సృష్ఠి రహస్యాన్ని ఇలా బోధించాడు.

“నానారూపాల్లో ఉన్నఈ ప్రపంచాన్ని సృష్టించడానికి కావలసిన జ్ఞానంలేక నేను తికమకపడుతుంటే అవసరమైన విజ్ఞానాన్ని నాకు నా ప్రభువు ఉదారబుద్ధితో అనుగ్రహించాడు. అలాంటి పరమేశ్వరుని ఆనతి లేకపోతే ఈ లోకాలు సృష్టించే సామర్థ్యం నాకెక్కడిది. సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని క్రీగంటిచూపు వల్లనే నేను జన్మించాను. గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడుగుణాలు పుడుతున్నాయి. మాయ వలనఆ త్రిగుణాలు జీవుణ్ణి బాధిస్తాయి.ఇదంతా ఆ పరమాత్మ చేసే వినోదమే నాయనా!అందరికంటే ఆ శ్రీమన్నారాయణుడే అధికుడు.సూర్యచంద్రులు,నక్షత్రాలు,నేనూ అందరం ఆయన ఆజ్ఞను పాటిస్తాము. అసలు పుట్టుకే లేనివాడు విశ్వాన్ని పుట్టిస్తాడు.విష్ణువు విశ్వంలో ఉంటాడు.విశ్వం ఆయనలో ఉంటుంది” అంటూ బ్రహ్మ నారదునికి శ్రీహరిగాథలు అవతార విశేషాలు చెప్పాడు.

నారద మహర్షి - వేదవ్యాసుడు

వేదవ్యాసమహర్షి మహాజ్ఞాని. ఆయన వేదాలను విభజించాడు. వేదసారం అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో మహాభారతాన్ని రచించాడు. విశ్వశ్రేయస్సు కోసం ఎంతచేసినా మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి ఆయనలో మిగిలిపోయింది. కారణం తెలియక సరస్వతీ నదీతీరంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అక్కడికు హరి సంకీర్తన చేస్తూనారదమహర్షి ఆకాశం దిగివచ్చాడు. వ్యాసమహర్షిని ఎందుకు అలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు.

దానికి వ్యాసుడు “స్వామీ మీకు తెలియనిదేమున్నది? నాదిగులుకు కారణం నీకు తెలియదా?” అన్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి “వేదవ్యాసా, నీవు ధర్మాలన్నీ చక్కగా చెప్పావు. అయితే విష్ణుకథలను మాత్రం కొద్దిగా చెప్పి వదలివేసావు. విష్ణుమూర్తి గుణవిషేషాలు చెప్పకుండా ఎన్ని కథలుచెప్పనా శ్రీహరి సంతోషించడు. నీకుకొరత ఏర్పడడానికి కారణం ప్రీతిపూర్వకంగా హరిని కీర్తించక పోవడమేసుమా!నా మాటలు ఇంకా బాగా అర్థం కావాలంటే నా పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను” అని ఇలాచెప్పాడు.

నారదుడువ్యాసునికితన పూర్వజన్మ వృత్తాంతంతెలుపుట:

“మహానుభావా! నేను గడచిన కల్పంలోని గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మవేదపండితుడైన ఒక బ్రాహ్మణుని ఇంటిలో దాసిగా పనిచేస్తూ ఉండేది. నేను పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవలు చేస్తూ ఉండేవాడిని. ఓర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాడిని.

ఒకసారి కొందరు మహాత్ములు చాతుర్మాస్యవ్రత నిమిత్తం ఆ బాహ్మణుని ఇంటిలో బస చేశారు. నేను వారికి నిత్యమూ సపర్యలు చేస్తూ ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. వారు భుజించిన తరువాత భిక్షాపాత్రలలో మిగిలిఉన్నఅన్నాన్ని తినేవాడిని. అలా ఎంతోకాలం గడిచిపోయింది. వారికి నా మీద అనుగ్రహం కలిగింది. ఆ బ్రహ్మజ్ఞులు శ్రీహరి కథలు చదువుతూ, హరిలీలలు వర్ణిస్తూ,హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండేవారు. అనుక్షణమూ ఆ పుణ్యాత్ముల నోటి వెంట వెడలి వచ్చే శబ్దాలు అమృతప్రవాహం వలె నా చెవులకు విందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండి పోయేది.

క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నీ మరిచిపోయి భక్తితో భగవంతుడైన శ్రీహరిని ఆరాధించడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతంమైన ఆసక్తి ఏర్పడింది.ఈ శరీరం కేవలం మాయా కల్పితం అనే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాను. ఆ యోగీంద్రుల అనుగ్రహం వల్ల అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్యవ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. వారిని భక్తితో ఆరాధించినందుకు ఎంతో వాత్సల్యముతో అతిరహస్యమూ, అమోఘమైన అయిన ఈశ్వర జ్ఞానాన్నినాకు ఉపదేశించారు. వారి మహోపదేశం వల్ల వాసుదేవుని మాయా ప్రభావం తెలుసుకున్నాను.

నా తల్లికి నేనంటే అమితమైన ప్రేమ. నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమలో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఆ ఇంట్లోనే ఉండిపోయాను. ఒక రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండడం కోసం ఇంటి బయటకు వెళ్ళిన అమ్మను పాముకాటు వేసింది. ఆ త్రాచుపాము విషానికి అమ్మ మరణించింది. దానితో నా బంధాలన్నీ తెగిపోయాయి.ఓంకారపూర్వకంగా వాసుదేవ-ప్రద్యుమ్నసంకర్షణ-అనిరుద్ధ నామాలు నాలుగు భక్తితో ఉచ్చరించి ఆ యజ్ఞేశ్వరుని నమస్కరించేమానవుడు సమదృష్టికలవాడవుతాడని తెలిసింది.

ఆ ఇల్లు వదిలి ఊరు ఊరు తిరుగుతూ చివరకు ఒక మహారణ్యం చేరాను. ఆ అడవిలో ఒక రావిచెట్టు క్రింద కూర్చొని నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.ఆ భక్తి పారవశ్యంలో నాచిత్తంలో దేవదేవుడు సాక్షాత్కరించాడు. కళ్ళు తెరిచే సరికి ఆయన రూపం అదృశ్యమైంది. అరణ్యమంతా అటూ ఇటూ తిరిగాను. మళ్ళీ ఆ స్వామిని దర్శించాలని తహతహలాడాను. కాని ఎంత వెదికినా మరల ఎక్కడా హరి కానరాలేదు.

కాస్సేపటి తరువాత శ్రీహరి మాటలు ఇలా వినబడ్డాయి. - నాయనా, ఎందుకు వృధాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను మరల చూడలేవు. అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియులు కానివారు నన్ను చూడలేరు. నాయందు లగ్నమైన నీ కోరిక వృధా కాదు. నీవు ఈ దేహాన్ని వదిలిన తరువాత నా అనుజ్ఞతో మళ్ళీ జన్మలో నా భక్తుడైన ఉద్భవిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది.అంతవరకు నువ్వు భక్తిమార్గాన్ని అవలంబించు.

శ్రీహరి మాటలు విన్న నేను ఇతర విషయవాసనలను,కామక్రోధలోభమదమాత్సర్యాలను పూర్తిగా విసర్జించాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు సంకీర్తిస్తూ నా శేషజీవితాన్ని గడిపాను. మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైనప్పుడు పూర్వ దేహాన్ని త్యజించాను. కల్పాంతంలో నేను భగవంతుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడి ఉచ్ఛ్వాస నుండి మరీచి మొదలైన మునులతోబాటు నేనూ జన్మించాను. భగవంతుని అనుగ్రహం వల్ల బ్రహ్మచారిని, త్రిలోకసంచారినై విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను.

కర్మలు బవబంధ కారణాలే అయినప్పటికీ, వాటిని ఈశ్వరార్పణ చేయడం వలన బంధ విముక్తి కలుగుతుంది. నేను ఆ విధంగా ప్రవర్తించడం వలన నన్ను శ్రీహరి అనుగ్రహించాడు. వ్యాస మహర్షీ నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. నీవు వాసుదేవుని గాథలను సంస్తుతించు.అప్పుడు నీ మనస్సులో ఉన్న దిగులు మటుమాయ మవుతుంది” అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు.

ధర్మరాజుకు బవిష్యత్తును గురించి సూచించుట:

ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తరువాత హస్తినాపుర సింహాసనం అధిష్టించాడు. పెదతండ్రి పెదతల్లి అయిన ధృతరాష్ట్రగాంధారులను తన రాజభవనంలో ఉంచి ప్రేమగా గౌరవమర్యాదలతో చూసుకుంటున్నాడు. ఒకనాడు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన విదురుడు వారికివిరక్తి మార్గాన్ని ఉపదేశించి,వానప్రస్థాశ్రమంలో శేషజీవితాన్ని గడపమనితనతోబాటుఅరణ్యానికి తీసుకు వెళ్లాడు. మరునాడు ప్రతీరోజులాగాధర్మరాజు పెదనాన్న భవంతికి వచ్చి వారు కనపడక సంజయుణ్ణి ప్రశ్నించాడు. సంజయుడు వారు ఉదయం నుండి తనకు కూడా కనపడలేదని, ఏమైపోయారో తెలియడంలేదనిపొంగి వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ విచారంగా తెలిపాడు.

ఆ సమయంలో తుంబురునితో నారదుడు అక్కడికి విచ్చేశాడు. ధర్మరాజు వారికి నమస్కారంచేసి పూజించాడు. తరువాత నారదుడితో “మీకు ముల్లోకాలలో తెలియని దంటూ ఏమీ లేదు. దయచేసి మా తల్లితండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పండి” అన్నాడు.

ఆ పలుకులు విని నారదుడు ఇలా అన్నాడు. “ ధర్మరాజా, ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. భగవంతుని ఇచ్ఛానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు కలుగుతాయి. అందువలన నీ తల్లితండ్రులు ఎలా జీవిస్తారు అనే దుఃఖం మాను. అజ్ఞానంతో కూడిన మమకారాన్ని పెంచుకొని అనవసరంగా మనస్సును బాధపెట్టుకోవద్దు. మీ పెదతండ్రి గాంథారీవిదురులతో కలిసి తపోవనానికి వెళ్లాడు. నేటికిఐదవరోజు యోగాగ్నిలో దేహత్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. గాంధారి కూడా ఆ పావన జ్వాలలలో బస్మమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద ఉన్నంతవరకు మీరు ఉండండి. ఆయన అవతారం చాలించాక మీరూ ఉండవలసిన పనిలేదు “ అని చెప్పి తుంబురునితో సహా అంతర్ధానమైనాడు.

ధ్రువునికి మంత్రోపపదేశం:

తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ఆశపడి, అది తీరక దుఃఖిస్తున్నధ్రువుని, దగ్గరకు తీసుకొనితల్లి సునీతి లాలించింది.బుజ్జగించింది. “నీ దుఃఖాన్ని తీర్చగల దివ్యపురుషుడు శ్రీహరి ఒక్కడే. కాబట్టి ఏకాగ్రతతో శ్రీమన్నారాయణుని ఆరాధించు. నీకోరిక తప్పక నెరవేరుతుంది” అని చెప్పింది. ఆ మాటలు ధ్రువునిపై బాగా పనిచేసాయి. తల్లినీ, ఇంటినీ, నగరాన్ని విడిచి బయలుదేరాడు.

తన దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి ధ్రువుడి ముందు సాక్షాత్కరించి “నాయనా అవమానం,గౌరవం అనేవి పట్టించుకోవద్దు. ఇదంతా దైవ సంకల్పం. నీ తల్లి చెప్పిన యోగమార్గం చాలా కఠినమైనది. నువ్వు పసిబాలుడివి. ఎందుకు నీకు ప్రయాస? మోక్షం కావాలంటే నువ్వు పెరిగి పెద్దవాడివయ్యాక ముసలితనంలో ప్రయత్నించవచ్చు. వెనక్కి వెళ్ళిపో” అని చెప్పాడు. అంతా విన్న ధ్రువుడు “ఎవరికీ దక్కని స్థానం నేను పొందాలని కుంటున్నాను. అందుకు ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పండి” అని అడిగాడు.

అప్పుడు నారదుడు “ఇక్కడకు దగ్గరలో యమునాతీరంలో మధువనం ఉంది. అది శ్రీహరికి నివాసస్థాననని పెద్దలు చెపుతారు. నీవు అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ తపస్సు చెయ్యి” అని చెప్పి“ఓం నమో భగవతే వాసుదేవాయ” అన్న ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్రువుడు నారదుని పాదాలకు నమస్కరించి మధువనం వైపు వెళ్ళిపోయాడు.

హిరణ్యకశిపుని రసాతలానికి పంపుట:

శ్రీహరి కోసం వైకుంఠమార్గం పట్టి వెళ్లుతున్న హిరణ్యాక్షుడికి నారదమునీంద్రుడు ఎదురు వచ్చాడు. “ఓ దానవరాజా ఇంత ఆనందంతో ఎక్కడికి వెళుతున్నావు” అని అడిగాడు. నారద మునీంద్రునితో ఆ దానవుడు “ఆ విష్ణుమూర్తిని అంతమొందించి రాక్షసజాతికి అంతులేని ఆనందం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారిపట్టిపోతున్నాను.” అని అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు ఆ రాక్షసునితో “శ్రీమహావిష్ణువు ఇప్పుడు వైకుంఠంలో లేడు. ఆ మహాత్ముడు భూభారాన్ని పూనడానికై ఆదివరాహరూపం ధరించి రసాతలంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి నీకు శక్తి ఉన్నట్టయితే వెళ్ళు. ఆ పాతాళంలో నీకూ విష్ణుమూర్తికి తప్పకుండా సమరం జరుగుతుంది.” అప్పుడా రాక్షసరాజు అగ్నివలె మండిపడుతూ మహాతేజస్సుతో గదాదండం చేబూని, ముల్లోకాలకూ భయం కలిగించే రూపంతో తన బాహు పరాక్రమాన్ని ప్రకటిస్తూపాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ రసాతలంలో యజ్ఞవరాహమూర్తి చేతిలో అంతమయ్యాడు.

గర్భస్త శిశువైన ప్రహ్లాదునికి నారదుడువిష్ణుభక్తిని బోధించుట:

హిరణ్యకశిపుడు కఠోరతపస్సులో ఉన్న సమయంలో దేవతలు అతని రాజ్యంపై దండెత్తారు. దేవేంద్రుడు అంతఃపురంలో ఉన్న హిరణ్యకశిపుని భార్య లీలావతిని చెరపట్టి భలవంతంగా స్వర్గానికి తీసుకు పోతుంటే అదృష్టవశాత్తు మార్గంలో నారదుడు ఎదురయ్యాడు. నారదుడు ఇంద్రునితో “ఓ దేవరాజా! నీకిది తగదు. పరస్త్రీని, అందులోనూ గర్భవతియైన ఈమెను ఈ విధంగా నిర్బంధించి తీసుకు రావడం న్యాయం కాదు. నీ కోపాన్ని దేవ విరోధియైన హిరణ్యకశిపునిపై చూపించు. భక్తురాలైన ఈమెను వదిలిపెట్టు” అని చెప్పాడు.

దానికి దేవేంద్రుడు “ఈమె గర్భంలో దేవతల శత్రువైన హిరణ్యకశిపుని సంతానం పెరుగుతోంది. ప్రసవం తరువాత శిశువును వధించి ఈమెను తప్పక విడిచి పెడతాను” అని సమాధానం ఇచ్చాడు.

అప్పుడు నారదుడు లీలావతి కడుపులో పెరిగేవాడు గొప్ప విష్ణు భక్తుడు, కాబట్టి ఆతనిని నీవు చంపలేవు అని దేవేంద్రుడికి నచ్చజెప్పాడు. లీలావతిని కూతురు వలె భావించి, ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. గర్భంలో ఉన్న శిశువుకు నారద మహర్షి దైవభక్తిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు.

నారదుడు ధర్మరాజుకు చెప్పిన తన పూర్వజన్మవృత్తాంతం:

నారదమహర్షి ధర్మరాజుకి విష్ణుతత్త్వాన్ని ఇలా బోధించాడు. “ధర్మరాజా! నువ్వు చాలా అదృష్టవంతుడివి. బ్రహ్మాదులు సైతం మాటల్లో వర్ణించలేనివాడు పరబ్రహ్మ స్వరూపుడూ అయిన ఆ జగన్నాథుడు శ్రీకృష్ణుడై మీతో మిత్రుడుగా, బావమరిదిగా, అంతరంగికుడుగా, మహాఫలప్రదాతగా మీ ఇంటిలో తిరుగడం ఎంత భాగ్యమో నేను మాటల్లో చెప్పలేను. తమ భక్తులపై ఈ పరంధాముడు ఈగను కూడా వాలనియ్యడు. ధర్మరాజా గృహస్థు కూడా మోక్షాన్ని పొందవచ్చు. తాను చేసే ప్రతీ కర్మను వాసుదేవుడికే అర్పించాలి. నిత్యం హరికీర్తనం, కథాశ్రవణం చేస్తూ ఉండాలి. వేదోక్త ప్రకారం నడుచుకుంటూ శ్రీహరిపాదాలను సేవిస్తే ఇంట్లో ఉంటూ మోక్షాన్ని పొందవచ్చు.

నేను పూర్వజన్మలో గంధర్వ వంశంలో'ఉపబర్హనుడు'అనే పేరుతో జన్మించాను.నా అందానికి ఎందరో అందగత్తెలు ఆకర్షితులై నా దగ్గరకు వచ్చేవారు. నేను వారితో క్రీడి‌స్తూ కాలం గడుపుతూ ఉండేవాడిని. ఒకసారి ప్రజాపతులు ‘దేవసత్రయాగంచేశారు.ఆ యాగంలో శ్రీమన్నారాయణుని గాథలు గానం చేయడానికి గంధర్వులను అప్సరసలను ఆహ్వానించారు.నేనూ వెళ్ళి విష్ణుకథలు గానం చేశాను.మధ్యలో నా మనస్సు స్త్రీలవైపు మళ్ళింది. వారిపై వ్యామోహం పెరిగింది.హరి కీర్తన వదిలిపెట్టి స్త్రీలపొందుకోసం పరుగులెత్తాను.దానితో ప్రజాపతులు ఆగ్రహించారు. నేను చేసిన పాపానికి నన్ను ఒక శూద్ర స్త్రీకి జన్మించమని శపించారు.ఆ శాప పలితంగా ఒక బ్రాహ్మణుల ఇంటిలో దాసిగా ఉన్న స్త్రీ కి కుమారుడుగా జన్మించాను.అక్కడ బ్రహ్మవేత్తలకు శుశ్రూష చేశాను. ఆ కారణంగా ఈ మహాకల్పంలో బ్రహ్మ మానస పుత్రుడినైవజన్మించాను”. అనంతరం నారదమహర్షి ఆకాశమార్గంలో వెళ్ళిపోయాడు.

నారదమహర్షికి శ్రీకృష్ణుడు తన మహిమ చూపుట:

నారదుడికి ఒక కోరిక కలిగింది. భూలోకంలో శ్రీకృష్ణుడు అష్టమహిషుల్నీ, పదహారువేలమందిరాకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఎంతమందితో శ్రీకృష్ణుడు ఎలా వేగుతున్నాడో చూడాలనిపించింది. నేరుగా శ్రీకృష్ణుడి అంతఃపురంలోకి వచ్చాడు. అక్కడ రుక్మిణీదేవి వింజామరలు వీస్తోంది. శ్రీకృష్ణుడు నారదుణ్ణి చూసి దిగ్గున లేచి సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశాడు.

ఇలా ఎన్ని అంతఃపురాలకు వెళ్ళినా అన్ని చోట్లా శ్రీకృష్ణుడు దర్శనమిస్తూనే ఉన్నాడు. ఒక్కో చోట ఒక్కో విధి నిర్వహిస్తూ నారదుణ్ణి ఆశ్చర్యానికి గురిచేసాడు. అప్పుడు నారదుడికి శ్రీకృష్ణుడి మహిమ పూర్తిగా అర్థమయ్యింది.

నారదమహర్షి త్రిలోక సంచారం చేస్తూ అన్ని యుగాల్లో హరి భక్తులకు దర్శనమిచ్చి, శ్రీహరి అవతార విషేషాలు చెప్పి వారికి మార్గదర్శకం చేస్తూ ఉంటాడు.

శుభం

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు